కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 64

సింహాల గుహలో దానియేలు

సింహాల గుహలో దానియేలు

బబులోనుకు తర్వాత వచ్చిన రాజుల్లో ఒకరు దర్యావేషు అనే మాదీయుడు. దానియేలు అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉన్నాడని దర్యావేషు గమనించాడు. ఆయన దానియేలును దేశంలో ఉన్న ముఖ్యమైన వాళ్లందరి మీద అధికారిగా ఉంచాడు. వాళ్లు దానియేలు మీద కుళ్లుతో అతనిని చంపేయాలని అనుకున్నారు. దానియేలు రోజుకు మూడుసార్లు యెహోవాకు ప్రార్థన చేస్తాడని వాళ్లకు తెలుసు. అందుకని వాళ్లు దర్యావేషు దగ్గరకు వెళ్లి ‘ఓ రాజా, అందరూ మీకు మాత్రమే ప్రార్థన చేయాలి అనే ఒక శాసనం ఉండాలి. దానిని వినని వాళ్లను ఎవరినైనా సింహాల గుహలో పడేయాలి’ అని చెప్పారు. దర్యావేషుకు వాళ్లు చెప్పింది నచ్చి ఆ శాసనం మీద సంతకం చేశాడు.

దానియేలు ఆ కొత్త శాసనం గురించి వినగానే, ఇంటికి వెళ్లాడు. తెరిచి ఉన్న కిటికీ ముందు మోకాళ్ల మీద ఉండి యెహోవాకు ప్రార్థన చేశాడు. ఆ కుళ్లుబోతు మనుషులు వెంటనే ఇంట్లోకి దూరిపోయి ప్రార్థన చేస్తుండగా అతన్ని పట్టుకున్నారు. వాళ్లు దర్యావేషు దగ్గరకు వెళ్లి ‘దానియేలు మీ మాట వినడం లేదు. ఆయన రోజూ వాళ్ల దేవుడికి మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు’ అని చెప్పారు. దానియేలు చనిపోవడం దర్యావేషుకు ఇష్టం లేదు. ఆయన ఆ రోజంతా దానియేలును ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ రాజు సంతకం చేసిన శాసనాన్ని రాజు కూడా మార్చలేడు. కాబట్టి ఆయన దానియేలును క్రూరమైన సింహాల గుహలో పడేయమని ఆజ్ఞాపించాల్సి వచ్చింది.

ఆ రోజు రాత్రి దర్యావేషు దానియేలు గురించి చాలా కంగారుపడుతూ నిద్రపోలేక పోయాడు. తెల్లవారగానే ఆయన గుహ దగ్గరకు పరిగెత్తి దానియేలును పిలిచి, ‘నీ దేవుడు నిన్ను కాపాడాడా?’ అని అడిగాడు.

దర్యావేషుకు ఒక గొంతు వినపడింది. అది దానియేలు గొంతు! ఆయన దర్యావేషుతో ‘యెహోవా దూత సింహాల నోర్లు మూసేశాడు. అవి నన్ను ఏమీ చేయలేదు’ అని అన్నాడు. దర్యావేషుకు చాలా సంతోషమేసింది. ఆయన దానియేలును గుహలోనుండి బయటకు తెమ్మని ఆజ్ఞాపించాడు. దానియేలు ఒంటి మీద చిన్న గాటు కూడా లేదు. అప్పుడు రాజు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు: ‘దానియేలు మీద చాడీలు చెప్పిన వాళ్లను గుహలో పడేయండి.’ వాళ్లను గుహలో పడేయగానే సింహాలు తినేశాయి.

దర్యావేషు ప్రజలకు ఈ ఆజ్ఞను పంపిస్తాడు: ‘అందరూ దానియేలు దేవునికి భయపడాలి. ఆయన దానియేలును సింహాల నుండి కాపాడాడు.’

మీరూ దానియేలులా రోజూ యెహోవాకు ప్రార్థన చేస్తారా?

“దైవభక్తి ఉన్న ప్రజల్ని కష్టాల నుండి ఎలా తప్పించాలో . . . యెహోవాకు తెలుసు.”—2 పేతురు 2:9