కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 68

ఎలీసబెతుకు బాబు పుట్టాడు

ఎలీసబెతుకు బాబు పుట్టాడు

యెరూషలేము గోడలు కట్టి 400 సంవత్సరాలు దాటిపోయింది. జెకర్యా అనే యాజకుడు, ఆయన భార్య ఎలీసబెతు ఆ పట్టణానికి దగ్గర్లో నివసిస్తున్నారు. వాళ్లకు పెళ్లి అయ్యి చాలాకాలం అయినా పిల్లలు లేరు. ఒకరోజు జెకర్యా ఆలయంలో ధూపం వేస్తున్నప్పుడు, గబ్రియేలు దూత కనిపించాడు. జెకర్యా భయపడ్డాడు, కానీ గబ్రియేలు ఇలా అన్నాడు: ‘భయపడకు. నేను యెహోవా నుండి ఒక శుభవార్తను తీసుకుని వచ్చాను. నీ భార్య ఎలీసబెతుకు బాబు పుడతాడు, అతనికి యోహాను అనే పేరు పెట్టాలి. యెహోవా యోహానును ఒక ప్రత్యేక పని కోసం ఎన్నుకున్నాడు.’ జెకర్యా ఇలా అంటాడు: ‘నువ్వు చెప్పే మాటలను ఎలా నమ్మాలి? నా భార్య, నేను చాలా ముసలి వాళ్లం, ఈ వయసులో మాకు పిల్లలు పుట్టరు కదా.’ గబ్రియేలు ఇలా అంటాడు: ‘ఈ వార్త చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు. కానీ నువ్వు నా మాటలు నమ్మలేదు కాబట్టి ఇప్పటి నుండి నీకు బిడ్డ పుట్టే వరకు నువ్వు మాట్లాడవు.’

జెకర్యా ఆలయంలోకి వెళ్లి చాలాసేపు అయ్యింది. చివరికి ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయనకు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి అందరు ఎదురుచూస్తూ ఉన్నారు. జెకర్యా మాట్లాడలేకపోయాడు. ఆయన చేతులతో సైగలు మాత్రం చేస్తున్నాడు. అప్పుడు ప్రజలు దేవుని నుండి అతనికి సందేశం వచ్చిందని అర్థంచేసుకున్నారు.

కొంతకాలం తర్వాత దేవదూత చెప్పినట్లు, ఎలీసబెతు గర్భవతి అయ్యి మగ బిడ్డను కంటుంది. ఆమె స్నేహితులు, బంధువులు బాబును చూడడానికి వస్తారు. వాళ్లు ఆమెను చూసి చాలా సంతోషిస్తారు. ఎలీసబెతు ‘బాబు పేరు యోహాను’ అని చెప్తుంది. వాళ్లు ‘యోహాను అనే పేరు మీ కుటుంబంలో ఎవరికి లేదు. బాబుకు జెకర్యా అని వాళ్ల నాన్న పేరు పెట్టు’ అని అంటారు. కానీ జెకర్యా, ‘అతని పేరు యోహాను’ అని రాస్తాడు. ఆ క్షణం నుండి జెకర్యా మళ్లీ మాట్లాడగలుగుతాడు. ఆ బిడ్డ గురించి యూదయ అంత తెలుస్తుంది, ప్రజలు, ‘ఈ బాబు పెద్దయ్యాక ఏమౌతాడో?’ అనుకుంటారు.

జెకర్యా పవిత్రశక్తితో నిండిపోయి ఇలా ప్రవచించాడు: ‘యెహోవా స్తుతించబడాలి. మనల్ని రక్షించడానికి ఒక రక్షకుడిని, మెస్సీయని పంపిస్తానని ఆయన అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. యోహాను ఒక ప్రవక్త అవుతాడు, మెస్సీయకు ఆయన మార్గం సిద్ధం చేస్తాడు.’

ఎలీసబెతు బంధువు మరియకు కూడా ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. అది ఏమిటో తర్వాతి అధ్యాయంలో చూద్దాం.

“మనుషులకు ఇది అసాధ్యమే, కానీ దేవునికి అన్నీ సాధ్యం.”—మత్తయి 19:26