కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 69

మరియ దగ్గరకు వచ్చిన గబ్రియేలు

మరియ దగ్గరకు వచ్చిన గబ్రియేలు

ఎలీసబెతుకు మరియ అనే బంధువు ఉంది, ఆమె ఎలీసబెతు కన్నా చిన్నది. మరియ గలిలయలో నజరేతు అనే పట్టణంలో నివసించేది. మరియకు యోసేపు అనే వడ్రంగితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఎలీసబెతు ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు, గబ్రియేలు దూత మరియకు కనిపిస్తాడు. దూత, ‘మరియ, యెహోవా ఆశీర్వాదం నీకు ఉంది’ అని అంటాడు. గబ్రియేలు మాటలు ఆమెకు అర్థం కాలేదు. అతను ఆమెతో ఇలా చెప్పాడు: ‘నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టాలి. అతను రాజుగా పరిపాలిస్తాడు. అతని రాజ్యం నిరంతరం ఉంటుంది.’

మరియ, ‘కానీ, నేను కన్యను. నాకు పిల్లలు ఎలా పుడతారు?’ అని అంది. గబ్రియేలు, ‘యెహోవాకు సాధ్యం కానిది ఏది లేదు. పవిత్రశక్తి నీ మీదకు వస్తుంది, నీకు కుమారుడు పుడతాడు. నీ బంధువైన ఎలీసబెతు కూడా గర్భవతి అయ్యింది’ అని చెప్పాడు. అప్పుడు మరియ, ‘నేను యెహోవా సేవకురాలిని. నువ్వు చెప్పినట్లు నాకు జరుగును గాక’ అంది.

మరియ ఎలీసబెతును కలవడానికి కొండల్లో ఉన్న పట్టణానికి వెళ్లింది. మరియ ఆమెను పలకరించినప్పుడు, కడుపులో ఉన్న తన బిడ్డ గంతులు వేస్తున్నట్లు ఎలీసబెతుకు అనిపించింది. ఆమె పవిత్రశక్తితో నిండిపోయి ఇలా అంది: ‘మరియ, యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకు గొప్ప గౌరవం.’ మరియ ‘నేను యెహోవాను కీర్తిస్తాను’ అని అంది. మరియ ఎలీసబెతు దగ్గర మూడు నెలలు ఉన్న తర్వాత నజరేతులో ఉన్న ఆమె ఇంటికి తిరిగి వెళ్తుంది.

మరియ గర్భవతి అని యోసేపుకు తెలిసినప్పుడు ఆయన ఆమెను పెళ్లి చేసుకోకూడదని అనుకుంటాడు. కానీ దేవదూత కలలో అతనికి కనిపించి ఇలా చెబుతాడు: ‘ఆమెను పెళ్లి చేసుకోవడానికి భయపడకు. ఆమె ఏ తప్పు చేయలేదు.’ కాబట్టి యోసేపు మరియను పెళ్లి చేసుకుని అతని ఇంటికి తీసుకెళ్తాడు.

“ఆకాశమందును భూమియందును . . . [యెహోవా] తనకిష్టమైనదంతయు జరిగించువాడు.”—కీర్తన 135:6