కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 70

యేసు పుట్టాడని దేవదూతలు ప్రకటించారు

యేసు పుట్టాడని దేవదూతలు ప్రకటించారు

రోమా చక్రవర్తి కైసరు ఔగుస్తు యూదులందర్నీ వాళ్ల సొంత ఊళ్లకు వెళ్లి పేర్లను నమోదు చేయించుకోమని ఆజ్ఞాపించాడు. అప్పుడు యోసేపు, మరియ యోసేపు సొంత ఊరైన బేత్లెహేముకు వెళ్లారు. అది దాదాపు మరియకు బిడ్డ పుట్టే సమయం.

బేత్లెహేముకు వచ్చాక, ఉండడానికి పశువుల పాక తప్ప వాళ్లకు వేరే చోటు దొరకలేదు. అక్కడ మరియ తన కుమారుడైన యేసును కంటుంది. ఆమె ఆ బిడ్డను మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో జాగ్రత్తగా పడుకోబెట్టింది.

బేత్లెహేముకు దగ్గర్లో కొంతమంది కాపరులు రాత్రివేళ గొర్రెల మందలను కాస్తూ బయట ఉన్నారు. ఉన్నట్టుండి, ఒక దేవదూత కనిపిస్తాడు, దేవుని మహిమ వాళ్ల చుట్టూ ప్రకాశిస్తుంది. కాపరులు భయపడతారు, కానీ దేవదూత ఇలా అంటాడు: ‘భయపడకండి. మీకు ఒక శుభవార్త తెచ్చాను. ఈ రోజు బేత్లెహేములో మెస్సీయ పుట్టాడు.’ ఆ సమయంలో చాలామంది దూతలు ఆకాశంలో కనిపించి ఇలా అన్నారు: ‘పరలోకంలో దేవునికి మహిమ, భూమ్మీద శాంతి కలగాలి.’ తర్వాత దేవదూతలు మాయమైపోయారు. అప్పుడు కాపరులు ఏమి చేశారు?

కాపరులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: ‘మనం బేత్లెహేముకు ఇప్పుడే వెళ్దాం.’ వాళ్లు వెంటనే వెళ్లి అప్పుడే పుట్టిన బిడ్డతో పశువుల పాకలో ఉన్న యోసేపు, మరియను చూశారు.

దేవదూత కాపరులకు చెప్పిన విషయాలను విన్న ప్రతి ఒక్కరు చాలా ఆశ్చర్యపోయారు. మరియ దేవదూత చెప్పిన విషయాల గురించి లోతుగా ఆలోచించి, వాటిని ఎప్పుడూ మర్చిపోలేదు. కాపరులు వాళ్ల మందల దగ్గరకు తిరిగి వెళ్లి, వాళ్లు చూసిన, విన్నవాటన్నిటిని బట్టి యెహోవాకు కృతజ్ఞతలు చెప్పారు.

“నేను దేవుని దగ్గరి నుండి వచ్చాను, ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. నా అంతట నేను రాలేదు, ఆయనే నన్ను పంపించాడు.”—యోహాను 8:42