కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 71

యెహోవా యేసును కాపాడాడు

యెహోవా యేసును కాపాడాడు

నక్షత్రాలు జీవితాన్ని నడిపిస్తాయని ఇశ్రాయేలుకు తూర్పున ఒక దేశంలో ఉన్న ప్రజలు నమ్మేవాళ్లు. ఒక రాత్రి తూర్పున ఉన్న కొంతమంది ప్రకాశవంతమైన ఒక నక్షత్రం ఆకాశంలో కదలడం గమనించారు, వాళ్లు దాని వెంటే వెళ్లారు. ఆ “నక్షత్రం” వాళ్లను యెరూషలేముకు నడిపించింది. వాళ్లు ప్రజలను ఇలా అడగడం మొదలుపెట్టారు: ‘యూదులకు రాజు కాబోయే బాబు ఎక్కడ? మేము ఆయనకు వంగి నమస్కారం చేయడానికి వచ్చాం.’

యెరూషలేము రాజైన హేరోదు ఆ కొత్త రాజు గురించి విన్నప్పుడు చాలా కంగారు పడ్డాడు. ఆయన ముఖ్య యాజకులను పిలిపించి, ‘కొత్త రాజు ఎక్కడ పుడతాడు?’ అని అడిగాడు. వాళ్లు ఇలా జవాబు ఇచ్చారు: ‘ప్రవక్తలు ఆయన బేత్లెహేములో పుడతాడు అని చెప్పారు.’ తూర్పు నుండి వచ్చిన మనుషులను పిలిచి హేరోదు ఇలా చెప్తాడు: ‘బేత్లెహేముకు వెళ్లి ఆ బిడ్డ కోసం వెదకండి. తిరిగి వచ్చి ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పండి. నేను కూడా ఆ బాబుకు వంగి నమస్కారం చేయాలని అనుకుంటున్నాను.’ కానీ అది అబద్ధం.

“నక్షత్రం” మళ్లీ అక్కడ నుండి కదలడం మొదలుపెట్టింది. ఆ మనుషులు దాని వెంట వెళ్లి బేత్లెహేముకు చేరుకుంటారు. ఆ “నక్షత్రం” ఒక ఇంటి పైకి వచ్చి ఆగింది, వాళ్లు లోపలికి వెళ్లారు. అక్కడ యేసును, ఆయన తల్లి మరియను చూశారు. వాళ్లు ఆ బాబుకు వంగి నమస్కారం చేసి బంగారం, సాంబ్రాణి, బోళం బహుమతిగా ఇస్తారు. ఈ మనుషులను యేసు దగ్గరకు నిజంగా యెహోవాయే పంపించాడా? లేదు.

ఆ రాత్రి యెహోవా కలలో యోసేపుతో ఇలా చెప్తాడు: ‘హేరోదు యేసును చంపాలని చూస్తున్నాడు. నువ్వు నీ భార్యను, కొడుకును తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను మళ్లీ రమ్మని చెప్పే వరకు మీరు అక్కడే ఉండండి.’ వెంటనే యోసేపు, అతని కుటుంబం ఐగుప్తుకు వెళ్లిపోయారు.

హేరోదు దగ్గరికి తిరిగి వెళ్లొద్దు అని యెహోవా తూర్పు నుండి వచ్చిన మనుషులతో చెప్తాడు. వాళ్లు తిరిగి రావడం లేదని హేరోదు తెలుసుకున్నప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. యేసు దొరకలేదు కాబట్టి, బేత్లెహేములో యేసు వయసులో ఉన్న పిల్లలందర్నీ చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. కానీ యేసు దూరంలో ఉన్న ఐగుప్తులో సురక్షితంగా ఉన్నాడు.

కొంతకాలానికి హేరోదు చనిపోయాడు. యెహోవా యోసేపుతో, ‘నువ్వు ఇప్పుడు తిరిగి వెళ్తే ఎలాంటి ప్రమాదం ఉండదు’ అని చెప్తాడు. యోసేపు, మరియ, యేసు ఇశ్రాయేలుకు తిరిగి వెళ్తారు, అక్కడ వాళ్లు నజరేతు పట్టణంలో నివసిస్తారు.

“నా నోటనుండి వచ్చు వచనమును ఉండును . . . అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.”—యెషయా 55:10, 11