కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 72

బాలుడైన యేసు

బాలుడైన యేసు

యోసేపు, మరియ యేసుతో, మిగతా కొడుకులు కూతుళ్లతో నజరేతులో నివసించేవాళ్లు. యోసేపు వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. అతను యెహోవా గురించి, ధర్మశాస్త్రం గురించి వాళ్లకు నేర్పించాడు. కుటుంబమంతా ఆరాధన కోసం సభామందిరానికి (సమాజమందిరానికి) క్రమంగా వెళ్లేవాళ్లు. ప్రతి సంవత్సరం పస్కా పండుగకు యెరూషలేముకు కూడా వెళ్లేవాళ్లు.

యేసుకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఎప్పటిలానే ఆయన కుటుంబం దూర ప్రయాణం చేసి యెరూషలేముకు వెళ్లారు. పస్కా చేసుకోవడానికి వచ్చిన ప్రజలతో ఆ పట్టణమంతా నిండిపోయింది. తర్వాత, యోసేపు, మరియ తిరిగి ఇంటికి బయల్దేరారు. యేసు ప్రయాణిస్తున్న వాళ్లలో ఎక్కడో ఉన్నాడని వాళ్లు అనుకున్నారు. కానీ బంధువుల్లో యేసు కోసం వెదికినప్పుడు ఆయన కనిపించలేదు.

మళ్లీ యెరూషలేముకు వెళ్లి మూడు రోజులు వాళ్ల కుమారుని కోసం వెదికారు. చివరికి ఆలయానికి వెళ్లారు. అక్కడ యేసు బోధకుల మధ్య కుర్చుని వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వింటూ, వాళ్లను మంచి ప్రశ్నలు అడుగుతున్నాడు. బోధకులు ఆయనను చూసి ఎంతో ఆశ్చర్యపోయి యేసును ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ఆయన చెప్పిన జవాబులకు వాళ్లు ఎంతో ఆశ్చర్యపోయారు. యెహోవా ధర్మశాస్త్రాన్ని యేసు అర్థం చేసుకున్నాడని వాళ్లు తెలుసుకున్నారు.

యోసేపు, మరియ చాలా కంగారు పడ్డారు. మరియ, ‘నాన్న, మేము నీ కోసం అంతా వెదుకుతున్నాం. నువ్వు ఎక్కడికి వెళ్లావు?’ అని అంది. యేసు ఇలా చెప్పాడు: ‘నేను నా తండ్రి ఇంట్లో ఉంటానని మీకు తెలియదా?’

యేసు తల్లిదండ్రులతో ఇంటికి నజరేతు వెళ్లిపోయాడు. యోసేపు యేసుకు వడ్రంగి పని నేర్పించాడు. యేసు యువకుడిగా ఉన్నప్పుడు ఎలాంటివాడై ఉంటాడని మీకు అనిపిస్తుంది? ఆయన పెద్దవాడు అవుతుండగా జ్ఞానాన్ని సంపాదించాడు. దేవుని అనుగ్రహం, మనుషుల అనుగ్రహం పొందాడు.

“నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.”—కీర్తన 40:8