కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 73

యోహాను మెస్సీయ వస్తున్నాడని ప్రకటించాడు

యోహాను మెస్సీయ వస్తున్నాడని ప్రకటించాడు

జెకర్యా, ఎలీసబెతుకు పుట్టిన యోహాను, పెద్దయ్యాక ప్రవక్త అయ్యాడు. మెస్సీయ వస్తున్నాడని ప్రజలకు నేర్పించడానికి యెహోవా యోహానును ఉపయోగించాడు. పట్టణాల్లో, సభామందిరాల్లో నేర్పించే బదులు యోహాను అడవుల్లో ప్రకటించాడు. యోహాను దగ్గర నేర్చుకోవడానికి ప్రజలు యెరూషలేమును నుండి, యూదయ ప్రాంతమంతటి నుండి వచ్చారు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే చెడు పనులు చేయడం మానేయాలని ఆయన వాళ్లకు నేర్పించాడు. యోహాను చెప్పింది విని చాలామంది వాళ్ల పాపాలు మానుకున్నారు. యోహాను వాళ్లకు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు.

యోహాను చాలా మామూలుగా జీవించేవాడు. ఆయన ఒంటె జుట్టుతో చేసిన బట్టలు వేసుకునేవాడు. మిడతలు, అడవి తేనె తినేవాడు. అందరికీ యోహాను గురించి తెలుసుకోవాలని ఉండేది. పొగరుబోతులైన పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా ఆయనిని చూడడానికి వచ్చేవాళ్లు. యోహాను వాళ్లతో ఇలా అన్నాడు: ‘మీరు మీ పద్ధతిని మార్చుకుని, పశ్చాత్తాపపడాలి. మీరు అబ్రాహాము పిల్లలు అని చెప్పుకున్నంత మాత్రాన మీరు ప్రత్యేకమైన వాళ్లని అనుకోకండి. మీరు దేవుని పిల్లలు అని అనుకోకండి.’

చాలామంది యోహాను దగ్గరకు వచ్చి ఇలా అడిగారు: ‘దేవునికి ఇష్టంగా ఉండాలంటే మేము ఏం చేయాలి?’ యోహాను యూదులకు ఇలా జవాబిచ్చాడు: ‘మీ దగ్గర రెండు అంగీలు ఉంటే, అవసరంలో ఉన్న వాళ్లకు ఒకటి ఇచ్చేయండి.’ ఆయన అలా ఎందుకు చెప్పాడో మీకు తెలుసా? దేవునికి ఇష్టంగా ఉండాలంటే, ప్రజలను ప్రేమించాలని తన శిష్యులకు నేర్పించాలనుకున్నాడు.

పన్నులు వసూలు చేసేవాళ్లతో యోహాను ఇలా అన్నాడు: ‘నిజాయితీగా ఉండండి. ఎవ్వరినీ మోసం చేయకండి.’ సైనికులతో ఇలా చెప్పాడు: ‘లంచాలు తీసుకోకండి, అబద్ధాలు చెప్పకండి.’

యాజకులు, లేవీయులు కూడా యోహాను దగ్గరకు వచ్చి ఇలా అడిగారు: ‘నువ్వు ఎవరివి? అందరికీ తెలుసుకోవాలనుంది.’ యోహాను ఇలా అన్నాడు: ‘యెషయా ప్రవచించినట్లు నేను అరణ్యంలో ఒక స్వరాన్ని. ప్రజల్ని యెహోవా దగ్గరికి నడిపిస్తున్నాను.’

యోహాను నేర్పించేవాటిని ప్రజలు ప్రేమించారు. చాలామంది యోహాను మెస్సీయ అయ్యుంటాడా అని అనుకున్నారు. కానీ ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: ‘చాలా గొప్ప అతను ఒకరు వస్తున్నారు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను సరిపోను. నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ ఆయన పవిత్రశక్తితో బాప్తిస్మం ఇస్తాడు.’

“అతని ద్వారా అన్నిరకాల ప్రజలు విశ్వాసముంచేలా, అతను ఆ వెలుగు గురించి సాక్ష్యమివ్వడానికి ఒక సాక్షిగా వచ్చాడు.”—యోహాను 1:7