కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 75

అపవాది యేసును పరీక్షిస్తాడు

అపవాది యేసును పరీక్షిస్తాడు

యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పవిత్ర శక్తి అతన్ని అడవిలోకి నడిపించింది. 40 రోజులు ఆయన ఏమీ తినలేదు కాబట్టి ఆయనకు బాగా ఆకలేసింది. అప్పుడు అపవాది యేసుతో ఏదైనా తప్పు చేయించాలని ఇలా అన్నాడు: ‘నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అయితే, రొట్టెలుగా అవ్వమని ఈ రాళ్లతో చెప్పు.’ కానీ యేసు లేఖనాలనుండి ఇలా జవాబు ఇచ్చాడు: ‘మనిషి ఆహారం వల్ల మాత్రమే జీవించడు. కానీ యెహోవా చెప్పే ప్రతీ మాట వినడం వల్ల జీవిస్తాడు అని రాసి ఉంది.’

తర్వాత అపవాది యేసుతో ‘నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అయితే, ఆలయంలో ఎత్తైన స్థలం నుండి దూకు. దేవుడు తన దూతల్ని పంపించి నిన్ను పట్టుకుంటాడని రాసి ఉంది’ అని సవాలు చేశాడు. కానీ యేసు మళ్లీ లేఖనాల నుండి ఇలా చెప్పాడు: ‘యెహోవాను పరీక్షించకూడదని రాసి ఉంది.’

తర్వాత సాతాను యేసుకు లోకంలో ఉన్న రాజ్యాలన్నిటినీ, వాటి ధనాన్ని, గొప్పతనాన్ని చూపించి ఇలా అన్నాడు: ‘నన్ను ఒక్కసారి ఆరాధిస్తే నేను నీకు ఈ రాజ్యాలు, వాటి గొప్పతనమంతా ఇచ్చేస్తాను.’ కానీ యేసు ఇలా అన్నాడు: ‘సాతాను వెళ్లిపో! యెహోవా ఒక్కడినే ఆరాధించాలని రాసి ఉంది.’

ఇక అపవాది వెళ్లిపోయాడు, దేవదూతలు వచ్చి యేసుకు తినడానికి ఆహారం ఇచ్చారు. అప్పటి నుండి యేసు దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాడు. అతన్ని భూమ్మీదకు పంపించింది ఈ పని చేయడానికే. యేసు ప్రజలకు నేర్పించిన వాటిని వాళ్లు ఎంతో ప్రేమించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా వాళ్లు ఆయన వెంట వెళ్లారు.

“[అపవాది] అబద్ధం చెప్పేటప్పుడు తన స్వభావం ప్రకారమే మాట్లాడతాడు; ఎందుకంటే అతను అబద్ధాలకోరు, అబద్ధానికి తండ్రి.”—యోహాను 8:44