కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 77

బావి దగ్గర స్త్రీ

బావి దగ్గర స్త్రీ

పస్కా పండుగ తర్వాత యేసు, ఆయన శిష్యులు సమరయ ప్రాంతం ద్వారా ప్రయాణిస్తూ గలిలయకు తిరిగి వెళ్తున్నారు. సుఖారు అనే పట్టణానికి దగ్గర్లో, యాకోబు అనే పేరున్న ఒక బావి దగ్గర యేసు ఆగాడు. ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శిష్యులు ఆహారం కొనడానికి పట్టణానికి వెళ్లారు.

ఒక స్త్రీ నీళ్లు చేదడానికి బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, “తాగడానికి నాకు కొన్ని నీళ్లు ఇవ్వు” అని అడిగాడు. ఆమె, ‘నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు. నేను సమరయ స్త్రీని. యూదులు సమరయులతో మాట్లాడరు కదా’ అంది. యేసు ఆమెతో ఇలా అన్నాడు: ‘నేను ఎవరో నీకు తెలిస్తే నువ్వు నన్ను తాగడానికి నీళ్లు అడుగుతావు. అప్పుడు నేను నీకు జీవజలం ఇస్తాను.’ ఆ స్త్రీ ‘అంటే ఏంటి? నీళ్లు చేదడానికి నీ దగ్గర గిన్నె కూడా లేదు’ అని అంది. యేసు, ‘నేను ఇచ్చే నీళ్లు తాగేవాళ్లెవ్వరికీ మళ్లీ దాహం వేయదు’ అన్నాడు. అప్పుడు స్త్రీ ఇలా అంది: ‘అయ్యా, నాకు ఆ నీళ్లు ఇవ్వు.’

తర్వాత యేసు ఆమెతో ఇలా అన్నాడు: ‘నీ భర్తను బావి దగ్గరకు తీసుకురా.’ ఆమె, ‘నాకు భర్త లేడు’ అంది. అందుకు ఆయన, ‘నువ్వు నిజం చెప్తున్నావు. నీకు ఐదుసార్లు పెళ్లైంది. నువ్వు ఇప్పుడు ఉంటున్న అతను నీ భర్త కాదు’ అన్నాడు. ఆమె ‘నువ్వు ప్రవక్త అని నాకు అనిపిస్తుంది. దేవున్ని ఈ కొండపైనే ఆరాధించాలని మావాళ్లు నమ్ముతారు, కానీ యూదులేమో యెరూషలేములోనే ఆరాధించాలని చెప్తారు. మెస్సీయ వచ్చినప్పుడు ఎలా ఆరాధించాలో ఆయన మాకు నేర్పిస్తాడని నేను నమ్ముతున్నాను’ అని అంది. అప్పుడు యేసు ఎవ్వరితో చెప్పని ఒక విషయాన్ని ఆమెతో చెప్పాడు: ‘నేనే మెస్సీయని.’

ఆ స్త్రీ వెంటనే పట్టణంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి, సమరయులతో ఇలా అంది: ‘నేను మెస్సీయను చూశాను అనుకుంటా. నా గురించి ఆయనకు అన్నీ తెలుసు. వచ్చి చూడండి!’ వాళ్లు ఆమెతో బావి దగ్గరికి వచ్చి యేసు బోధిస్తుంటే విన్నారు.

సమరయులు యేసును వాళ్ల పట్టణంలో ఉండమని ఆహ్వానించారు. రెండు రోజులు ఆయన అక్కడ ఉండి నేర్పించాడు. చాలామంది ఆయన మీద విశ్వాసం ఉంచారు. వాళ్లు సమరయ స్త్రీతో ఇలా అన్నారు: ‘ఇతను చెప్పేవి విన్న తర్వాత, ఆయన నిజంగా లోకాన్ని రక్షిస్తాడని మేము తెలుసుకున్నాం.’

“‘రండి!’ . . . దాహంగా ఉన్న ఎవరినైనా సరే రానివ్వండి. ఇష్టమున్న ఎవరినైనా ఉచితంగా జీవజలాలు తాగనివ్వండి.”—ప్రకటన 22:17