కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 78

యేసు దేవుని రాజ్యం గురించి చెప్పాడు

యేసు దేవుని రాజ్యం గురించి చెప్పాడు

బాప్తిస్మం అయిన కొంతకాలానికే యేసు ‘దేవుని రాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన గలిలయ, యూదయ ప్రాంతమంతా ప్రయాణిస్తున్నప్పుడు శిష్యులు ఆయనతోపాటు వెళ్లారు. యేసు తన సొంత ఊరు నజరేతుకు తిరిగి వచ్చినప్పుడు ఆయన అక్కడ సభామందిరానికి వెళ్లి యెషయా గ్రంథపు చుట్టను తెరిచి, పెద్దగా ఇలా చదివాడు: ‘నేను మంచివార్త ప్రకటించడానికి యెహోవా నాకు పవిత్రశక్తి ఇచ్చాడు.’ ఆ మాటల అర్థం ఏంటి? యేసు అద్భుతాలు చేయాలని ప్రజలు కోరుకున్నా, ఆయన ముఖ్యంగా మంచివార్త ప్రకటించడానికి పవిత్రశక్తిని పొందాడని దానర్థం. ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: ‘ఈ రోజు ఈ ప్రవచనం నెరవేరింది.’

తర్వాత, యేసు గలిలయ సముద్రం దగ్గరికి వెళ్లాడు. అక్కడ అతను తన నలుగురు శిష్యులను కలిశాడు, వాళ్లు చేపలు పట్టేవాళ్లు. ఆయన వాళ్లను పిలుస్తూ ఇలా అన్నాడు: ‘నాతో రండి. నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టేవాళ్లుగా చేస్తాను.’ వాళ్లు పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను. వెంటనే వాళ్లు చేపలు పట్టే వ్యాపారాన్ని వదిలేసి ఆయన వెంట వెళ్లారు. వాళ్లు యెహోవా రాజ్యం గురించి ప్రకటిస్తూ గలిలయ అంతా వెళ్లారు. సభామందిరాల్లో, సంతల్లో, వీధుల్లో ప్రకటించారు. వాళ్లు ఎక్కడికి వెళ్లినా చాలామంది ఒక గుంపుగా వాళ్ల వెంట వెళ్లేవాళ్లు. యేసు గురించి అన్ని చోట్ల, సిరియా దేశం వరకు కూడా తెలిసిపోయింది.

కొంతకాలం తర్వాత యేసు కొంతమంది శిష్యులకు ప్రజల రోగాలు బాగుచేయడానికి, చెడ్డదూతలను వెళ్లగొట్టడానికి శక్తిని ఇచ్చాడు. ఆయన ప్రకటించడానికి ఒక పట్టణం నుండి ఇంకో పట్టణానికి, ఒక ఊరునుండి ఇంకో ఊరికి వెళ్లినప్పుడు మిగతావాళ్లు ఆయనతోపాటు వెళ్లారు. చాలామంది నమ్మకమైన స్త్రీలు, అంటే మగ్దలేనే మరియ, సూసన్న, యోహన్న, ఇంకా వేరే స్త్రీలు యేసును ఆయన శిష్యుల్ని చూసుకున్నారు.

శిష్యులకు నేర్పించాక యేసు వాళ్లను ప్రకటించడానికి పంపించాడు. వాళ్లు గలిలయ ప్రాంతమంతా వెళ్లినప్పుడు చాలామంది శిష్యులు అయ్యి, బాప్తిస్మం పొందారు. ఎంతోమంది ఆయన శిష్యులు అవ్వాలి అనుకున్నారు. అందుకే యేసు వాళ్లను కోతకు దగ్గరపడిన పొలంతో పోల్చాడు. ఆయనిలా అన్నాడు: ‘కోతపని చేయడానికి ఇంకా పనివాళ్లను పంపించమని యెహోవాకు ప్రార్థన చేయండి.’ తర్వాత, ఆయన 70 మంది శిష్యుల్ని ఎంపిక చేసుకుని యూదయ ప్రాంతమంతా ప్రకటించడానికి వాళ్లను పంపించాడు. వాళ్లు రాజ్యం గురించి రకరకాల వాళ్లకు నేర్పించారు. శిష్యులు తిరిగి వచ్చినప్పుడు జరిగిన వాటిని యేసుకు చెప్పాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రకటనా పనిని ఆపడానికి అపవాది ఏమీ చేయలేకపోయాడు.

ఆయన పరలోకానికి వెళ్లిపోయాక కూడా తన శిష్యులు ఈ ముఖ్యమైన పనిని చేస్తూ ఉండేలా యేసు చూసుకున్నాడు. ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: ‘భూమంతా మంచివార్త ప్రకటించండి. దేవుని వాక్యం గురించి ప్రజలకు నేర్పించండి, వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి.’

“నేను మిగతా నగరాల్లో కూడా దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి. ఇందుకోసమే దేవుడు నన్ను పంపించాడు.”—లూకా 4:43