కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 79

యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు

యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు

దేవుని రాజ్యం గురించిన మంచివార్తను అందరికీ చెప్పడానికి యేసు భూమ్మీదకు వచ్చాడు. యెహోవా ఆయనకు అద్భుతాలు చేయడానికి పవిత్రశక్తిని ఇచ్చి రాజుగా యేసు ఏం చేస్తాడో చూపించాడు. యేసు ఏ జబ్బునైనా బాగు చేయగలడు. ఆయన ఎక్కడికి వెళ్లినా రోగులు సహాయం కోసం ఆయన దగ్గరికి వచ్చేవాళ్లు, వాళ్లందరినీ ఆయన బాగు చేశాడు. గుడ్డివాళ్లు చూశారు, చెవిటివాళ్లు విన్నారు, పక్షవాతం ఉన్నవాళ్లు లేచి నడిచారు. చెడ్డదూతలు పట్టినవాళ్ల నుండి చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు. యేసు అంగీ చెంగును పట్టుకున్నా బాగైపోయేవాళ్లు. యేసు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయన వెంట వెళ్లేవాళ్లు. యేసుకు ఒక్కడే ఉండాలని అనిపించినా ఆయన ఎవ్వర్నీ వెళ్లిపొమ్మని చెప్పలేదు.

ఒకసారి పక్షవాతం ఉన్న ఒకతన్ని కొంతమంది యేసు ఉంటున్న ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆ ఇల్లు చాలామందితో నిండిపోయేసరికి వాళ్లు లోపలికి వెళ్లలేకపోయారు. కాబట్టి వాళ్లు ఇంటి పైకప్పుకు ఒక రంధ్రం చేసి అతన్ని లోపలికి దించారు. అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: ‘లేచి, నడువు.’ అతను నడిచినప్పుడు ప్రజలు చూసి చాలా ఆశ్చర్యపోయారు.

ఇంకోసారి, యేసు ఒక ఊరులోకి వెళ్తున్నప్పుడు కుష్ఠురోగం ఉన్న పది మంది దూరంలో నిలబడి ఇలా అరిచారు: ‘యేసు, మాకు సహాయం చేయి.’ ఆ రోజుల్లో కుష్ఠురోగులు వేరేవాళ్ల దగ్గరకు రాకూడదు. యేసు వాళ్లను ఆలయానికి వెళ్లమని చెప్పాడు. ఎందుకంటే కుష్ఠురోగులు బాగయ్యాక ఆలయానికి వెళ్లాలని యెహోవా ధర్మశాస్త్రంలో ఉంది. వాళ్లు వెళ్తున్నప్పుడు వాళ్ల జబ్బు తగ్గిపోయింది. వాళ్లలో ఒకతను తన జబ్బు తగ్గిపోయిందని తెలుసుకున్నప్పుడు యేసుకు థ్యాంక్స్‌ చెప్పడానికి, దేవున్ని స్తుతించడానికి తిరిగి వచ్చాడు. ఆ పదిమందిలో ఒక్క అతనే యేసుకు థ్యాంక్స్‌ చెప్పాడు.

ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఎలా అయినా జబ్బు తగ్గాలని ఆమె అనుకుంది. యేసు చుట్టూ చాలామంది ఉన్నప్పుడు ఆమె ఆయన వెనక్కి వెళ్లి, ఆయన అంగీ అంచు ముట్టుకుంది. వెంటనే ఆమె జబ్బు తగ్గిపోయింది. అది జరిగినప్పుడు యేసు ఇలా అడిగాడు: “నన్ను ముట్టుకున్నది ఎవరు?” ఆ స్త్రీకి చాలా భయమేసింది కానీ ముందుకు వచ్చి, నిజం చెప్పేసింది. యేసు ఆమెతో ఓదార్పుగా మాట్లాడి, ‘కుమారీ, ప్రశాంతంగా వెళ్లు’ అన్నాడు.

యాయీరు అనే ఒక అధికారి యేసును ఇలా బ్రతిమాలాడు: ‘మా ఇంటికి రండి! మా పాపకు అస్సలు బాలేదు.’ కానీ యేసు యాయీరు ఇంటికి చేరుకునేలోపే ఆ పాప చనిపోయింది. యేసు వచ్చినప్పుడు చాలామంది ఆ కుటుంబంతో కలిసి ఏడ్వడం చూశాడు. యేసు వాళ్లతో ఇలా అన్నాడు: ‘ఏడ్వకండి. ఆమె నిద్రపోతుంది అంతే.’ ఆయన ఆమె చేయి పట్టుకుని ఇలా అన్నాడు: ‘పాప, లెగు!’ ఆమె వెంటనే లేచి కూర్చుంది. ఆమెకు తినడానికి ఏదైన ఇవ్వమని యేసు ఆమె అమ్మానాన్నతో చెప్పాడు. వాళ్లకు ఎలా అనిపించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.

“దేవుడు ఆయన్ని పవిత్రశక్తితో అభిషేకించాడు. ఆయనకు శక్తిని ఇచ్చాడు. దానివల్ల ఆయన మంచి పనులు చేస్తూ, అపవాది చేత పీడించబడుతున్న వాళ్లను బాగుచేస్తూ ఆ ప్రాంతమంతా తిరిగాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు.”—అపొస్తలుల కార్యాలు 10:38