కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 81

కొండ మీద ప్రసంగం

కొండ మీద ప్రసంగం

యేసు 12 మంది అపొస్తలులను ఎన్నుకున్నాక కొండ మీద నుండి కిందికి వచ్చాడు. అక్కడ చాలామంది ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లు గలిలయ, యూదయ, తూరు, సీదోను, సిరియ, యొర్దాను అవతలి ప్రాంతాల నుండి వచ్చారు. జబ్బులతో బాధపడేవాళ్లను, చెడ్డదూతలతో బాధించబడేవాళ్లను ప్రజలు ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. యేసు వాళ్లందరినీ బాగుచేశాడు. తర్వాత ఆయన కొండ ఎక్కి ఒక చోట కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్నేహితులుగా ఉండాలంటే ఏమి చేయాలో ఆయన నేర్పించాడు. యెహోవా మనకు అవసరమని గుర్తించాలి. ఆయన్ను ప్రేమించడం నేర్చుకోవాలి. మనం అందర్నీ ప్రేమించకపోతే దేవున్ని ప్రేమించలేము. మనం అందరితో, శత్రువులతో కూడా దయగా న్యాయంగా ఉండాలి.

యేసు ఇలా చెప్పాడు: ‘మీ స్నేహితుల్ని మాత్రం ప్రేమిస్తే సరిపోదు. మీ శత్రువుల్ని కూడా ప్రేమించాలి. మనస్ఫూర్తిగా అందర్నీ క్షమించాలి. ఎవరైనా మనవల్ల బాధపడితే వెంటనే మనం వాళ్ల దగ్గరికి వెళ్లి క్షమాపణ అడగాలి. ఇతరులు మనల్ని ఎలా చూడాలని అనుకుంటామో, మనం ఇతరులను అలా చూడాలి.’

యేసు ప్రజలకు వస్తుసంపదల గురించి కూడా మంచి సలహా ఇచ్చాడు. ఆయన ఇలా చెప్పాడు: ‘ఎక్కువ డబ్బు ఉండడం కన్నా యెహోవాకు స్నేహితునిగా ఉండడం చాలా ముఖ్యం. దొంగ మీ డబ్బును దొంగతనం చేయవచ్చు. కానీ యెహోవాతో మీ స్నేహాన్ని ఎవరూ దొంగతనం చేయలేరు. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి వేసుకోవాలి అని కంగారు పడడం మానేయండి. పక్షుల్ని చూడండి. దేవుడు ఎప్పుడూ వాటికి సరిపడా ఆహారం ఉండేలా చూసుకుంటున్నాడు. కంగారు పడడం వల్ల మనం ఒక్క రోజు కూడా జీవితాన్ని పెంచుకోలేము. మీకు ఏమి కావాలో యెహోవాకు తెలుసని గుర్తుపెట్టుకోండి.’

యేసులా మాట్లాడిన వాళ్లను ఆ ప్రజలు ఎప్పుడూ చూడలేదు. వాళ్ల మతనాయకులు వాళ్లకు ఈ విషయాలు నేర్పించలేదు. యేసు ఎందుకు అంత మంచి టీచర్‌? ఎందుకంటే ఆయన నేర్పించినవన్నీ యెహోవా చెప్పినవే.

“నేను సౌమ్యుడిని, వినయస్థుడిని కాబట్టి నా కాడిని మీమీద ఎత్తుకుని, నా దగ్గర నేర్చుకోండి; అప్పుడు మీరు సేదదీర్పు పొందుతారు.”—మత్తయి 11:29