కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 82

ప్రార్థన ఎలా చేయాలో యేసు శిష్యులకు నేర్పిస్తాడు

ప్రార్థన ఎలా చేయాలో యేసు శిష్యులకు నేర్పిస్తాడు

పరిసయ్యులు ఏదీ చేసినా ప్రజల ముందు గొప్ప కోసం చేసేవాళ్లు. వాళ్లు ఏదైనా మంచి పని చేస్తే ఇతరులు చూడాలనే ఉద్దేశంతో చేసేవాళ్లు. అందరూ ఉండే చోట ప్రజలకు కనపడేలా వాళ్లు ప్రార్థన చేసేవాళ్లు. పెద్దపెద్ద ప్రార్థనల్ని బట్టీపట్టి వాటినే మళ్లీమళ్లీ సభామందిరాల్లో రోడ్డు చివర్లలో నిలబడి అందరికి వినబడేలా చేసేవాళ్లు. అందుకే యేసు ఇలా చెప్పినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు: ‘పరిసయ్యుల్లా ప్రార్థన చేయకండి. ఎన్నో మాటలు ఉపయోగించి దేవున్ని మెప్పించవచ్చని వాళ్లు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్రార్థన మీకూ యెహోవాకు మధ్య ఉండాలి. ఒకే ప్రార్థనను మళ్లీమళ్లీ చెప్పకండి. మీ మనసులో మీకు ఏమి అనిపిస్తుందో చెప్పాలని యెహోవా కోరుకుంటున్నాడు.

‘మీరు ఇలా ప్రార్థన చేయాలి: “పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ పేరు పవిత్రం అవ్వాలి. నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలో జరిగినట్లు భూమి మీద జరగాలి.”’ ఆ రోజుకి కావాల్సిన ఆహారం కోసం ప్రార్థించాలని కూడా యేసు వాళ్లకు చెప్పాడు. వాళ్ల పాపాలకు క్షమాపణను, వాళ్ల సొంత విషయాలను అడగాలని కూడా చెప్పాడు.

యేసు ఇలా చెప్పాడు: ‘ప్రార్థన చేయడం ఆపకండి. మంచి విషయాల కోసం మీ తండ్రి యెహోవాను అడుగుతూనే ఉండండి. ప్రతి అమ్మానాన్న పిల్లలకు మంచి వస్తువుల్ని ఇవ్వాలని అనుకుంటారు. మీ కొడుకు మిమ్మల్ని రొట్టె అడిగితే మీరు వాడికి రాయిని ఇస్తారా? మీ బాబు చేపని ఇవ్వమని అడిగితే పాముని ఇస్తారా?’

తర్వాత యేసు వాళ్లకు ఈ పాఠాన్ని వివరించాడు: ‘మీ పిల్లలకు మంచి గిఫ్ట్స్‌ ఎలా ఇవ్వాలో మీకు తెలుసు. అలాంటిది, మీ తండ్రి యెహోవాకు మీకు పవిత్రశక్తిని ఇవ్వాలని ఇంకెంతగానో తెలుసు కదా! మీరు ఆయన్ని అడిగితే సరిపోతుంది.’ మీరు యేసు చెప్పిన మాటల్ని పాటిస్తారా? మీరు ఎలాంటి విషయాల గురించి ప్రార్థన చేస్తారు?

“అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది; వెతుకుతూ ఉండండి, మీకు దొరుకుతుంది; తడుతూ ఉండండి, మీ కోసం తెరవబడుతుంది.”—మత్తయి 7:7