కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 84

యేసు నీళ్ల మీద నడుస్తాడు

యేసు నీళ్ల మీద నడుస్తాడు

యేసు జబ్బుతో ఉన్నవాళ్లని బాగు చేయడం, చనిపోయిన వాళ్లను బ్రతికించడం మాత్రమే కాకుండా గాలిని, వర్షాన్ని కూడా అదుపు చేశాడు. కొండ మీద ప్రార్థన చేసుకున్నాక, యేసు కింద ఉన్న గలిలయ సముద్రాన్ని చూశాడు. అక్కడ తుఫాను వస్తుంది. ఆయన అపొస్తలులు పడవలో ఉన్నారు. గాలి ఎదురుగా కొట్టడం వల్ల వాళ్లు పడవ నడపడానికి చాలా కష్టపడుతున్నారు. యేసు కిందికి వచ్చి నీళ్లపై నడుస్తూ పడవ వైపు వెళ్తున్నాడు. ఎవరో నీళ్ల మీద నడవడం చూసి అపొస్తలులకు చాలా భయం వేసింది. కానీ యేసు వాళ్లతో ‘నేనే, భయపడకండి’ అని చెప్పాడు.

అప్పుడు పేతురు ‘ప్రభువా, అది నిజంగా నువ్వే అయితే, నన్ను కూడా నీ దగ్గరికి రావడానికి ఆజ్ఞ ఇవ్వు’ అన్నాడు. యేసు పేతురుతో ‘నా దగ్గరికి రా’ అని పిలిచాడు. కాబట్టి తుఫాను మధ్యలో పేతురు పడవ దిగి నీళ్లలో నడుచుకుంటూ యేసు వైపు వెళ్లాడు. కానీ యేసు దగ్గరికి వచ్చేసరికి పేతురు తుఫానుని చూసి భయపడి పోయాడు. తను మునిగిపోతున్నాడని తెలుసుకుని పేతురు ఇలా అరిచాడు: ‘ప్రభువా నన్ను కాపాడు.’ యేసు ఆయన చేయి పట్టుకుని ‘నువ్వెందుకు సందేహించడం మొదలుపెట్టావు? నీ విశ్వాసం ఏమైంది?’ అని అడిగాడు.

యేసు, పేతురు పడవ ఎక్కారు, వెంటనే తుఫాను ఆగిపోయింది. అపొస్తలులకు ఎలా అనిపించి ఉంటుందో మీరు ఊహించుకోగలరా? వాళ్లు ‘నువ్వు నిజంగా దేవుని కుమారుడివి’ అని అన్నారు.

యేసు వాతావరణాన్ని అదుపు చేసింది ఈ ఒక్కసారే కాదు. ఇంకొకసారి యేసు, ఆయన శిష్యులు సముద్రం అవతలికి వెళ్తున్నప్పుడు యేసు పడవలో వెనక భాగానికి వెళ్లి నిద్రపోయాడు. ఆయన నిద్రపోతున్నప్పుడు భయంకరమైన తుఫాను వచ్చింది. అలలు పడవను కొడుతున్నాయి. పడవ నీళ్లతో నిండిపోయింది. అపొస్తలులు యేసును ఇలా అరుస్తూ లేపారు: ‘బోధకుడా, మేము చనిపోతున్నాం. మమ్మల్ని కాపాడు.’ యేసు లేచి సముద్రంతో “నిశ్శబ్దంగా ఉండు” అన్నాడు. వెంటనే గాలి, సముద్రం నెమ్మది అయిపోయాయి. యేసు అపొస్తలుల్ని ‘మీ విశ్వాసం ఏమైంది’ అని అడిగాడు. వాళ్లు ఒకరితో ఒకరు “గాలి, సముద్రం కూడా ఈయనకు లోబడుతున్నాయి” అని చెప్పుకున్నారు. యేసును పూర్తిగా నమ్మితే వాళ్లు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని అపొస్తలులు నేర్చుకున్నారు.

“సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?”—కీర్తన 27:13