కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 86

యేసు లాజరును లేపుతాడు

యేసు లాజరును లేపుతాడు

యేసుకు ముగ్గురు మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్లు బేతనియ గ్రామంలో ఉండే లాజరు, అతని ఇద్దరి సహోదరీలు మార్త, మరియ. ఒకరోజు యేసు యొర్దానుకు అవతల ప్రాంతంలో ఉన్నప్పుడు మరియ, మార్త అతనికి ఒక అత్యవసర సందేశాన్ని పంపిస్తారు: ‘లాజరుకు బాగా జబ్బుగా ఉంది. దయచేసి త్వరగా రండి.’ కానీ యేసు వెంటనే వెళ్లడు. రెండు రోజులు ఆగి శిష్యులతో ఇలా చెప్పాడు: ‘మనం బేతనియకు వెళ్దాం. లాజరు నిద్రపోతున్నాడు. నేను అతన్ని లేపడానికి వెళ్తున్నాను.’ అపొస్తలులు ‘లాజరు నిద్రపోతే బాగవుతాడు’ అని అంటారు. అప్పుడు యేసు వాళ్లకు అర్థమయ్యేలా ‘లాజరు చనిపోయాడు’ అని చెప్పాడు.

యేసు బేతనియకు వచ్చాడు. లాజరును సమాధిలో పెట్టి అప్పటికే నాలుగు రోజులు అయింది. ప్రజలు గుంపులు గుంపులుగా మార్తను, మరియను ఓదార్చడానికి వచ్చారు. యేసు వచ్చాడని వినగానే మార్త వెంటనే ఆయన్ను కలవడానికి వచ్చింది. ఆమె ఇలా అంది: ‘ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు.’ యేసు ఆమెతో ‘నీ సహోదరుడు మళ్లీ బ్రతుకుతాడు. నువ్వు దీన్ని నమ్ముతున్నావా మార్త?’ అన్నాడు. ‘అతను పునరుత్థానం అప్పుడు లేస్తాడని నేను నమ్ముతాను’ అని ఆమె చెప్పింది. అప్పుడు యేసు ‘నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని’ అని చెప్పాడు.

తర్వాత మార్త మరియ దగ్గరికి వెళ్లి ఇలా చెప్పింది: ‘యేసు వచ్చాడు.’ మరియ యేసు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. జన సమూహం అంతా ఆమె వెనుక వచ్చారు. ఆమె అతని కాళ్ల దగ్గర పడి ఏడుపు ఆపుకోలేపోయింది. ఆమె ఇలా అంది: ‘ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు బ్రతికి ఉండేవాడు.’ యేసు ఆమె ఎంత బాధపడుతుందో చూసి, ఆయన కూడా ఏడవడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నవాళ్లందరూ ఆయన ఏడవడం చూసి ‘యేసు లాజరును ఎంత ప్రేమించాడో చూడండి’ అన్నారు. కానీ కొంతమంది ‘ఆయన తన స్నేహితున్ని ఎందుకు కాపాడలేదు?’ అని అనుకున్నారు. ఇప్పుడు యేసు ఏమి చేస్తాడు?

యేసు సమాధి దగ్గరికి వెళ్లాడు. ఆ సమాధి పెద్ద రాయితో మూసేసి ఉంది. ఆయన ‘ఆ రాయిని జరపండి’ అని ఆజ్ఞ ఇచ్చాడు. మార్త ఇలా చెప్పింది: ‘కానీ చనిపోయి నాలుగు రోజులు అయింది. అతని శరీరం వాసన కొడుతుంది.’ అయినా వాళ్లు రాయిని జరిపేశారు, అప్పుడు యేసు ‘తండ్రీ, నా మాట విన్నందుకు కృతజ్ఞతలు. నువ్వు ఎప్పుడూ నా మాట వింటావని నాకు తెలుసు. కానీ నువ్వు నన్ను పంపించావని ఈ ప్రజలు తెలుసుకోవాలని అందరికీ వినిపించేలా చెప్తున్నాను’ అని అన్నాడు. తర్వాత ఆయన పెద్దగా “లాజరూ, బయటికి రా” అని పిలిచాడు. అప్పుడు ఒక గొప్ప సంఘటన జరిగింది. లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. అతనికి ఇంకా నార బట్టలు చుట్టి ఉన్నాయి. యేసు “అతని కట్లు విప్పి, అతన్ని వెళ్లనివ్వండి” అన్నాడు.

దీన్ని చూసిన చాలామంది యేసు మీద విశ్వాసం ఉంచారు. కానీ కొంతమంది వెళ్లి పరిసయ్యులకు చెప్పారు. అప్పటి నుండి పరిసయ్యులు యేసును లాజరును ఇద్దరినీ చంపాలని అనుకున్నారు. యేసు 12 అపొస్తలుల్లో ఒకరైన యూదా ఇస్కరియోతు రహస్యంగా పరిసయ్యులు దగ్గరికి వెళ్లి ఇలా అడిగాడు: ‘యేసును పట్టుకోవడానికి నేను మీకు సహాయం చేస్తే నాకు ఎంత ఇస్తారు?’ వాళ్లు 30 వెండి నాణాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. యూదా యేసును పరిసయ్యులకు అప్పగించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు.

“దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.”—కీర్తన 68:20