కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 87

యేసు ఆఖరి భోజనం

యేసు ఆఖరి భోజనం

యూదులు ప్రతి సంవత్సరం నీసాను నెల 14వ రోజున పస్కా పండుగను చేసుకునేవాళ్లు. యెహోవా వాళ్లను ఐగుప్తు బానిసత్వం నుండి ఎలా విడిపించాడో, వాగ్దానదేశంలోకి ఎలా తీసుకొచ్చాడో ఈ పండుగ గుర్తు చేసేది. క్రీస్తు శకం 33వ సంవత్సరంలో యేసు ఆయన అపొస్తలులు యెరూషలేములో ఒక మేడ గదిలో పస్కాను చేసుకున్నారు. ఆ భోజనం చివరిలో యేసు ఇలా అన్నాడు: ‘మీలో ఒకరు నాకు నమ్మకద్రోహం చేస్తారు.’ అపొస్తలులు కంగారు పడి యేసును ఇలా అడిగారు: ‘ఎవరు అది?’ యేసు ఇలా అన్నాడు: ‘నేను ఎవరికైతే ఈ రొట్టెను ఇస్తానో అతనే.’ తర్వాత యేసు ఒక రొట్టె ముక్కను యూదా ఇస్కరియోతుకు ఇచ్చాడు. వెంటనే యూదా లేచి ఆ గదిలో నుండి వెళ్లిపోయాడు.

తర్వాత యేసు ప్రార్థన చేసి, రొట్టెల్ని ముక్కలు చేసి, దానిని మిగతా అపొస్తలులకు ఇచ్చాడు. ఆయన వాళ్లతో ఇలా చెప్పాడు: ‘ఈ రొట్టెను తినండి. ఇది నేను మీ కోసం ఇవ్వబోయే నా శరీరానికి గుర్తుగా ఉంది.’ తర్వాత ఆయన ద్రాక్షారసం కోసం ప్రార్థన చేసి దానిని తన అపొస్తలులకు ఇచ్చాడు. ఆయన వాళ్లతో ఇలా చెప్పాడు: ‘ఈ ద్రాక్షారసం త్రాగండి. ఇది నా రక్తానికి గుర్తుగా ఉంది. పాపాలకు క్షమాపణ కలగడానికి నేను నా రక్తాన్ని ఇస్తాను. మీరు నాతోపాటు పరలోకంలో రాజులుగా ఉంటారని మాట ఇస్తున్నాను. ప్రతి సంవత్సరం నన్ను గుర్తు చేసుకోవడానికి దీనిని చేయండి.’ యేసు అనుచరులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ రోజు సాయంత్రం కలుసుకుంటారు. ఆ మీటింగ్‌ని ఇప్పుడు ప్రభువు రాత్రి భోజనం అని పిలుస్తారు.

భోజనం తర్వాత అపొస్తలులు వాళ్లలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. కానీ యేసు వాళ్లతో ఇలా చెప్పాడు: ‘అందరిలో చిన్నవాడినని అంటే చాలా తక్కువ వాడినని ఎవరైతే అనుకుంటారో అతనే మీ అందరిలో గొప్పవాడు.’

‘మీరు నా స్నేహితులు. నా తండ్రి నాకు చెప్పాలనుకునే విషయాలన్నీ నేను మీకు చెప్తాను. నేను త్వరలో నా తండ్రి దగ్గరికి పరలోకానికి వెళ్తున్నాను. మీరు ఇక్కడే ఉంటారు. మీరు ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమను బట్టే మీరు నా శిష్యులని ప్రజలు తెలుసుకుంటారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.’

చివరికి శిష్యులందరినీ కాపాడమని అడుగుతూ యేసు యెహోవాకు ప్రార్థన చేస్తాడు. వాళ్లు కలిసి శాంతిగా పనిచేసేలా సహాయం చేయమని ఆయన యెహోవాను అడుగుతాడు. యెహోవా పేరు పవిత్రం అవ్వాలి అని ప్రార్థన చేస్తాడు. తర్వాత యేసు, అతని అపొస్తలులు పాటలు పాడి యెహోవాను స్తుతించి బయటకు వెళ్లిపోతారు. యేసును బంధించే సమయం దగ్గరికి వచ్చేసింది.

“చిన్నమందా, భయపడకండి, మీకు రాజ్యాన్ని ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం.”—లూకా 12:32