కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 88

యేసును బంధించారు

యేసును బంధించారు

యేసు, అపొస్తలులు కిద్రోను లోయ గుండా నడుచుకుంటూ ఓలీవ కొండకు వెళ్లారు. మధ్యరాత్రి దాటింది, చంద్రుడు నిండుగా ఉన్నాడు. వాళ్లు గెత్సేమనే తోటకు వచ్చాక యేసు వాళ్లతో ఇలా చెప్పాడు: “మీరు ఇక్కడే ఉండి, మెలకువగా ఉండండి.” తర్వాత యేసు ఆ తోటలో కొంచెం ముందుకు వెళ్లి మోకాళ్ల మీద కూర్చుంటాడు. చాలా బాధలో ఆయన యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు: “నీ ఇష్టప్రకారమే కానివ్వు.” యెహోవా యేసుకు బలాన్ని ఇవ్వడానికి దేవదూతను పంపించాడు. యేసు అపొస్తలుల దగ్గరకు తిరిగి వెళ్లేసరికి ఆ ముగ్గురు నిద్రపోవడం చూశాడు. ఆయన వాళ్లతో ‘లేవండి, ఇది నిద్రపోయే సమయం కాదు! నా శత్రువుల చేతికి నేను అప్పగించబడే సమయం వచ్చేసింది.’

అంతలోనే యూదా కత్తులు, కర్రలు పట్టుకున్న ఒక పెద్ద గుంపుని తీసుకుని వచ్చాడు. ఆయనకు యేసు ఎక్కడ ఉంటాడో తెలుసు, ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ ఈ తోటకి వచ్చేవాళ్లు. యూదా యేసును చూపిస్తానని సైనికులతో చెప్తాడు. ఆయన వెంటనే యేసు దగ్గరికి వెళ్లి, ‘బోధకుడా, నీకు శుభం’ అని అతన్ని ముద్దు పెట్టుకుంటాడు. ‘ముద్దు పెట్టి నాకు నమ్మకద్రోహం చేస్తున్నావా యూదా?’ అని యేసు యూదాతో అన్నాడు.

యేసు ముందుకొచ్చి ఆ గుంపుని ఇలా అడిగాడు: “మీరు ఎవరి కోసం వెదుకుతున్నారు?” వాళ్లు “నజరేయుడైన యేసు కోసం” అని చెప్పారు. తర్వాత ఆయన ఇలా జవాబిచ్చాడు: “నేనే ఆయన్ని.” ఆయన అలా అనగానే ఆ మనుషులు వెనక్కి జరిగి నేలమీద పడిపోయారు. యేసు “మీరు ఎవరి కోసం వెదుకుతున్నారు?” అని వాళ్లను మళ్లీ అడిగాడు. మళ్లీ వాళ్లు “నజరేయుడైన యేసు కోసం” అని జవాబిచ్చారు. యేసు వాళ్లతో ఇలా అన్నాడు: ‘నేనే ఆయన్ని అని మీతో చెప్పాను కదా. వీళ్లను వెళ్లనివ్వండి.’

అక్కడ ఏమి జరుగుతుందో అర్థమవ్వగానే పేతురు ఒక పెద్ద కత్తిని తీసి మల్కు అనే ప్రధాన యాజకుని పనివాడి చెవిని కోస్తాడు. కానీ యేసు అతని చెవిని ముట్టుకుని బాగుచేస్తాడు. తర్వాత పేతురుతో ఇలా అన్నాడు: ‘నీ కత్తిని తీసేయి. నువ్వు కత్తితో పోరాడితే కత్తితోనే చచ్చిపోతావు.’ అప్పుడు సైనికులు యేసుని పట్టుకుని చేతులు కట్టేస్తారు. అపొస్తలులు పారిపోతారు. తర్వాత ఆ గుంపు యేసుని ముఖ్య యాజకుడైన అన్న దగ్గరికి తీసుకెళ్తారు. అన్న యేసుని విచారణ చేసి ప్రధాన యాజకుడైన కయప ఇంటికి పంపిస్తాడు. మరి అపొస్తలులకు ఏమి అవుతుంది?

“లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయితే ధైర్యం తెచ్చుకోండి! నేను లోకాన్ని జయించాను.”—యోహాను 16:33