కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 89

యేసు ఎవరో తెలియదన్న పేతురు

యేసు ఎవరో తెలియదన్న పేతురు

యేసు తన అపొస్తలులతో మేడ మీద గదిలో ఉన్నప్పుడు ‘ఈ రోజు రాత్రి మీరందరూ నన్ను వదిలేస్తారు’ అని వాళ్లతో చెప్పాడు. కానీ పేతురు ‘నేను కాదు. అందరూ నిన్ను వదిలినా, నేను నిన్ను ఎప్పటికీ వదిలేయను’ అని అన్నాడు. కానీ యేసు పేతురుతో, ‘కోడి కూయక ముందు, మూడుసార్లు నేను ఎవరో తెలియదని నువ్వు అంటావు’ అన్నాడు.

సైనికులు యేసును కయప ఇంటికి తీసుకెళ్లినప్పుడు అపొస్తలులందరూ పారిపోతారు. కానీ వాళ్లలో ఇద్దరు ఆ గుంపులో యేసు వెనక వెళ్తారు. వాళ్లలో ఒకడు పేతురు. ఆయన కయప ఇంటి బయట ఖాళీ స్థలంలోకి వెళ్లి అక్కడ మంట దగ్గర చలి కాచుకుంటాడు. ఆ వెలుతురులో ఒక పనమ్మాయి పేతురు ముఖాన్ని చూసి ఇలా అంది: ‘నువ్వు నాకు తెలుసు. నువ్వు యేసుతో ఉన్నావు.’

పేతురు ఇలా అన్నాడు: ‘లేదు, నేను లేను. నువ్వేమి అంటున్నావో నాకు తెలియదు.’ ఆయన గేటు వైపు వెళ్లాడు. అంతలోనే ఇంకొక పనమ్మాయి ఆయనను చూసి అక్కడున్న గుంపుతో ఇలా చెప్పింది: ‘ఇతను యేసుతో ఉన్నాడు.’ పేతురు ‘నాకు యేసు ఎవరో కూడా తెలియదు’ అని అన్నాడు. ఒకతను ఇలా అన్నాడు: ‘నువ్వు వాళ్లలో ఒకడివే. నీ భాష చూసి నేను చెప్పగలను, నువ్వు యేసులానే గలిలయ వాడివి.’ కానీ పేతురు ఒట్టు పెట్టుకుంటూ ‘నాకు ఆయన తెలియదు’ అని అన్నాడు.

ఆ క్షణంలోనే కోడి కూసింది. యేసు తన వైపు తిరిగి చూడడం పేతురు చూశాడు. ఆయనకు యేసు మాటలు గుర్తు వచ్చాయి. బయటకు వెళ్లి బాధతో చాలా ఏడ్చాడు.

ఈలోపు యూదుల మహాసభ, కయప ఇంట్లో సమావేశమై యేసును ప్రశ్నించారు. వాళ్లు యేసును చంపాలని అప్పటికే నిర్ణయించేసుకున్నారు. ఇప్పుడు కారణం కోసం వెదుకుతున్నారు. కానీ యేసులో వాళ్లకే తప్పు దొరకలేదు. చివరికి కయప యేసుని ఇలా అడిగాడు: ‘నువ్వు దేవుని కుమారుడివా?’ యేసు ‘అవును’ అని చెప్పాడు. కయప ‘ఇంక ఇంతకన్నా రుజువులు అవసరం లేదు. ఇది దేవున్ని అవమానించడమే’ అని అన్నాడు. ఆ సభలో వాళ్లు ‘ఇతను చనిపోవాలి’ అని ఒప్పుకున్నారు. వాళ్లు యేసు చెంప మీద కొట్టారు, ఆయన మీద ఊశారు, కళ్లు మూసి ‘నువ్వు ప్రవక్తవైతే ఎవరు గుద్దారో చెప్పు’ అంటూ ఆయన్ని గుద్దారు.

తెల్లవారగానే వాళ్లు యేసును యూదుల మహాసభ గదిలోకి తీసుకెళ్లి మళ్లీ ఇలా అడిగారు: ‘నువ్వు దేవుని కుమారుడివా?’ యేసు ‘నేను దేవుని కూమారుడినని మీరే చెప్తున్నారు’ అని జవాబిచ్చాడు. వాళ్లు ఆయన దేవున్ని అవమానిస్తున్నాడనే నేరం వేసి రోమా గవర్నర్‌ అయిన పొంతు పిలాతు ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత ఏమి జరిగింది. తెలుసుకుందాం.

“మీలో ప్రతీ ఒక్కరు తమతమ ఇళ్లకు పారిపోయి, నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతుంది. . . . అయితే నా తండ్రి నాతోపాటు ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను.”—యోహాను 16:32