కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 90

గొల్గొతా దగ్గర యేసు చనిపోయాడు

గొల్గొతా దగ్గర యేసు చనిపోయాడు

ముఖ్య యాజకులు యేసును గవర్నర్‌ ఉండే చోటుకు తీసుకెళ్లారు. పిలాతు వాళ్లను ఇలా అడిగాడు: ‘ఇతను ఏమి తప్పు చేశాడని మీరు అంటున్నారు?’ వాళ్లు ఇలా చెప్పారు: ‘ఇతను రాజు అని చెప్పుకుంటున్నాడు!’ పిలాతు యేసును “నువ్వు యూదుల రాజువా?” అని అడిగాడు. యేసు “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు” అని చెప్పాడు.

తర్వాత పిలాతు యేసును గలిలయ పాలకుడైన హేరోదు దగ్గరకు పంపిస్తాడు. యేసులో ఏమైనా తప్పు కనిపిస్తుందేమో అని అతని దగ్గరకు పంపిస్తాడు. హేరోదుకు యేసు విషయంలో ఎలాంటి తప్పు కనపడక, అతనిని తిరిగి పిలాతు దగ్గరకు పంపించేస్తాడు. అప్పుడు పిలాతు ప్రజలతో ఇలా అంటాడు: ‘ఇతని విషయంలో హేరోదుకుగానీ నాకుగానీ ఏ తప్పు కనిపించలేదు. నేను ఇతనిని వదిలేస్తాను.’ అప్పుడు ప్రజలందరూ ఇలా అరిచారు: ‘అతన్ని చంపేయండి! అతన్ని చంపేయండి!’ సైనికులు యేసును కొరడాలతో కొట్టారు, ఉమ్మి వేశారు, గుద్దారు. వాళ్లు అతని తలకు ముళ్ల కిరీటం పెట్టి, ఎగతాళి చేస్తూ ఇలా అన్నారు: ‘యూదుల రాజా, నీకు మంచి రోజు!’ పిలాతు ప్రజలందరితో మళ్లీ ఇలా అన్నాడు: ‘ఇతనిలో నాకు ఏ తప్పు కనపడలేదు.’ కానీ ప్రజలు ఇలా అరిచారు: “అతనికి కొయ్యపై శిక్ష వేయండి!” కాబట్టి పిలాతు ఆయనను శిక్ష వేయడానికి అప్పగించాడు.

యేసును గొల్గొతా అనే ప్రాంతానికి తీసుకొచ్చి ఆయన్ని మేకులతో కొయ్యకు కొట్టి, దాన్ని పైకి నిలబెట్టారు. యేసు ఇలా ప్రార్థన చేశాడు: ‘తండ్రి, వీళ్లను క్షమించు, వీళ్లు ఏమి చేస్తున్నారో వీళ్లకు తెలియదు.’ ప్రజలు యేసును ఎగతాళి చేస్తూ, ‘నువ్వు దేవుని కుమారుడివి అయితే కొయ్య మీద నుండి కిందకు రా! నిన్ను నువ్వు రక్షించుకో’ అని అన్నారు.

ఆయన ప్రక్కన వ్రేలాడదీసిన నేరస్తుల్లో ఒకడు ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వు రాజ్యాధికారం పొందినప్పుడు నన్ను గుర్తుచేసుకో.” యేసు అతనికి ఇలా మాటిచ్చాడు: “నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు.” మధ్యాహ్నం ఆ దేశమంతా మూడు గంటల పాటు చీకటి అయిపోయింది. యేసు దగ్గర కొంతమంది శిష్యులు నిలబడి ఉన్నారు, వాళ్లలో యేసు తల్లి అయిన మరియ కూడా ఉంది. యేసు యోహానుతో మరియను తన సొంత తల్లిగా చూసుకోమని చెప్పాడు.

చివరిగా యేసు ఇలా చెప్పాడు: “అంతా పూర్తయింది!” అప్పుడు ఆయన తలను వంచి, చివరి శ్వాస విడిచాడు. ఆ క్షణంలో పెద్ద భూకంపం వచ్చింది. ఆలయంలో పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరు చేసే బరువైన తెర రెండుగా చీలిపోయింది. ఒక సైనిక అధికారి ‘ఇతను నిజంగా దేవుని కుమారుడు’ అని చెప్పాడు.

“దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్ని ఉన్నాసరే అవన్నీ యేసుక్రీస్తు ద్వారా ‘అవును’ అన్నట్టుగానే ఉన్నాయి.”—2 కొరింథీయులు 1:20