కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 91

యేసు మళ్లీ బ్రతికాడు

యేసు మళ్లీ బ్రతికాడు

యేసు చనిపోయాక, ధనవంతుడైన యోసేపు యేసు శరీరాన్ని కొయ్యమీద నుండి తీసుకెళ్లిపోతానని పిలాతును అడిగాడు. యోసేపు మంచి నారబట్టలతో, సుగంధ ద్రవ్యాలతో యేసు శరీరాన్ని చుట్టి కొత్త సమాధిలో పెట్టాడు. సమాధి ద్వారానికి పెద్ద రాయి అడ్డు పెట్టాడు. ముఖ్య యాజకులు పిలాతుతో ఇలా అన్నారు: ‘యేసు శిష్యులు ఎవరైనా ఆయన శరీరాన్ని తీసుకెళ్లిపోయి తిరిగి బ్రతికాడని చెప్తారేమో అని మాకు భయంగా ఉంది.’ కాబట్టి పిలాతు ఇలా చెప్పాడు: ‘సమాధిని పూర్తిగా మూసేసి, కాపలా కాయండి.’

మూడు రోజుల తర్వాత ఉదయాన్నే, కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్లి, అడ్డుగా పెట్టిన రాయి జరిపి ఉండడం చూశారు. సమాధి లోపల ఒక దేవదూత స్త్రీలతో ఇలా చెప్పాడు: ‘భయపడకండి. యేసు తిరిగి లేచాడు. వెళ్లి గలిలయలో ఆయనను కలవమని శిష్యులతో చెప్పండి.’

మగ్దలేనే మరియ వెంటనే పేతురు, యోహాను ఎక్కడ ఉన్నారో చూడ్డానికి వెళ్లింది. వాళ్లతో ఇలా చెప్పింది: ‘యేసు శరీరాన్ని ఎవరో తీసుకెళ్లిపోయారు!’ పేతురు, యోహాను సమాధి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లారు. సమాధి ఖాళీగా ఉండడం చూసి, వాళ్లు వాళ్ల ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు.

మరియ సమాధి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు లోపల ఇద్దరు దూతల్ని చూసింది. వాళ్లతో ఇలా చెప్పింది: ‘నా ప్రభువును వాళ్లు ఎక్కడకు తీసుకు వెళ్లారో నాకు తెలీదు.’ తర్వాత అక్కడ ఒకతన్ని చూసి తోటమాలి అనుకుని ఇలా అడిగింది: ‘అయ్యా, ఆయనను ఎక్కడకు తీసుకువెళ్లావో దయచేసి చెప్పు.’ కానీ అతను, “మరియ!” అనగానే, అతను యేసు అని ఆమె తెలుసుకుంది. ఆమె, “బోధకుడా!” అని అరిచి, అతనిని గట్టిగా పట్టుకుంది. యేసు ఆమెతో ఇలా చెప్పాడు: ‘నువ్వు నన్ను చూశావని వెళ్లి నా సహోదరులకు చెప్పు.’ మరియ వెంటనే యేసు శిష్యుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయనను చూశానని చెప్పింది.

తర్వాత అదే రోజు, ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మాయు అనే ఊరికి నడుస్తూ వెళ్తున్నారు. ఒకతను దారిలో వాళ్లను కలిసి వాళ్లు ఏమి మాట్లాడుకుంటున్నారో అడిగాడు. వాళ్లు ఇలా చెప్పారు: ‘నువ్వు వినలేదా? మూడు రోజుల క్రితం ముఖ్య యాజకులు యేసును చంపేశారు. ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఆయన బ్రతికాడని చెప్తున్నారు!’ అతను వాళ్లను ఇలా అడిగాడు: ‘మీరు ప్రవక్తలను నమ్మరా? క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతుకుతాడు అని వాళ్లు చెప్పారు.’ అతను వాళ్లకు లేఖనాలు వివరిస్తూ ఉన్నాడు. వాళ్లు ఎమ్మాయు అనే ఊరికి చేరుకున్నాక, శిష్యులు అతనిని వాళ్లతో రమ్మని అడుగుతారు. రాత్రి భోజనం చేసేటప్పుడు అతను రొట్టె గురించి ప్రార్థించిన తర్వాత, అతను యేసు అని వాళ్లు తెలుసుకుంటారు. తర్వాత అతను మాయమైపోతాడు.

ఆ ఇద్దరు శిష్యులు యెరూషలేములో అపొస్తలులు కలుసుకున్న ఇంటికి త్వరగా వచ్చి జరిగిన విషయాలను వాళ్లకు చెప్పారు. వాళ్లు ఇంటిలో ఉన్నప్పుడు యేసు వాళ్లందరికీ కనిపిస్తాడు. అపొస్తలులు మొదట అతను యేసని నమ్మలేదు. అప్పుడు యేసు ఇలా చెప్పాడు: ‘నా చేతులు చూడండి, నన్ను ముట్టుకోండి. క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతుకుతాడని రాసి ఉంది.’

నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.—యోహాను 14:6