కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 93

యేసు పరలోకానికి తిరిగి వెళ్లిపోతాడు

యేసు పరలోకానికి తిరిగి వెళ్లిపోతాడు

గలిలయలో యేసు తన అనుచరులను కలుస్తాడు. వాళ్లకు ఆయన చాలా ముఖ్యమైన ఒక ఆజ్ఞ ఇస్తాడు: ‘అన్నీ దేశాలకు వెళ్లి శిష్యులను చేయండి. నేను మీకు నేర్పించిన విషయాలను వాళ్లకు నేర్పించి బాప్తిస్మం ఇవ్వండి.’ తర్వాత ఆయన ఈ మాట ఇస్తాడు: ‘గుర్తుంచుకోండి, నేను ఎప్పుడూ మీతో ఉంటాను.’

పునరుత్థానం అయ్యాక 40 రోజుల వరకు గలిలయ, యెరూషలేములో ఉన్న తన వందల మంది శిష్యులకు యేసు కనిపిస్తాడు. వాళ్లకు ముఖ్యమైన పాఠాలను నేర్పించి, చాలా అద్భుతాలు చేస్తాడు. తర్వాత చివరిసారిగా యేసు తన శిష్యులను ఒలీవల కొండ మీద కలుస్తాడు. ఆయన ఇలా చెప్తాడు: ‘యెరూషలేమును విడిచి వెళ్లకండి. తండ్రి వాగ్దానం చేసిన దానికోసం ఎదురుచూస్తూ ఉండండి.’

ఆయన చెప్పింది శిష్యులకు అర్థం కాలేదు. వాళ్లు, ‘నువ్వు ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజు అవుతావా?’ అని అడిగారు. యేసు, ‘నేను రాజు అవ్వడానికి యెహోవా నిర్ణయించిన సమయం ఇంకా రాలేదు. త్వరలోనే మీరు పవిత్రశక్తి పొందుతారు, మీరు నాకు సాక్షులుగా ఉంటారు. మీరు యెరూషలేముకు, యూదయకు, సమరయకు భూమ్మీద దూర ప్రాంతాలకు వెళ్లి పరిచర్య చేయండి’ అని చెప్తాడు.

తర్వాత యేసు ఆకాశంలోకి వెళ్లిపోతాడు, ఒక మేఘం ఆయనను కప్పేస్తుంది. ఆయన శిష్యులు ఇంకా పైకి చూస్తుంటారు కానీ ఆయన వెళ్లిపోయాడు.

శిష్యులు ఒలీవల కొండ నుండి యెరూషలేముకు వెళ్లిపోతారు. వాళ్లు ఎప్పుడూ మేడమీద ఒక గదిలో కలుసుకుని ప్రార్థన చేసుకునేవాళ్లు. యేసు తర్వాత ఇవ్వబోయే సూచనల కోసం వాళ్లు ఎదురుచూస్తూ ఉన్నారు.

“అన్ని దేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, రాజ్యం గురించిన మంచివార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.”—మత్తయి 24:14