కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 94

శిష్యులు పవిత్రశక్తిని పొందారు

శిష్యులు పవిత్రశక్తిని పొందారు

యేసు పరలోకానికి వెళ్లిన పది రోజులకు శిష్యులు పవిత్రశక్తిని పొందారు. క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున, చాలామంది పండుగ జరుపుకోవడానికి వేర్వేరు ప్రాంతాల నుండి యెరూషలేముకు వచ్చారు. దాదాపు 120 మంది యేసు శిష్యులు ఒక ఇంటి మేడమీద గదిలో ఉన్నారు. హఠాత్తుగా ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. శిష్యుల్లో ప్రతి ఒక్కరి తల మీద మంట లాంటిది కనిపించింది, వాళ్లంతా వేరే భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారు. పెద్ద గాలి లాంటి శబ్దంతో ఆ ఇల్లంతా నిండిపోయింది.

వేరే ప్రాంతాల నుండి యెరూషలేముకు వచ్చినవాళ్లు ఆ శబ్దం విని ఏమి జరుగుతుందో చూడడానికి ఆ ఇంటికి వచ్చారు. శిష్యులు ఈ భాషల్లో మాట్లాడడం చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. వాళ్లు ఇలా అన్నారు: ‘ఈ ప్రజలు గలిలయవాళ్లు కదా. మరి మన భాషల్లో ఎలా మాట్లాడగలుగుతున్నారు?’

పేతురు, మిగతా అపొస్తలులు ఆ ప్రజలందరి ముందు లేచి నిలబడ్డారు. యేసు ఎలా చంపబడ్డాడో, యెహోవా ఆయనను తిరిగి ఎలా లేపాడో పేతురు ప్రజలకు చెప్పాడు. పేతురు ఇలా అన్నాడు: ‘ఇప్పుడు యేసు పరలోకంలో దేవుని కుడి ప్రక్కన ఉన్నాడు, ఆయన మాటిచ్చినట్లు పవిత్రశక్తిని కుమ్మరించాడు. అందుకే మీరు ఈ అద్భుతాలు చూశారు, విన్నారు.’

పేతురు మాటలకు ప్రజలు ఎంతో కదిలిపోయారు, వాళ్లు ఇలా అడిగారు: “మేము ఏంచేయాలి?” అతను ఇలా చెప్పాడు: ‘మీ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి యేసు పేరున బాప్తిస్మం తీసుకోండి. మీరు పవిత్రశక్తి బహుమానాన్ని కూడా పొందుతారు.’ ఆ రోజు దాదాపు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. అప్పటినుండి, యెరూషలేములో శిష్యుల సంఖ్య చాలా త్వరగా పెరగడం మొదలైంది. యేసు వాళ్లకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ శిష్యులకు నేర్పించడానికి పవిత్రశక్తి సహాయంతో అపొస్తలులు చాలా సంఘాలు స్థాపించారు.

“యేసు ప్రభువని మీ నోటితో బహిరంగంగా ప్రకటిస్తే, యేసును మృతుల్లో నుండి దేవుడు బ్రతికించాడని మీ హృదయంలో విశ్వసిస్తే మీరు రక్షించబడతారు.”—రోమీయులు 10:9