కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 95

వాళ్లను ఏదీ ఆపలేదు

వాళ్లను ఏదీ ఆపలేదు

నడవలేని ఒకతను ఆలయం గేటు దగ్గర కూర్చొని రోజూ అడుక్కునేవాడు. ఒకరోజు మధ్యాహ్నం పేతురు, యోహాను ఆలయానికి వెళ్లడం చూస్తాడు. అతను వాళ్లను ఇలా అడిగాడు: ‘దయచేసి నాకు ఏమైనా ఇవ్వండి.’ పేతురు ఇలా అన్నాడు: ‘నా దగ్గర డబ్బుల కన్నా విలువైనది ఉంది. అది నీకు ఇవ్వగలను. యేసు పేరున లేచి నడువు!’ అప్పుడు పేతురు అతను లేవడానికి సహాయం చేశాడు, అతను నడవడం మొదలుపెట్టాడు! ప్రజలు ఈ అద్భుతం చూసి చాలా సంతోషించారు, ఎంతోమంది విశ్వాసులు అయ్యారు.

కానీ యాజకులకు, సద్దూకయ్యులకు చాలా కోపం వచ్చింది. వాళ్లు అపొస్తలులను పట్టుకుని కోర్టుకు లాక్కెళ్లి గట్టిగా ఇలా అడిగారు: ‘ఇతనిని బాగుచేసే శక్తి మీకు ఎవరు ఇచ్చారు?’ పేతురు ఇలా చెప్పాడు: ‘మీరు చంపిన యేసుక్రీస్తు నుండి మేము ఈ శక్తిని పొందాం.’ మతనాయకులు ఇలా గట్టిగా అరిచారు: ‘యేసు గురించి మాట్లాడడం ఆపేయండి!’ కానీ అపొస్తలులు ఇలా చెప్పారు: ‘మేము ఆయన గురించి మాట్లాడాలి. మేము ఆపము.’

పేతురు, యోహాను విడుదలైన వెంటనే మిగతా శిష్యుల దగ్గరకు వెళ్లి జరిగినదంతా వాళ్లకు చెప్పారు. వాళ్లు కలిసి ప్రార్థన చేసి యెహోవాను ఇలా అడిగారు: ‘ధైర్యంగా మీ పని చేసేలా మాకు దయచేసి సహాయం చేయి.’ యెహోవా వాళ్లకు పవిత్రశక్తి ఇచ్చాడు, వాళ్లు పరిచర్య చేస్తూ రోగులను బాగు చేస్తూ ఉన్నారు. చాలాచాలా మంది విశ్వాసులు అయ్యారు. సద్దూకయ్యులు కుళ్లుతో అపొస్తలులను అరెస్ట్‌ చేసి జైల్లో వేశారు. కానీ రాత్రి సమయంలో యెహోవా ఒక దేవదూతను పంపించాడు, అతను జైలు తలుపులను తెరిచి అపొస్తలులతో ఇలా చెప్పాడు: ‘ఆలయం దగ్గరకు వెళ్లి అక్కడ బోధించండి.’

తర్వాత రోజు ఉదయమే యూదుల మహాసభకు అంటే మతనాయకుల కోర్టుకు కొంతమంది ఇలా చెప్పారు: ‘జైలు తలుపులకు తాళం వేసే ఉంది, కానీ మీరు బంధించిన వాళ్లు వెళ్లిపోయారు! వాళ్లు ఆలయంలో ఉన్నారు, ప్రజలకు బోధిస్తున్నారు!’ అపొస్తలులను మళ్లీ బంధించి యూదుల మహాసభకు తీసుకొచ్చారు. ప్రధాన యాజకుడు ఇలా చెప్పాడు: ‘యేసు గురించి మాట్లాడవద్దని మీకు చెప్పాం కదా!’ కానీ పేతురు ఇలా జవాబిచ్చాడు: “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.”

మతనాయకులకు చాలా కోపం వచ్చి అపొస్తలులను చంపాలని అనుకున్నారు. కానీ పరిసయ్యుడైన గమలీయేలు నిలబడి ఇలా చెప్పాడు: ‘జాగ్రత్త! దేవుడు ఈ మనుషులతో ఉన్నాడేమో. మీరు నిజంగా దేవునితో పోరాడాలని అనుకుంటున్నారా?’ వాళ్లు అతని సలహా విని, అపొస్తలులను కర్రలతో కొట్టి పరిచర్య చేయవద్దని ఇంకోసారి ఆజ్ఞాపించి పంపించేశారు. కానీ అపొస్తలులు ఆపలేదు. ఇంటింటా, ఆలయంలో మంచివార్తను ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు.

“మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.”—అపొస్తలుల కార్యాలు 5:29