కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 96

యేసు సౌలును ఎన్నుకున్నాడు

యేసు సౌలును ఎన్నుకున్నాడు

సౌలు తార్సులో పుట్టిన రోమా పౌరుడు. యూదా ధర్మశాస్త్రం బాగా తెలిసిన పరిసయ్యుడు, క్రైస్తవులను ద్వేషించేవాడు. అతను క్రైస్తవ స్త్రీలను, పురుషులను ఇళ్లల్లో నుండి లాక్కొచ్చి జైల్లో పడేసేవాడు. శిష్యుడైన స్తెఫనును కోపంతో ఉన్న ఒక గుంపు రాళ్లతో కొడుతున్నప్పుడు పక్కనే నిలబడి చూస్తూ ఉన్నాడు.

సౌలు యెరూషలేములో ఉన్న క్రైస్తవులను జైల్లో వేసి ఊరుకోలేదు. దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవులను కూడా పట్టుకునేలా పంపించమని అతను ప్రధానయాజకుడిని అడుగుతాడు. సౌలు ఆ పట్టణం దగ్గరికి రాగానే అతని చుట్టూ పెద్ద వెలుగు వచ్చింది, అతను కింద పడిపోయాడు. ఒక స్వరం ఇలా చెప్పడం విన్నాడు: ‘సౌలు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు?’ దానికి సౌలు, ‘ఎవరు నువ్వు?’ అని అడుగుతాడు. అప్పుడు ఇలా జవాబు వస్తుంది: ‘నేను యేసును. దమస్కుకు వెళ్లు, అక్కడ నువ్వు ఏమి చేయాలో తెలుస్తుంది.’ ఒక్క క్షణంలో సౌలు గుడ్డివాడు అయిపోతాడు, అతని చెయ్యి పట్టుకుని పట్టణానికి తీసుకు వెళ్లాల్సి వస్తుంది.

దమస్కులో అననీయ అనే నమ్మకమైన క్రైస్తవుడు ఉన్నాడు. యేసు దర్శనంలో అతనికి ఇలా చెప్పాడు: ‘తిన్ననిది అనే వీధిలో యూదా ఇంటికి వెళ్లు, అక్కడ సౌలు కోసం చూడు.’ అననీయ ఇలా అన్నాడు: ‘ప్రభువా, నాకు అతని గురించి అంతా తెలుసు! అతను నీ శిష్యులను జైల్లో పడేస్తున్నాడు!’ కానీ యేసు ఇలా చెప్పాడు: ‘అతని దగ్గరకు వెళ్లు. చాలా దేశాల్లో ప్రజలకు మంచివార్త చెప్పడానికి నేను సౌలును ఎన్నుకున్నాను.’

కాబట్టి అననీయ సౌలు దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు: ‘సౌలూ, సహోదరా, నీ కళ్లు కనిపించేలా చేయడానికి యేసు నన్ను పంపించాడు.’ వెంటనే సౌలుకు చూపు వచ్చింది. అతను యేసు గురించి నేర్చుకుని ఆయన అనుచరుడు అయ్యాడు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుడిగా సౌలు తోటి క్రైస్తవులతో సభామందిరాల్లో పరిచర్య చేయడం మొదలు పెట్టాడు. సౌలు యేసు గురించి ప్రజలకు బోధించడం చూసినప్పుడు యూదులు ఎంత ఆశ్చర్యపోయి ఉంటారో మీరు ఊహించగలరా? వాళ్లు ఇలా అన్నారు: ‘యేసు శిష్యులను వెంటాడింది ఇతనే కదా?’

సౌలు మూడు సంవత్సరాలు దమస్కులో ఉన్న ప్రజలకు ప్రీచింగ్‌ చేశాడు. యూదులు సౌలును ద్వేషించారు, అతనిని చంపేయాలని పథకాలు వేశారు. కానీ సహోదరులు ఈ విషయం తెలుసుకుని అతను తప్పించుకునే ఏర్పాట్లు చేశారు. వాళ్లు అతనిని ఒక బుట్టలో పెట్టి పట్టణ గోడలకు ఉన్న కన్నంలో నుండి అతనిని కిందికి దించారు.

సౌలు యెరూషలేముకు వెళ్లినప్పుడు, అక్కడ సహోదరులను కలవడానికి ప్రయత్నించాడు. కానీ వాళ్లు ఆయనకు భయపడ్డారు. అప్పుడు బర్నబా అనే దయగల సహోదరుడు సౌలును అపొస్తలుల దగ్గరకు తీసుకొచ్చి, సౌలు నిజంగా మారిపోయాడని వాళ్లను ఒప్పించాడు. యెరూషలేములో ఉన్న సంఘంతోపాటు సౌలు ఉత్సాహంగా మంచివార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. తర్వాత, అతనిని పౌలు అని పిలిచారు.

“పాపుల్ని రక్షించడానికి క్రీస్తుయేసు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ పాపుల్లో నేనే చాలా హీనమైనవాణ్ణి.”—1 తిమోతి 1:15