కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 98

క్రైస్తవ మతం చాలా దేశాలకు విస్తరించింది

క్రైస్తవ మతం చాలా దేశాలకు విస్తరించింది

భూమి అంతటా మంచివార్త గురించి చెప్పమని యేసు ఇచ్చిన ఆజ్ఞను అపొస్తలులు పాటించారు. క్రీ.శ. 47⁠లో అంతియొకయలో ఉన్న సహోదరులు పౌలు, బర్నబాను వేర్వేరు ప్రాంతాలకు ప్రకటించడానికి పంపించారు. ఈ ఇద్దరు ఎంతో ఆసక్తితో దెర్బే, లుస్త్ర, ఈకొనియ లాంటి ప్రాంతాలకు ప్రకటిస్తూ ఆసియా మైనరు అంతా వెళ్లారు.

పౌలు, బర్నబా ధనవంతులకు, పేదవాళ్లకు, పిల్లలకు, ముసలి వాళ్లకు అందరికీ ప్రకటించారు. చాలామంది క్రీస్తు గురించిన సత్యాన్ని నమ్మారు. పౌలు, బర్నబా కుప్ర దేశానికి అధికారి అయిన సెర్గి పౌలుకు ప్రకటించినప్పుడు ఒక మంత్రగాడు వాళ్లను ఆపడానికి ప్రయత్నించాడు. పౌలు ఆ మంత్రగాడితో ఇలా అన్నాడు: ‘యెహోవా నిన్ను శిక్షిస్తాడు.’ అ క్షణంలో అతను గుడ్డివాడు అయ్యాడు. అది చూసి, అధికారి అయిన సెర్గి పౌలు విశ్వాసి అయ్యాడు.

పౌలు, బర్నబా ప్రతీచోట ప్రకటించారు. ఇంటింటికి వెళ్లి, మార్కెట్లలో, వీధుల్లో, సభామందిరాల్లో అన్ని చోట్ల ప్రకటించారు. లుస్త్రలో వాళ్లు ఒక కుంటివాడిని బాగు చేశారు. ఆ అద్భుతాన్ని చూసిన వాళ్లు పౌలు, బర్నబాను దేవుళ్లని అనుకుని ఆరాధించడానికి ప్రయత్నించారు. కానీ పౌలు, బర్నబా వాళ్లను ఆపి, ఇలా చెప్పారు: ‘దేవుడినే ఆరాధించండి. మేము మనుషులం మాత్రమే.’ తర్వాత కొంతమంది యూదులు వచ్చి అక్కడున్న గుంపును పౌలుకు వ్యతిరేకంగా చేశారు. ఆ గుంపు అతన్ని రాళ్లతో కొట్టి, పట్టణం బయటికి ఈడ్చుకెళ్లారు. ఆయన చనిపోయాడని అనుకుని అక్కడే వదిలేశారు. కానీ పౌలు బ్రతికే ఉన్నాడు! వెంటనే, సహోదరులు అతని సహాయానికి వచ్చి, పట్టణంలోకి తీసుకెళ్లారు. తర్వాత, పౌలు మళ్లీ అంతియొకయకు వెళ్లిపోయాడు.

క్రీ.శ. 49⁠లో పౌలు ఇంకో యాత్రకు వెళ్లాడు. ఆసియా మైనరులో ఉన్న సహోదరులను చూడడానికి వెళ్లాక ఇంకా దూరం వెళ్లి యూరప్‌లో కూడా మంచివార్త చెప్పాడు. అతను ఏథెన్సు, ఎఫెసు, ఫిలిప్పీ, థెస్సలొనీక, ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్లాడు. పౌలుతోపాటు సీల, లూకా, తిమోతి అనే యవనస్థుడు కూడా వెళ్లారు. వాళ్లు సంఘాలు ఏర్పడడానికి కలిసి పని చేశారు. అవి బలంగా ఉండేలా సహాయం చేశారు. పౌలు కొరింథులో ఒకటిన్నర సంవత్సరం ఉండి అక్కడ సహోదరులను బలపర్చాడు. అక్కడ ఆయన ప్రకటించాడు, నేర్పించాడు, ఎన్నో సంఘాలకు ఉత్తరాలు రాశాడు. డేరాలు తయారు చేసే పని కూడా చేశాడు. కొంతకాలం తర్వాత పౌలు అంతియొకయకు తిరిగి వచ్చేశాడు.

తర్వాత, క్రీ.శ. 52⁠లో పౌలు మూడవసారి యాత్ర చేశాడు. ఆసియా మైనరు ప్రాంతంలో మొదలుపెట్టి ఉత్తర దిక్కులో ఉన్న ఫిలిప్పీ నుండి దక్షిణాన ఉన్న కొరింథు వరకు ప్రయాణించాడు. ఎఫెసులో బోధిస్తూ, రోగుల్ని బాగు చేస్తూ, సంఘానికి సహాయం చేస్తూ పౌలు అక్కడ చాలా సంవత్సరాలు గడిపాడు. ఒక స్కూల్‌ ఆడిటోరియమ్‌లో ఆయన రోజూ బహిరంగ ప్రసంగాలు కూడా ఇచ్చేవాడు. చాలామంది విని వాళ్ల పద్ధతులు మార్చుకున్నారు. చాలా దేశాల్లో మంచివార్త ప్రకటించి పౌలు చివరికి యెరూషలేముకు వెళ్లిపోయాడు.

“కాబట్టి, మీరు వెళ్లి అన్ని దేశాల ప్రజలను శిష్యుల్ని చేయండి.”—మత్తయి 28:19