కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 99

ఒక జైలు అధికారి సత్యం నేర్చుకుంటాడు

ఒక జైలు అధికారి సత్యం నేర్చుకుంటాడు

ఫిలిప్పీలో, ఒక పనమ్మాయిలోకి చెడ్డదూత ప్రవేశించాడు. ఆ చెడ్డదూత ఆ అమ్మాయిని భవిష్యత్తు లేదా జాతకం చెప్పడానికి ఉపయోగించాడు. ఆ అమ్మాయి వల్ల ఆమె యజమానులకు చాలా డబ్బులు వచ్చేవి. పౌలు, సీల ఫిలిప్పీకు వచ్చినప్పుడు చాలా రోజులు ఆ అమ్మాయి వాళ్ల వెంట పడింది. ఆ చెడ్డదూత ఆమెను ఇలా అరిచేలా చేశాడు: “వీళ్లు సర్వోన్నత దేవుని దాసులు.” చివరికి పౌలు ఆ చెడ్డదూతతో ఇలా అన్నాడు: ‘యేసు పేరున ఆమెలో నుండి బయటికి రా.’ అప్పుడు ఆ చెడ్డదూత ఆమె నుండి బయటికి వచ్చేశాడు.

ఇక ఆమెను ఉపయోగించుకుని డబ్బులు సంపాదించుకోలేరని ఆ అమ్మాయి యజమానులకు తెలిసి వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్లు పౌలు, సీలను నగర పాలకుల దగ్గరికి తీసుకెళ్లి ఇలా అన్నారు: ‘వీళ్లు చట్టాన్ని పాటించకుండా, పట్టణంలో గందరగోళం సృష్టిస్తున్నారు.’ పాలకులు పౌలు, సీలను కొట్టి జైల్లో పడేయమని చెప్పారు. జైలు అధికారి వాళ్లను జైల్లో బాగా చీకటిగా ఉన్న లోతైన చోట పడేసి, వాళ్లను బొండలో పెట్టాడు.

మిగతా ఖైదీలు వింటుండగా పౌలు, సీల యెహోవాకు పాటలు పాడారు. మధ్యరాత్రి అయినప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చి జైలు పైనుండి కిందికి ఊగిపోయింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి, ఖైదీలకు వేసిన సంకెళ్లు, బొండలు ఊడిపోయాయి. జైలు అధికారి జైలు లోపలికి వెళ్లి చూసినప్పుడు తలుపులు తెరిచి ఉన్నాయి. అతను ఖైదీలందరు పారిపోయారని అనుకుని తనను చంపుకోవడానికి ఒక పెద్ద కత్తి తీసుకున్నాడు.

వెంటనే పౌలు ఇలా పిలిచాడు: ‘మిమ్మల్ని మీరు ఏం చేసుకోకండి! మేమంతా ఇక్కడే ఉన్నాం!’ ఆ జైలు అధికారి పరుగెత్తుకుంటూ వచ్చి పౌలు, సీల ముందు పడిపోయాడు. ఆయన వాళ్లను ఇలా అడిగాడు: “రక్షణ పొందాలంటే నేనేం చేయాలి?” వాళ్లు ఇలా జవాబిచ్చారు: ‘నువ్వు, నీ కుటుంబం యేసును నమ్మాలి.’ తర్వాత పౌలు, సీల వాళ్లకు యెహోవా వాక్యం నేర్పించారు. ఆ జైలు అధికారి, అతని కుటుంబంలో అందరూ బాప్తిస్మం తీసుకున్నారు.

“ప్రజలు మిమ్మల్ని పట్టుకొని, హింసించి, సభామందిరాలకు అప్పగిస్తారు; చెరసాలల్లో వేయిస్తారు. నా శిష్యులుగా ఉన్నందుకు మీరు రాజుల ముందుకు, అధిపతుల ముందుకు తీసుకురాబడతారు. దానివల్ల సాక్ష్యం ఇచ్చే అవకాశం మీకు దొరుకుతుంది.”—లూకా 21:12, 13