కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 100

పౌలు, తిమోతి

పౌలు, తిమోతి

లుస్త్ర సంఘంలో తిమోతి అనే యువ సహోదరుడు ఉన్నాడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి యూదురాలు. తల్లి యునీకే, అమ్మమ్మ లోయి తిమోతికి యెహోవా గురించి చిన్నప్పటి నుండే నేర్పించారు.

ప్రకటనా పని కోసం పౌలు చేసిన రెండో యాత్రలో ఆయన లుస్త్రకు వచ్చాడు. అక్కడ ఉన్న తిమోతి సహోదరులను చాలా ప్రేమించాడని, వాళ్లకు సహాయం చేయడానికి ముందుండేవాడని పౌలు చూశాడు. తనతోపాటు మిషనరీ యాత్రకు రమ్మని పౌలు తిమోతిని అడిగాడు. కాలం గడుస్తుండగా, పౌలు తిమోతికి మంచివార్తను చక్కగా ఎలా ప్రకటించాలో, బోధించాలో నేర్పించాడు.

పౌలు, తిమోతి ఎక్కడికి వెళ్లినా పవిత్రశక్తి వాళ్లను నడిపించింది. ఒకరోజు రాత్రి దర్శనంలో ఒకతను పౌలుతో మాసిదోనియాకు వచ్చి వాళ్లకు సహాయం చేయమని చెప్పాడు. కాబట్టి పౌలు, తిమోతి, సీల, లూకా అక్కడ ప్రకటించడానికి, సంఘాల్ని స్థాపించడానికి వెళ్లారు.

మాసిదోనియలో థెస్సలోనిక అనే పట్టణం ఉంది. అక్కడ చాలామంది స్త్రీలు, పురుషులు క్రైస్తవులు అయ్యారు. కానీ కొంతమంది యూదులు పౌలు, అతని స్నేహితులను చూసి కుళ్లుకున్నారు. వాళ్లు ఒక రౌడీ గుంపును పోగు చేసి సహోదరులను నగర పాలకుల దగ్గరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఇలా అరిచారు: ‘వీళ్లు రోమా ప్రభుత్వానికి శత్రువులు.’ పౌలు, తిమోతి వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి రాత్రిపూట బెరయకు పారిపోయారు.

బెరయలో ఉన్న ప్రజలు మంచివార్త నేర్చుకోవడానికి చాలా ఇష్టం చూపించారు. అక్కడ ఉన్న గ్రీకులు, యూదులు విశ్వాసులయ్యారు. కానీ కొంతమంది యూదులు థెస్సలోనిక నుండి వచ్చి మళ్లీ గొడవ మొదలుపెట్టారు, అప్పుడు పౌలు ఏథెన్సుకు వెళ్లిపోయాడు. తిమోతి, సీల బెరయలో సహోదరులను బలపర్చడానికి ఉండిపోయారు. కొన్ని రోజుల తర్వాత థెస్సలోనికలో సహోదరులు ఎదుర్కొంటున్న తీవ్రమైన హింసను తట్టుకునేలా సహాయం చేయడానికి పౌలు తిమోతిని మళ్లీ అక్కడకు పంపించాడు. తర్వాత పౌలు తిమోతిని ఇంకా చాలా సంఘాలకు వెళ్లి, వాళ్లను ప్రోత్సహించడానికి పంపించాడు.

పౌలు తిమోతితో ఇలా అన్నాడు: ‘యెహోవాను సేవించాలనుకునే వాళ్లకు హింసలు వస్తాయి.’ తన నమ్మకాన్ని బట్టి తిమోతి హింసలు ఎదుర్కొన్నాడు, జైలుకు వెళ్లాడు. యెహోవాకు నమ్మకంగా ఉన్నాడని చూపించే అవకాశం వచ్చినందుకు తిమోతి సంతోషించాడు.

పౌలు ఫిలిప్పీయులతో ఇలా అన్నాడు: ‘నేను మీ దగ్గరకు తిమోతిని పంపిస్తున్నాను. సత్యంలో నడవడం అంటే ఏంటో ఆయన మీకు నేర్పిస్తాడు. పరిచర్య ఎలా చేయాలో నేర్పిస్తాడు.’ తిమోతిపై తను ఆధారపడవచ్చు అని పౌలుకు తెలుసు. వాళ్లు ఫ్రెండ్స్‌గా, తోటి సేవకులుగా చాలా సంవత్సరాలు కలిసి పని చేశారు.

“మీ విషయంలో నిజమైన శ్రద్ధ చూపించే తిమోతిలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు నా దగ్గర ఎవ్వరూ లేరు. మిగతావాళ్లంతా ఎవరి పనులు వాళ్లు చూసుకుంటున్నారే తప్ప యేసుక్రీస్తుకు సంబంధించిన పనులు చూడట్లేదు.”—ఫిలిప్పీయులు 2:20, 21