కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లెసన్‌ 103

“నీ రాజ్యం రావాలి”

“నీ రాజ్యం రావాలి”

యెహోవా ఇలా మాటిచ్చాడు: ‘ఏడుపు, నొప్పి, రోగాలు, చనిపోవడం ఇక ఉండవు. నేను వాళ్ల కళ్లలో నుండి ప్రతి కన్నీటి బొట్టును తుడిచేస్తాను. గతంలో జరిగిన చెడ్డ విషయాలేవీ గుర్తుకురావు.’

యెహోవా, ఆదాము హవ్వను శాంతి, సంతోషాలతో జీవించాలని ఏదెను తోటలో పెట్టాడు. వాళ్లు వాళ్ల పరలోక తండ్రిని ఆరాధించాలి. భూమిని వాళ్ల పిల్లలతో నింపాలి. ఆదాము, హవ్వ ఆయనకు లోబడకపోయినా యెహోవా మొదట అనుకున్నది ఎప్పుడూ మారలేదు. దేవుడు మాటిచ్చినవన్నీ జరుగుతాయని ఈ పుస్తకంలో మనం చూశాం. ఆయన అబ్రాహాముకు మాటిచ్చినట్లే, ఆయన రాజ్యం భూమ్మీద గొప్ప ఆశీర్వాదాలు తెస్తుంది.

త్వరలో సాతాను, అతనితో ఉన్న చెడ్డదూతలు, చెడ్డ మనుషులు ఎవ్వరూ ఉండరు. బ్రతికి ఉన్నవాళ్లందరూ యెహోవాను ఆరాధిస్తారు. మనకు జబ్బులు రావు, మనం చనిపోం. ప్రతిరోజు ఉదయం పూర్తి శక్తితో లేస్తాము, బ్రతికి ఉన్నామని సంతోషం కూడా ఉంటుంది. భూమంతా పరదైసు అవుతుంది. ప్రతి ఒక్కరికి మంచి ఆహారం ఉంటుంది. క్షేమంగా ఉండడానికి ఇళ్లు ఉంటాయి. మనుషులందరూ దయగా ఉంటారు, ఎవ్వరూ క్రూరంగా ఉండరు, హింసించరు. అడవి జంతువులు మనకు భయపడవు, మనం కూడా వాటికి భయపడం.

యెహోవా ప్రజలను పునరుత్థానం చేయడం మొదలుపెట్టినప్పుడు ఎంత బాగుంటుంది! ఒకప్పుడు ఉన్నవాళ్లనందరినీ మనం ఆహ్వానించవచ్చు. హేబెలును, నోవహును, అబ్రాహామును, శారాను, మోషేను, రూతును, ఎస్తేరును, దావీదును ఆహ్వానించవచ్చు. భూగ్రహాన్ని పరదైసుగా మార్చే పనిలో వాళ్లు కూడా మనకు సహాయం చేస్తారు. చేయడానికి ఎప్పుడూ మంచిమంచి పనులు ఉంటాయి.

మీరు అక్కడ ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. మీరు ఊహించని విధాలుగా ఆయనను తెలుసుకుంటారు. ఇప్పుడూ, ఎప్పుడూ, ప్రతీరోజు యెహోవాకు దగ్గరౌతూ, బాగా దగ్గరౌతూ ఉందాం!

“యెహోవా మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు; . . . కాబట్టి మహిమ, ఘనత, శక్తి పొందడానికి నువ్వు అర్హుడవు.”—ప్రకటన 4:11