కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిపాలక సభ నుండి ఉత్తరం

పరిపాలక సభ నుండి ఉత్తరం

ప్రియమైన తోటి విశ్వాసులకు:

యెహోవా ఆరాధకులుగా మేము ఆయన వాక్యమైన బైబిల్ని ప్రేమిస్తాం. బైబిల్‌ వాస్తవమైన చరిత్రను చెప్తుందని, జీవించడానికి సరైన మార్గనిర్దేశాన్ని ఇస్తుందని, మనుషులుగా మనందరి మీద యెహోవాకు ఉన్న ప్రేమకు రుజువులను చూపిస్తుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. (కీర్తన 119:105; లూకా 1:3; 1 యోహాను 4:19) దేవుని వాక్యంలో ఉన్న విలువైన సత్యాలను నేర్చుకోవడానికి ఇతరులకు సహాయం చేయాలని మేము ఎంతగానో కోరుకుంటాం. అందుకు నా బైబిలు పుస్తకం అందించడానికి చాలా ఆనందిస్తున్నాం. ఈ పుస్తకం గురించి కొన్ని విషయాలు చెప్పే అవకాశం మాకు ఇవ్వండి.

చాలావరకు ఈ పుస్తకం పిల్లల్ని మనసులో ఉంచుకుని తయారు చేయబడింది. కానీ దీన్ని బైబిల్‌ గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని కోరుకుంటున్న పెద్దవాళ్లకు కూడా ఉపయోగించవచ్చు. బైబిల్‌ అందరి కోసం రాసిన పుస్తకం కాబట్టి ఖచ్చితంగా మనమందరం అందులో పాఠాలను పరిశీలించడం ద్వారా ప్రయోజనాలను పొందుతాం, అప్పుడు మనం నిజంగా సంతోషంగా ఉండవచ్చు.

సృష్టి మొదటినుండి మానవ కుటుంబ చరిత్రను బైబిల్లో ఉన్న సంఘటనల ఆధారంగా ఈ పుస్తకం వివరిస్తుంది. ఆ సంఘటనలను వీలైనంతవరకు జరిగిన వరుసలో స్పష్టంగా, సులువుగా అర్థమయ్యేలా చెప్పడానికి అన్ని విధాలా ప్రయత్నం జరిగింది.

కానీ ఈ పుస్తకం కేవలం బైబిల్లో ఉన్న సంఘటనలను మాత్రమే చెప్పడం లేదు. ఇందులో ఉన్న మాటలూ, బొమ్మలూ బైబిల్లో ఉన్న సంఘటనలకు జీవం పోసేలా, అక్కడున్న వాళ్ల భావాలు అర్థమయ్యేలా తయారు చేశారు.

బైబిలు మనుషుల గురించిన గ్రంథమని, బైబిల్లో యెహోవా మాట విన్నవాళ్ల గురించి, వినని వాళ్ల గురించి ఉందని మీరు ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. వాళ్ల నుండి మనమేమి నేర్చుకోవచ్చో ఆలోచించడానికి ఈ పుస్తకం సహాయం చేస్తుంది. (రోమీయులు 15:4; 1 కొరింథీయులు 10: 6) ఈ పుస్తకంలో 14 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి సెక్షన్‌ మొదట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠాల గురించి కొన్ని విషయాలు ఉన్నాయి.

మీకు పిల్లలు ఉంటే, ప్రతీ పాఠాన్ని మీ పిల్లలతో కలిసి చదివి అందులో ఉన్న బొమ్మల గురించి కలిసి మాట్లాడుకోవచ్చు. తర్వాత ఇద్దరూ కలిసి బైబిల్లో ఆ పాఠానికి సంబంధించిన భాగాన్ని చదవవచ్చు. బైబిల్లో చదివిన వాటిని పాఠంలో ఉన్న వాటితో పోల్చుకోవడానికి మీ పాపకు లేదా బాబుకు సహాయం చేయండి. బైబిల్లో సందేశాన్ని అర్థం చేసుకోవడానికి పెద్దవాళ్లకు సహాయం చేస్తున్నప్పుడు కూడా ఇలా చేస్తే మంచి ప్రయోజనాలు రావచ్చు.

మంచి హృదయం ఉన్నవాళ్లందరికీ, పిల్లలకు పెద్దవాళ్లకు దేవుని వాక్యం నుండి నేర్చుకునేలా, అందులో పాఠాలను వాళ్ల జీవితంలో పాటించేలా ఈ పుస్తకం సహాయం చేస్తుందని మా నమ్మకం. అప్పుడు వాళ్లు కూడా దేవుడు ఎంతో ప్రేమిస్తున్న ఆయన కుటుంబంలో ఒకరిగా ఆయనను ఆరాధించవచ్చు.

మీ సహోదరులు,

యెహోవాసాక్షుల పరిపాలక సభ