కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7వ పాఠం

యెహోవా ఎలాంటి దేవుడు?

యెహోవా ఎలాంటి దేవుడు?

యెహోవా దేవుని పేరు వినగానే మీకేం అనిపిస్తుంది? ఆకాశంలోని నక్షత్రాల్లా ఆయన మనకు అందనంత దూరంలో ఉంటాడని, ఆయన చాలా గొప్పవాడని అనిపిస్తుందా? లేదా ఉరుములు-మెరుపుల్లాగే ఆయన కేవలం ఒక శక్తి అని, ఆయనకు వ్యక్తిత్వం ఉండదని అనిపిస్తుందా? అసలు యెహోవా ఎలాంటి దేవుడు? ఆయన ఎలాంటి దేవుడో బైబిలు చెప్తుంది. అంతేకాదు, యెహోవాకు మీ మీద శ్రద్ధ ఉందని కూడా చెప్తుంది.

1. మనం దేవుణ్ణి ఎందుకు చూడలేం?

“దేవుడు అదృశ్య వ్యక్తి.” (యోహాను 4:24) యెహోవాకు మనలాంటి శరీరం లేదు. అందుకే మనం ఆయన్ని చూడలేం. అంతేకాదు ఆయన పరలోకంలో ఉంటాడు. అది కూడా మన కంటికి కనిపించదు.

2. యెహోవాకు ఉన్న కొన్ని లక్షణాలు ఏంటి?

యెహోవా మనకు కనిపించకపోయినా ఆయన నిజంగా ఉన్నాడు, ఆయనకు ఎన్నో చక్కని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల గురించి తెలుసుకున్నప్పుడు మనం ఆయనకు దగ్గరౌతాం. బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు, ఆయన తన విశ్వసనీయుల్ని విడిచిపెట్టడు.” (కీర్తన 37:28) ఆయన అందరి మీద, ముఖ్యంగా బాధలో ఉన్నవాళ్ల మీద ‘ఎంతో వాత్సల్యం, కరుణ’ చూపిస్తాడు. (యాకోబు 5:11) “విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు; నిరుత్సాహపడినవాళ్లను ఆయన కాపాడతాడు.” (కీర్తన 34:18, అధస్సూచి) మన పనులు యెహోవాను సంతోషపెట్టవచ్చు లేదా బాధపెట్టవచ్చు అని మీకు తెలుసా? మనం చెడ్డ పనులు చేస్తే ఆయన నొచ్చుకుంటాడు, బాధపడతాడు. (కీర్తన 78:40, 41) కానీ మనం మంచి పనులు చేస్తే ఆయన సంతోషిస్తాడు.—సామెతలు 27:11 చదవండి.

3. మన మీద ప్రేమ ఉందని యెహోవా ఎలా చూపిస్తున్నాడు?

యెహోవా లక్షణాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమ. నిజానికి, దేవునికి ప్రేమ ఉండడం కాదు ‘దేవుడే ప్రేమ’ అని బైబిలు చెప్తుంది. (1 యోహాను 4:8) యెహోవాకు మన మీద ఎంత ప్రేమ ఉందో బైబిల్ని చదివి తెలుసుకోవచ్చు, అలాగే సృష్టిని చూసి కూడా తెలుసుకోవచ్చు. (అపొస్తలుల కార్యాలు 14:17 చదవండి.) ఉదాహరణకు, ఆయన మనల్ని ఎలా తయారు చేశాడో ఆలోచించండి. అందమైన రంగుల్ని చూసేలా, మంచి సంగీతాన్ని వినేలా, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించేలా ఆయన మనల్ని తయారు చేశాడు. ఎందుకంటే, మనం సంతోషంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు.

ఎక్కువ తెలుసుకోండి

యెహోవా గొప్పగొప్ప పనుల్ని ఎలా చేస్తాడో, తన చక్కని లక్షణాల్ని ఎలా తెలియజేస్తాడో పరిశీలించండి.

4. పవిత్రశక్తి అంటే దేవుని చురుకైన శక్తి

పనులు చేయడానికి మనం చేతుల్ని ఉపయోగించినట్టే, యెహోవా తన పవిత్రశక్తిని ఉపయోగిస్తాడు. పవిత్రశక్తి దేవుడు కాదుగానీ, తాను అనుకున్న పనులు జరిగించడానికి దేవుడు ఉపయోగించే శక్తి అని బైబిలు చెప్తుంది. లూకా 11:13; అపొస్తలుల కార్యాలు 2:17 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • పవిత్రశక్తి కోసం అడిగినవాళ్ల మీద దేవుడు దాన్ని ‘కుమ్మరిస్తాడు.’ దీన్నిబట్టి, పవిత్రశక్తి ఒక దేవుడా లేక దేవుని చురుకైన శక్తా? మీరేమంటారు? ఎందుకు?

యెహోవా తన పవిత్రశక్తిని ఉపయోగించి గొప్పగొప్ప పనులు చేస్తాడు. కీర్తన 33:6; a 2 పేతురు 1:20, 21 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యెహోవా తన పవిత్రశక్తిని ఏయే విధాలుగా ఉపయోగించాడు?

5. యెహోవాకు చక్కని లక్షణాలు ఉన్నాయి

మోషే చాలా సంవత్సరాలు దేవుణ్ణి నమ్మకంగా సేవించాడు, అయినా సృష్టికర్త గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే మోషే ఇలా అడిగాడు: ‘నీ మార్గాలు నాకు తెలియజేయి. అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను.’ (నిర్గమకాండం 33:13) దానికి జవాబుగా, యెహోవా తన లక్షణాల్లో కొన్నిటిని మోషేకు చెప్పాడు. నిర్గమకాండం 34:4-6 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యెహోవా తనకున్న ఏ లక్షణాల్ని మోషేకు చెప్పాడు?

  • యెహోవా లక్షణాల్లో మీకు ఏది బాగా నచ్చింది?

6. యెహోవాకు ప్రజల మీద శ్రద్ధ ఉంది

పూర్వం, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వాళ్లు బాధలు పడుతున్నప్పుడు యెహోవాకు ఎలా అనిపించింది? నిర్గమకాండం 3:1-10 చదవండి లేదా ఆడియో వింటూ ఆ వచనాల్ని మీ బైబిల్లో చూడండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • దీన్నిబట్టి, మనుషులు బాధలు పడుతున్నప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?—7, 8 వచనాలు చూడండి.

  • మనుషులకు సహాయం చేయాలనే కోరిక, అలా చేసే శక్తి యెహోవాకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఎందుకు?

7. సృష్టిలో యెహోవా లక్షణాలు కనిపిస్తాయి

యెహోవా చేసిన సృష్టిని చూస్తే మనకు ఆయన లక్షణాలు తెలుస్తాయి. వీడియో చూడండి. రోమీయులు 1:20 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • యెహోవాకు ఉన్న ఏ లక్షణాల్ని మీరు సృష్టిలో చూశారు?

కొంతమంది ఇలా అంటారు: “దేవుడు ఒక వ్యక్తి కాదు, శక్తి మాత్రమే.”

  • మీరు ఏమనుకుంటున్నారు?

  • ఎందుకు అలా అనుకుంటున్నారు?

ఒక్కమాటలో

యెహోవా దేవుడు మన కంటికి కనిపించడు. ఆయనకు ఎన్నో చక్కని లక్షణాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైనది ప్రేమ.

మీరేం నేర్చుకున్నారు?

  • మనం యెహోవాను ఎందుకు చూడలేం?

  • పవిత్రశక్తి అంటే ఏంటి?

  • యెహోవాకు ఉన్న కొన్ని లక్షణాలు ఏంటి?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

యెహోవాకు ఉన్న నాలుగు ముఖ్యమైన లక్షణాల గురించి వివరంగా తెలుసుకోండి.

“దేవుడు ఎలాంటివాడు?” (కావలికోట నం. 1 2019)

యెహోవా ప్రతీచోట ఉండడు అనడానికి రుజువులు పరిశీలించండి.

“దేవుడు ప్రతీచోట ఉంటాడా? ఆయన సర్వాంతర్యామా?” (jw.org ఆర్టికల్‌)

బైబిలు పవిత్రశక్తిని దేవుని చెయ్యితో ఎందుకు పోలుస్తుందో తెలుసుకోండి.

“పవిత్రశక్తి అంటే ఏమిటి?” (jw.org ఆర్టికల్‌)

దేవునికి తన మీద శ్రద్ధ లేదని చూపులేని ఒకాయన అనుకున్నాడు. కానీ ఆయన తన అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకున్నాడో తెలుసుకోండి.

“నేను కూడా సహాయం చేయగలను అని ఇప్పుడు నాకనిపిస్తుంది” (కావలికోట నం. 1 2016)

a కీర్తన 33:6 లోని “ఊపిరి” అనే పదం పవిత్రశక్తిని సూచిస్తుంది.