కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

9వ పాఠం

దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది

దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది

జీవితంలో మీకు మంచి సలహా అవసరమని అనిపిస్తుందా? ముఖ్యమైన ప్రశ్నలకు మీరు జవాబులు వెతుకుతున్నారా? మీకు ఓదార్పు, మనశ్శాంతి అవసరమా? మీరు యెహోవాకు ఇంకా దగ్గరవ్వాలని అనుకుంటున్నారా? అలాగైతే ప్రార్థన మీకు సహాయం చేస్తుంది. కానీ ఎలా ప్రార్థించాలి? దేవుడు అందరి ప్రార్థనలు వింటాడా? ఆయన మీ ప్రార్థనలు వినాలంటే మీరేం చేయాలి? వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

1. మనం ఎవరికి ప్రార్థించాలి? మనం వేటి గురించి ప్రార్థించవచ్చు?

మన పరలోక తండ్రికి మాత్రమే ప్రార్థించాలని యేసు నేర్పించాడు. యేసు కూడా యెహోవాకే ప్రార్థించాడు. యేసు ఇలా అన్నాడు: “మీరు ఈ విధంగా ప్రార్థించాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ . . . ’” (మత్తయి 6:9) మనం యెహోవాకు ప్రార్థించినప్పుడు ఆయనకు ఇంకా దగ్గరౌతాం.

మనం దేని గురించైనా ప్రార్థించవచ్చు. అయితే, మన ప్రార్థనలు దేవుని ఇష్టానికి తగ్గట్టు ఉండాలి. “మనం ఆయన [అంటే, దేవుని] ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు.” (1 యోహాను 5:14) మనం ఎలాంటి విషయాల గురించి ప్రార్థించవచ్చో యేసు చెప్పాడు. (మత్తయి 6:9-13 చదవండి.) మనం మన కోసమే కాదు, వేరేవాళ్ల కోసం కూడా ప్రార్థించాలి. అంతేకాదు దేవుడు చేసినవాటికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకూడదు.

2. మనం ఎలా ప్రార్థించాలి?

దేవుని ముందు “మీ హృదయాలు కుమ్మరించండి” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 62:8) అంటే, మన హృదయంలో ఉన్నదంతా యెహోవాకు చెప్పాలి. మనం బయటికి అయినా, మనసులో అయినా ప్రార్థించవచ్చు. మనం కూర్చుని గానీ నిలబడి గానీ మోకరించి గానీ, గౌరవం చూపించే విధంగా ఎలాగైనా ప్రార్థించవచ్చు. అంతేకాదు మనం ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రార్థించవచ్చు.

3. దేవుడు మన ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడు?

ఆయన చాలా విధాలుగా జవాబిస్తాడు. ఉదాహరణకు, యెహోవా మనకు తన వాక్యమైన బైబిల్ని ఇచ్చాడు. మనం మంచి సలహాల కోసం అందులో వెదకవచ్చు. కీర్తన 19:7 చెప్తున్నట్టు, దేవుని వాక్యాన్ని చదివితే ‘అనుభవం లేనివాళ్లు తెలివిగలవాళ్లుగా’ అవుతారు. (యాకోబు 1:5 చదవండి.) కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకు మనశ్శాంతిని ఇస్తాడు. కొన్నిసార్లు, ఆయన తన సేవకుల్ని ఉపయోగించి మనకు అవసరమైన సహాయం చేస్తాడు.

ఎక్కువ తెలుసుకోండి

మీరు దేవునికి ఇష్టమైన విధంగా ఎలా ప్రార్థించవచ్చో, ప్రార్థన మీకెలా సహాయం చేస్తుందో తెలుసుకోండి.

4. దేవుడు మన ప్రార్థనలు వినాలంటే ఏం చేయాలి?

దేవుడు ఎలాంటి ప్రార్థనలు వింటాడో, ఎలాంటి ప్రార్థనలు వినడో తెలుసుకోవడానికి వీడియో చూడండి.

మనం తనకు ప్రార్థించాలని యెహోవా కోరుతున్నాడు. కీర్తన 65:2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ‘ప్రార్థనలు వినే దేవుడు’ మీరు తనకు ప్రార్థించాలని నిజంగా కోరుకుంటున్నాడా? ఎందుకు?

దేవుడు మన ప్రార్థనలు వినాలంటే, మనం ఆయనకు ఇష్టమైన విధంగా జీవించడానికి ప్రయత్నించాలి. మీకా 3:4; 1 పేతురు 3:12 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మనం ఎలా జీవిస్తే యెహోవా మన ప్రార్థనలు వింటాడు?

యుద్ధంలో గెలవాలని రెండు వైపుల వాళ్లూ ప్రార్థిస్తారు. దేవుడు అలాంటి ప్రార్థనలు వింటాడని మీకు అనిపిస్తుందా?

5. మన ప్రార్థనలు హృదయంలో నుండి రావాలి

ప్రార్థనల్ని బట్టీ పట్టాలని కొంతమంది అంటారు. కానీ, మనం అలా ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడా? మత్తయి 6:7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • “చెప్పిన మాటలే మళ్లీమళ్లీ” చెప్పకుండా ప్రార్థించాలంటే ఏం చేయాలి?

ప్రతీరోజు యెహోవా మీకు చేసిన ఒక మేలు గురించి ఆలోచించి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి. ఇలా ఒక వారం పాటు చేయండి. అలా చేస్తే మీరు ఆ వారమంతటిలో ఒకే విషయాల గురించి కాకుండా, వేర్వేరు విషయాల గురించి ప్రార్థించినట్టు అవుతుంది.

పిల్లవాడు తనతో మనసువిప్పి మాట్లాడాలని ఒక మంచి తండ్రి కోరుకుంటాడు. అలాగే మనం మనసువిప్పి తనకు ప్రార్థించాలని యెహోవా కోరుకుంటున్నాడు

6. ప్రార్థన దేవుడు ఇచ్చిన బహుమతి

ప్రార్థన మనకెలా సహాయం చేస్తుంది? మరిముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన మనకెలా సహాయం చేస్తుంది? వీడియో చూడండి.

మనం నిజమైన మనశ్శాంతిని పొందడానికి ప్రార్థన సహాయం చేస్తుందని బైబిలు మాటిస్తుంది. ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ప్రార్థన అన్నిసార్లూ మన కష్టాల్ని తీసేయకపోయినా, అదెలా సహాయం చేస్తుంది?

  • మీరు వేటి గురించి ప్రార్థించాలని అనుకుంటున్నారు?

మీకు తెలుసా?

“ఆమేన్‌” అనే మాటకు, “అలాగే జరగాలి” లేదా “ఖచ్చితంగా” అని అర్థం. ప్రార్థన చివర్లో “ఆమేన్‌” అనడం, బైబిలు కాలాల నుండి అలవాటుగా వస్తోంది.—1 దినవృత్తాంతాలు 16:36.

7. ప్రార్థించడానికి సమయం తీసుకోండి

కొన్నిసార్లు మనం ఎంత బిజీగా ఉంటామంటే, ప్రార్థించడం కూడా మర్చిపోతాం. ప్రార్థనను యేసు ఎంత ముఖ్యమైనదిగా చూశాడు? మత్తయి 14:23; మార్కు 1:35 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ప్రార్థించడానికి యేసు ఎలా సమయం తీసుకున్నాడు?

  • మీరు ఏ సమయంలో ప్రార్థించవచ్చు?

కొంతమంది ఇలా అంటారు: “ప్రార్థన కేవలం మనశ్శాంతి కోసం చేసేదే కానీ, దాన్ని వినేవాళ్లు ఎవ్వరూ ఉండరు.”

  • మీరేమంటారు?

ఒక్కమాటలో

మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలు మనల్ని యెహోవాకు దగ్గర చేస్తాయి, మనశ్శాంతిని ఇస్తాయి, ఆయన్ని సంతోషపెట్టేలా జీవించడానికి కావాల్సిన బలాన్ని ఇస్తాయి.

మీరేం నేర్చుకున్నారు?

  • మనం ఎవరికి ప్రార్థించాలి?

  • ఎలా ప్రార్థించాలి?

  • ప్రార్థన వల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏంటి?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

ప్రార్థన గురించి చాలామంది అడిగే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి.

“ప్రార్థన గురించి మీరు తెలుసుకోవాల్సిన ఏడు విషయాలు” (కావలికోట ఆర్టికల్‌)

ఎందుకు ప్రార్థించాలో, చక్కగా ప్రార్థించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

“నేను ఎందుకు ప్రార్థించాలి?” (jw.org ఆర్టికల్‌)

మనం ఎవరికి ప్రార్థించాలని బైబిలు చెప్తుందో పరిశీలించండి.

“నేను పరిశుద్ధులకు ప్రార్థించాలా?” (jw.org ఆర్టికల్‌)

మనం ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రార్థించవచ్చు అని అర్థం చేసుకోవడానికి ఈ వీడియో చూడండి.

ఎప్పుడైనా ప్రార్థించండి (1:22)