కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

17వ పాఠం

యేసు ఎలాంటి వ్యక్తి?

యేసు ఎలాంటి వ్యక్తి?

భూమ్మీద యేసు చెప్పినవి, చేసినవి పరిశీలించినప్పుడు మనం ఆయన లక్షణాలు తెలుసుకుంటాం. దానివల్ల ఆయనకు, ఆయన తండ్రైన యెహోవాకు ఇంకా దగ్గరౌతాం. యేసుకు ఉన్న చక్కని లక్షణాల్లో కొన్ని ఏంటి? వాటిని మనం ఎలా చూపించవచ్చు?

1. యేసు ఏయే విధాలుగా తన తండ్రిలా ఉన్నాడు?

పరలోకంలో, యేసు వందలకోట్ల సంవత్సరాలు తన ప్రేమగల తండ్రిని గమనిస్తూ, ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. దానివల్ల యేసు ఆలోచనలు, భావాలు, పనులు అచ్చం ఆయన తండ్రిలాగే ఉంటాయి. (యోహాను 5:19 చదవండి.) యేసు తన తండ్రి లక్షణాల్ని ఎంత బాగా చూపించాడంటే, “నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు” అని ఆయన అన్నాడు. (యోహాను 14:9) యేసు లక్షణాల గురించి మీరు నేర్చుకునేకొద్దీ, యెహోవాను ఇంకా బాగా తెలుసుకోగలుగుతారు. ఉదాహరణకు, యేసు ప్రజల మీద ఎంత శ్రద్ధ చూపించాడో పరిశీలించినప్పుడు, యెహోవాకు మీమీద ఎంత శ్రద్ధ ఉందో మీరు తెలుసుకుంటారు.

2. యెహోవా మీద ఉన్న ప్రేమను యేసు ఎలా చూపించాడు?

యేసు ఇలా అన్నాడు: “నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకానికి తెలియాలని, తండ్రి నాకు ఆజ్ఞాపించినట్టే చేస్తున్నాను.” (యోహాను 14:31) భూమ్మీద ఉన్నప్పుడు యేసు కష్టమైన పరిస్థితుల్లో కూడా తన తండ్రి మాట విన్నాడు, అలా ఆయన మీద ఎంత ప్రేమ ఉందో చూపించాడు. తన తండ్రి గురించి మాట్లాడడం ద్వారా, ఆయనకు స్నేహితులయ్యేలా వేరేవాళ్లకు సహాయం చేయడం ద్వారా కూడా యేసు ఆయన మీద ఉన్న ప్రేమను చూపించాడు.—యోహాను 14:23.

3. ప్రజల మీద ఉన్న ప్రేమను యేసు ఎలా చూపించాడు?

యేసు మనుషుల్ని ఎంతో ప్రేమించాడని, వాళ్లను బట్టి ఎంతో ఆనందించాడని బైబిలు చెప్తుంది. (సామెతలు 8:31) ప్రజల్ని ప్రోత్సహించడం ద్వారా, వాళ్లకు నిస్వార్థంగా సహాయం చేయడం ద్వారా ఆయన వాళ్లమీద ప్రేమ చూపించాడు. యేసు చేసిన అద్భుతాలు ఆయనకు ఉన్న శక్తినే కాదు, కనికరాన్ని కూడా చూపించాయి. (మార్కు 1:40-42) ఆయన అందర్నీ సమానంగా చూసేవాడు, దయగా ఉండేవాడు. ఆయన తన మాటల ద్వారా మంచి మనసున్న వాళ్లందర్నీ ఓదార్చాడు, వాళ్లలో ఆశను నింపాడు. మనుషులందరి మీద ప్రేమతో యేసు బాధ అనుభవించి చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు. యేసు అందర్నీ ప్రేమిస్తాడు, అయితే తాను చెప్పినవాటిని పాటించేవాళ్లను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు.—యోహాను 15:13, 14 చదవండి.

ఎక్కువ తెలుసుకోండి

యేసు లక్షణాల గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోండి. యేసుకున్న ప్రేమను, ఇచ్చే గుణాన్ని మనం ఎలా చూపించవచ్చో పరిశీలించండి.

4. యేసుకు తన తండ్రి మీద ప్రేమ ఉంది

దేవుని మీద ఉన్న ప్రేమను మనం ఎలా చూపించవచ్చో యేసు నుండి నేర్చుకోవచ్చు. లూకా 6:12; యోహాను 15:10; 17:26 చదవండి. ప్రతీ వచనాన్ని చదివిన తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యేసులాగే, యెహోవా మీద ఉన్న ప్రేమను మనం ఎలా చూపించవచ్చు?

యేసు తన పరలోక తండ్రిని ప్రేమించాడు, ప్రార్థనలో తరచూ ఆయనతో మాట్లాడాడు

5. యేసు ప్రజల అవసరాల్ని పట్టించుకున్నాడు

యేసు తన అవసరాల కన్నా, వేరేవాళ్ల అవసరాల గురించే ఎక్కువగా ఆలోచించాడు. ఆయన అలసిపోయినా సరే, ప్రజలకు సహాయం చేయడానికి తన సమయాన్ని, శక్తిని ఉపయోగించాడు. మార్కు 6:30-44 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యేసు ఏయే విధాలుగా ప్రజల మీద శ్రద్ధ చూపించాడు?—31, 34, 41, 42 వచనాలు చూడండి.

  • ప్రజలకు సహాయం చేయాలని యేసుకు ఎందుకు అనిపించింది?—34వ వచనం చూడండి.

  • యేసు తన తండ్రి లక్షణాల్ని చూపిస్తాడు కాబట్టి, ఈ వచనాల నుండి యెహోవా గురించి ఏం నేర్చుకోవచ్చు?

  • యేసులా మనం ఏయే విధాలుగా వేరేవాళ్ల మీద శ్రద్ధ చూపించవచ్చు?

6. యేసుకు ఇచ్చే గుణం ఉంది

యేసుకు పెద్దగా ఆస్తులు లేకపోయినా, తనకు ఉన్నవాటిని వేరేవాళ్లతో పంచుకున్నాడు. మనల్ని కూడా అలాగే చేయమని ఆయన చెప్పాడు. అపొస్తలుల కార్యాలు 20:35 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మనం ఏం చేస్తే సంతోషంగా ఉంటామని యేసు చెప్పాడు?

వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • మనకు పెద్దగా ఆస్తులు లేకపోయినా, మనకున్న వాటిని వేరేవాళ్లతో ఎలా పంచుకోవచ్చు?

మీకు తెలుసా?

మనం యేసు పేరున యెహోవాకు ప్రార్థించాలని బైబిలు చెప్తుంది. (యోహాను 16:23, 24 చదవండి.) అలా ప్రార్థించినప్పుడు, యెహోవాకు స్నేహితులయ్యేలా మనకు సహాయం చేసిన యేసు మీద కృతజ్ఞత ఉందని చూపిస్తాం.

కొంతమంది ఇలా అంటారు: “మనం బాధలు పడుతున్నా దేవుడు మనల్ని పట్టించుకోడు.”

  • యెహోవాకు మనమీద శ్రద్ధ ఉందని భూమ్మీద యేసు చేసిన పనులు ఎలా చూపిస్తున్నాయి?

ఒక్కమాటలో

యేసుకు యెహోవా మీద, ప్రజల మీద ప్రేమ ఉంది. యేసు అచ్చం తన తండ్రిలాగే ఉంటాడు. కాబట్టి యేసు గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, యెహోవా గురించి అంత ఎక్కువగా తెలుసుకుంటాం.

మీరేం నేర్చుకున్నారు?

  • యేసులాగే మనం యెహోవా మీద ఎలా ప్రేమ చూపించవచ్చు?

  • యేసులాగే మనం ప్రజల మీద ఎలా ప్రేమ చూపించవచ్చు?

  • యేసుకు ఉన్న లక్షణాల్లో మీకు ఏది బాగా నచ్చింది?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

యేసుకు ఉన్న కొన్ని లక్షణాల్ని మనం ఎలా చూపించవచ్చో పరిశీలించండి.

“యేసును అనుకరిస్తూ, ఆయనలా . . . ” (యేసే మార్గం, సత్యం, జీవం, 317వ పేజీ)

మనం యేసు పేరున ఎందుకు ప్రార్థించాలో తెలుసుకోండి.

“మనం యేసు పేరున ఎందుకు ప్రార్థించాలి?” (కావలికోట ఆర్టికల్‌)

యేసు రూపం గురించి బైబిలు ఏమైనా చెప్తుందా?

“యేసు చూడడానికి ఎలా ఉండేవాడు?” (jw.org ఆర్టికల్‌)

యేసు స్త్రీలతో ప్రవర్తించిన తీరు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

“మనం స్త్రీలను గౌరవించాలని దేవుడు కోరుతున్నాడు” (కావలికోట ఆర్టికల్‌)