కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

22వ పాఠం

మీరు ఎలా వేరేవాళ్లకు మంచివార్త చెప్పవచ్చు?

మీరు ఎలా వేరేవాళ్లకు మంచివార్త చెప్పవచ్చు?

బైబిలు సత్యాలు నేర్చుకుంటున్నప్పుడు, అవి బాగా నచ్చి, ‘వీటిని అందరికీ చెప్పాలి!’ అని మీకు అనిపించవచ్చు. నిజమే, వాటిని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి! అయితే, నేర్చుకున్నవాటిని వేరేవాళ్లకు చెప్పడానికి మీరు కొంచెం భయపడుతుండవచ్చు. ఆ భయాన్ని తీసేసుకొని, బైబిల్లో ఉన్న మంచివార్తను ఎలా సంతోషంగా చెప్పవచ్చో ఇప్పుడు చూద్దాం.

1. మీరు నేర్చుకున్న విషయాల్ని మీకు తెలిసినవాళ్లకు ఎలా చెప్పవచ్చు?

యేసు శిష్యులకు వాళ్లు నేర్చుకున్న సత్యాలు ఎంతగా నచ్చాయంటే, వాటిని వీలైనంత ఎక్కువమందికి చెప్పాలని కోరుకున్నారు. వాళ్లు ఇలా అన్నారు: “మేమైతే చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం.” (అపొస్తలుల కార్యాలు 4:20) మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అయితే, మీరు నేర్చుకున్న విషయాల్ని మీ ఇంట్లోవాళ్లతో, స్నేహితులతో గౌరవపూర్వకంగా చెప్పే అవకాశాల కోసం చూడండి.—కొలొస్సయులు 4:6 చదవండి.

మీరు ఇలా మొదలుపెట్టవచ్చు …

  • ఇంట్లోవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు, “ఈ వారం నేను ఒక కొత్త విషయం నేర్చుకున్నాను తెలుసా” అంటూ, మీరు నేర్చుకున్న ఏదైనా విషయం చెప్పండి.

  • మీ స్నేహితుల్లో ఎవరికైనా ఒంట్లో బాలేకపోతే లేదా ఆందోళనపడుతుంటే, ఓదార్పును ఇచ్చే బైబిలు వచనం చూపించండి.

  • మీతో కలిసి పనిచేసేవాళ్లతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు, స్టడీలో లేదా మీటింగ్‌లో మీరు నేర్చుకున్న ఏదైనా విషయాన్ని మాటల మధ్యలో చెప్పండి.

  • మీ స్నేహితులకు వెబ్‌సైట్‌ చూపించండి.

  • స్టడీలో మీతోపాటు కూర్చోమని ఎవరినైనా పిలవండి, లేదా jw.orgలో స్టడీ కోసం ఎలా అడగాలో చూపించండి.

2. సంఘంతో కలిసి ప్రకటించాలనే లక్ష్యం పెట్టుకోవడం ఎందుకు మంచిది?

యేసు శిష్యులు కేవలం తెలిసినవాళ్లకే కాదు, అందరికీ మంచివార్త ప్రకటించారు. యేసు వాళ్లను ‘ప్రతీ నగరానికి తనకన్నా ముందు ఇద్దరిద్దరిగా పంపించి,’ ప్రకటించమని చెప్పాడు. (లూకా 10:1) అలా ఒక పద్ధతి ప్రకారం ప్రకటించడం వల్ల, మంచివార్త వినే అవకాశం ఇంకా ఎక్కువమందికి దొరికింది. అంతేకాదు, అలా కలిసి ప్రకటించడం వల్ల శిష్యులు ఎంతో ఆనందాన్ని పొందారు. (లూకా 10:17) మీరు కూడా సంఘంతో కలిసి ప్రకటించాలనే లక్ష్యం పెట్టుకోగలరా?

ఎక్కువ తెలుసుకోండి

మీరు ఎలా భయాన్ని తీసేసుకొని, మంచివార్త ప్రకటించడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూడవచ్చో తెలుసుకోండి.

3. యెహోవా మీకు సహాయం చేస్తాడు

కొంతమందికి ప్రకటించాలని ఉన్నా వేరేవాళ్లు ఏమనుకుంటారో అని, ఎగతాళి చేస్తారేమో అని, కోప్పడతారేమో అని భయపడతారు.

  • నేర్చుకున్న విషయాల్ని వేరేవాళ్లకు చెప్పాలంటే మీకు భయంగా అనిపిస్తుందా? ఎందుకు?

వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • వీడియోలో ఉన్న యౌవనులు ఎలా భయాన్ని తీసేసుకున్నారు?

యెషయా 41:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ప్రకటించడానికి మీకు ఎప్పుడైనా భయమేస్తే, ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

మీకు తెలుసా?

మంచివార్త ప్రకటించడం మా వల్ల కాదు అని చాలామంది యెహోవాసాక్షులు ఒకప్పుడు అనుకున్నారు. ఉదాహరణకు, సెర్గీ అనే వ్యక్తికి అంతగా ఆత్మవిశ్వాసం ఉండేది కాదు, వేరేవాళ్లతో మాట్లాడాలంటే ఇబ్బంది పడేవాడు. కానీ, ఆయన బైబిలు స్టడీ తీసుకున్న తర్వాత ఇలా అన్నాడు: “నాకు భయమేసినా, నేను నేర్చుకుంటున్న విషయాల్ని ఇతరులకు చెప్పడం మొదలుపెట్టాను. బైబిలు గురించి వేరేవాళ్లకు చెప్పడం వల్ల నిజానికి నా ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను కొత్తగా నేర్చుకుంటున్న విషయాల మీద కూడా నాకు నమ్మకం పెరిగింది.”

4. గౌరవంతో మాట్లాడండి

మంచివార్త చెప్పే ముందు, ఏం మాట్లాడాలో ఆలోచించడంతో పాటు ఎలా మాట్లాడాలో కూడా ఆలోచించండి. 2 తిమోతి 2:24; 1 పేతురు 3:15 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • బైబిలు విషయాల గురించి వేరేవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఈ వచనాల్ని ఎలా పాటించవచ్చు?

  • కొన్నిసార్లు ఇంట్లోవాళ్లు లేదా స్నేహితులు మీరు చెప్పేదాన్ని ఒప్పుకోకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేయవచ్చు? కానీ ఏం చేయకూడదు?

  • వాళ్లు ఏం నమ్మాలో మీరు చెప్పే బదులు, వాళ్లే ఆలోచించుకునేలా నేర్పుగా ప్రశ్నలు వేయడం ఎందుకు మంచిది?

5. మంచివార్తను చెప్పినప్పుడు ఆనందంగా ఉంటుంది

యెహోవా దేవుడు మంచివార్త చెప్పే పనిని యేసుకు అప్పగించాడు. యేసు ఆ పనిని ఎలా చూశాడు? యోహాను 4:34 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మనం బ్రతికుండాలంటే మంచి ఆహారం అవసరం, అంతేకాదు అది మనకు సంతోషాన్నిస్తుంది. ప్రకటించడాన్ని, దేవుని ఇష్టం చేయడాన్ని యేసు ఆహారంతో ఎందుకు పోల్చాడు?

  • మంచివార్త చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతామని, ఎలాంటి ఆనందాన్ని రుచి చూస్తామని మీరు అనుకుంటున్నారు?

సలహాలు

  • మీరు వేరేవాళ్లతో మాట్లాడడం ఎలా మొదలుపెట్టవచ్చో వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో చూసి నేర్చుకోండి.

  • ఆ మీటింగ్‌లో మీరు కూడా విద్యార్థి నియామకాలు చేయాలనుకుంటే, మీకు స్టడీ ఇచ్చే వ్యక్తితో మాట్లాడండి. ఆ నియామకాలు చేసేకొద్దీ, మీరు నేర్చుకున్నవాటిని వేరేవాళ్లకు ఇంకా బాగా చెప్పగలుగుతారు.

  • ఈ పుస్తకంలో “కొంతమంది ఇలా అంటారు” లేదా “కొంతమంది ఇలా అడుగుతారు” అనేవాటి కింద, ప్రజలు సాధారణంగా ఏమంటారో, ఏం అడుగుతారో ఉంటాయి. వాటికి మీరు ఎలా జవాబు ఇవ్వవచ్చో ప్రాక్టీస్‌ చేయండి.

కొంతమంది ఇలా అడుగుతారు: “ఇంకా ఏంటి సంగతులు?”

  • ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని, మీరు బైబిలు స్టడీలో నేర్చుకున్న విషయాన్ని వాళ్లకు ఎలా చెప్పవచ్చు?

ఒక్కమాటలో

వేరేవాళ్లకు మంచివార్త చెప్పినప్పుడు ఆనందంగా ఉంటుంది. అలా చెప్పడం మీరు అనుకున్నంత కష్టమేమీ కాకపోవచ్చు.

మీరేం నేర్చుకున్నారు?

  • మంచివార్తను వేరేవాళ్లకు ఎందుకు చెప్పాలి?

  • మంచివార్తను చెప్పేటప్పుడు మీరెలా గౌరవంతో మాట్లాడవచ్చు?

  • ఒకవేళ మీకు ప్రకటించడానికి భయంగా అనిపిస్తే, మీరు దాన్ని ఎలా తీసేసుకోవచ్చు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

jw.org కాంటాక్ట్‌ కార్డు ఉపయోగించి మంచివార్త ప్రకటించడానికి నాలుగు సులువైన పద్ధతులు తెలుసుకోండి.

JW.ORG కాంటాక్ట్‌ కార్డ్‌ ఇలా ఇవ్వవచ్చు (1:43)

మంచివార్త ప్రకటించడానికి మీకు సహాయం చేసే నాలుగు లక్షణాల గురించి తెలుసుకోండి.

“మనుషుల్ని పట్టే జాలరిగా అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?” (కావలికోట, సెప్టెంబరు 2020)

చిన్నపిల్లలు కూడా ధైర్యంగా మంచివార్త ప్రకటించవచ్చు అనడానికి ఒక బైబిలు ఉదాహరణ చూడండి.

యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు (11:59)

సత్యంలో లేని మీ కుటుంబ సభ్యులకు యెహోవా గురించి ఎలా చెప్పవచ్చో తెలుసుకోండి.

“సత్యంలో లేని బంధువుల హృదయాల్ని చేరుకోండి” (కావలికోట, మార్చి 15, 2014)