కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

24వ పాఠం

దేవదూతలు ఎవరు, వాళ్లు ఏం చేస్తారు?

దేవదూతలు ఎవరు, వాళ్లు ఏం చేస్తారు?

పరలోకంలో ఉన్న తన కుటుంబం గురించి మనం తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఆ కుటుంబంలో దేవదూతలు ఉన్నారు. బైబిలు వాళ్లను “దేవుని కుమారులు” అని పిలుస్తుంది. (యోబు 38:7) దేవదూతల గురించి బైబిలు ఏం చెప్తుంది? వాళ్లు మనకు మంచి గానీ, చెడు గానీ చేయగలరా? దేవదూతల్లో అందరూ దేవుని కుటుంబ సభ్యులేనా?

1. దేవదూతలు ఎవరు?

యెహోవా భూమిని తయారు చేయకముందే దేవదూతల్ని సృష్టించాడు. యెహోవాలాగే వాళ్లు కూడా మనకు కనిపించరు, వాళ్లు పరలోకంలో ఉంటారు. (హెబ్రీయులు 1:14) దేవదూతలు కోట్ల సంఖ్యలో ఉన్నారు, వాళ్లందరికీ వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నాయి. (ప్రకటన 5:11) వాళ్లు యెహోవా ‘స్వరానికి లోబడుతూ, ఆయన మాటల్ని నెరవేరుస్తారు.’ (కీర్తన 103:20) పూర్వకాలంలో దేవదూతలు యెహోవా సందేశాన్ని ప్రజలకు చెప్పారు, వాళ్లకు సహాయం చేశారు, వాళ్లను కాపాడారు. మనకాలంలో, దేవదూతలు దేవుని గురించి తెలుసుకోవాలని కోరుకునేవాళ్ల దగ్గరికి క్రైస్తవుల్ని నడిపిస్తున్నారు.

2. సాతాను, చెడ్డదూతలు ఎవరు?

కొంతమంది దూతలు యెహోవాకు నమ్మకంగా ఉండలేదు. దేవుని మీద తిరుగుబాటు చేసిన మొదటి దూతకు “అపవాది, సాతాను అనే పేర్లు ఉన్నాయి. అతను లోకమంతటినీ మోసం చేస్తున్నాడు.” (ప్రకటన 12:9) సాతాను అధికారం కావాలని కోరుకున్నాడు. అందుకే మొదటి మనుషులైన ఆదాముహవ్వల్ని, ఆ తర్వాత కొంతమంది దూతల్ని దేవునికి ఎదురుతిరిగేలా చేశాడు. అలా ఎదురుతిరిగిన దూతలే చెడ్డదూతలు. యెహోవా వాళ్లను పరలోకం నుండి భూమ్మీదికి పడేశాడు, త్వరలో వాళ్లను పూర్తిగా నాశనం చేస్తాడు.—ప్రకటన 12:9, 12 చదవండి.

3. సాతాను, చెడ్డదూతలు మనల్ని ఎలా మోసం చేస్తారు?

సాతాను, చెడ్డదూతలు మంత్రతంత్రాల్ని, అలాంటి వేరే పద్ధతుల్ని ఉపయోగించి చాలామందిని మోసం చేస్తున్నారు. ఎవరైనా నేరుగా గానీ, ఇతరుల ద్వారా గానీ చెడ్డదూతలతో మాట్లాడడానికి ప్రయత్నించడం సరైనది కాదు. ఉదాహరణకు కొంతమంది జ్యోతిష్యుల దగ్గరికి, భవిష్యత్తు చెప్పేవాళ్ల దగ్గరికి, మంత్రగాళ్ల దగ్గరికి, భూతవైద్యుల దగ్గరికి వెళ్తారు. ఇంకొంతమంది మంత్రతంత్రాలతో సంబంధం ఉన్న వైద్యం చేయించుకుంటారు. సాతాను, చెడ్డదూతలు ప్రజల్ని మోసం చేసే ఇంకో పద్ధతి ఏంటంటే, చనిపోయినవాళ్లతో మాట్లాడవచ్చు అని నమ్మించడం. కానీ “చనిపోయినవాళ్లతో మాట్లాడేవాళ్ల దగ్గరికి వెళ్లకండి, భవిష్యత్తు చెప్పేవాళ్లను సంప్రదించకండి” అని యెహోవా హెచ్చరిస్తున్నాడు. (లేవీయకాండం 19:31) సాతాను నుండి, చెడ్డదూతల నుండి మనల్ని కాపాడడానికి ఆయన అలా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే వాళ్లు దేవునికి శత్రువులు, వాళ్లు మనకు హాని చేయాలని చూస్తారు.

ఎక్కువ తెలుసుకోండి

మంచి దేవదూతలు మనకు ఎలా సహాయం చేస్తారో, మంత్రతంత్రాల వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయో, అలాగే సాతాను నుండి, చెడ్డదూతల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకోండి.

4. ప్రజలు యెహోవా గురించి తెలుసుకునేలా దేవదూతలు సహాయం చేస్తారు

దేవదూతలు ప్రజలకు నేరుగా వచ్చి ప్రకటించరు. కానీ, దేవుని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ల దగ్గరికి ఆయన సేవకులు వెళ్లేలా సహాయం చేస్తారు. ప్రకటన 14:6, 7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ప్రకటించడానికి మనకు దేవదూతల సహాయం ఎందుకు అవసరం?

  • దేవుని గురించి నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ల దగ్గరికి దేవదూతలు మిమ్మల్ని నడిపించగలరు అని తెలుసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు?

5. మంత్రతంత్రాలకు దూరంగా ఉండండి

సాతాను, చెడ్డదూతలు యెహోవాకు శత్రువులు. వాళ్లు మనకు కూడా శత్రువులే. లూకా 9:38-42 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • చెడ్డదూతలు ప్రజలకు ఏం చేస్తారు?

మనం చెడ్డదూతల్ని సంప్రదించి సమస్యలు కొని తెచ్చుకోవాలని కోరుకోం. ద్వితీయోపదేశకాండం 18:10-12 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • చెడ్డదూతలు ఎలాంటి వాటి ద్వారా మనతో మాట్లాడడానికి, మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు? మీ ప్రాంతంలో ఏయే రకాల మంత్రతంత్రాలు చేస్తుంటారు?

  • మంత్రతంత్రాలకు దూరంగా ఉండమని యెహోవా చెప్పేది మన మంచి కోసమే అని మీరు నమ్ముతున్నారా? ఎందుకు?

వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • పలేసా వాళ్ల పాపకు కట్టిన తాయెత్తు హానికరమైనది అని మీకు అనిపిస్తుందా? ఎందుకు?

  • చెడ్డదూతల హాని నుండి తప్పించుకోవాలంటే పలేసా ఏం చేయాలి?

నిజ క్రైస్తవులు మొదటి నుండి చెడ్డదూతల్ని ఎదిరిస్తూనే ఉన్నారు. అపొస్తలుల కార్యాలు 19:19; 1 కొరింథీయులు 10:21 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మంత్రతంత్రాలకు సంబంధించినది ఏదైనా మీ దగ్గర ఉంటే దాన్ని తీసిపారేయడం ఎందుకు ముఖ్యం?

6. సాతానుతో, అతని చెడ్డదూతలతో పోరాడి గెలవండి

సాతాను చెడ్డదూతలకు నాయకుడు. కానీ, నమ్మకమైన దూతలకు నాయకుడు ప్రధానదూతైన మిఖాయేలు. అది యేసుకు ఉన్న మరో పేరు. మిఖాయేలుకు ఎంత శక్తి ఉంది? ప్రకటన 12:7-9 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఎవరికి ఎక్కువ శక్తి ఉంది? మిఖాయేలు, ఆయన దూతలకా? లేదా సాతాను, అతని చెడ్డదూతలకా?

  • సాతాను, అతని చెడ్డదూతలకు క్రైస్తవులు భయపడాలా?

సాతాను, అతని చెడ్డదూతలతో మీరు పోరాడి గెలవగలరు. యాకోబు 4:7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • సాతాను నుండి, అతని చెడ్డదూతల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు?

కొంతమంది ఇలా అంటారు: “మంత్రతంత్రాలకు సంబంధించిన ఆటలు ఆడడం, సినిమాలు చూడడం తప్పేం కాదు. అవి సరదా కోసం చేసేవే.”

  • అలాంటి ఆలోచన ఎందుకు ప్రమాదకరం?

ఒక్కమాటలో

మంచి దేవదూతలు మనకు సహాయం చేస్తారు. సాతాను, అతని చెడ్డదూతలు యెహోవాకు శత్రువులు. వాళ్లు మంత్రతంత్రాలు ఉపయోగించి ప్రజల్ని మోసం చేస్తారు.

మీరేం నేర్చుకున్నారు?

  • ప్రజలు యెహోవా గురించి నేర్చుకునేలా ఆయన దూతలు ఎలా సహాయం చేస్తున్నారు?

  • సాతాను, చెడ్డదూతలు ఎవరు?

  • మంత్రతంత్రాలకు దూరంగా ఉండాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

యేసే ప్రధానదూతైన మిఖాయేలు అనడానికి రుజువులు చూడండి.

“ప్రధానదూతైన మిఖాయేలు ఎవరు?” (jw.org ఆర్టికల్‌)

సాతాను అంటే మనలో ఉండే చెడు కాదు. అందుకు రుజువులు చూడండి.

“సాతాను నిజంగా ఉన్నాడా?” (jw.org ఆర్టికల్‌)

చెడ్డదూతలతో సంబంధం ఉన్నవాటిని ఒకామె ఎలా వదిలించుకుందో చూడండి.

“ఆమె జీవితంలో లక్ష్యాన్ని కనుగొంది” (కావలికోట, జూలై 1, 1993)

మంత్రతంత్రాల్ని ఉపయోగించి సాతాను ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో తెలుసుకోండి.

“మ్యాజిక్‌, మంత్రాలు, క్షుద్రవిద్య గురించిన సత్యం” (శాశ్వత జీవితానికి నడిపించే దారి బ్రోషురులోని ఆర్టికల్‌)