కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

40వ పాఠం

మనం దేవుని దృష్టిలో ఎలా పవిత్రంగా ఉండవచ్చు?

మనం దేవుని దృష్టిలో ఎలా పవిత్రంగా ఉండవచ్చు?

ఒక తల్లి తన పిల్లాడిని స్కూల్‌కు తయారుచేస్తున్నట్టు ఊహించుకోండి. ఆమె తన పిల్లాడికి స్నానం చేయించి, ఉతికిన బట్టలు వేసి, శుభ్రంగా తయారుచేస్తుంది. దానివల్ల పిల్లాడు ఆరోగ్యంగా ఉంటాడు, చూసేవాళ్లకు కూడా అతని తల్లిదండ్రులు పిల్లాడిని ప్రేమిస్తున్నారని, బాగా చూసుకుంటున్నారని అర్థమౌతుంది. అదేవిధంగా, మన ప్రేమగల తండ్రైన యెహోవా మనం శుభ్రంగా ఉండాలనీ మన ఆలోచనల్లో, మాటల్లో, పనుల్లో కూడా పవిత్రంగా ఉండాలనీ కోరుకుంటున్నాడు. మనం అలా శుభ్రంగా, పవిత్రంగా ఉంటే మనకు మేలు జరుగుతుంది, యెహోవాకు కూడా ఘనత వస్తుంది.

1. మనం ఎలా శుభ్రంగా ఉండవచ్చు?

యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు పవిత్రులుగా ఉండాలి.” (1 పేతురు 1:16) పవిత్రంగా ఉండడం అంటే శరీరాన్ని అలాగే మనసును శుభ్రంగా ఉంచుకోవడం అని అర్థం. మనం స్నానం చేయడం ద్వారా మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం. అంతేకాదు మనం మన బట్టల్ని, ఇంటిని, వాహనాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం. మనం రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడానికి కూడా సహాయం చేయవచ్చు. ఇలా మనం శుభ్రంగా ఉండడం ద్వారా యెహోవాకు ఘనత తీసుకొస్తాం.—2 కొరింథీయులు 6:3, 4.

2. పవిత్రంగా ఉండాలంటే మనం ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి?

‘శరీరానికి, మనసుకు ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకోవాలి’ అని బైబిలు ప్రోత్సహిస్తుంది. (2 కొరింథీయులు 7:1) కాబట్టి మన శరీరానికి, మనసుకు హాని చేసే ప్రతీదానికి మనం దూరంగా ఉండాలి. మన ఆలోచనలు యెహోవాకు నచ్చేలా ఉండాలి, కాబట్టి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవడానికి చేయగలిగినదంతా చేస్తాం. (కీర్తన 104:34) అంతేకాదు, మనం ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడడానికి కృషి చేస్తాం.—కొలొస్సయులు 3:8 చదవండి.

మన శరీరాన్ని, మనసును ఇంకా ఎలా శుభ్రంగా ఉంచుకోవచ్చు? పొగాకు, వక్క, గుట్కా, డ్రగ్స్‌ వంటివి మన శరీరానికి హాని చేస్తాయి. అలాంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, జీవం అనే బహుమతిని గౌరవిస్తున్నామని చూపిస్తాం. అంతేకాదు హస్తప్రయోగం, పోర్నోగ్రఫీ a వంటి అపవిత్రమైన అలవాట్లకు దూరంగా ఉండడానికి కృషి చేయడం ద్వారా మన మనసును శుభ్రంగా ఉంచుకుంటాం. (కీర్తన 119:37; ఎఫెసీయులు 5:5) ఇలాంటి అలవాట్ల నుండి బయటపడడం కష్టమే, కానీ యెహోవా మనకు సహాయం చేస్తాడు.—యెషయా 41:13 చదవండి.

ఎక్కువ తెలుసుకోండి

మనం శుభ్రంగా ఉంటే యెహోవాకు ఎలా ఘనత వస్తుందో తెలుసుకోండి. అపవిత్రమైన అలవాట్లతో పోరాడి ఎలా గెలవవచ్చో పరిశీలించండి.

3. మనం శుభ్రంగా ఉంటే యెహోవాకు ఘనత వస్తుంది

ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞల్ని పరిశీలిస్తే, శుభ్రంగా ఉండే విషయంలో ఆయన అభిప్రాయం ఏంటో తెలుస్తుంది. నిర్గమకాండం 19:10; 30:17-19 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఈ వచనాల ప్రకారం, శుభ్రంగా ఉండే విషయంలో యెహోవా అభిప్రాయం ఏంటి?

  • శుభ్రంగా ఉండడానికి ఏ మంచి అలవాట్లు మీకు సహాయం చేస్తాయి?

శుభ్రంగా ఉండాలంటే సమయం, కృషి అవసరం. అయితే మనం ఏ ప్రాంతంలో ఉంటున్నా, డబ్బున్న వాళ్లమైనా-పేదవాళ్లమైనా శుభ్రంగా ఉండవచ్చు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • మన వస్తువుల్ని శుభ్రంగా ఉంచుకున్నప్పుడు, మనం చేసే పరిచర్యకు ఎలా గౌరవం వస్తుంది?

4. చెడు అలవాట్లను విడిచిపెట్టండి

ఎలాంటి చెడు అలవాటునైనా మానుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడు

మీకు పొగతాగే లేదా డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉంటే, దాన్ని మానుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసు. మరి దాన్ని ఎలా మానుకోవచ్చు? ఆ అలవాటు ఎంత హాని చేస్తుందో పరిశీలించండి. మత్తయి 22:37-39 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి: పొగ తాగడం లేదా డ్రగ్స్‌ తీసుకోవడం . . .

  • ఒక వ్యక్తికి యెహోవాతో ఉన్న స్నేహాన్ని ఎలా పాడుచేస్తుంది?

  • అతని కుటుంబానికి, అతని చుట్టూ ఉన్నవాళ్లకు ఎలా హాని చేస్తుంది?

మీకు ఏదైనా చెడు అలవాటు ఉంటే, దాన్నుండి బయటపడడానికి ఏం చేయవచ్చో ఆలోచించండి. b వీడియో చూడండి.

ఫిలిప్పీయులు 4:13 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • క్రమంగా ప్రార్థించడం, బైబిలు చదవడం, మీటింగ్స్‌కి హాజరవడం ఏదైనా ఒక చెడు అలవాటును మానుకోవడానికి ఎలా సహాయం చేస్తాయి?

5. అపవిత్రమైన ఆలోచనలతో, అలవాట్లతో పోరాడండి

కొలొస్సయులు 3:5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • పోర్నోగ్రఫీ, సెక్స్‌టింగ్‌, c హస్తప్రయోగం వంటివి యెహోవా దృష్టిలో అపవిత్రమైనవి అని మనకెలా తెలుసు?

  • మనం పవిత్రంగా ఉండాలని యెహోవా కోరుకోవడం సరైనదే అంటారా? ఎందుకు?

అపవిత్రమైన ఆలోచనలతో ఎలా పోరాడాలో తెలుసుకోండి. వీడియో చూడండి.

మనం పవిత్రంగా ఉండడానికి ఎంతగా కృషి చేయాలో, యేసు ఒక ఉదాహరణ ఉపయోగించి చెప్పాడు. మత్తయి 5:29, 30 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఇక్కడ యేసు నిజంగా మనకు మనం హాని చేసుకోవాలని చెప్పట్లేదు గానీ, మనం చర్య తీసుకోవాలని చెప్తున్నాడు. అపవిత్రమైన ఆలోచనలకు దూరంగా ఉండడానికి ఒక వ్యక్తి ఎలాంటి చర్య తీసుకోవాలి? d

ఒకవేళ మీరు అపవిత్రమైన ఆలోచనలతో పోరాడుతుంటే, మీరు చేసే కృషిని యెహోవా విలువైనదిగా చూస్తాడు. కీర్తన 103:13, 14 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మీరు ఏదైనా అపవిత్రమైన అలవాటుతో పోరాడుతుంటే, మీ పోరాటాన్ని ఆపకుండా ఉండడానికి ఈ లేఖనం ఎలా సహాయం చేస్తుంది?

ఒకసారి పడిపోయినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు!

‘నేను మళ్లీ తప్పు చేశాను, ఇక నేను ప్రయత్నించడం అనవసరం’ అని మీకు అనిపించవచ్చు. కానీ దీని గురించి ఆలోచించండి: పరుగుపందెంలో పరుగెత్తే ఒక వ్యక్తి ఏదైనా తగిలి కింద పడిపోయినంత మాత్రాన అతను పందెంలో ఓడిపోయాడనీ కాదు, మళ్లీ మొదటినుండి పరుగెత్తాలనీ కాదు. అదేవిధంగా, చెడు అలవాటు మానుకోవడానికి మీరు చేస్తున్న పోరాటంలో ఒకసారి పడిపోయినంత మాత్రాన మీరు ఓడిపోయినట్టు కాదు. అలాగే, ఇప్పటివరకు మీరు చేసిన ప్రయత్నమంతా వృథా అయిపోయినట్టు కాదు. గెలుపును చేరుకునే దారిలో అప్పుడప్పుడు పడిపోవడం సహజమే. కాబట్టి మధ్యలో ఆపేయకండి! యెహోవా సహాయంతో మీరు గెలవవచ్చు.

కొంతమంది ఇలా అంటారు: “నేను ఈ అలవాటుకు బానిసైపోయాను. దీన్ని మానుకోవడం నా వల్ల కాదు.”

  • యెహోవా సహాయంతో ఆ వ్యక్తి తన చెడు అలవాటును మానుకోవచ్చు అని చెప్పడానికి మీరు ఏ లేఖనం చూపిస్తారు?

ఒక్కమాటలో

మన శరీరాన్ని, మనసును, ప్రవర్తనను పవిత్రంగా ఉంచుకోవడం ద్వారా యెహోవాను సంతోషపెడతాం.

మీరేం నేర్చుకున్నారు?

  • మనం శుభ్రంగా, పవిత్రంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

  • మీరు ఎలా శుభ్రంగా ఉండవచ్చు?

  • మీ ఆలోచనల్ని, ప్రవర్తనను ఎలా పవిత్రంగా ఉంచుకోవచ్చు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

మన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినా శుభ్రంగా ఉండడానికి ఎలాంటి చిన్నచిన్న విషయాలు సహాయం చేస్తాయో చూడండి.

ఆరోగ్యం, పరిశుభ్రత—చేతులు కడుక్కోవడం (3:01)

పొగతాగే అలవాటును మానుకోవడానికి సహాయం చేసే కొన్ని మంచి సలహాలు చదవండి.

“సిగరెట్‌ తాగే అలవాటును ఎలా మానుకోవచ్చు?” (తేజరిల్లు! ఆర్టికల్‌)

పోర్నోగ్రఫీ వల్ల వచ్చే నష్టాల గురించి చదవండి.

“పోర్నోగ్రఫీ—ప్రమాదకరమైనదా, కాదా?” (కావలికోట ఆర్టికల్‌)

అశ్లీల చిత్రాలు చూసే అలవాటు నుండి ఒక వ్యక్తి ఎలా బయటపడ్డాడో తెలుసుకోండి.

“గెలిచే ముందు నేను చాలాసార్లు ఓడిపోయాను” (కావలికోట, నం. 4 2016)

a పోర్నోగ్రఫీ అంటే, లైంగికంగా రెచ్చగొట్టడానికి తయారుచేసిన వీడియోలు, చిత్రాలు, మెసేజ్‌లు, ఆడియోలు.

b ఈ పాఠంలో “ఇవి కూడా చూడండి” కింద ఇచ్చిన “సిగరెట్‌ తాగే అలవాటును ఎలా మానుకోవచ్చు?” అనే దానిలో, చెడు అలవాట్లను మానుకోవడానికి సహాయం చేసే మంచి సలహాలు ఉన్నాయి.

c సెక్స్‌టింగ్‌ అంటే, ఫోన్‌ లేదా కంప్యూటర్‌ ద్వారా అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు పంపించడం.

d హస్తప్రయోగం అలవాటు నుండి బయటపడడానికి, యువత అడిగే ప్రశ్నలు—మంచి సలహాలు, 1వ సంపుటిలోని “హస్తప్రయోగం అలవాటును ఎలా మానుకోవచ్చు?” అనే ఆర్టికల్‌ చదవండి.