కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

41వ పాఠం

సెక్స్‌ గురించి బైబిలు ఏం చెప్తుంది?

సెక్స్‌ గురించి బైబిలు ఏం చెప్తుంది?

సెక్స్‌ గురించి మాట్లాడడానికి చాలామంది ఇబ్బందిపడతారు. అయితే ఈ విషయం గురించి బైబిలు నిర్మొహమాటంగా, గౌరవపూర్వకంగా మాట్లాడుతుంది. బైబిలు చెప్పేది తెలుసుకుంటే మనం ప్రయోజనం పొందుతాం. ఎందుకంటే, బైబిల్లో ఉన్నవి మన సృష్టికర్త అయిన యెహోవా మాటలు. మనకు ఏది మంచిదో ఆయనకు బాగా తెలుసు. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా జీవించవచ్చో, తనను ఎలా సంతోషపెట్టవచ్చో ఆయన చెప్తున్నాడు.

1. ఈ విషయం గురించి యెహోవా ఏం చెప్తున్నాడు?

సెక్స్‌ అనేది భార్యాభర్తలకు యెహోవా ఇచ్చిన బహుమతి. వాళ్లు దాన్ని ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ బహుమతి వల్ల భార్యాభర్తలు పిల్లల్ని కనగలుగుతారు. అంతేకాదు, ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు చూపించుకుంటూ సంతోషించగలుగుతారు. అందుకే, బైబిలు ఇలా చెప్తుంది: “నీ యౌవనకాల భార్యతో నువ్వు సంతోషించాలి.” (సామెతలు 5:18, 19) పెళ్లయిన క్రైస్తవులు తమ వివాహజతకు నమ్మకంగా ఉండాలని, అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదని యెహోవా కోరుకుంటున్నాడు.—హెబ్రీయులు 13:4 చదవండి.

2. లైంగిక పాపం అంటే ఏంటి?

“లైంగిక పాపం చేసేవాళ్లు . . . దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు” అని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 6:9, 10) లైంగిక పాపం అనే మాట పోర్నియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. (1) భార్యాభర్తలుకాని వాళ్ల మధ్య సెక్స్‌, a (2) మగవాళ్లు-మగవాళ్లు, ఆడవాళ్లు-ఆడవాళ్ల మధ్య సెక్స్‌, (3) జంతువులతో చేసే సెక్స్‌ వంటివి లైంగిక పాపం కిందికి వస్తాయి. ‘లైంగిక పాపానికి దూరంగా ఉన్నప్పుడు’ యెహోవాను సంతోషపెడతాం, మనం కూడా ప్రయోజనం పొందుతాం.—1 థెస్సలొనీకయులు 4:3.

ఎక్కువ తెలుసుకోండి

లైంగిక పాపానికి ఎలా దూరంగా ఉండవచ్చో, అలా ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో తెలుసుకోండి.

3. లైంగిక పాపానికి దూరంగా పారిపోండి

బైబిల్లో ఉన్న యోసేపు అనే వ్యక్తి పవిత్రంగా ఉండడానికి ఎంతో కృషి చేశాడు. ఆదికాండం 39:1-12 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యోసేపు ఎందుకు పారిపోయాడు?​—9వ వచనం చూడండి.

  • యోసేపు చేసిన పని సరైనదే అంటారా? ఎందుకు?

యోసేపులాగే, నేడు యౌవనులు కూడా లైంగిక పాపానికి ఎలా దూరంగా పారిపోవచ్చు? వీడియో చూడండి.

మనందరం లైంగిక పాపానికి దూరంగా పారిపోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. 1 కొరింథీయులు 6:18 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో లైంగిక పాపం చేసే ప్రమాదం ఉంది?

  • మీరు లైంగిక పాపానికి ఎలా దూరంగా పారిపోవచ్చు?

4. తప్పు చేయాలనే ఒత్తిడిని మీరు ఎదిరించగలరు

లైంగిక పాపం చేయాలనే ఒత్తిడిని ఎదిరించడం ఎప్పుడు కష్టంగా ఉండవచ్చు? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • తన ఆలోచనలు, పనులు తప్పు చేసేలా నడిపించవచ్చని గుర్తించినప్పుడు వీడియోలో ఉన్న సహోదరుడు ఏం చేశాడు?

నమ్మకమైన క్రైస్తవులు కూడా కొన్నిసార్లు తమ ఆలోచనల్ని పవిత్రంగా ఉంచుకోవడానికి పోరాడాల్సి వస్తుంది. తప్పుడు ఆలోచనల్లో మునిగిపోకుండా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది? ఫిలిప్పీయులు 4:8 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మనం ఎలాంటి విషయాల గురించి ఆలోచించాలి?

  • బైబిలు చదవడం, యెహోవా సేవలో బిజీగా ఉండడం తప్పు చేయాలనే ఒత్తిడిని ఎదిరించడానికి ఎలా సహాయం చేస్తాయి?

5. యెహోవా చెప్పేవన్నీ మన మంచికే

మనకు ఏది మంచిదో యెహోవాకు బాగా తెలుసు. మనం ఎలా పవిత్రంగా ఉండవచ్చో, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో ఆయన చెప్తున్నాడు. సామెతలు 7:7-27 చదవండి లేదా వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • ఒక యువకుడు తప్పు చేయాలనిపించే పరిస్థితుల వైపు ఎలా అడుగులు వేశాడు?—సామెతలు 7:8, 9 చూడండి.

  • సామెతలు 7:23, 26 చెప్తున్నట్టు, లైంగిక పాపం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి. పవిత్రంగా ఉండడం వల్ల మనం ఎలాంటి సమస్యలు తప్పించుకోవచ్చు?

  • మనం ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలంటే, మన ప్రవర్తన పవిత్రంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

మగవాళ్లు-మగవాళ్లు, ఆడవాళ్లు-ఆడవాళ్ల మధ్య సెక్స్‌ తప్పని బైబిలు చెప్పడం మరీ కఠినంగా ఉందని కొంతమంది అంటారు. కానీ ప్రేమగల దేవుడైన యెహోవా, ప్రతీఒక్కరు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఆ జీవితం పొందాలంటే, మనం యెహోవా చెప్పేవి పాటించాలి. 1 కొరింథీయులు 6:9-11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • దేవుని దృష్టిలో, స్వలింగ సంపర్కం మాత్రమే తప్పా?

దేవుణ్ణి సంతోషపెట్టాలంటే, మనందరం మార్పులు చేసుకోవడానికి కృషి చేయాలి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? కీర్తన 19:8, 11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యెహోవా చెప్పేవన్నీ మన మంచికే అని మీకు అనిపిస్తుందా? ఎందుకు?

తన నియమాల్ని, సూత్రాల్ని పాటించేలా యెహోవా ఎంతోమందికి సహాయం చేశాడు. ఆయన మీకు కూడా సహాయం చేయగలడు

కొంతమంది ఇలా అంటారు: “ఒకరినొకరు ఇష్టపడుతున్న ఏ ఇద్దరైనా సెక్స్‌లో పాల్గొనవచ్చు, అందులో తప్పేం లేదు.”

  • ఎవరైనా అలా అంటే మీరేం చెప్తారు?

ఒక్కమాటలో

సెక్స్‌ అనేది భార్యాభర్తలు ఆనందించడానికి యెహోవా ఇచ్చిన బహుమతి.

మీరేం నేర్చుకున్నారు?

  • లైంగిక పాపం అంటే ఏంటి?

  • లైంగిక పాపానికి దూరంగా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

  • యెహోవా చెప్పేవి పాటించడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించవచ్చా? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోండి.

“పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం గురించి బైబిలు ఏం చెప్తుంది?” (jw.org ఆర్టికల్‌)

మగవాళ్లు-మగవాళ్లు, ఆడవాళ్లు-ఆడవాళ్ల మధ్య సెక్స్‌ తప్పు అని బైబిలు చెప్తుందంటే, దానర్థం మనం అలాంటి వాళ్లను ద్వేషించాలని కాదు. ఎందుకో తెలుసుకోండి.

“హోమోసెక్సువాలిటీ తప్పా?” (jw.org ఆర్టికల్‌)

సెక్స్‌ విషయంలో దేవుడు ఇచ్చిన నియమాలు మనల్ని ఎలా కాపాడతాయో తెలుసుకోండి.

“ఓరల్‌ సెక్స్‌ నిజంగా ఓ రకమైన సెక్స్‌ ఏనా?” (jw.org ఆర్టికల్‌)

మగవాళ్లతో సంబంధం పెట్టుకున్న ఒకతను, దేవునికి నచ్చినట్టు తన జీవితాన్ని మార్చుకున్నాడు. కారణమేంటో, “వాళ్లు నాకు మర్యాద ఇచ్చారు” అనే అనుభవంలో చదవండి.

“బైబిలు జీవితాల్ని మారుస్తుంది” (కావలికోట ఆర్టికల్‌)

a అది శారీరకంగా కలవడం కావచ్చు, ఓరల్‌ సెక్స్‌ కావచ్చు, ఆనల్‌ సెక్స్‌ కావచ్చు, వేరే వ్యక్తి మర్మాంగాలను నిమరడం కావచ్చు.