కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

42వ పాఠం

పెళ్లి గురించి బైబిలు ఏం చెప్తుంది?

పెళ్లి గురించి బైబిలు ఏం చెప్తుంది?

కొన్ని సంస్కృతుల్లో, ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటాడని ప్రజలు అనుకుంటారు. అదే నిజమైతే పెళ్లయిన వాళ్లందరూ సంతోషంగా ఉండాలి, పెళ్లికాని వాళ్లందరూ బాధగా ఉండాలి. కానీ అలా లేరు కదా. నిజానికి పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం రెండూ బహుమానాలే అని బైబిలు చెప్తుంది.

1. పెళ్లి చేసుకోకపోవడం వల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏంటి?

బైబిలు ఇలా చెప్తుంది: ‘పెళ్లి చేసుకునేవాళ్లకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి, కానీ పెళ్లి చేసుకోనివాళ్లకు ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.’ (1 కొరింథీయులు 7:32, 33, 38 చదవండి.) పెళ్లి చేసుకోనివాళ్లకు “ఇంకా ఎక్కువ ప్రయోజనాలు” ఉన్నాయి అని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, వాళ్లకు పెళ్లితో వచ్చే బాధ్యతలేవీ ఉండవు. దానివల్ల, వాళ్లకు సాధారణంగా ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఉదాహరణకు, కొంతమంది వేరే ప్రాంతానికి వెళ్లి మంచివార్త ప్రకటించడం లాంటివి చేస్తూ, యెహోవా సేవను ఎక్కువ చేయగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవాకు దగ్గరవ్వడానికి వాళ్లకు ఎక్కువ సమయం ఉంటుంది.

2. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏంటి?

పెళ్లి చేసుకునేవాళ్లకు కూడా ప్రయోజనాలు ఉన్నాయి. బైబిలు ఇలా చెప్తుంది: “ఒక్కరి కన్నా ఇద్దరు ఉండడం మంచిది.” (ప్రసంగి 4:9) ముఖ్యంగా, వివాహ జీవితంలో బైబిలు సూత్రాలు పాటించే క్రైస్తవుల విషయంలో ఆ మాట నిజం. చట్టబద్ధంగా పెళ్లి చేసుకునే దంపతులు ఒకరినొకరం ప్రేమించుకుంటామని, గౌరవించుకుంటామని, బాగా చూసుకుంటామని మాటిస్తారు. దానివల్ల వాళ్లు, వాళ్లకు పుట్టబోయే పిల్లలు ఒక భరోసాతో, ధైర్యంతో ఉంటారు. కానీ పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేవాళ్లు అలా ఉండలేరు.

3. పెళ్లి గురించి యెహోవా ఏం చెప్తున్నాడు?

మొదటి పురుషునికి, స్త్రీకి పెళ్లి చేసినప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి, తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు.” (ఆదికాండం 2:24) భార్యాభర్తలు బ్రతికి ఉన్నంతకాలం ఒకరినొకరు ప్రేమించుకోవాలని, అంటిపెట్టుకొని ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. అక్రమ సంబంధం అనే ఒకే ఒక్క కారణంతో మాత్రమే యెహోవా విడాకుల్ని అనుమతిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో విడాకులు ఇవ్వాలో వద్దో నిర్ణయించుకునే హక్కు, తప్పు చేయని వివాహజతకు ఉంటుంది. a (మత్తయి 19:9) ఒక క్రైస్తవుడికి ఒకే భార్య ఉండాలని, ఒక క్రైస్తవ స్త్రీకి ఒకే భర్త ఉండాలని యెహోవా చెప్తున్నాడు.—1 తిమోతి 3:2.

ఎక్కువ తెలుసుకోండి

మీరు పెళ్లి చేసుకున్న వాళ్లయినా, పెళ్లి చేసుకోని వాళ్లయినా ఎలా సంతోషంగా ఉండవచ్చో, యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చో తెలుసుకోండి.

4. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడం అనే బహుమానాన్ని చక్కగా ఉపయోగించుకోండి

పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడాన్ని యేసు ఒక బహుమానంలా చూశాడు. (మత్తయి 19:11, 12) మత్తయి 4:23 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడం అనే బహుమానాన్ని యేసు తన తండ్రికి సేవ చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి ఎలా ఉపయోగించాడు?

యేసులాగే క్రైస్తవులు కూడా తమ ఒంటరి జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • పెళ్లికాని క్రైస్తవులు తమ ఒంటరి జీవితాన్ని ఎలా చక్కగా ఉపయోగించవచ్చు?

మీకు తెలుసా?

పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎంత వయసు రావాలో బైబిలు చెప్పట్లేదు. అయితే, ఒక వ్యక్తి “యౌవనప్రాయం” దాటిపోయే వరకు వేచి ఉండడం మంచిదని బైబిలు చెప్తుంది. యౌవనప్రాయంలో లైంగిక కోరికలు బలంగా ఉంటాయి కాబట్టి, ఆ వ్యక్తి తెలివైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు.—1 కొరింథీయులు 7:36.

5. ఎవర్ని పెళ్లి చేసుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించుకోండి

ఎవర్ని పెళ్లి చేసుకోవాలి అనేది మీరు తీసుకునే అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. మత్తయి 19:4-6, 9 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఒక క్రైస్తవుడు పెళ్లి విషయంలో ఎందుకు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు?

పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో ఎలాంటి లక్షణాల్ని చూడాలో బైబిలు మనకు చెప్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూడాల్సింది, ఆ వ్యక్తికి యెహోవా మీద ప్రేమ ఉందా లేదా అన్నదే. b 1 కొరింథీయులు 7:39; 2 కొరింథీయులు 6:14 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మనం ఎందుకు తోటి క్రైస్తవుల్నే పెళ్లి చేసుకోవాలి?

  • యెహోవాను ప్రేమించని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆయనకు ఎలా అనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు?

భిన్నమైన రెండు జంతువులకు కాడి కడితే, అవి ఇబ్బందిపడతాయి. అలాగే, ఒక క్రైస్తవుడు యెహోవాను ప్రేమించని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి

6. వివాహబంధాన్ని యెహోవా చూసినట్టే చూడండి

ప్రాచీన ఇశ్రాయేలులో, కొంతమంది పురుషులు చిన్నచిన్న కారణాలకే భార్యలకు విడాకులు ఇచ్చారు. మలాకీ 2:13, 14, 16 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • అక్రమ సంబంధం అనే కారణం కాకుండా వేరే కారణాల్ని బట్టి విడాకులు ఇవ్వడాన్ని యెహోవా ఎందుకు అసహ్యించుకుంటాడు?

అక్రమ సంబంధం అలాగే విడాకులు తప్పు చేయని వివాహజతకు, పిల్లలకు ఎంతో బాధ కలిగిస్తాయి

వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • ఒకవేళ మీకు యెహోవాను ప్రేమించని వ్యక్తితో పెళ్లయి ఉంటే, మీ వివాహ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి మీరు ఏం చేయవచ్చు?

7. పెళ్లి విషయంలో యెహోవా నియమాల్ని, సూత్రాల్ని పాటించండి

పెళ్లి విషయంలో యెహోవా నియమాల్ని, సూత్రాల్ని పాటించడానికి ఒక వ్యక్తి చాలా కృషి చేయాల్సి రావచ్చు. c కానీ, అలా కృషి చేసేవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు. వీడియో చూడండి.

హెబ్రీయులు 13:4 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • పెళ్లి విషయంలో యెహోవా ఇచ్చిన నియమాల్ని, సూత్రాల్ని పాటించడం సాధ్యమే అని మీకు అనిపిస్తుందా? ఎందుకు?

క్రైస్తవులు తమ పెళ్లిని, విడాకుల్ని చట్టబద్ధం చేసుకోవాలని యెహోవా కోరుతున్నాడు. ఎందుకంటే, అలా చట్టబద్ధం చేసుకోవాలని చాలా దేశాల్లో ప్రభుత్వాలు చెప్తున్నాయి. తీతు 3:1 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఒకవేళ మీకు పెళ్లయి ఉంటే, మీ పెళ్లి చట్టబద్ధమైనదేనా, దానికి ప్రభుత్వ గుర్తింపు ఉందా?

కొంతమంది ఇలా అడుగుతారు: “పెళ్లి చేసుకోకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తే తప్పేంటి?”

  • మీరేం చెప్తారు?

ఒక్కమాటలో

పెళ్లి, ఒంటరి జీవితం రెండూ యెహోవా ఇచ్చిన బహుమానాలే. యెహోవా చెప్పినట్టు జీవిస్తే పెళ్లి చేసుకున్నవాళ్లు, చేసుకోనివాళ్లు ఆనందంగా, సంతృప్తిగా ఉండవచ్చు.

మీరేం నేర్చుకున్నారు?

  • పెళ్లి చేసుకోనివాళ్లు తమ ఒంటరి జీవితాన్ని ఎలా చక్కగా ఉపయోగించుకోవచ్చు?

  • తోటి క్రైస్తవుల్నే పెళ్లి చేసుకోవాలని బైబిలు ఎందుకు చెప్తుంది?

  • బైబిలు ప్రకారం, విడాకులు తీసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క కారణం ఏంటి?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

“ప్రభువును అనుసరించే వ్యక్తినే” పెళ్లి చేసుకోవడం అంటే ఏంటి?

“పాఠకుల ప్రశ్నలు” (కావలికోట, జూలై 1, 2004)

డేటింగ్‌ గురించి, పెళ్లి గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేసే రెండు భాగాల వీడియోను చూడండి.

పెళ్లి కోసం సిద్ధపడడం (11:53)

తాను వదులుకున్న వాటికన్నా యెహోవా ఇచ్చినవి ఎంతో విలువైనవని ఒక సహోదరుడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసుకోండి.

ఆమె సత్యం నేర్చుకుంటుందని నేను ఆశపడ్డాను (1:56)

విడాకుల గురించి, విడిపోవడం గురించి ఆలోచించేవాళ్లు ఏ విషయాల్ని మనసులో ఉంచుకోవాలి?

“దేవుడు చేసిన వివాహ ఏర్పాటును గౌరవించండి” (కావలికోట, డిసెంబరు 2018)

a వివాహజత అక్రమ సంబంధం పెట్టుకోకపోయినా, కొంతమంది విడిపోయి వేరుగా ఉంటారు. దాని గురించి తెలుసుకోవడానికి, అదనపు సమాచారంలో 4వ పాయింట్‌ చూడండి.

b కొన్ని సంస్కృతుల్లో, తల్లిదండ్రులే తమ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తారు. అలాంటప్పుడు, ప్రేమగల తల్లిదండ్రులు మొదట చూసేది ఆ వ్యక్తి ఆస్తి-అంతస్తుల్ని కాదుగానీ, ఆ వ్యక్తికి యెహోవా మీద ప్రేమ ఉందా లేదా అన్నదే.

c ఒకవేళ మీరు పెళ్లి కాకుండానే వేరే వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లయితే, ఆ వ్యక్తిని విడిచిపెట్టాలా లేక పెళ్లి చేసుకోవాలా అనేది మీ వ్యక్తిగత నిర్ణయం.