కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

48వ పాఠం

స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి

స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి

మంచి స్నేహితులు మన సంతోషాలే కాదు, కష్టాలు కూడా పంచుకుంటారు. అయితే, ప్రతీఒక్కరు మంచి స్నేహితులు అవ్వలేరని బైబిలు మనల్ని హెచ్చరిస్తుంది. మరి మీరు ఎలా మంచి స్నేహితుల్ని ఎంచుకోవచ్చు? ఈ పాఠంలో దాని గురించి చూస్తాం.

1. మీరు ఎంచుకునే స్నేహితులు మీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తారు?

మనం నేరుగా గానీ, సోషల్‌ మీడియా ద్వారా గానీ ఎవరితోనైతే ఎక్కువ సమయం గడుపుతామో వాళ్లలా తయారౌతాం. అది మంచిగా అయినా కావచ్చు, చెడ్డగా అయినా కావచ్చు. బైబిలు చెప్తున్నట్టు, “తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు, మూర్ఖులతో [అంటే, దేవుణ్ణి ప్రేమించని వాళ్లతో] సహవాసం చేసేవాడు చెడిపోతాడు.” (సామెతలు 13:20) యెహోవాను ప్రేమించే, ఆరాధించే స్నేహితులు మనం ఆయనకు ఇంకా దగ్గరయ్యేలా, మంచి నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేస్తారు. కానీ, యెహోవాను ప్రేమించని స్నేహితులు మనల్ని ఆయన నుండి దూరం చేసే ప్రమాదం ఉంది. అందుకే, స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోమని బైబిలు ప్రోత్సహిస్తుంది. దేవుణ్ణి ప్రేమించే వాళ్లతో స్నేహం చేసినప్పుడు మనం ప్రయోజనం పొందుతాం, వాళ్లూ ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే, మనం ‘ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ, బలపర్చుకుంటూ ఉంటాం.’—1 థెస్సలొనీకయులు 5:11.

2. మనం మంచివాళ్లతో స్నేహం చేస్తే యెహోవాకు ఎలా అనిపిస్తుంది? చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే ఎలా అనిపిస్తుంది?

యెహోవా తన స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకుంటాడు. “నిజాయితీపరులకు ఆయన దగ్గరి స్నేహితుడు.” (సామెతలు 3:32) మనం యెహోవాను ప్రేమించని వాళ్లతో స్నేహం చేస్తే ఆయనకు ఎలా అనిపిస్తుంది? ఆయన చాలా బాధపడతాడు! (యాకోబు 4:4 చదవండి.) కానీ, మనం యెహోవాను ప్రేమించే వాళ్లతో స్నేహం చేస్తే ఆయన సంతోషిస్తాడు. అంతేకాదు, మనం చెడు సహవాసాలకు దూరంగా ఉంటూ యెహోవాకు దగ్గరైతే, ఆయన మనల్ని స్నేహితులుగా చేసుకుంటాడు.—కీర్తన 15:1-4.

ఎక్కువ తెలుసుకోండి

స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో, మీకు నిజంగా మేలు చేసే స్నేహితుల్ని మీరు ఎలా సంపాదించుకోవచ్చో పరిశీలించండి.

3. చెడు సహవాసులతో జాగ్రత్త!

చెడు సహవాసులు అంటే యెహోవాను, ఆయన నియమాల్ని-సూత్రాల్ని ప్రేమించని ప్రజలు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • మనం ఎలా తెలియకుండానే చెడ్డవాళ్లతో సహవాసం చేసే ప్రమాదం ఉంది?

1 కొరింథీయులు 15:33 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మీ విషయానికొస్తే, ఎలాంటివాళ్లు చెడు సహవాసులుగా ఉండే అవకాశం ఉంది? ఎందుకు?

కీర్తన 119:63 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మీరు ఎలాంటివాళ్లతో స్నేహం చేయాలి?

కుళ్లిపోయిన ఒక్క పండు వల్ల మిగతా పండ్లు పాడైపోవచ్చు. ఒక్క చెడ్డ స్నేహితుని వల్ల మీకేం జరగవచ్చు?

4. స్నేహానికి వయసు, భాష, జాతి అడ్డురావు

ప్రాచీన ఇశ్రాయేలులో జీవించిన దావీదు, యోనాతాను అనే ఇద్దరు వ్యక్తుల గురించి బైబిలు మాట్లాడుతుంది. యోనాతాను దావీదు కన్నా వయసులో చాలా పెద్దవాడు, పైగా రాజు కొడుకు. అయినా, వాళ్లిద్దరు ప్రాణ స్నేహితులు అయ్యారు. 1 సమూయేలు 18:1 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • స్నేహానికి వయసుతో లేదా స్థాయితో సంబంధం లేదని ఈ లేఖనం ఎలా చూపిస్తుంది?

రోమీయులు 1:11, 12 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యెహోవాను ప్రేమించే స్నేహితులు ఒకరినొకరు ఎలా ప్రోత్సహించుకోవచ్చు?

ఈ వీడియోలో, ఒక యువ సహోదరుడికి ఊహించని చోట్ల స్నేహితులు ఎలా దొరికారో చూడండి. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • అఖిల్‌ తన స్కూల్లో ఉన్న పిల్లలతో స్నేహం చేస్తుంటే, వాళ్ల అమ్మానాన్న ఎందుకు కంగారుపడ్డారు?

  • అఖిల్‌కు మొదట్లో వాళ్లు మంచి స్నేహితుల్లానే ఎందుకు కనిపించారు?

  • అఖిల్‌ తన ఒంటరితనాన్ని ఎలా దూరం చేసుకోగలిగాడు?

5. మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవచ్చు?

నిజమైన స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవచ్చో, మీరు ఎలా నిజమైన స్నేహితులుగా ఉండవచ్చో పరిశీలించండి. వీడియో చూడండి.

సామెతలు 18:24; 27:17 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • నిజమైన స్నేహితులు ఎలా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు?

  • ఈ వచనాల్లో చెప్పినలాంటి మంచి స్నేహితులు మీకు ఉన్నారా? ఒకవేళ లేకపోతే, వాళ్లను సంపాదించుకోవడానికి మీరేం చేయవచ్చు?

ఫిలిప్పీయులు 2:4 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మంచి స్నేహితుల్ని సంపాదించుకోవాలంటే, మీరు మంచి స్నేహితునిగా ఉండాలి. అందుకోసం మీరేం చేయవచ్చు?

మంచి స్నేహితుల్ని సంపాదించుకోవాలంటే, మీరు మంచి స్నేహితునిగా ఉండాలి

కొంతమంది ఇలా అంటారు: “అసలు స్నేహితులే లేకపోవడం కన్నా, ఎవరో ఒకరు ఉండడం మంచిది.”

  • మీరేమంటారు?

ఒక్కమాటలో

మనం స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకుంటే యెహోవాను సంతోషపెడతాం, మనం కూడా ప్రయోజనం పొందుతాం.

మీరేం నేర్చుకున్నారు?

  • మనం మంచివాళ్లతో స్నేహం చేస్తే యెహోవాకు ఎలా అనిపిస్తుంది? చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే ఎలా అనిపిస్తుంది?

  • మనం ఎలాంటి స్నేహాలకు దూరంగా ఉండాలి?

  • యెహోవాను ప్రేమించే వాళ్లకు మీరు ఎలా దగ్గరి స్నేహితులు అవ్వవచ్చు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

కష్ట సమయాల్లో మంచి స్నేహితులు మనకు ఎలా సహాయం చేస్తారో చూడండి.

“అంతం రాకముందే బలమైన స్నేహాన్ని వృద్ధిచేసుకోండి” (కావలికోట, నవంబరు 2019)

ఆన్‌లైన్‌ స్నేహాల గురించి మీరేం తెలుసుకోవాలి?

సోషల్‌ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి (4:12)

“నేను తండ్రి కోసం తపించాను” అనే అనుభవం చదివి, ఒకతను తన పాత స్నేహితుల్ని విడిచిపెట్టి కొత్త స్నేహితుల్ని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకోండి.

“బైబిలు జీవితాల్ని మారుస్తుంది” (కావలికోట, జూలై-సెప్టెంబరు 2012)