కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

51వ పాఠం

యెహోవాను సంతోషపెట్టేలా ఎలా మాట్లాడవచ్చు?

యెహోవాను సంతోషపెట్టేలా ఎలా మాట్లాడవచ్చు?

యెహోవా మనల్ని మాట్లాడే సామర్థ్యంతో సృష్టించాడు. అది ఒక అద్భుతమైన వరం. మనం దాన్ని ఎలా ఉపయోగిస్తాం అనేది యెహోవా పట్టించుకుంటాడా? ఖచ్చితంగా! (యాకోబు 1:26 చదవండి.) మరి, మనం ఈ వరాన్ని యెహోవాను సంతోషపెట్టేలా ఎలా ఉపయోగించవచ్చు?

1. మాట్లాడే వరాన్ని మనం ఎలా ఉపయోగించాలి?

“ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి” అని బైబిలు చెప్తుంది. (1 థెస్సలొనీకయులు 5:11) మీకు తెలిసినవాళ్లలో ఎవరికైనా ప్రోత్సాహం అవసరమేమో ఆలోచించండి. వాళ్లను బలపర్చడానికి మీరేం చేయవచ్చు? వాళ్లు మీకు ఎంత ముఖ్యమైనవాళ్లో చెప్పండి. బహుశా, వాళ్లలో మీకు నచ్చిన ఒక విషయాన్ని చెప్పవచ్చు. లేదా ఒక లేఖనం చూపించి బలపర్చవచ్చు. అలాంటి లేఖనాలు బైబిల్లో చాలా ఉన్నాయి. మీరు ఏం మాట్లాడుతున్నారు అనేదే కాదు, ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి. కాబట్టి ఎప్పుడూ దయగా, సౌమ్యంగా మాట్లాడడానికి కృషి చేయండి.—సామెతలు 15:1.

2. మనం ఎలా మాట్లాడకూడదు?

“మీ నోటి నుండి చెడ్డ మాట అనేదే రాకూడదు” అని బైబిలు చెప్తుంది. (ఎఫెసీయులు 4:29 చదవండి.) అంటే మనం బూతులు మాట్లాడకూడదు, ఎదుటివాళ్ల మనసు గాయపడేలా కఠినంగా, దురుసుగా మాట్లాడకూడదు. అంతేకాదు మనం పుకార్లు పుట్టించకూడదు, వాటిని వ్యాప్తి చేయకూడదు, లేనిపోనివి కల్పించి చెప్పకూడదు.—సామెతలు 16:28 చదవండి.

3. మనం వేరేవాళ్లను బలపర్చేలా మాట్లాడాలంటే ఏం చేయాలి?

సాధారణంగా మన మాటలు మన మనసులో, హృదయంలో ఏం ఉందో చెప్తాయి. (లూకా 6:45) కాబట్టి మనం మంచి విషయాల మీదే, అంటే ‘ఏవి నీతిగలవో, పవిత్రమైనవో, ప్రేమించదగినవో, పొగడదగినవో’ వాటి మీదే మనసుపెట్టాలి. (ఫిలిప్పీయులు 4:8) అందుకోసం మనం మన స్నేహితుల్ని, వినోదాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. (సామెతలు 13:20) బలపర్చేలా మాట్లాడాలంటే, ఆలోచించి మాట్లాడడం కూడా ప్రాముఖ్యం. అంటే మన మాటలు వేరేవాళ్లకు ఎలా అనిపిస్తాయో ఆలోచించాలి. బైబిలు ఇలా చెప్తుంది: “ఆలోచించకుండా మాట్లాడే మాటలు కత్తిపోట్ల లాంటివి, తెలివిగలవాళ్ల మాటలు గాయాల్ని నయం చేస్తాయి.”సామెతలు 12:18.

ఎక్కువ తెలుసుకోండి

యెహోవాను సంతోషపెట్టేలా, ఇతరుల్ని ప్రోత్సహించేలా ఎలా మాట్లాడవచ్చో తెలుసుకోండి.

4. జాగ్రత్తగా మాట్లాడండి

కొన్నిసార్లు మనం ఆలోచించకుండా ఏదోకటి అనేసి, తర్వాత బాధపడతాం. (యాకోబు 3:2) గలతీయులు 5:22, 23 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • జాగ్రత్తగా మాట్లాడడానికి సహాయం చేసే ఏ లక్షణాల కోసం మీరు ప్రార్థించవచ్చు? ఈ లక్షణాలు మీకు ఎలా సహాయం చేస్తాయి?

1 కొరింథీయులు 15:33 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మీరు ఎంచుకునే స్నేహితులు, వినోదం మీ మాటలపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?

ప్రసంగి 3:1, 7 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మౌనంగా ఉండడం, లేదా సరైన సమయం వచ్చే వరకు ఆగి మాట్లాడడం ఎలాంటి సందర్భాల్లో మంచిది?

5. ఇతరుల గురించి మంచిగా మాట్లాడండి

ఇతరుల్ని అవమానించేలా, నొప్పించేలా మాట్లాడకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • వీడియోలో ఉన్న సహోదరుడు, ఇతరుల గురించి తను మాట్లాడే విధానాన్ని ఎందుకు మార్చుకోవాలని అనుకున్నాడు?

  • అలా మార్చుకోవడానికి అతను ఏం చేశాడు?

ప్రసంగి 7:16 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఇతరుల్ని తప్పుబట్టాలని అనిపించినప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి?

ప్రసంగి 7:21, 22 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు, కోపం తెచ్చుకోకుండా ఉండడానికి ఈ వచనాలు ఎలా సహాయం చేస్తాయి?

6. మీ ఇంట్లోవాళ్లతో దయగా మాట్లాడండి

మనం మన ఇంట్లోవాళ్లతో దయగా, ప్రేమగా మాట్లాడాలని యెహోవా కోరుకుంటున్నాడు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • మీ ఇంట్లోవాళ్లతో దయగా మాట్లాడడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?

ఎఫెసీయులు 4:31, 32 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఎలా మాట్లాడితే కుటుంబంలో బంధాలు బలపడతాయి?

తన కుమారుడంటే తనకు ఎంత ఇష్టమో యెహోవా తన మాటల్లో చెప్పాడు. మత్తయి 17:5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మీ ఇంట్లోవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు, యెహోవాలాగే మీరు కూడా ఏం చేయవచ్చు?

ఇతరుల్ని మెచ్చుకునే అవకాశాల కోసం చూడండి

కొంతమంది ఇలా అంటారు: “నాకు ఏదనిపిస్తే అది అనేస్తాను. అవతలివాళ్లు ఏమనుకుంటే నాకేంటి?”

  • అది సరైనదే అంటారా? ఎందుకు?

ఒక్కమాటలో

మాటలకు చాలా శక్తి ఉంది. మనం ఏం మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.

మీరేం నేర్చుకున్నారు?

  • మీరు ఇతరుల్ని ప్రోత్సహించేలా ఎలా మాట్లాడవచ్చు?

  • మీరు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనుకుంటున్నారు?

  • ఎప్పుడూ దయగా, బలపర్చేలా మాట్లాడడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

మంచిగా, ప్రోత్సహించేలా మాట్లాడడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

తెలివిగలవాళ్ల మాటలు (8:04)

చెడ్డ మాటలు మాట్లాడకుండా ఎలా ఉండవచ్చు?

“బూతులు మాట్లాడడం నిజంగా తప్పా?” (jw.org ఆర్టికల్‌)

పుకార్లకు ఎలా దూరంగా ఉండవచ్చో చూడండి.

నేను పుకార్లను ఎలా ఆపవచ్చు? (2:36)

బూతులు మానుకోవడం కష్టంగా ఉన్న ఒకతనికి యెహోవా ఎలా సహాయం చేశాడో తెలుసుకోండి.

“నా జీవిత గమనం గురించి తీవ్రంగా ఆలోచించసాగాను” (కావలికోట, అక్టోబరు-డిసెంబరు 2013)