కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అదనపు సమాచారం

అదనపు సమాచారం
  1.  మహాబబులోను దేన్ని సూచిస్తుంది?

  2.  మెస్సీయ ఎప్పుడు కనిపిస్తాడు?

  3.  రక్తాన్ని ఉపయోగించి చేసే వైద్య విధానాలు

  4.  భార్యాభర్తలు విడిపోవడం

  5.  పండుగలు, వేడుకలు

  6.  అంటువ్యాధులు

  7.  వ్యాపారపరమైన, చట్టపరమైన విషయాలు

 1. మహాబబులోను దేన్ని సూచిస్తుంది?

“మహాబబులోను” అనే స్త్రీ, ప్రపంచమంతటా ఉన్న అబద్ధ మతాలన్నిటినీ సూచిస్తుంది. (ప్రకటన 17:5) అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఈ కారణాల్ని పరిశీలించండి:

  • ఆమె ప్రపంచమంతటా పని చేస్తోంది. ఆమె ‘ప్రజల గుంపుల’ మీద, ‘దేశాల’ మీద కూర్చుందని బైబిలు చెప్తుంది. ఆమె “భూమ్మీది రాజుల్ని పరిపాలిస్తుంది.”—ప్రకటన 17:15, 18.

  • ఆమె రాజకీయ వ్యవస్థ కాదు, వాణిజ్య వ్యవస్థ కాదు. ఎందుకంటే, ఆమె నాశనం అయినప్పుడు “భూరాజులు,” “వర్తకులు” నాశనం అవ్వకుండా మిగిలే ఉంటారు.—ప్రకటన 18:9, 15.

  • ఆమె దేవునికి చెడ్డపేరు తెస్తుంది. ఆమె డబ్బు కోసం లేదా వేరే ప్రయోజనాల కోసం ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకుంటుంది. కాబట్టి, బైబిలు ఆమెను వేశ్య అని పిలుస్తుంది. (ప్రకటన 17:1, 2) ఆమె అన్నిదేశాల ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుంది, ఎంతోమంది చావుకు కారణమౌతుంది.—ప్రకటన 18:23, 24.

తిరిగి 13వ పాఠంలో 6వ పాయింట్‌ చూడండి

 2. మెస్సీయ ఎప్పుడు కనిపిస్తాడు?

మెస్సీయ రావడానికి 69 వారాలు పడుతుందని బైబిలు ముందే చెప్పింది.—దానియేలు 9:25 చదవండి.

  • 69 వారాలు ఎప్పుడు మొదలయ్యాయి? క్రీస్తు పూర్వం 455లో మొదలయ్యాయి. ఆ సంవత్సరంలో, యెరూషలేము నగరాన్ని ‘పునరుద్ధరించి, దాన్ని మళ్లీ కట్టడానికి’ అధిపతి అయిన నెహెమ్యా అక్కడికి వచ్చాడు.—దానియేలు 9:25; నెహెమ్యా 2:1, 5-8.

  • 69 వారాలు అంటే ఎంత? కొన్ని బైబిలు ప్రవచనాల్లో ఒక రోజు అంటే ఒక సంవత్సరం అని అర్థం. (సంఖ్యాకాండం 14:34; యెహెజ్కేలు 4:6) దాని ప్రకారం చూస్తే, ఒక వారం అంటే ఏడు సంవత్సరాలు. కాబట్టి, ఈ ప్రవచనంలో 69 వారాలు అంటున్నప్పుడు 483 సంవత్సరాలు (69x7) అని అర్థం.

  • 69 వారాలు ఎప్పుడు ముగిశాయి? క్రీస్తు పూర్వం 455 నుండి మొదలుపెట్టి 483 సంవత్సరాలు లెక్కవేస్తే, క్రీస్తు శకం 29 వస్తుంది. a యేసు బాప్తిస్మం తీసుకుని, మెస్సీయ అయింది సరిగ్గా ఆ సంవత్సరంలోనే!—లూకా 3:1, 2, 21, 22.

తిరిగి 15వ పాఠంలో 5వ పాయింట్‌ చూడండి

 3. రక్తాన్ని ఉపయోగించి చేసే వైద్య విధానాలు

క్రైస్తవులమైన మనం రక్తం ఎక్కించుకోం లేదా రక్తదానం చేయం. అయితే, రోగి సొంత రక్తాన్ని ఉపయోగించి చేసే వైద్య విధానాలు ఉన్నాయి. వాటిలో కొన్ని క్రైస్తవులకు తగవు. ఉదాహరణకు, ఆపరేషన్‌కి ముందు రోగి రక్తాన్ని నిల్వ చేసి, ఆపరేషన్‌ సమయంలో అతనికి తిరిగి ఎక్కిస్తారు. అలాంటివి క్రైస్తవులు తీసుకోరు.​—ద్వితీయోపదేశకాండం 15:23.

అయితే, రోగి సొంత రక్తాన్ని ఉపయోగించి చేసే ఇంకొన్ని వైద్య విధానాలు బైబిలు నియమానికి వ్యతిరేకం కాకపోవచ్చు. ఉదాహరణకు రక్త పరీక్షలు, హీమోడయాలిసిస్‌, హీమోడైల్యూషన్‌, సెల్‌ సాల్వేజ్‌, హార్ట్‌-లంగ్‌ బైపాస్‌ మెషీన్‌ లాంటివి. ఆపరేషన్‌ గానీ, వైద్య పరీక్ష గానీ, చికిత్స గానీ చేయించుకుంటున్నప్పుడు తన రక్తాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయంలో ప్రతీ క్రైస్తవుడు సొంతగా నిర్ణయించుకోవాలి. ఈ వైద్య విధానాల్ని ఒక్కో డాక్టరు చేసే పద్ధతి, మిగతావాళ్ల కన్నా కాస్త వేరుగా ఉండవచ్చు. కాబట్టి ఏదైనా ఆపరేషన్‌ గానీ, వైద్య పరీక్ష గానీ, చికిత్స గానీ చేయించుకునే ముందు తన రక్తాన్ని ఎలా ఉపయోగిస్తారో ప్రతీ క్రైస్తవుడు వివరంగా తెలుసుకోవాలి. ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి:

  • ఒకవేళ నా శరీరం నుండి కొంత రక్తాన్ని బయటికి మళ్లిస్తున్నప్పుడు, ఆ రక్త ప్రవాహాన్ని కొద్దిసేపు ఆపేస్తే అప్పుడేంటి? ఆ రక్తం ఇంకా నాలో భాగమేనని, దాన్ని ‘నేలమీద పారబోయాల్సిన’ అవసరం లేదని నా మనస్సాక్షికి అనిపిస్తుందా?​—ద్వితీయోపదేశకాండం 12:​23, 24.

  • చికిత్స జరుగుతున్న సమయంలో, నాలో నుండి కొంత రక్తాన్ని బయటికి తీసి, దానికి మార్పులు చేసి, తిరిగి నా శరీరంలోకి ఎక్కిస్తే (లేదా నా గాయం మీద పూస్తే) బైబిలు చేత శిక్షణ పొందిన నా మనస్సాక్షి నొచ్చుకుంటుందా? లేదా నేను దానికి ఒప్పుకుంటానా?

తిరిగి 39వ పాఠంలో 3వ పాయింట్‌ చూడండి

 4. భార్యాభర్తలు విడిపోవడం

విడిపోవడం వేరు, విడాకులు వేరు. భార్యాభర్తలు విడిపోకూడదని, ఒకవేళ విడిపోతే భార్యకు గానీ, భర్తకు గానీ మళ్లీ పెళ్లి చేసుకునే హక్కు ఉండదని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (1 కొరింథీయులు 7:10, 11) అయితే కొన్ని సందర్భాల్లో, కొంతమంది క్రైస్తవులు విడిపోయి వేరుగా జీవించాలనుకుంటారు.

  •   కావాలనే కుటుంబాన్ని పోషించకపోవడం: భర్త కావాలనే కుటుంబాన్ని పోషించకుండా, వాళ్ల కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఉంటే.—1 తిమోతి 5:8.

  •   తీవ్రమైన శారీరక హింస: వివాహజత ఆరోగ్యం లేదా ప్రాణం ప్రమాదంలో పడేంతగా హింసిస్తుంటే.—గలతీయులు 5:19-21.

  •   యెహోవాతో ఉన్న సంబంధం పూర్తిగా ప్రమాదంలో పడడం: భర్త లేదా భార్య వల్ల యెహోవాను ఆరాధించడం అస్సలు వీలుకాకపోతుంటే.—అపొస్తలుల కార్యాలు 5:29.

తిరిగి 42వ పాఠంలో 3వ పాయింట్‌ చూడండి

 5. పండుగలు, వేడుకలు

క్రైస్తవులు యెహోవాకు ఇష్టంలేని పండుగల్లో పాల్గొనరు. అయితే అలాంటి పండుగలకు సంబంధించిన వేర్వేరు సందర్భాల్లో ఏం చేయాలో, ప్రతీ క్రైస్తవుడు బైబిలు చేత శిక్షణ పొందిన తన మనస్సాక్షిని బట్టి నిర్ణయించుకోవాలి. కొన్ని సందర్భాల్ని పరిశీలించండి.

  •   ఎవరైనా పండుగ శుభాకాంక్షలు చెప్పినప్పుడు: మీరు వాళ్లకు థాంక్యూ చెప్తే సరిపోతుంది. ఒకవేళ వాళ్లు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, మీరు ఆ పండుగను ఎందుకు చేసుకోరో వివరించవచ్చు.

  •   యెహోవాసాక్షికాని మీ వివాహజత, పండుగ రోజున బంధువులతో కలిసి భోజనం చేయడానికి రమ్మని అన్నప్పుడు: ఒకవేళ వెళ్లడానికి మీ మనస్సాక్షి ఒప్పుకుంటే, అక్కడ ఏమైనా అబద్ధమత ఆచారాలు జరిగితే మాత్రం, మీరు వాటిలో పాల్గొనరని మీ భర్త లేదా భార్యకు ముందే వివరించవచ్చు.

  •   మీ యజమాని పండుగ సమయంలో మీకు బోనస్‌ ఇస్తున్నప్పుడు: మీరు దాన్ని తీసుకోకూడదా? అలాగని ఏం లేదు. “యజమాని దాన్ని పండుగలో భాగంగా ఇస్తున్నాడా లేక మీ కష్టానికి ప్రతిఫలంగా ఇస్తున్నాడా?” అనే విషయాన్ని ఆలోచించండి.

  •   పండుగ సమయంలో ఎవరైనా మీకు బహుమతి ఇస్తున్నప్పుడు: వాళ్లు ఇలా అనవచ్చు: “మీరు ఈ పండుగ చేసుకోరని నాకు తెలుసు, కానీ నా సంతోషం కోసం తీసుకోండి.” వాళ్లు అందరికీ ఇస్తున్నట్టే మీకూ ఇస్తుండవచ్చు. లేక వాళ్లు మిమ్మల్ని పరీక్షించాలని లేదా మిమ్మల్ని ఏదోక విధంగా ఆ పండుగలో పాల్గొనేలా చేయాలని ఇస్తుండవచ్చు. వీటి గురించి ఆలోచించిన తర్వాత, ఆ బహుమతి తీసుకోవాలో లేదో మీరు నిర్ణయించుకోవచ్చు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా మంచి మనస్సాక్షితో ఉండాలని, యెహోవాకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటాం.—అపొస్తలుల కార్యాలు 23:1.

తిరిగి 44వ పాఠంలో 1వ పాయింట్‌ చూడండి

 6. అంటువ్యాధులు

మనం ప్రజల్ని ప్రేమిస్తాం కాబట్టి, వాళ్లకు మన నుండి అంటువ్యాధులు సోకకుండా చాలా జాగ్రత్తపడతాం. మనకు వ్యాధి సోకినా లేదా సోకిందని అనుమానం వచ్చినా, అలా జాగ్రత్తపడతాం. ఎందుకంటే, బైబిలు ఈ ఆజ్ఞ ఇస్తుంది: “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని ప్రేమించాలి.”—రోమీయులు 13:8-10.

ఈ ఆజ్ఞను మనం ఎలా పాటించవచ్చు? అంటువ్యాధి సోకిన వ్యక్తి ఇతరుల్ని కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం లాంటివి చేయకూడదు. ఎవరైనా తమ ఇంట్లోవాళ్ల క్షేమం కోసం, అతన్ని తమ ఇంటికి ఆహ్వానించకపోతే, అతను తప్పుగా అనుకోకూడదు. అలాగే, బాప్తిస్మం తీసుకోవడానికి ముందు అతను తన వ్యాధి గురించి పెద్దల సభ సమన్వయకర్తకు తెలియజేయాలి. అప్పుడు, బాప్తిస్మం తీసుకోబోయే మిగతావాళ్లకు ఆ వ్యాధి సోకకుండా పెద్దలు ఏర్పాట్లు చేయగలుగుతారు. అంటువ్యాధి సోకిందేమోనని అనుమానం ఉన్న వ్యక్తి, పెళ్లి సంబంధం ఖాయం కాకముందే స్వచ్ఛందంగా రక్త పరీక్ష చేయించుకోవాలి. ఇలా చేయడం ద్వారా, మీరు ‘మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపించిన వాళ్లౌతారు.’—ఫిలిప్పీయులు 2:4.

తిరిగి 56వ పాఠంలో 2వ పాయింట్‌ చూడండి

 7. వ్యాపారపరమైన, చట్టపరమైన విషయాలు

డబ్బు, వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలన్నీ రాసిపెట్టుకుంటే చాలా సమస్యల్ని తప్పించుకోవచ్చు. అవి తోటి క్రైస్తవుల మధ్య జరిగేవైనా సరే. (యిర్మీయా 32:9-12) అయినా కొన్నిసార్లు డబ్బు, ఇతర విషయాలకు సంబంధించి క్రైస్తవుల మధ్య చిన్నచిన్న సమస్యలు రావచ్చు. అలాంటప్పుడు వాళ్లే వాటిని త్వరగా, శాంతంగా, ఒంటరిగా పరిష్కరించుకోవాలి.

కానీ మోసం చేయడం, లేనిపోనివి కల్పించి చెప్పడం లాంటి పెద్దపెద్ద సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి? (మత్తయి 18:15-17 చదవండి.) మనం చేయాల్సిన మూడు పనుల గురించి యేసు చెప్పాడు:

  1. ముందు సమస్య ఎవరితో ఉందో ఆ వ్యక్తితోనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.—15వ వచనం చూడండి.

  2. అయినా సమస్య పరిష్కారం కాకపోతే, మీతోపాటు సంఘంలో పరిణతిగల ఒకరిద్దర్ని తీసుకెళ్లండి.—16వ వచనం చూడండి.

  3. ఇంకా సమస్య పరిష్కారం కాకపోతే, అప్పుడు మాత్రమే సంఘ పెద్దల సహాయాన్ని తీసుకోవాలి.—17వ వచనం చూడండి.

వీలైనంతవరకు, మన సహోదరుల మధ్య సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మనం కోర్టుకు వెళ్లకూడదు. ఎందుకంటే అలా చేస్తే యెహోవాకు, సంఘానికి చెడ్డపేరు రావచ్చు. (1 కొరింథీయులు 6:1-8) అయితే విడాకులు, విడాకుల తర్వాత పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, విడాకుల తర్వాత ఇచ్చే భరణం, ఇన్సూరెన్స్‌, డబ్బులు ఎగ్గొట్టడం, వీలునామాలు వంటి వాటిని కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాల్సి రావచ్చు. ఒక క్రైస్తవుడు అలాంటి విషయాల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడం కోసం కోర్టుకు వెళ్తే, అతను బైబిలు సలహాను మీరినట్టు కాదు.

మరి, ఘోరమైన నేరాల సంగతేంటి? మానభంగం, పిల్లలపై అత్యాచారం, తీవ్రంగా కొట్టడం, పెద్దపెద్ద దొంగతనాలు, హత్య వంటివాటిని ఒక క్రైస్తవుడు అధికారులకు రిపోర్టు చేయడం బైబిలు సలహాను మీరినట్టు అవ్వదు.

తిరిగి 56వ పాఠంలో 3వ పాయింట్‌ చూడండి

a క్రీస్తు పూర్వం 455 నుండి క్రీస్తు పూర్వం 1 వరకు 454 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 1 నుండి క్రీస్తు శకం 1 వరకు ఒక సంవత్సరం (సున్నా అనే సంవత్సరం లేదు). క్రీస్తు శకం 1 నుండి క్రీస్తు శకం 29 వరకు 28 సంవత్సరాలు. అంటే, మొత్తం 483 సంవత్సరాలు (454+1+28).