కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పూర్తికాల పరిచర్య—ద్వారా యెహోవాకు కృతజ్ఞతలు

పూర్తికాల పరిచర్య—ద్వారా యెహోవాకు కృతజ్ఞతలు

జీవిత కథ

పూర్తికాల పరిచర్య—ద్వారా యెహోవాకు కృతజ్ఞతలు

స్టాన్లీ ఇ. రేనాల్డ్స్‌ చెప్పినది

నేను 1910 లో ఇంగ్లాండులోని లండన్‌లో పుట్టాను. మొదటి ప్రపంచ యుద్ధానంతరం మా తల్లిదండ్రులు విల్ట్‌షైర్‌ మండలంలోని వెస్ట్‌బ్యూరీ లే అనే చిన్న గ్రామానికి తరలి వెళ్ళారు. నా చిన్నప్పుడు నేను ‘అసలు దేవుడెవరు’ అని తరచూ ఆలోచిస్తుండేవాడిని. నాకెప్పుడూ ఎవరూ చెప్పలేకపోయారు. దేవుణ్ణి ఆరాధించటానికి మా చిన్న గ్రామంలో రెండు ఛాపెల్‌లు, ఒక చర్చీ ఎందుకో నాకెన్నడూ అర్థంకాలేదు.

అది రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి నాలుగు సంవత్సరాలు ముందు, అంటే 1935వ సంవత్సరం. నేనూ మా తమ్ముడు డిక్‌ కలిసి, ఇంగ్లాండ్‌కి దక్షిణాన వేమౌత్‌ పట్టణంలో సెలవుల్ని గడపటానికి ఒక సైకిలుమీద వెళ్ళాము. టెంటులో కూర్చుని బయట కుండపోతగా కురుస్తున్న వర్షం చేస్తున్న శబ్దాన్ని వింటూ ఏం చేద్దామాని మేము ఆలోచిస్తుండగా ఒక పెద్ద మనిషి వచ్చి మూడు బైబిలు పఠన సహాయక పుస్తకాల్ని నాకు అందించాడు—ద హార్ప్‌ ఆఫ్‌ గాడ్‌, లైట్‌ I, లైట్‌ II. విసుగు నుంచి విముక్తి లభించిందని నేను వాటిని ఆనందంగా తీసుకున్నాను. నేను చదువుతున్నదాన్ని బట్టి వెంటనే అందులో పూర్తిగా నిమగ్నమైపోయాను, కానీ అది నా జీవితాన్నీ నా తమ్ముడి జీవితాన్నీ పూర్తిగా మార్చేయబోతోందని నాకప్పుడు తెలియదు.

నేనింటికి తిరిగివచ్చినప్పుడు, అదే గ్రామంలో నివసిస్తున్న కేట్‌ పార్సన్స్‌ అలాంటి బైబిలు సాహిత్యాన్నే పంపిణీ చేస్తుందని మా అమ్మ చెప్పింది. ఆమె గురించి అక్కడ అందరికీ తెలుసు, ఎందుకంటే ఆమె బాగా వృద్ధురాలైనప్పటికీ మోటర్‌సైకిల్‌ మీద దూరం దూరంగా ఉన్న ఇళ్ళల్లోని ప్రజల్ని సందర్శిస్తుంటుంది. నేనామెను చూడ్డానికి వెళ్ళినప్పుడు, ఆమె ఆనందంగా క్రియేషన్‌, రిచెస్‌ అనే పుస్తకాల్ని నాకిచ్చింది, అలాగే మరితర వాచ్‌ టవర్‌ సొసైటీ ప్రచురణల్ని కూడా ఇచ్చింది. తాను యెహోవాసాక్షినని కూడా ఆమె నాకు చెప్పింది.

ఆ పుస్తకాల్ని బైబిలును దగ్గరపెట్టుకుని చదివిన తర్వాత, యెహోవా సత్య దేవుడని నాకర్థమైపోయింది, నేనాయన్ని ఆరాధించాలని నిర్ణయించుకున్నాను. దానితో నేను మా చర్చి నుండి రాజీనామా చేస్తూ ఉత్తరం వ్రాసి పంపించి జాన్‌ మూడీ, అలీస్‌ మూడీల ఇంట్లో బైబిలు పఠనాలకు హాజరుకావడం ప్రారంభించాను. వాళ్ళు మాకు దగ్గర్లోనున్న వెస్ట్‌బురీ అనే పట్టణంలో నివసిస్తున్నారు. ఆ కూటాల్లో మేము ఏడుగురిమే ఉన్నాము. కూటాలకు ముందు ఆ తర్వాతా కేట్‌ పార్సన్స్‌ తన హార్మోనియం వాయిస్తుండగా మేమందరం కలిసి స్వరాలెత్తి రాజ్య గీతాల్ని పాడేవాళ్ళం !

తొలినాళ్ళు

మేము గమనార్హమైన కాలాల్లో జీవిస్తున్నామని నేను గ్రహించాను, నేను మత్తయి 24:14 లో ప్రవచించబడిన ప్రకటనా పనిలో భాగం వహించాలని ఎంతగానో ఆశించాను. అందుకని నేను పొగత్రాగడం మానుకుని, ఒక బ్రీఫ్‌కేసు కొనుక్కుని మహా దేవుడైన యెహోవాకు నన్ను నేను సమర్పించుకున్నాను.

వాచ్‌ టవర్‌ సొసైటీ అధ్యక్షుడైన జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌ 1936 ఆగస్టులో “అర్మగెద్దోను” అనే అంశంపై మాట్లాడటానికి స్కాట్లండ్‌లోని గ్లాస్గో వస్తున్నాడు. గ్లాస్గో 600 కిలోమీటర్ల అవతల ఉన్నప్పటికీ నేనక్కడ ఉండాలనీ, ఆ సమావేశంలో బాప్తిస్మం పొందాలనీ నిర్ణయించేసుకున్నాను. డబ్బు చాలా తక్కువవుండటంతో నేను నా సైకిల్ని ట్రైన్‌లో వేసుకుని, స్కాట్లండ్‌ సరిహద్దులోనున్న కార్లైల్‌ అనే పట్టణానికి వెళ్ళి అక్కణ్నుంచి 160 కిలోమీటర్లు ఉత్తరంవైపు సైకిలు మీద వెళ్ళాను. ఇంటికి తిరుగు ప్రయాణం చాలా మట్టుకు సైకిలుమీదే చేశాను, శారీరకంగా డస్సిపోయినా, ఆధ్యాత్మికంగా బలపడ్డాను.

అప్పటినుంచి చుట్టుప్రక్కల నున్న గ్రామాల్లోని ప్రజలతో నా విశ్వాసాన్ని పంచుకోవటానికి సైకిలు మీదే వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో ఒక్కో సాక్షి దగ్గర సాక్ష్యపు కార్డు ఉండేది, అందులో ఇంటివారు చదువుకోవటానికి లేఖన సందేశం ఉండేది. మేము సొసైటీ అధ్యక్షుడు చేసిన బైబిలు ప్రసంగాల రికార్డులు వినిపించడానికి చిన్న ఫోనోగ్రాఫులు కూడా ఉపయోగించాము. అయితే పత్రికల బ్యాగుల్ని * మాత్రం మర్చిపోయేవాళ్ళం కాము, అవే మమ్మల్ని యెహోవాసాక్షులుగా గుర్తించేవి.

యుద్ధకాలంలో పయినీరు సేవ

నా తమ్ముడు 1940 లో బాప్తిస్మం పొందాడు. రెండవ ప్రపంచ యుద్ధం 1939 లో ప్రారంభమైంది, దానితో పూర్తికాల ప్రచారకుల అవసరం ఎంతో ఉందని మేము గ్రహించాము. అందుకని మేము మా పయినీరు దరఖాస్తు ఫారాలను సమర్పించుకున్నాము. మా ఇద్దర్నీ కలిపి బ్రిస్టాల్‌లోని పయినీరు గృహానికి నియమించడంతో మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. అక్కడ ఎడిత్‌ పూల్‌, బెర్ట్‌ ఫార్మర్‌, టామ్‌ బ్రిడ్జ్‌, డొరోతీ బ్రిడ్జ్‌, బెర్నార్డ్‌ హోటన్‌ ఇంకా ఇతర పయినీర్లతో కలిశాము. వారి విశ్వాసాన్ని చూసి మేమెప్పుడూ విస్మయం చెందుతుంటాము.

రెండు ప్రక్కలా “యెహోవాసాక్షులు” అని ఇంగ్లీషులో స్పష్టంగా వ్రాసివున్న ఒక చిన్న వ్యాన్‌ మమ్మల్ని తీసుకువెళ్ళటానికి వచ్చింది. బండి నడుపుతున్నది స్టాన్లీ జోన్స్‌, ఈయన అటుతర్వాత చైనాలో మిషనరీగా వెళ్ళి, అక్కడ తన ప్రకటనా కార్యకలాపాల నిమిత్తం ఏడేళ్ళపాటు ఏకాంత నిర్బంధాన్ని అనుభవించాడు.

ఒక ప్రక్క యుద్ధం చెలరేగుతుండటం మూలంగా మాకు నిద్ర సరిగా పట్టేది కాదు. మా పయినీరు గృహం చుట్టూ బాంబులు పడేవి, దానితో విస్ఫోటక పదార్థాల కోసం అనుక్షణం అప్రమత్తంగా కనిపెట్టుకుని ఉండాల్సివచ్చేది. ఒక సాయంత్రం పూట 200 మంది సాక్షులము బ్రిస్టాల్‌ నగరం నడిబొడ్డున ఉన్న ఒక హాలులో జరిగిన అసెంబ్లీకి హాజరై తిరిగివస్తున్నాము. విమానాల్ని కూల్చటానికి క్షిపణులను పంపిస్తుంటే వాటి లోహపు తొడుగుల తునకలు మామీద వర్షపు జల్లులా పడుతుండగా మేము మా ఇంటికి క్షేమంగానే చేరుకున్నాము.

తర్వాతి రోజు ఉదయం నేనూ డిక్‌ కలిసి క్రితం రాత్రి విడిచిపెట్టేసిన కొన్ని వస్తువుల్ని తీసుకోవటానికి నగరంలోకి వెళ్ళాము. అక్కడి దృశ్యం చూసి మాకు నోట మాట రాలేదు. బ్రిస్టాల్‌ నగరం శిధిలమైపోయింది. నగరం మధ్యభాగం బాంబుల దాడికి ధ్వంసమై కాలిపోయివుంది. మా రాజ్య మందిరం ఉన్న పార్క్‌ స్ట్రీట్‌ అంతా శిధిలాలమయం. శిధిలాల్లోంచి పొగలు వస్తున్నాయి. అయితే సాక్షులెవరూ గాయపడటంగాని చనిపోవటంగాని జరుగలేదు. సంతోషకరమైన విషయం ఏమిటంటే, మేము మా బైబిలు సాహిత్యాన్ని అప్పటికే రాజ్య మందిరం నుండి తరలించేసి, సంఘ సభ్యులకు పంపిణీ చేసేశాము. అంతటికీ యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించాము.

అనూహ్యంగా స్వాతంత్ర్యం

నేను అధ్యక్షునిగా సేవచేసిన బ్రిస్టాల్‌ సంఘంలో పరిచారకుల సంఖ్య 64కి పెరిగింది. అప్పుడు నాకు సైన్యంలో చేరమని ఉత్తర్వులు అందాయి. తమ తటస్థ స్థానం మూలంగా అనేకమంది ఇతర సాక్షుల్ని జైల్లో వేశారు. అదేవిధంగా ప్రకటనా పని సంబంధంగా నా స్వాతంత్ర్యానికీ తెరపడిందని అనుకున్నాను. నా కేసు స్థానిక బ్రిస్టాల్‌ ట్రైబ్యునల్‌లో విచారణకు వచ్చింది, అక్కడ ఒక మాజీ జైలు అధికారి అయిన సహోదరుడు ఆంథోనీ బక్‌ నా పక్షాన మాట్లాడాడు. ఆయన చాలా ధైర్యవంతుడు నిర్భయంగల మనిషి, బైబిలు సత్యాన్ని సమర్థిస్తూవున్న సాహసవంతుడు. నా పక్షాన బలంగా వాదించటం మూలంగా అనూహ్యమైన రీతిలో నన్ను మిలిటరీ సేవ నుండి పూర్తిగా విముక్తుణ్ని చేశారు, అదీ నేను పూర్తికాల పరిచర్యను కొనసాగిస్తానన్న షరతు మీదే !

స్వతంత్రుణ్ణి అయినందుకు అత్యానందభరితుడనై, ఇక నా పరిచర్యను సాధ్యమైనంతగా విస్తృతం చేయాలని తీర్మానించుకున్నాను. బ్రాంచి అధ్యక్షుడైన అల్బర్ట్‌ డి. ష్రోడర్‌తో మాట్లాడటానికి రమ్మని ఫోనులో పిలుపు వచ్చినప్పుడు, నేను సహజంగానే ఏమైయుంటుందా అని ఆలోచనలో పడ్డాను. ప్రయాణ పైవిచారణకర్తగా ప్రతి వారం వేర్వేరు సంఘాన్ని సందర్శిస్తూ సహోదరులను ప్రోత్సహిస్తూ సేవచేయటానికి యార్క్‌షైర్‌కి వెళ్ళాలన్న ఆహ్వానాన్ని అందుకున్నప్పుడు నా ఆశ్చర్యాన్ని ఊహించుకోండి ! అటువంటి నియామకానికి నేను తగనన్న భావనలు నాలో ఎంతగానో ఉత్పన్నమయ్యాయి, కానీ మిలిటరీ సేవనుండి మినహాయింపు ఉండటంతో నాకు వెళ్ళటానికి ఎటువంటి అడ్డంకులూ లేవు. అందుకని యెహోవా నిర్దేశాన్ని స్వీకరించి ఎంతో ఇష్టంగా వెళ్ళాను.

అల్బర్ట్‌ ష్రోడర్‌ హడ్డర్స్‌ఫీల్డ్‌లోని ఒక అసెంబ్లీలో నన్ను ఆ సహోదరులకు పరిచయం చేశారు, నేను 1941 ఏప్రిల్‌లో నా కొత్త నియామకాన్ని స్వీకరించాను. ఈ ప్రియమైన సహోదరులను తెలుసుకోవటం నాకెంతో ఆనందాన్ని తెచ్చింది ! వారి ప్రేమ దయ, యెహోవాకు పూర్తిగా అంకితమైన ప్రజలు, ఒకరినొకరు ప్రేమించే ప్రజలు ఉన్నారని నేను మరింత ప్రగాఢంగా విశ్వసించేలా చేశాయి.—యోహాను 13:35.

మరిన్ని సేవాధిక్యతలు

లెస్టర్‌లోని డె మోంట్‌ఫోర్ట్‌ హాల్‌లో 1941 లో ఒక మరపురాని ఐదురోజుల సమావేశం జరిగింది. ఆహారం రేషన్‌ ప్రకారం పంపిణీ చేసినప్పటికీ, ప్రజా రవాణా పరిమితంగా ఉన్నప్పటికీ హాజరు ఆదివారానికల్లా 12,000కు చేరుకుంది; అయితే అప్పట్లో మొత్తం దేశంలో సాక్షుల సంఖ్య చూస్తే 11,000 మాత్రంగా ఉంది. సొసైటీ అధ్యక్షుని ప్రసంగాల రికార్డింగులు వినిపించడం జరిగింది, అప్పుడే చిల్డ్రన్‌ అనే పుస్తకం విడుదల చేయబడింది. ఆ సమావేశం నిశ్చయంగా బ్రిటన్‌లోని యెహోవా ప్రజల దైవపరిపాలనా చరిత్రలో ఒక మైలురాయే; అదీ రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతుండగా జరిగింది.

ఈ సమావేశం ముగిసిన తర్వాత వెంటనే, లండన్‌ బేతేలు కుటుంబంతోపాటు సేవచేయమని నాకు ఆహ్వానం అందింది. నేనక్కడ షిప్పింగ్‌ ప్యాకింగ్‌ విభాగాల్లో పనిచేశాను, తర్వాత సంఘాలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ ఆఫీసులో పనిచేశాను.

లండన్‌ మీద రాత్రనక పగలనక జరుగుతున్న విమాన దాడుల మూలంగా బేతేలు కుటుంబం అప్రమత్తంగా ఉండాల్సివచ్చింది. అదీగాక బేతేలులోని బాధ్యతగల సహోదరులపై ప్రభుత్వాధికారులు నిఘా ఉంచేవారు. ప్రైస్‌ హ్యూస్‌, యూవర్ట్‌ ఛిటీ, ఫ్రాంక్‌ ప్లాట్‌ల తటస్థ స్థానం మూలంగా వారిని జైలుకి పంపించారు, అల్బర్ట్‌ ష్రోడర్‌ని చివరికి అమెరికాకు పంపించేశారు. ఈ ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ సంఘాల పట్ల రాజ్యాసక్తుల పట్ల చక్కని శ్రద్ధవహించడం జరిగింది.

ఓడలో గిలియడ్‌కి!

యుద్ధం 1945 లో ముగిసినప్పుడు నేను మిషనరీ శిక్షణ నిమిత్తం వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కి దరఖాస్తు పెట్టుకున్నాను, నాకు 1946 లోని ఎనిమిదవ తరగతికి పిలుపు వచ్చింది. కార్న్‌వాల్‌లోని ఫావీ అనే పేరుగల చేపల నౌకాశ్రయం నుండి ఓడలో ప్రయాణించటానికి సొసైటీ మాలో చాలామందికి ఏర్పాట్లు చేసింది, వారిలో టోనీ ఆట్‌వుడ్‌, స్టాన్లీ జోన్స్‌, హెరాల్డ్‌ కింగ్‌, డాన్‌ రెండల్‌, స్టాన్లీ ఉడ్‌బర్న్‌ ఉన్నారు. ఒక స్థానిక సాక్షి, చైనా పింగాణి సామగ్రిని తీసుకువెళ్ళే ఒక చిన్న ఓడలో మాకు టిక్కెట్లు బుక్‌ చేశాడు. ఓడలో మేముండే గది చాలా ఇరుకైనది, బయట నేల చూస్తే ఎప్పుడూ నీళ్ళమయంగా ఉండేది. చివరికి మేము ఫిలడెల్ఫియా నౌకాశ్రయానికి చేరుకునేసరికి ఎంత ఉపశమనం లభించిందో !

న్యూయార్క్‌ రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న సౌత్‌ లాన్సింగ్‌లో అందమైన పరిసరాల్లో గిలియడ్‌ క్యాంపస్‌ ఉంది. అక్కడ నేను పొందిన శిక్షణను నేనెంతో అమూల్యంగా ఎంచుతాను. మా తరగతిలోని విద్యార్థులు 18 దేశాలనుండి వచ్చారు, మేమందరం ఒకరికొకరం ఎంతో సన్నిహితం అయ్యాం. విదేశాల నుండి అంతమంది విద్యార్థుల్ని సొసైటీ సమకూర్చగల్గటం అదే మొదటిసారి. ఫిన్‌లాండ్‌ నుంచి వచ్చిన కాల్లా సాలవారా అనే నా రూమ్‌మేట్‌ సహవాసంలో నేనెంతో ఆనందించాను.

కాలం చాలా త్వరగా గడిచిపోయింది, ఐదవ నెల ముగింపులో మాకు డిప్లొమాలు ఇవ్వటానికీ మేం ఎక్కెడెక్కడికి వెళ్ళనైయున్నామో చెప్పటానికీ బ్రూక్లిన్‌ ముఖ్యకార్యాలయం నుండి సొసైటీ అధ్యక్షుడు నేథన్‌ హెచ్‌. నార్‌ వచ్చారు. ఆ రోజుల్లోని విద్యార్థులకు గిలియడ్‌ స్నాతకోత్సవం నాటికి గానీ తాము ఎక్కడికి వెళ్తారో తెలిసేదికాదు. నేను లండన్‌లో నా పనిని కొనసాగించేందుకు అక్కడి బేతేలుకే తిరిగి వెళ్ళమని నియమించారు.

లండన్‌కి తిరుగు ప్రయాణం

బ్రిటన్‌లో యుద్ధానంతర పరిస్థితులు చాలా కఠినంగా ఉండేవి. ఆహారం, మరితర నిత్యావసర వస్తువులు, కాగితం వంటివి రేషన్‌ ప్రకారమే లభ్యమయ్యేవి. కానీ మేము సర్దుకుపోయాము, యెహోవా రాజ్యాసక్తులు వర్ధిల్లాయి. బేతేలులో పనిచేయటానికి తోడు నేను జిల్లా, ప్రాంతీయ సమావేశాల్లో సేవచేస్తూ ఐర్లాండ్‌ ఇంగ్లాండ్‌లలోని సంఘాల్ని సందర్శిస్తూ ఉండేవాడిని. యూరప్‌లోని ఎరిక్‌ ఫ్రాస్ట్‌ని, మరితర సహోదర సహోదరీలను కలిసే భాగ్యం కూడా నాకు లభించింది. నాజీ నిర్బంధ శిబిరాల్లో (కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో) భయానకమైన అనుభవాల్ని ఎదుర్కొన్న వారి తోటి సాక్షుల యథార్థతను గురించి నేను తెలుసుకున్నాను. బేతేలు సేవ విషయానికొస్తే అది నిజంగానే ఒక ఆధిక్యత.

లండన్‌కు ఉత్తరాన వాట్‌ఫోర్డ్‌ అనే పట్టణంలో ప్రత్యేక పయినీరు సేవచేస్తున్న జోవన్‌ వెబ్‌ నాకు పది సంవత్సరాలుగా తెలుసు. మేము 1952 లో పెండ్లి చేసుకున్నాము. మేమిద్దరమూ పూర్తికాల పరిచర్యలో కొనసాగాలని కోరుకున్నాము, అందుకని నేను బేతేలును విడిచిపెట్టిన తర్వాత నన్ను ప్రాంతీయ పైవిచారణకర్తగా నియమించే సరికి మేము ఆనందంతో ఉప్పొంగిపోయాము. మా మొదటి సర్క్యూట్‌ ఇంగ్లాండ్‌ దక్షిణ కోస్తాలో అంటే సస్సెక్స్‌, హాంప్‌షైర్‌లలో ఉంది. ఆ రోజుల్లో సర్క్యూట్‌ సేవ అంత సులభమైనది కాదు. మేము ఎక్కువగా ప్రయాణానికి బస్సు, సైకిలు ఉపయోగించేవాళ్ళం, లేదా కాలినడకనే వెళ్ళేవాళ్ళం. చాలా సంఘాల కింద గ్రామీణ ప్రాంతాలు ఉండేవి. వీటిని కవర్‌ చేయడం తరచు చాలా కష్టంగా ఉండేది, కానీ సాక్షుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతునే ఉంది.

1958 న్యూయార్క్‌ సిటీ

బేతేలు నుండి నాకు 1957 లో మరో ఆహ్వానం లభించింది: “న్యూయార్క్‌ సిటీలో 1958 లో యాంకీ స్టేడియంలోను పోలో గ్రౌండ్స్‌లోను జరుగనైయున్న అంతర్జాతీయ సమావేశాలకు వెళ్తున్న సహోదరుల ప్రయాణపు ఏర్పాట్లలో సహాయం చేయగలరా?” సొసైటీ అద్దెకు తీసుకున్న విమానాల్లోను ఓడల్లోను ప్రయాణించటానికి సహోదరులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలిస్తూ నేనూ జోవన్‌ పనిరద్దీలో పడిపోయాము. ప్రఖ్యాతి చెందిన ఈ దైవిక చిత్తం అంతర్జాతీయ సమావేశానికి 2,53,922 మంది హాజరయ్యారు. ఈ సమావేశంలో 7,136 మంది యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు సూచనగా నీళ్ళలో మునగడం ద్వారా బాప్తిస్మం పొందారు—ఇది బైబిల్లో నివేదించినట్లుగా సా.శ. 33 పెంతెకొస్తు దినాన చరిత్రాత్మకమైన సందర్భంలో బాప్తిస్మం పొందిన సంఖ్యకు రెండింతల కన్నా ఎక్కువే.—అపొస్తలుల కార్యములు 2:41.

మేము కూడా హాజరై, 123 దేశాల నుండి న్యూయార్క్‌ సిటీకి వస్తున్న ప్రతినిధులకు సహాయం చేయమని సహోదరుడు నార్‌ ఎంతో దయాపూర్వకంగా వ్యక్తిగతంగా ఆహ్వానించటం నేనూ జోవన్‌ ఎన్నడూ మరువలేము. అది మా ఇద్దరికీ ఎంతో సంతోషకరమైన సంతృప్తికరమైన అనుభవం.

పూర్తికాల సేవ ఆశీర్వాదాలు

మేము తిరిగివచ్చిన తర్వాత ప్రయాణ పనిలో కొనసాగాము, చివరికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చిపడ్డాయి. జోవన్‌ హాస్పిటల్‌లో చేరాల్సివచ్చింది, నాకూ చిన్నగా స్ట్రోక్‌ వచ్చింది. మమ్మల్ని ప్రత్యేక పయినీరు జాబితాల్లో చేర్చారు, కానీ మళ్ళీ కొంతకాలంపాటు సర్క్యూట్‌ పనిలో చేరే ఆధిక్యత లభించింది. చివరికి మేము బ్రిస్టాల్‌కి తిరిగివచ్చాము, అక్కడే పూర్తికాల సేవలో కొనసాగుతున్నాము. మా తమ్ముడు డిక్‌ దగ్గర్లోనే తన కుటుంబంతో నివసిస్తున్నాడు, మేం అప్పుడప్పుడు కలుసుకుని గతకాల స్మృతుల్ని నెమరువేసుకుంటుంటాము.

నాకు 1971 లో కనుదృష్టి సంబంధంగా గంభీరమైన వ్యాధి వచ్చింది. అప్పటినుండే నాకు చదవటం చాలా కష్టంగా ఉండేది, అందుకని నేను బైబిలు సాహిత్యపు క్యాసెట్లు యెహోవా నుండి వచ్చిన గొప్ప ఏర్పాటుగా దృష్టిస్తాను. నేనూ జోవన్‌ ఇప్పటికీ గృహ బైబిలు పఠనాలను నిర్వహిస్తుంటాము, ఈ సంవత్సరాలన్నింట్లో మేము దాదాపు 40 మంది వ్యక్తులు సత్యపు జ్ఞానాన్ని పొందేలా సహాయపడ్డాము; వీరిలో ఏడుగురితో కూడిన ఒక కుటుంబం కూడా ఉంది.

మేము 60 సంవత్సరాల క్రితం మా జీవితాల్ని యెహోవాకు సమర్పించుకున్నప్పుడు, పూర్తికాల సేవలోకి ప్రవేశించి అందులో కొనసాగాలన్నది మా కోరికగా ఉండేది. యెహోవా మాపట్ల చేసిన మేలుకంతటికీ మేమాయనకు ధన్యవాదాలను చెల్లించే ఒకే ఒక మార్గం ఆయనకు సేవచేయటం; మహా దేవుడైన యెహోవాకు అలాంటి సేవచేసేందుకు మాకిప్పటికీ శక్తినిచ్చినందుకు మేమెంతో కృతజ్ఞులం !

[అధస్సూచి]

^ పేరా 11 ఇవి కావలికోట, కన్సోలేషన్‌ (అటుతర్వాత తేజరిల్లు!) పత్రికలను పెట్టుకోవటానికి బట్టతో ప్రత్యేకంగా తయారుచేసిన, భుజానికి తగిలించుకునే సంచీలు.

[25వ పేజీలోని చిత్రం]

బ్రిస్టాల్‌ పయినీరు గృహం ముందు నేను నా తమ్ముడు డిక్‌ (పూర్తిగా ఎడమవైపు; నిల్చున్నది డిక్‌), ఇతర పయినీర్లు

[25వ పేజీలోని చిత్రం]

1940 లో బ్రిస్టాల్‌ పయినీరు గృహం

[26వ పేజీలోని చిత్రాలు]

1952, జనవరి 12న వారి పెళ్ళిరోజున స్టాన్లీ రేనాల్డ్స్‌, జోవన్‌, మళ్ళీ ఇప్పుడు