కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మన హృదయాలకంటె అధికుడు

యెహోవా మన హృదయాలకంటె అధికుడు

యెహోవా మన హృదయాలకంటె అధికుడు

“తనయందు భయభక్తులుగలవారియందు . . . యెహోవా ఆనందించువాడైయున్నాడు” అని వ్రాశాడు కీర్తన గ్రంథకర్త. తన నీతియుక్త ప్రమాణాల్ని పాటించటానికి తన సేవకులు కృషిచేస్తూ ఉండగా, వారిలో ఒక్కొక్కరిని చూస్తూ సృష్టికర్త నిజంగా ఎంతగానో ఆనందిస్తాడు. దేవుడు తనపట్ల యథార్థహృదయం గలవారిని ఆశీర్వదిస్తాడు, వారు నిరాశానిస్పృహలకు గురైనప్పుడు ప్రోత్సహిస్తాడు, ఓదార్పునిస్తాడు. తన ఆరాధకులు అపరిపూర్ణులని ఆయనకు తెలుసు, అందుకనే తాను వారినుండి అపేక్షించేదాని విషయంలో ఆయనకు వాస్తవిక దృక్పథం ఉంటుంది.—కీర్తన 147:11.

యెహోవాకు సాధారణంగా తన సేవకులపట్ల ఎంతో ప్రేమ ఉంటుందన్నది మనం సులభంగానే నమ్ముతాము. అయితే, కొందరు తమలోని లోపాల విషయమై ఎంతగా ఆలోచిస్తూ ఉంటారంటే, యెహోవా తమను ఎన్నడూ ప్రేమించలేడని వారికి నమ్మకం కుదిరిపోతుంది. “నాలో అపరిపూర్ణత చాలా ఉంది, యెహోవా నన్ను ప్రేమించడు” అని వారు ఒక ముగింపుకు వస్తారు. నిజమే, మనలో అందరికీ అప్పుడప్పుడు ప్రతికూల భావాలు ఏర్పడుతుంటాయి. కానీ కొందరు తాము నిరుపయోగకరమైన వారమన్న భావనలతో ఎప్పుడూ పోరాడుతున్నట్లు కన్పిస్తోంది.

తిరస్కారానికి గురైనట్లు భావించటం

బైబిలు కాలాల్లో విశ్వసనీయులైన అనేకమంది వ్యక్తులు తాము తిరస్కారానికి గురౌతున్న భావాల్ని అనుభవించారు. యోబు తన జీవితాన్నే అసహ్యించుకుని దేవుడు తన్ను విడనాడాడని భావించాడు. సమూయేలు పుట్టకముందు హన్నా తాను గొడ్రాలిగా ఉందని ఒకసారి ఎంతో మనఃక్లేశానికి గురైంది. “నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను” అని దావీదు అన్నాడు; ఎపఫ్రొదితు, తన అనారోగ్యాన్ని గురించిన వార్త సహోదరులను కలతపర్చిందని దుఃఖించాడు.—కీర్తన 38:6; 1 సమూయేలు 1:7, 10; యోబు 29:2, 4, 5; ఫిలిప్పీయులు 2:25, 26.

నేడు క్రైస్తవుల సంగతేమిటి? అనారోగ్యం, వయసు పైబడుతుండటం, లేదా ఇతర వ్యక్తిగత పరిస్థితుల మూలంగా కొందరు తాము పవిత్ర సేవను చేయాలనుకున్నంతగా చేయలేకపోతుండవచ్చు. దీని మూలంగా తాము యెహోవాపట్లా, తమ తోటి విశ్వాసులపట్లా ఒక రకంగా తప్పు చేస్తున్నట్లు ఒక ముగింపుకు వస్తుండవచ్చు. అలా కాక మరికొందరు, తాము గతంలో చేసిన పొరబాట్లకు తమను తాము ఎప్పుడూ నిందించుకుంటూ యెహోవా తమను క్షమించలేదని అనుకుంటుండవచ్చు. లేదా మరితరులు, చిన్నప్పుడు కుటుంబపరంగా కఠినమైన పరిస్థితులను అనుభవించినందు మూలంగా తాము ప్రేమించబడటానికి పూర్తిగా అయోగ్యులమన్న అభిప్రాయాన్ని ఏర్పర్చుకొనివుండవచ్చు. ఇలాంటి భావనలు కలగటం ఎలా సాధ్యం?

కొందరు వ్యక్తులు ప్రేమానురాగాలు విలసిల్లే కుటుంబంలో కాక, స్వార్థంతో నిండివున్న వాతావరణంలో ఎత్తిపొడుపులు వింటూ, భయంతో జీవిస్తూ పెరుగుతారు. ప్రగాఢంగా ప్రేమించే తండ్రి అంటే ఏమిటో, మెచ్చుకునేందుకు ప్రోత్సహించేందుకు అవకాశాలను వెదికే తండ్రి అంటే ఏమిటో వారికి తెలియదు, చిన్నచిన్న తప్పుల్ని ఉపేక్షిస్తూ పెద్ద తప్పుల్ని కూడా క్షమించటానికి సిద్ధంగా ఉంటూ తన వాత్సల్యం ద్వారా కుటుంబం అంతా భద్రంగా ఉన్నట్లు భావించేలా చేసే తండ్రి అంటే ఏమిటో ఏమాత్రం తెలియదు. వారీ భూమ్మీద ప్రేమపూర్వకమైన తండ్రిని ఎన్నడూ చూడలేదు గనుక, ప్రేమపూర్వకమైన పరలోకపు తండ్రిని కల్గివుండటం అంటే ఏమిటో అర్థం చేసుకోవటం వారికి చాలా కష్టంగా ఉండవచ్చు.

ఉదాహరణకు, ఫ్రిట్జ్‌ * ఇలా వ్రాస్తున్నాడు: “నా చిన్నతనమంతా మా నాన్నగారి ప్రేమరహితమైన ప్రవర్తన ద్వారా చాలా ప్రభావితమైంది. ఆయన నన్నెన్నడూ మెచ్చుకుని ఎరుగడు, నేనూ ఆయనకు సన్నిహితంగా ఎన్నడూ ఉన్నట్లు నాకన్పించలేదు. నిజానికి నాకాయనంటే ఎప్పుడూ భయంగా ఉండేది.” దాని ఫలితంగా, ఇప్పుడు 50లలో ఉన్న ఫ్రిట్జ్‌కు ఇంకా అయోగ్యుడనన్న భావాలున్నాయి. మార్గరెటా ఇలా వివరిస్తోంది: “నా తల్లిదండ్రుల్లో వాత్సల్యం అనేది కనబడదు, ప్రేమ అనేది లేదు. నేను బైబిలు పఠనం ప్రారంభించినప్పుడు అసలు ప్రేమపూర్వకమైన తండ్రి ఎలా ఉంటాడో ఊహించటమే కష్టంగా ఉండేది.”

అటువంటి భావాలు కల్గివుండటం—అది ఏ కారణం చేతనైనా సరే—దేవునికి మనం చేసే సేవ కొన్నిసార్లు ప్రేమచే కాదుగాని చాలామట్టుకు అపరాధ భావాలచేత భయంచేత పురికొల్పబడుతుందని అర్థం కావచ్చు. మనమెంతగా కృషి చేసినా అది సరిపోవట్లేదనిపించవచ్చు. యెహోవాను మన తోటి విశ్వాసులను ప్రీతిపర్చాలన్న కోరిక మనం అనుకున్నంత చేయలేకపోతున్నామని భావించేలా చేయగలదు. తత్ఫలితంగా మనం లక్ష్యాల్ని సాధించలేకపోతుండవచ్చు, ఇంకా మనల్ని మనం నిందించుకుంటూ నిస్పృహకు గురౌతుండవచ్చు.

అలాంటప్పుడు ఏమి చేయవచ్చు? బహుశ మనం యెహోవా ఎంత సానుభూతి గలవాడో మనకు మనం గుర్తుచేసుకోవచ్చు. దేవుని ప్రేమపూర్వకమైన వ్యక్తిత్వంలోని ఈ అంశాన్ని అర్థం చేసుకున్న ఒక వ్యక్తి అపొస్తలుడైన యోహాను.

“దేవుడు మన హృదయముకంటె అధికు[డు]”

సా.శ. మొదటి శతాబ్దం చివర్లో యోహాను తన తోటి విశ్వాసులకు ఇలా వ్రాశాడు: “ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.” యోహాను ఈ మాటల్ని ఎందుకు వ్రాశాడు?—1 యోహాను 3:19, 20.

యెహోవా సేవకుని హృదయం ఆయనపై దోషం మోపడం జరుగవచ్చని యోహానుకు స్పష్టంగా తెలుసు. బహుశ యోహాను తానే అలాంటి అనుభవానికి గురైయుండవచ్చు. ఎంతో ఉద్రేకమైన స్వభావంగల యౌవనస్థునిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన్ను, ఇతరులతో వ్యవహరించేటప్పుడు మరీ కఠినంగా ప్రవర్తించిన ఒక సందర్భంలో సరిదిద్దాడు. నిజానికి యేసు యోహాను, ఆయన సహోదరుడైన యాకోబులకు “బోయనేర్గెసను పేరుపెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము.”—మార్కు 3:17; లూకా 9:49-56.

అటుతర్వాతి 60 సంవత్సరాల్లో యోహాను సాత్త్వికుడై, సంయమనంగల ప్రేమపూర్వకమైన, దయాపూర్వకమైన క్రైస్తవుడయ్యాడు. జీవించివున్న అపొస్తలుల్లో చివరివాడిగా, తన మొదటి ప్రేరేపిత లేఖను వ్రాసే సమయానికల్లా ఆయన, యెహోవా తన సేవకులు చేసే ప్రతి చిన్న పొరబాటుకీ లెక్క ఒప్పజెప్పమని అడగడని గ్రహించాడు. అలాకాక యెహోవా వాత్సల్యం, సానుభూతి, ఔదార్యం, కనికరాలుగల తండ్రి, తన్ను ప్రేమించేవారందరి పట్లా, తనను సత్యంతో ఆరాధించేవారందరి పట్లా ప్రగాఢమైన ప్రేమగలవాడు. యోహాను ఇలా వ్రాస్తున్నాడు: “దేవుడు ప్రేమాస్వరూపి.”—1 యోహాను 4:8.

మన సేవను చూసి యెహోవా ఉప్పొంగిపోతాడు

మనలో స్వతఃసిద్ధంగా ఉన్న బలహీనతలు, కొరతల గురించి దేవునికి తెల్సు, వీటినాయన లెక్కలోనికి తీసుకుంటాడు. “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు.” మనం ఎలాంటివారమన్న దానిపై మనం పుట్టిపెరిగిన పరిస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపగలవో యెహోవాకు తెలుసు. నిజానికి ఆయనకు మనల్ని గురించి మనకు తెలిసినదానికన్నా ఎంతో బాగా తెలుసు.—కీర్తన 103:14.

మనలో చాలామందిమి వేరుగా ఉండాలని కోరుకుంటున్నామనీ, కానీ మనం మన అపరిపూర్ణతలను అధిగమించలేకపోతున్నామనీ ఆయనకు తెలుసు. మన పరిస్థితిని అపొస్తలుడైన పౌలు పరిస్థితితో పోల్చవచ్చు, ఆయనిలా వ్రాశాడు: “నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.” మనందరమూ ఒకే పోరాటం చేస్తున్నాము. కొన్ని సందర్భాల్లో దీని మూలంగా ఆత్మనింద చేసే హృదయం ఏర్పడుతుండవచ్చు.—రోమీయులు 7:19.

కానీ ఎల్లప్పుడూ ఇది జ్ఞాపకం ఉంచుకోండి: మనల్ని మనమెలా దృష్టించుకుంటున్నామనే దానికన్నా యెహోవా మనల్ని ఎలా దృష్టిస్తున్నాడన్నది మరింత ప్రాముఖ్యం. మనమాయన్ని ప్రీతిపర్చటానికి ప్రయత్నించటాన్ని ఆయన గమనించిన ప్రతిసారి ఆయన ఏదో కాస్త సంతృప్తి పడటం మాత్రమే కాదు గానీ, అత్యానందభరితుడౌతాడు. (సామెతలు 27:11) మనం సాధించింది మన దృష్టిలో చాలా స్వల్పమైనదిగా ఉన్నా, చేయాలన్న మన కోరికా, దానివెనుకనున్న సదుద్దేశమూ ఆయన్ను ఆహ్లాదపరుస్తాయి. మనం సాధించేదాన్ని మించి ఆయన చూస్తాడు; ఏమి చేయాలని ఆశిస్తున్నామో అది ఆయన చూస్తాడు; ఆయనకు మన ఆశలు, అభిలాషలు ఏమిటో తెలుసు. యెహోవా మన హృదయాల్ని చదవగలడు.—యిర్మీయా 12:3; 17:10.

ఉదాహరణకు యెహోవాసాక్షుల్లో చాలామంది సహజంగా బెరుకుగలవారు, అనవసరంగా అవధానాన్ని ఆకర్షించటానికి ఇష్టపడని ప్రజలు. అటువంటివారికి, సువార్తను ఇంటింటికి ప్రకటించటం అనేది ఒక పెద్ద సవాలే. అయినప్పటికీ దేవుణ్ణి సేవించాలనే, పొరుగువారికి సహాయం చేయాలనే కోరికతో ప్రేరేపితులై, చివరికి పిరికివారు కూడా తమ పొరుగువారిని సమీపించి బైబిలును గురించి మాట్లాడటం నేర్చుకుంటారు. తాము సాధించింది చాలా తక్కువని భావిస్తుండవచ్చు, దీని మూలంగా వారి ఆనందం తక్కువకావచ్చు. వారి బహిరంగ పరిచర్య అంత యోగ్యమైంది కాదని వారి హృదయం వారికి చెబుతుండవచ్చు. కానీ అటువంటి వారు తమ పరిచర్యలో చేసే గొప్ప కృషిని చూసి యెహోవా తప్పక ఉప్పొంగిపోతుంటాడు. అంతేగాక, తాము చల్లిన సత్యపు విత్తనాలు ఎప్పుడు ఎక్కడ మొలకెత్తుతాయో, అభివృద్ధిచెంది, ఫలాల్ని ఫలిస్తాయో వారికి తెలియదు.—ప్రసంగి 11:6; మార్కు 12:41-44; 2 కొరింథీయులు 8:12.

మరితర సాక్షులు దీర్ఘకాలిక వ్యాధుల్ని అనుభవిస్తుంటారు లేదా వారి వయస్సు పైబడుతుండవచ్చు. వారి విషయంలో, రాజ్యమందిరంలో కూటాలకు క్రమంగా హాజరుకావటమే ఎంతో ప్రయాసతో కూడినదిగా, చింతను కలిగించేదిగా ఉండవచ్చు. ప్రకటనా పని గురించిన ఒక ప్రసంగాన్ని వినటమే తరువాయి, తాము మునుపు ఎంతగా చేయగలిగారో, తమ దౌర్భల్యం తమను ఎంతగా ఆపుతున్నా ఇప్పటికీ ఎంతగా చేయాలని కోరుకుంటున్నారో మనస్సుకి వస్తుంది. ప్రకటనా పని గురించి అక్కడివ్వబడుతున్న సలహాను తాము పాటించలేకపోతున్నందున అటువంటి వారిని అపరాధ భావాలు శూలాల్లా గుచ్చుతుంటాయి. అయినప్పటికీ యథార్థహృదయంతో వారు చేసే సేవను, వారి సహనాన్ని యెహోవా అమూల్యంగా ఎంచుతాడు. వారు యథార్థంగా ఉన్నంత కాలము, ఆయన వారి విశ్వసనీయమైన చరిత్రను ఎన్నడూ మరువడు.—కీర్తన 18:25; 37:28.

“హృదయములను సమ్మతిపరచుకొందము”

యోహాను వృద్ధాప్యానికి వచ్చేసరికి, ఆయన దేవుని దయార్ద్రహృదయాన్ని గురించి చాలా తెల్సుకునివుంటాడు. గుర్తుతెచ్చుకోండి, ఆయనిలా వ్రాశాడు: “దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు.” ఇంకా, “మన హృదయములను సమ్మతిపరచుకొందము” అని యోహాను ప్రోత్సహిస్తున్నాడు. యోహాను మాటలకు భావమేమిటి?

వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్టమెంట్‌ వర్డ్స్‌ ప్రకారం “సమ్మతి” అని అనువదించబడిన గ్రీకు క్రియాపదానికి “నచ్చజెప్పటానికి ప్రయత్నించటం, ఒకరిపై ప్రబలం కావటం లేదా గెలుపొందటం, ఒప్పించటం” అని అర్థం. వేరే మాటల్లో చెప్పాలంటే, మన హృదయాల్ని సమ్మతిపర్చుకోవటానికి, మనం మన హృదయాలపై గెలుపొందాలి, యెహోవా మనల్ని ప్రేమిస్తాడని దాన్ని ఒప్పించాలి. ఎలా?

ఈ శీర్షికలో ముందు పేర్కొనబడిన ఫ్రిట్జ్‌ గత 25 సంవత్సరాలుగా యెహోవాసాక్షుల ఒక సంఘంలో పెద్దగా సేవచేశాడు, వ్యక్తిగత పఠనం అనేది యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడన్న భరోసాను మన హృదయానికి ఇవ్వటానికి సహాయం చేస్తుందని కనుగొన్నాడు. “నేను బైబిలును మన ప్రచురణలను క్రమంగా జాగ్రత్తగా చదువుతుంటాను. దీని మూలంగా నేను గతంపై కాక అద్భుతమైన మన భవిష్యత్తుపై దృష్టిని నిలిపేందుకు నాకు సహాయం లభిస్తుంది. కొన్నిసార్లు గతంలోని చేదు అనుభవాలు బాగా జ్ఞప్తికి వస్తుంటాయి, అప్పుడు దేవుడు నన్నెన్నడూ ప్రేమించలేడని భావిస్తుంటాను. కానీ సాధారణంగా చూస్తే, క్రమంగా పఠనం చేయటం నా హృదయాన్ని బలపరుస్తున్నట్లు, నా విశ్వాసాన్ని పెంచుతున్నట్లు, నేను ఆనందంతో సంయమనంతో ఉండేందుకు సహాయపడుతున్నట్లు గ్రహించాను.”

నిజమే, బైబిలు పఠనము ధ్యానించటము మన అసలు పరిస్థితిని మారుస్తుండకపోవచ్చు. అయినా అది మన పరిస్థితిని మనమెలా దృష్టిస్తున్నామన్నదాన్ని మార్చగలదు. దేవుని వాక్యం నుండి తలంపులను మన హృదయాల్లోనికి తీసుకున్నట్లైతే మనం ఆయన ఆలోచిస్తున్నట్లుగా ఆలోచించగలము. అంతేగాక, పఠనం చేయటం ద్వారా మనం దేవుని దయార్ద్రహృదయాన్ని అర్థం చేసుకోవటం సాధ్యమౌతుంది. అప్పుడు, చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణానికి యెహోవా మనల్ని నిందించడనీ, మన దౌర్భల్యాలకు మనల్ని నిందించడనీ క్రమంగా గ్రహిస్తాము. మనలో చాలామందిమి మోసే భారాలు—అవి భావోద్వేగపరమైనవైనా, శారీరకమైనవైనా—వాటి గురించి ఆయనకు తెలుసు, అవి ఏర్పడటానికి మనం కారణం కాదనీ ఆయనకు తెలుసు. ఆయన ప్రేమపూర్వకంగా దీన్ని పరిగణలోనికి తీసుకుంటాడు.

మునుపు పేర్కొన్న మార్గరెటా విషయమేమిటి? ఆమెకు యెహోవా గురించి తెలిసినప్పుడు బైబిలును పఠించటం ఎంతో ప్రయోజనకరంగా ఉన్నట్లు ఆమె కూడా గ్రహించింది. ఆమె కూడా ఫ్రిట్జ్‌లానే తండ్రి అనే పదానికున్న పరిభాషను మళ్ళీ నిర్వచించుకోవల్సివచ్చింది. మార్గరెటా పఠనం ద్వారా తను నేర్చుకున్నదాన్ని బలపర్చుకోవటానికి ప్రార్థన ఆమెకు సహాయం చేసింది. “నాకు ప్రేమపూర్వకమైన తండ్రి లేడు గాని, ప్రేమపూర్వకమైన స్నేహితులు ఉండటంతో, మొదట్లో నేను యెహోవాను ఎంతో సన్నిహితమైన స్నేహితునిగా దృష్టించాను. నెమ్మదిగా నేను నా భావాల్ని, సందేహాల్ని, చింతల్ని, ఇబ్బందుల్ని యెహోవాకు వ్యక్తపర్చటం నేర్చుకున్నాను. నేను పదేపదే ప్రార్థనలో ఆయనతో మాట్లాడాను, అదే సమయంలో నేనాయన గురించి నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని ఒకదానితో ఒకటి జతచేస్తూ వచ్చాను. కొంతకాలానికి నాలో యెహోవాపట్ల ఎంతగా భావాలు అభివృద్ధి అయ్యాయంటే, ఇప్పుడు ఆయన్ను నా ప్రేమపూర్వకమైన తండ్రిగా దృష్టించటం ఏమాత్రం సమస్యగా లేదు” అని అంటుంది మార్గరెటా.

యావత్తు చింత నుండి విడుదల

ఈ దుష్టమైన పాత విధానం ఉన్నంత వరకు ఎవరూ కూడా చింతల్లేని పరిస్థితి కోసం ఎదురుచూడలేరు. కొంతమంది క్రైస్తవుల్లో చింతలు లేదా తమపై తమకే సందేహాలు మళ్ళీ మళ్ళీ కలుగుతుండవచ్చు, దీని మూలంగా తీవ్రమైన నిరాశ కలుగుతుండవచ్చు. కానీ యెహోవా మనలోని సదుద్దేశాల్ని గ్రహిస్తాడని, ఆయన సేవలో మనం సల్పే కృషి ఆయనకు తెలుసని మనం భరోసా కల్గివుండగలము. మనం ఆయన నామంపట్ల ప్రదర్శించే ప్రేమను ఆయనెన్నడూ మర్చిపోడు.—హెబ్రీయులు 6:10.

మెస్సీయా రాజ్యం కింద కొత్త భూమి సమీపిస్తోంది, అందులో విశ్వసనీయులైన మానవులందరూ ఈ సాతాను విధానపు భారాలన్నీ మటుమాయమౌతాయని ఎదురుచూడవచ్చు. అదెంత ఉపశమనాన్నిస్తుందో కదా ! అప్పుడు యెహోవా ఎంత దయార్ద్రహృదయుడో అన్నదానికి మరిన్ని రుజువులను మనం చూస్తాము. అప్పటివరకు మనం, “దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు” అన్న భరోసాను కల్గివుందాము.—1 యోహాను 3:19.

[అధస్సూచీలు]

^ పేరా 8 పేర్లు మార్చబడ్డాయి.

[30వ పేజీలోని బ్లర్బ్‌]

యెహోవా నిరంకుశుడు కాడు, వాత్సల్యం, సానుభూతి, ఔదార్యం, కనికరాలుగల తండ్రి

[31వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్య పఠనం, మనం ఆయనలా ఆలోచించటానికి సహాయపడుతుంది