కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం—భూమిపై ఒక క్రొత్త పరిపాలన

దేవుని రాజ్యం—భూమిపై ఒక క్రొత్త పరిపాలన

దేవుని రాజ్యం​—⁠భూమిపై ఒక క్రొత్త పరిపాలన

“ఆ రాజ్యము . . . ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”​—⁠దానియేలు 2:⁠44.

1. బైబిలు మనకెలాంటి సమాచారాన్ని ఇవ్వగలదని మనం నమ్మకం కల్గివుండగలము?

దేవుడు బైబిలు ద్వారా తనను తాను మానవులకు బయల్పర్చుకున్నాడు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీరు దేవునిగూర్చిన వర్తమానవాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి.” (1 థెస్సలొనీకయులు 2:​13) మనం దేవుని గురించి తెలుసుకోవలసిన మూడు విషయాలు బైబిల్లో ఉన్నాయి. అవి: ఆయన వ్యక్తిత్వం, ఆయన ఉద్దేశాలు, ఆయన మన నుండి కోరే వాటిని గురించిన సమాచారం. అలాగే కుటుంబ జీవితానికి సంబంధించి, అనుదిన ప్రవర్తనకు సంబంధించి బైబిల్లో సర్వశ్రేష్ఠమైన ఉపదేశం ఉంది. గతంలో నెరవేరిన, ఇప్పుడు నెరవేరుతున్న, భవిష్యత్తులో నెరవేరనున్న ప్రవచనాల వివరాలను అది అందజేస్తుంది. అవును, “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”​—⁠2 తిమోతి 3:16, 17.

2. బైబిలు యొక్క ముఖ్యాంశాన్ని యేసు ఎలా నొక్కి చెప్పాడు?

2 దేవుని సర్వోన్నతాధిపత్యాన్ని (పరిపాలించేందుకు ఆయనకున్న హక్కును) ఆయన తన పరలోక రాజ్యం ద్వారా నిరూపించడమే బైబిలు యొక్క ముఖ్యాంశం, బైబిలులోని అత్యంత ప్రధానమైన విషయం అదే. యేసు ఆ ముఖ్యాంశాన్నే తన పరిచర్యకు కేంద్రబిందువుగా చేసుకున్నాడు. “యేసు​—⁠పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.” (మత్తయి 4:​17) “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి” అని ఉద్బోధిస్తూ, అది మన జీవితాల్లో ఏ స్థానాన్ని కల్గివుండాలో ఆయన చూపించాడు. (మత్తయి 6:​33) అంతేగాక, “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని దేవునికి ప్రార్థించమని తన అనుచరులకు బోధించడం ద్వారా కూడా ఆ రాజ్యం ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన చూపించాడు.​—⁠మత్తయి 6:​9, 10.

భూమిపై క్రొత్త పరిపాలన

3. దేవుని రాజ్యం మనకెందుకంత ప్రాముఖ్యమైనది?

3 దేవుని రాజ్యం మానవులకు ఎందుకంత ప్రాముఖ్యమైనది? ఎందుకంటే అది త్వరలోనే భూమిపైనున్న పరిపాలనను శాశ్వతంగా మార్చివేసే చర్యను తీసుకుంటుంది. దానియేలు 2:⁠44 నందలి ప్రవచనం ఇలా పేర్కొంటుంది: “ఆ [ఇప్పుడు భూమిని పరిపాలిస్తున్న] రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము [పరలోకంలో ఒక ప్రభుత్వాన్ని] స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని [భూ ప్రభుత్వములను] పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” దేవుని పరలోక రాజ్యం పరిపాలనను సంపూర్ణంగా ప్రారంభించినప్పుడు, మానవులు భూమిపై ఇక ఎంతమాత్రం అధికారం చేయలేరు. అనైక్యతకు, అసంతృప్తికి మూలమైన మానవ ప్రభుత్వం ఇక గతించిన విషయమై ఉంటుంది.

4, 5. (ఎ) పరలోక రాజ్యానికి రాజుగా ఉండేందుకు యేసు ఎందుకు అన్ని విధాల అర్హుడు? సమీప భవిష్యత్తులో యేసుకు ఏ పని అప్పగించబడుతుంది?

4 యెహోవా నడిపింపు క్రింద, యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి ప్రధాన పరిపాలకునిగా ఉంటాడు, అందుకాయనకు పూర్తి అర్హత ఉంది. ఎందుకంటే ఆయన భూమిపైకి రాకముందు, దేవుని సృష్టి అంతటిలో మొదటివాడై ఉండి, పరలోకంలో దేవుని “ప్రధానశిల్పి”గా ఉన్నాడు. (సామెతలు 8:​22-31) అంతేగాక, “ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు . . . ఆయనయందు సృజింపబడెను.” (కొలొస్సయులు 1:​15, 16) అలాగే, దేవుడు ఆయనను భూమిపైకి పంపించినప్పుడు, ఆయన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన ఎంతో కష్టతరమైన పరీక్షలను సహితం సహించి, మరణం వరకు తన తండ్రిపట్ల యథార్థంగా ఉన్నాడు.​—⁠యోహాను 4:34; 15:⁠10.

5 మరణం వరకు దేవునిపట్ల తన యథార్థతను కాపాడుకున్నందుకు యేసు ప్రతిఫలాన్ని పొందాడు. దేవుడు ఆయనను పరలోకానికి పునరుత్థానం చేసి, పరలోక రాజ్యానికి రాజయ్యే హక్కును ఆయనకు ఇచ్చాడు. (అపొస్తలుల కార్యములు 2:​32-36) భూమిపై నుండి మానవ పరిపాలననూ మన భూగోళం మీది నుండి దుష్టత్వపు పీడనూ నిర్మూలించే పనిలో శక్తివంతమైన వేవేల ఆత్మ ప్రాణులకు నాయకత్వం వహించే అత్యద్భుతమైన నియామకం ఆ రాజ్యానికి రాజుగా క్రీస్తుయేసుకు ఇవ్వబడుతుంది. (సామెతలు 2:21, 22; 2 థెస్సలొనీకయులు 1:6-10; ప్రకటన 19:11-21; 20:​1-3) అప్పుడు క్రీస్తు నాయకత్వం క్రిందనున్న దేవుని పరలోక రాజ్యం భూమిపై క్రొత్త పరిపాలనగా అవతరిస్తుంది, అంటే మొత్తం భూమి మీద అదే ఏకైక ప్రభుత్వంగా ఉంటుంది.​—⁠ప్రకటన 11:⁠15.

6. పరలోక రాజ్య పరిపాలకుని పరిపాలన ఎలా ఉంటుందని మనం ఎదురుచూడవచ్చు?

6 క్రొత్త భూ పరిపాలకుని గురించి దేవుని వాక్యం ఇలా చెప్తుంది: “సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను.” (దానియేలు 7:​14) దేవునిలానే యేసు కూడా ప్రేమ గలవాడు గనుక, ఆయన పరిపాలన క్రింద శాంతి సంతోషాలు వెల్లివిరుస్తాయి. (మత్తయి 5:5; యోహాను 3:16; 1 యోహాను 4:​7-10) “మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగు[ను],” ఆయన “న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు[ను].” (యెషయా 9:​7) ప్రేమ, నీతి న్యాయాలతో పరిపాలించే పరిపాలకుడు ఉండడం ఎంత ఆశీర్వాదకరం! అందుకే, 2 పేతురు 3:⁠13 ఇలా ప్రవచిస్తుంది: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశముల [దేవుని పరలోక రాజ్యం] కొరకును క్రొత్త భూమి [ఒక క్రొత్త భూ సమాజం] కొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.”

7. నేడు మత్తయి 24:⁠14 ఎలా నెరవేరుతోంది?

7 నీతిని ప్రేమించేవారందరికీ దేవుని రాజ్యాన్ని గురించిన వార్తే సర్వశ్రేష్ఠమైన వార్త. మనమిప్పుడు ఈ దుష్ట విధానపు “అంత్యదినములలో” జీవిస్తున్నామనడానికి సూచనలో భాగంగా, యేసు ఇలా ప్రవచించాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (2 తిమోతి 3:1-5; మత్తయి 24:​14) దేవుని రాజ్యాన్ని గురించి ఇతరులకు చెప్పడానికి, ఈనాడు 234 దేశాల్లో దాదాపు 60 లక్షలమంది యెహోవాసాక్షులు సంవత్సరానికి వంద కోట్ల కన్నా ఎక్కువ గంటలు వెచ్చిస్తుండగా, ఆ ప్రవచనం నెరవేరుతోంది. యుక్తమైన రీతిలోనే, వారు ఆరాధన కోసం కూడుకునే స్థలాలు రాజ్యమందిరాలని పిలువబడుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా 90,000 సంఘాలు అలాంటి రాజ్యమందిరాలను ఉపయోగించుకుంటున్నాయి. రానున్న క్రొత్త ప్రభుత్వం గురించి నేర్చుకునేందుకు ప్రజలు అక్కడ సమకూడతారు.

సహ పరిపాలకులు

8, 9. (ఎ) క్రీస్తు సహ పరిపాలకులు ఎక్కడి నుండి వస్తారు? (బి) రాజు, ఆయన సహ పరిపాలకుల పరిపాలన గురించి మనమే నమ్మకం కల్గివుండవచ్చు?

8 దేవుని పరలోక రాజ్యంలో క్రీస్తు యేసుతోపాటు పరిపాలించేందుకు సహపరిపాలకులు ఉంటారు. “మనుష్యులలోనుండి కొనబడిన” 1,44,000 మంది వ్యక్తులు పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడతారని ప్రకటన 14:1-4 వచనాలు ప్రవచించాయి. ఇతరుల సేవలను అందుకునే బదులు దేవునికి, తోటి మానవులకు సేవ చేసిన స్త్రీపురుషులు వీరిలో ఉంటారు. “వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.” (ప్రకటన 20:⁠6) “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి” ఈ విధానాంతాన్ని తప్పించుకునే, “యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము” యొక్క సంఖ్య కంటే వీరి సంఖ్య చాలా తక్కువ. వారు కూడా దేవునికి “రాత్రింబగళ్లు” సేవచేస్తుంటారు గానీ వారికి పరలోక నిరీక్షణ ఉండదు. (ప్రకటన 7:​9, 15) దేవుని పరలోక రాజ్య పౌరులుగా వారు క్రొత్త భూమికి పునాది అవుతారు.​—⁠కీర్తన 37:29; యోహాను 10:⁠16.

9 పరలోకంలో క్రీస్తుతోపాటు పరిపాలించేందుకు, జీవితంలోని ఒడిదుడుకులన్నిటినీ అనుభవించిన నమ్మకమైన సేవకులను యెహోవా ఎంపిక చేసుకున్నాడు. రాజులూ యాజకులూ అయిన వీళ్లు, మానవులకు రాగల కష్టాల్లో వేటినీ అనుభవించకుండా ఉండలేదు. కాబట్టి వాళ్లు ఈ భూమిపై గడిపిన జీవితం, వారి పరిపాలనా సామర్థ్యాన్ని మరింత అధికం చేస్తుంది. చివరికి యేసు కూడా “తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చు”కొన్నాడు. (హెబ్రీయులు 5:⁠8) ఆయనను గురించి అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.” (హెబ్రీయులు 4:​15) నీతియుక్తమైన దేవుని నూతన లోకంలో ప్రేమ, సానుభూతి గల రాజులూ యాజకులూ ప్రజలను పరిపాలిస్తారని తెలుసుకోవడం ఎంతటి ఓదార్పునిస్తుందో కదా!

ఆ రాజ్యం దేవుని సంకల్పంలో ఒక భాగమేనా?

10. పరలోక రాజ్యం దేవుని ఆది సంకల్పంలో ఎందుకు ఒక భాగం కాదు?

10 దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు పరలోక రాజ్యం దేవుని ఆది సంకల్పంలో ఒక భాగమేనా? మానవజాతిని పరిపాలించే ఒక రాజ్యాన్ని గూర్చి ఆదికాండములోని సృష్టి వృత్తాంతంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. యెహోవాయే వారి పరిపాలకుడు, వారు ఆయనకు విధేయులై ఉన్నంత వరకూ మరో పరిపాలన అవసరమే లేదు. ఆదికాండము మొదటి అధ్యాయం చూపిస్తున్నట్లుగా, యెహోవా బహుశా పరలోకంలోని తన మొదటి కుమారుని ద్వారా ఆదాము హవ్వలతో వ్యవహరించి ఉంటాడు. ఆ వృత్తాంతం, “దేవుడు వారితో చెప్పెను,” “దేవుడు . . . పలికెను” వంటి వ్యక్తీకరణలను ఉపయోగిస్తుంది.​—⁠ఆదికాండము 1:​28-30; యోహాను 1:⁠1.

11. మానవజాతికి ఎలాంటి పరిపూర్ణ ప్రారంభం లభించింది?

11 “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను” అని బైబిలు చెప్తుంది. (ఆదికాండము 1:​31) ఏదెను తోటలో ఉన్న ప్రతిదీ పరిపూర్ణమైనది. ఆదాము హవ్వలు ఒక పరదైసులో జీవించారు. వాళ్లు మానసికంగా, శారీరకంగా పరిపూర్ణులు. వారు తమ సృష్టికర్తతోనూ, ఆయన వారితోనూ సంభాషించుకోగలిగేవారు. యెహోవా పట్ల నమ్మకంగా ఉండడం ద్వారా, వారు పరిపూర్ణులైన పిల్లలకు జన్మనిచ్చి ఉండేవారు. ఒక క్రొత్త పరలోక ప్రభుత్వం అవసరమయ్యేదే కాదు.

12, 13. పరిపూర్ణులైన మానవులు విస్తరించినప్పటికీ దేవుడు ఎందుకు వారితో సంభాషించి ఉండగలిగేవాడు?

12 మానవ కుటుంబం విస్తరిస్తుండగా, దేవుడు వారందరితోనూ ఎలా సంభాషించి ఉండేవాడు? ఆకాశంలోని నక్షత్రాలను చూడండి. అవి గ్యాలక్సీలని పిలువబడే ద్వీప విశ్వాలుగా ఏర్పడి ఉన్నాయి. కొన్ని గ్యాలక్సీలలో వంద కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మరికొన్నింట్లో 10 లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనం చూడగల విశ్వంలో దాదాపు ఒక లక్ష కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు! అయినప్పటికీ, సృష్టికర్త ఇలా అంటున్నాడు: “మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.”​—⁠యెషయా 40:⁠26.

13 ఈ ఆకాశ సమూహాలన్నిటి వివరాలను గుర్తుంచుకోవడం దేవునికి ఎంతమాత్రం కష్టం కాదు గనుక, అంతకంటే తక్కువ సంఖ్యలో ఉన్న మానవుల వివరాలను గుర్తుంచుకోవడం కచ్చితంగా ఆయనకు సమస్యేమీ కాదు. ఇప్పుడు కూడా, ఆయన సేవకులు లక్షలాదిమంది ప్రతిదినం ఆయనకు ప్రార్థిస్తారు. ఆ ప్రార్థనలన్నీ దేవునికి తక్షణమే చేరుతాయి. కాబట్టి, పరిపూర్ణులైన మానవులతో సంభాషించడం ఆయనకేమాత్రం సమస్య అయి ఉండేది కాదు. వారి వివరాలను గుర్తుంచుకునేందుకు ఆయనకు ఒక పరలోక రాజ్యం అవసరమై ఉండేదీ కాదు. యెహోవాను పరిపాలకునిగా కల్గివుండి, నేరుగా ఆయనను సమీపించగల్గుతూ, ఎన్నడూ మరణించకుండా నిరంతరం పరదైసు భూమిపై జీవించగల్గడం ఎంత అద్భుతమైన ఏర్పాటు!

‘నరులవశములో లేదు’

14. మానవులకు నిరంతరం యెహోవా పరిపాలన ఎందుకు అవసరం?

14 అయితే, మానవులకు​—⁠పరిపూర్ణులైన మానవులకు సహితం​—⁠యెహోవా పరిపాలన మాత్రం నిరంతరమూ అవసరం ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే తన పరిపాలన నుండి స్వతంత్రంగా ఉండడంలో విజయం సాధించే సామర్థ్యంతో యెహోవా వారిని సృష్టించలేదు. అది వారిపై విధించబడిన ఒక శిలాశాసనమే, అందుకే యిర్మీయా కూడా ఇలా వ్యాఖ్యానించాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. యెహోవా, . . . నన్ను శిక్షింపుము.” (యిర్మీయా 10:​23, 24) యెహోవా తమను పరిపాలించకుండా తాము సమాజాన్ని విజయవంతంగా క్రమబద్ధం చేసుకోగలమని మానవులు అనుకోవడం ఘోరమైన పొరబాటు. అది వాళ్లు సృష్టించబడిన విధానానికే విరుద్ధం. యెహోవా పరిపాలన నుండి స్వాతంత్ర్యాన్ని పొందడం స్వార్థాన్నీ, ద్వేషాన్నీ, క్రూరత్వాన్నీ, దౌర్జన్యాన్నీ, మరణాన్నీ, యుద్ధాలనూ తీసుకువస్తుంది. ‘ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకోవడమే జరుగుతుంది.’​—⁠ప్రసంగి 8:⁠9.

15. మన మొదటి తల్లిదండ్రులు తప్పు ఎంపికను చేసుకోవడం వల్ల ఏర్పడిన పర్యవసానాలేమిటి?

15 దుఃఖకరంగా, దేవుడు తమ పరిపాలకునిగా అవసరం లేదని భావిస్తూ, మన మొదటి తల్లిదండ్రులు ఆయన నుండి స్వతంత్రంగా జీవించటానికి ఎంపిక చేసుకున్నారు. ఫలితంగా, దేవుడు వారిని పరిపూర్ణతలో ఉంచలేదు. దానితో వాళ్లు విద్యుత్‌ సరఫరా నిలిపివేయబడిన విద్యుత్‌ ఉపకరణంలా తయారయ్యారు. కాబట్టి కొంతకాలానికి వాళ్లు క్రమక్రమంగా కృశించిపోయి, చివరికి మరణించారు. వాళ్లు లోపమున్న మూసలా తయారయ్యారు, వాళ్లు ఆ స్థితినే తమ సంతానానికీ సంక్రమింపజేశారు. (రోమీయులు 5:​12) “[యెహోవా] ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు. . . . వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు; వారు కళంకులు.” (ద్వితీయోపదేశకాండము 32:​4, 5) నిజమే, సాతానుగా మారిన తిరుగుబాటుదారుడైన ఆత్మ ప్రాణి ఆదాము హవ్వలను ప్రభావితం చేశాడు, కానీ వాళ్లకు పరిపూర్ణమైన మనస్సులున్నాయి, కాబట్టి వాళ్లు అతని తప్పుడు సలహాలను నిరాకరించి ఉండగలిగేవారే.​—⁠ఆదికాండము 3:1-19; యాకోబు 4:⁠7.

16. దేవుని నుండి స్వతంత్రంగా ఉండడం వల్ల వచ్చిన ఫలితమేమిటని చరిత్ర నిరూపిస్తుంది?

16 దేవుని నుండి స్వతంత్రంగా ఉండడం వల్ల వచ్చే పర్యవసానాలను చరిత్రలో కోకొల్లలుగా చూడవచ్చు. వేలాది సంవత్సరాలపాటు ప్రజలు అన్ని రకాలైన ప్రభుత్వాలను, అన్ని విధాలైన ఆర్థిక సాంఘిక విధానాలను ప్రయత్నించి చూశారు. అయినా, దుష్టత్వం “అంతకంతకు” పెరిగిపోతూనే ఉంది. (2 తిమోతి 3:​13) ఇరవయ్యవ శతాబ్దం అది నిజమని నిరూపించింది. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా విషపూరితమైన విద్వేషాలు, హింసాత్మక సంఘటనలు, యుద్ధాలు, ఆకలి, పేదరికం, బాధలతో ఇరవయ్యవ శతాబ్దం పూర్తిగా కళంకితమైవుంది. వైద్య రంగం ఎంతగా పురోభివృద్ధిని సాధించినప్పటికీ, ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి మరణం మాత్రం తథ్యం. (ప్రసంగి 9:​5, 10) తమ మార్గాలను తామే ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మానవులు సాతానుకు అతని దయ్యాలకు ఎరగా అంటే, బైబిలు సాతానును “ఈ యుగ సంబంధమైన దేవత” అని పిలిచేంతగా వాళ్లు దానికి ఎరగా దొరికారు.​—⁠2 కొరింథీయులు 4:⁠4.

స్వేచ్ఛాచిత్తమనే బహుమానం

17. దేవుడిచ్చిన స్వేచ్ఛాచిత్తమనే బహుమానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి?

17 మానవులు స్వతంత్రంగా ఉండడానికి యెహోవా ఎందుకు అనుమతిస్తాడు? ఎందుకంటే, ఆయన వారికి స్వేచ్ఛాచిత్తమనే అద్భుతమైన బహుమానాన్ని అంటే ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యాన్ని ఇవ్వడమే దానికి కారణం. “[యెహోవా] ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (2 కొరింథీయులు 3:​17) ప్రతిక్షణం ఏమి చెప్పాలి, ఏమి చేయాలి అనేది ఎవరో నిర్ణయించవలసిన రోబోట్‌లలా ఉండాలని మానవులెవరూ కోరుకోరు. కానీ వాళ్లు తన చిత్తాన్ని చేయడంలోని విజ్ఞతను గ్రహించి తనకు విధేయులై ఉండి, ఆ స్వేచ్ఛా చిత్తాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని యెహోవా కోరాడు. (గలతీయులు 5:​13) కాబట్టి ఆ స్వాతంత్ర్యం సంపూర్ణమైనది కాదు, అలా సంపూర్ణమైనదైతే అరాచకత్వం ఏర్పడుతుంది. కాబట్టి దేవుడిచ్చిన ప్రయోజనార్థకమైన చట్టాల పరిధుల్లోనే దాన్ని క్రమబద్ధం చేయాల్సివుంది.

18. మానవులు స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించడం ద్వారా దేవుడు ఏమి చూపించాడు?

18 మానవ కుటుంబం దాని ఇష్టానుసారంగా ఉండడానికి అనుమతించడం ద్వారా దేవుడు, తన పరిపాలన మనకు అవసరమని మళ్ళీ ఎన్నడూ ఎటువంటి సందేహానికి తావులేకుండా అనుపమానమైన మార్గంలో సుస్పష్టం చేశాడు. ఆయన పరిపాలించే విధానం మాత్రమే, ఆయన సర్వోన్నతాధిపత్యం మాత్రమే సరైనది. అది అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని, సమృద్ధిని తెస్తుంది. దానికి కారణం ఏమిటంటే మన మనస్సులు, శరీరాలు ఆయన చట్టాలకు అనుగుణ్యంగా నడుచుకుంటేనే చక్కగా పనిచేసేలా యెహోవా వాటిని రూపొందించాడు. “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.” (యెషయా 48:​17) దేవుని చట్టాల పరిధిలో ఉపయోగించబడే స్వేచ్ఛాచిత్తం ఒక భారంలా ఉండదు గానీ, అది వివిధ రకాలైన సంతృప్తికరమైన ఆహారం, ఇళ్లు, కళలు, సంగీతం వంటివాటిని ఆనందించడాన్ని సాధ్యం చేస్తుంది. స్వేచ్ఛాచిత్తాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే, పరదైసు భూమిపై జీవితం అద్భుతమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండేది.

19. మానవులు తనతో సమాధానపడేలా చేసుకోవడానికి దేవుడు ఏ సాధనాన్ని ఉపయోగిస్తున్నాడు?

19 కానీ సరైన దాన్ని ఎంపిక చేసుకోకపోవడం వల్ల మానవులు యెహోవా నుండి తమను తాము దూరం చేసుకుని, అపరిపూర్ణులై, కృశించి, మరణిస్తున్నారు. కాబట్టి వారు ఆ దుఃఖకరమైన స్థితి నుండి విమోచించబడి, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయనతో సరైన సంబంధంలోకి తీసుకురాబడవలసిన అవసరం ఉంది. దేవుడు దీన్ని సాధించడానికి ఎంచుకున్న సాధనమే ఆయన రాజ్యం, విమోచకుడు యేసుక్రీస్తు. (యోహాను 3:​16) ఈ ఏర్పాటు ద్వారా నిజంగా పశ్చాత్తాపపడిన వారు, యేసు ఉపమానంలోని తప్పిపోయిన కుమారునిలా, దేవునితో సమాధానపడి, ఆయన పిల్లలుగా తిరిగి స్వీకరించబడతారు.​—⁠లూకా 15:11-24; రోమీయులు 8:​20, 21; 2 కొరింథీయులు 6:⁠16-18.

20. దేవుని రాజ్యము ద్వారా ఆయన సంకల్పం ఎలా నెరవేర్చబడనైయుంది?

20 యెహోవా చిత్తం ఈ భూమిపై తప్పక నెరవేరుతుంది. (యెషయా 14:24, 27; 55:​11) క్రీస్తు పరిపాలన క్రింద తన రాజ్యం ద్వారా దేవుడు తాను సర్వోన్నతాధిపతిగా ఉండేందుకు తనకున్న హక్కును (న్యాయమని నిరూపించుకుంటాడు లేక రుజువు చేసుకుంటాడు) సంపూర్ణంగా నిరూపించుకుంటాడు. ఆ రాజ్యం ఈ భూమిపైనున్న మానవుల, దయ్యాల పరిపాలనకు అంతం తీసుకువస్తుంది, అది మాత్రమే పరలోకం నుండి వెయ్యి సంవత్సరాలపాటు పరిపాలిస్తుంది. (రోమీయులు 16:20; ప్రకటన 20:​1-6) కానీ ఆ సమయంలో, యెహోవా పరిపాలనా విధానం శ్రేష్ఠమైనదని ఎలా ప్రదర్శించబడుతుంది? వెయ్యి సంవత్సరాల తర్వాత, ఆ రాజ్యం ఏ పాత్రను నిర్వహిస్తుంది? తర్వాతి శీర్షిక ఈ ప్రశ్నలను పరిశీలిస్తుంది.

పునఃపరిశీలన కోసం అంశాలు

• బైబిలు ముఖ్యాంశం ఏమిటి?

• భూమిపై క్రొత్త పరిపాలన ఎవరిదై ఉంటుంది?

• దేవుని నుండి స్వతంత్రంగా ఉండే మానవ పరిపాలన ఎందుకు ఎన్నడూ విజయవంతం కాలేదు?

• స్వేచ్ఛా చిత్తాన్ని ఎలా ఉపయోగించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రం]

యేసు చేసిన బోధ, దేవుడు తన రాజ్యం ద్వారా చేసే పరిపాలనను నొక్కి చెప్పింది

[12వ పేజీలోని చిత్రాలు]

దేవుని రాజ్యమే ప్రతి దేశంలోనూ ఉన్న యెహోవాసాక్షుల ముఖ్య బోధనాంశం

[14వ పేజీలోని చిత్రాలు]

దేవుని నుండి స్వతంత్రంగా ఉండడం వల్ల వచ్చే ఫలితాలకు చరిత్ర సాక్ష్యమిస్తుంది

[చిత్రసౌజన్యం]

WWI soldiers: U.S. National Archives photo; concentration camp: Oświęcim Museum; child: UN PHOTO 186156/J. Isaac