కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

“నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.”​—⁠మత్తయి 6:​9, 10.

1. దేవుని రాజ్య ఆగమనంతో ఏమి జరుగుతుంది?

దేవుని రాజ్యపు రాక కోసం ప్రార్థించమని యేసు తన అనుచరులకు బోధించాడు. దాని ఆగమనం, దేవుని నుండి స్వతంత్రంగా వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న మానవ పరిపాలనను తుదముట్టిస్తుందని ఆయనకు అప్పుడే తెలుసు. అప్పటి నుండి ఇప్పటి వరకు, భూమిపైనున్న ప్రజల్లో అత్యధికులు దేవుని చిత్తాన్ని చేయడంలేదు. (కీర్తన 147:​19, 20) కానీ పరలోకంలో రాజ్యం స్థాపించబడింది గనుక, దేవుని చిత్తం సర్వత్రా నెరవేరాల్సిందే. మానవ పరిపాలన పోయి దేవుని పరలోక రాజ్యపు పరిపాలన వచ్చే అత్యద్భుతమైన సమయం సమీపిస్తోంది.

2. మానవ పరిపాలన పోయి దేవుని రాజ్య పరిపాలన వచ్చే కాలానికి గుర్తు ఏమిటి?

2 ఈ మార్పుకు గుర్తేమిటంటే, “అప్పుడు మహా శ్రమ కలుగును . . . లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు” అని యేసు చెప్పిన కాలమే. (మత్తయి 24:​21) దాని కాలవ్యవధి ఎంతన్నది బైబిలు చెప్పడం లేదు, ఆ కాలంలో సంభవించే విపత్తులు మాత్రం లోకం ఇంతవరకూ చూడనంత ఘోరమైనవై ఉంటాయి. మహాశ్రమల ప్రారంభంలో, భూమి మీదనున్న చాలామంది ప్రజలను దిగ్భ్రమపర్చే విషయం ఒకటి సంభవిస్తుంది, అదే: అబద్ధ మత నాశనం. కానీ యెహోవాసాక్షులను అది ఎంతమాత్రం దిగ్భ్రమపర్చదు ఎందుకంటే వాళ్లు ఎప్పటి నుండో దాని కోసం ఎదురు చూస్తున్నారు. (ప్రకటన 17:1, 15-17; 18:​1-24) అర్మగిద్దోను సమయంలో దేవుని రాజ్యం సాతాను విధానాన్నంతటినీ నిర్మూలించడంతో మహా శ్రమ ముగుస్తుంది.​—⁠దానియేలు 2:44; ప్రకటన 16:​14-16.

3. అవిధేయులకు సంభవించబోయే దుర్గతి గురించి యిర్మీయా ఎలా వివరిస్తున్నాడు?

3 “దేవుని నెరుగని” ప్రజలకూ, క్రీస్తు చేతుల్లోవున్న ఆయన పరలోక రాజ్యాన్ని గురించిన “సువార్తకు లోబడని” వారికీ ఏమి జరుగుతుంది? (2 థెస్సలొనీకయులు 1:​6-10) బైబిలు ప్రవచనం ఇలా చెప్తుంది: “జనమునుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతములనుండి గొప్ప తుపాను బయలు వెళుచున్నది. ఆ దినమున యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును.”​—⁠యిర్మీయా 25:32, 33.

దుష్టత్వపు అంతం

4. యెహోవా ఈ దుష్ట విధానాన్ని అంతం చేయడమన్నది ఎందుకు పూర్తిగా న్యాయసమ్మతమైనది?

4 వేలాది సంవత్సరాలుగా యెహోవా దేవుడు దుష్టత్వాన్ని సహించాడు, మానవ పరిపాలన ఒక ఘోరమైన వైఫల్యమని యథార్థ హృదయులు గ్రహించేందుకు అవసరమైనంత సమయం వరకు ఆయన దాన్ని సహించాడు. ఉదాహరణకు, కేవలం 20వ శతాబ్దంలోనే యుద్ధాలు, తిరుగుబాట్లు, ఇతర అల్లకల్లోలాల్లో 15 కోట్ల కన్నా ఎక్కువమంది ప్రజలు చంపబడ్డారని ఒక పుస్తకం తెలియజేస్తుంది. ప్రాముఖ్యంగా, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దాదాపు ఐదు కోట్లమంది ప్రజలు చంపబడినప్పుడు, నాజీ నిర్బంధ శిబిరాల్లో ఎంతోమంది దుర్మరణం పాలైనప్పుడు మానవుని విషస్వభావం బయటపడింది. బైబిలు ప్రవచించినట్లుగానే, మన కాలంలో ‘దుర్జనులు, వంచకులు అంతకంతకు చెడిపోతున్నారు.’ (2 తిమోతి 3:1-5, 13) నేడు లైంగిక దుర్నీతి, నేరం, దౌర్జన్యం, భ్రష్టత్వం, దేవుని ప్రమాణాలంటే ధిక్కారం పెచ్చు పెరిగిపోతున్నాయి. కాబట్టి, యెహోవా ఈ దుష్ట విధానాన్ని అంతం చేయడమన్నది పూర్తిగా న్యాయసమ్మతమైనదే.

5, 6. ప్రాచీన కనానులోని దుష్టత్వాన్ని వివరించండి.

5 ఇప్పుడున్న పరిస్థితి, దాదాపు 3,500 సంవత్సరాల క్రితం కనానులో ఉన్న పరిస్థితిలానే ఉంది. “యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు” అని బైబిలు చెప్తుంది. (ద్వితీయోపదేశకాండము 12:​31) యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ఇలా తెలియజేశాడు: “ఈ జనముల చెడుతనమును బట్టియే . . . నీ దేవుడైన యెహోవా వారిని నీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్నాడు.” (ద్వితీయోపదేశకాండము 9:⁠5) బైబిలు చరిత్రకారుడైన హెన్రీ హెచ్‌. హేలీ ఇలా పేర్కొన్నాడు: “బయలు, అష్టారోతు, ఇతర కనాను దేవుళ్ల ఆరాధనలో ఎన్నో ఆచారకర్మలు ఉండేవి; వారి ఆలయాలు నీచత్వానికి కేంద్రాలుగా ఉండేవి.”

6 వారి దుష్టత్వం ఎంత ఎక్కువైపోయిందో హేలీ తెలియజేస్తున్నాడు, అలాంటి స్థలాల్లోని ఒకదానిలో, పురావస్తు శాస్త్రజ్ఞులు, “బయలుకు బలి ఇవ్వబడిన శిశువుల అవశేషాలున్న అనేక పాత్రలను కనుగొన్నారు.” ఆయన ఇంకా ఇలా చెప్తున్నాడు: “ఆ ప్రాంతమంతా నవజాత శిశువులకు శ్మశానంగా తయారైంది. . . . లైంగిక దుర్నీతిలో నిమగ్నమవ్వడం ద్వారా, . . . ఆ తర్వాత, తమ మొదటి సంతానాన్ని బలిగా అర్పించడం ద్వారా కనానీయులు ఈ దేవుళ్లను ఆరాధించేవారు. కనాను దేశం చాలామేరకు జాతీయ స్థాయిలో సొదొమ గొమొఱ్ఱాలలా తయారైనట్లు కనిపిస్తుంది. . . . అలాంటి అసహ్యకరమైన నీచత్వం మరియు క్రూరత్వం గల నాగరికతకు ఇంకా ఉనికిలో ఉండే హక్కు ఉందా? . . . కనాను నగరాల శిథిలాలను త్రవ్విన పురావస్తు శాస్త్రజ్ఞులు, దేవుడు వారిని నాశనం చేసినదాని కంటే ఇంకా ముందే ఎందుకు నాశనం చేయలేదా అని ఆశ్చర్యపోతున్నారు.”

భూమిని స్వతంత్రించుకోవడం

7, 8. దేవుడు ఈ భూమిని ఎలా శుభ్రపరుస్తాడు?

7 దేవుడు కనానును శుభ్రపర్చినట్లుగానే, మొత్తం భూమినంతటినీ శుభ్రపర్చి తన చిత్తాన్ని చేసేవారికి దాన్ని ఇస్తాడు. “యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు.” (సామెతలు 2:​21, 22) కీర్తన గ్రంథకర్త ఇలా చెప్తున్నాడు: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:​10, 11) “వెయ్యి సంవత్సరములు గడుచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు” సాతాను కూడా తీసివేయబడతాడు. (ప్రకటన 20:​1-3) అవును, “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”​—⁠1 యోహాను 2:⁠17.

8 భూమిపై నిరంతరం జీవించాలని కోరుకునే వారికున్న మహిమాన్వితమైన నిరీక్షణ గురించి చెప్తూ, యేసు ఇలా అన్నాడు: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” (మత్తయి 5:⁠5) ఆయన బహుశా, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అని కీర్తన 37:⁠29 లో ప్రవచించబడిన దాన్ని ఉద్దేశించి ఆ మాటలు చెప్పివుండవచ్చు. యథార్థహృదయులు పరదైసు భూమిపై నిరంతరం జీవించాలన్నది యెహోవా సంకల్పమని యేసుకు తెలుసు. “అధిక బలముచేత . . . భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను” అని యెహోవా చెప్తున్నాడు.​—⁠యిర్మీయా 27:⁠5.

అద్భుతమైన నూతన లోకం

9. దేవుని రాజ్యం ఏవిధమైన లోకాన్ని తీసుకువస్తుంది?

9 అర్మగిద్దోను తర్వాత, దేవుని రాజ్యం ఒక అద్భుతమైన “క్రొత్త భూమి”ని తీసుకువస్తుంది, దానిలో “నీతి నివసించును.” (2 పేతురు 3:​13) అర్మగిద్దోనును తప్పించుకున్న వారికి, అణిచివేసే ఈ దుష్ట విధానం నుండి విముక్తి లభించడం ఎంతటి ఉపశమనాన్ని ఇస్తుందో కదా! నిత్యజీవాన్ని, అత్యద్భుతమైన ఆశీర్వాదాలను దృష్టిలో ఉంచుకుని పరలోక రాజ్య ప్రభుత్వం క్రింద నీతియుక్తమైన నూతన లోకంలోకి ప్రవేశించడానికి వారు ఎంతగా ఆనందిస్తారో కదా!​—⁠ప్రకటన 7:9-17.

10. రాజ్య పరిపాలన క్రింద ఏ చెడ్డ విషయాలు ఇక ఉండవు?

10 ప్రజలు అప్పుడిక యుద్ధం, నేరం, ఆకలి వంటి వాటికి భయపడరు, అంతేగాక చివరికి క్రూరమైన జంతువులు తమపై దాడి చేస్తాయేమోనని కూడా వాళ్లు భయపడవలసిన అవసరం ఉండదు. “నేను [నా ప్రజలతో] సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములో లేకుండ చేయుదును. . . . ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు.” “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు, జనముమీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజారపు చెట్టు క్రిందను కూర్చుండును.”​—⁠యెహెజ్కేలు 34:25-28; మీకా 4:3, 4.

11. శారీరక రుగ్మతలు నిర్మూలించబడతాయని మనం ఎందుకు నమ్మకం కల్గివుండవచ్చు?

11 అనారోగ్యం, దుఃఖం, చివరికి మరణం కూడా నిర్మూలించబడతాయి. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.” (యెషయా 33:​24) “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను]. . . . ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నా[ను].” (ప్రకటన 21:​4, 5) యేసు భూమిపైన ఉన్నప్పుడు, దేవుడు తనకిచ్చిన శక్తితో ఆ పనులను చేసే సామర్థ్యం తనకుందని చూపించాడు. పరిశుద్ధాత్మ మద్దతుతో, యేసు ఆ ప్రాంతమంతటిలో వికలాంగులను బాగుచేశాడు, రోగులను స్వస్థపరిచాడు.​—⁠మత్తయి 15:30, 31.

12. మృతులకు ఏ నిరీక్షణ ఉంది?

12 యేసు అంతకంటే ఎక్కువే చేశాడు. ఆయన మృతులను తిరిగి లేపాడు. దానికి దీనులు ఎలా ప్రతిస్పందించారు? ఆయన 12 ఏళ్ల ఒక అమ్మాయిని పునరుత్థానం చేసినప్పుడు, ఆమె తల్లిదండ్రులు “బహుగా విస్మయ మొందిరి.” (మార్కు 5:​42) రాజ్య పరిపాలన క్రింద యేసు భూవ్యాప్తంగా ఏమి చేస్తాడనే దానికి ఇది మరో ఉదాహరణ, ఎందుకంటే “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్న[ది].” (అపొస్తలుల కార్యములు 24:​14, 15) మరణించిన వారు గుంపులు గుంపులుగా జీవానికి తిరిగి వచ్చి, తమ ప్రియమైనవారిని మళ్లీ కలుసుకున్నప్పుడు ఆనందం ఎంతగా వెల్లివిరుస్తుందో ఒక్కసారి ఊహించండి! “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి” ఉండేలా రాజ్య పర్యవేక్షణ క్రింద గొప్ప విద్యాపని జరుగుతుందనడంలో సందేహం లేదు.​—⁠యెషయా 11:⁠9.

యెహోవా సర్వోన్నతాధిపత్యం న్యాయమని నిరూపించబడడం

13. దేవుని పరిపాలన సరైనదని ఎలా నిరూపించబడుతుంది?

13 వెయ్యేండ్ల రాజ్య పరిపాలన ముగింపుకల్లా, మానవ కుటుంబం మానసికంగా, శారీరకంగా పరిపూర్ణతకు తీసుకురాబడి ఉంటుంది. మొత్తం భూమి అంతా ఏదెను తోటలా, ఒక పరదైసులా మారుతుంది. శాంతి, సంతోషం, భద్రత తిరిగి నెలకొంటాయి, ప్రేమతో నిండిన మానవ సమాజం ఏర్పడుతుంది. రాజ్య పరిపాలనకు ముందు మానవ చరిత్రలో ఇటువంటిదేదీ ఎన్నడూ జరిగివుండదు. గడిచిన వేల సంవత్సరాలుగా దుఃఖకరమైన మానవ పరిపాలనకూ, వెయ్యి సంవత్సరాల దేవుని పరలోక రాజ్యపు మహిమాన్వితమైన పరిపాలనకూ మధ్య ఎంత పెద్ద తేడా కనిపిస్తుందో కదా! దేవుడు తన రాజ్యం ద్వారా చేసే పరిపాలన అన్ని అంశాల్లోనూ ఎంతో ఉన్నతంగా ఉన్నట్లు నిరూపణ అవుతుంది. పరిపాలించేందుకు దేవునికున్న హక్కు, ఆయన సర్వోన్నతాధిపత్యం సంపూర్ణంగా నిరూపించబడుతుంది.

14. వెయ్యేండ్ల అంతంలో తిరుగుబాటుదారులకు ఏమి సంభవిస్తుంది?

14 వెయ్యేండ్ల పరిపాలన ముగింపులో, పరిపూర్ణ మానవులు తాము ఎవరి సేవ చేయాలకుంటున్నామనే విషయంలో తమ స్వేచ్ఛా చిత్తాన్ని ఉపయోగించుకోవటానికి యెహోవా అనుమతిస్తాడు. “వెయ్య సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును” అని బైబిలు చూపిస్తుంది. అతడు మానవులను తప్పుదోవ పట్టించడానికి మళ్లీ ప్రయత్నిస్తాడు, వారిలో కొంతమంది దేవుని నుండి స్వతంత్రంగా ఉండడాన్ని ఎంపిక చేసుకుంటారు. ‘బాధ రెండవమారు రావడాన్ని’ నివారించేందుకు, యెహోవా సాతానును, అతని దయ్యాలను, అలాగే తన సర్వోన్నతాధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారినందరిని, నిర్మూలిస్తాడు. ఆ సమయంలో శాశ్వతంగా నాశనం చేయబడిన ఏ మానవుల విషయంలోనైనా, వాళ్లు తీసుకున్న తప్పుడు చర్య అపరిపూర్ణత మూలంగాననీ లేక వాళ్లకు అవకాశం ఇవ్వబడనందు వల్లననీ ఎవ్వరూ ఇక అభ్యంతరం చెప్పలేరు. ఎందుకంటే వాళ్లు, యెహోవా నీతియుక్తమైన పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకున్న పరిపూర్ణులైన ఆదాము హవ్వల్లా ఉంటారు.​—⁠ప్రకటన 20:7-10; నహూము 1:⁠9.

15. యథార్థవంతులకు యెహోవాతో ఎలాంటి సంబంధం ఉంటుంది?

15 మరో వైపున, బహుశా అధిక శాతంమంది యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని ఉన్నతపర్చడానికి ఎంపిక చేసుకుంటారు. తిరుగుబాటుదారులందరూ నిర్మూలించబడడంతో, నీతిమంతులు తమ అంతిమ యథార్థతా పరీక్షలో విజయం సాధించి యెహోవా ఎదుట నిలబడతారు. ఈ యథార్థవంతులను యెహోవా తన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరిస్తాడు. ఆదాము హవ్వలు తాము తిరుగుబాటు చేయకముందు దేవునితో కల్గివున్నటువంటి సంబంధాన్ని వీళ్లు పొందుతారు. కాబట్టి, “సృష్టి [మానవజాతి] నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” పొందుతుందని చెప్తున్న రోమీయులు 8:⁠20 నెరవేరుతుంది. “మరెన్నడును ఉండకుండ మరణమును [దేవుడు] మ్రింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.”​—⁠యెషయా 25:⁠8.

నిత్యజీవ నిరీక్షణ

16. నిత్యజీవ ప్రతిఫలం కోసం ఎదురు చూడడం ఎందుకు సరైనది?

16 నమ్మకమైనవారికి భవిష్యత్తులో అత్యద్భుతమైన ఆశీర్వాదం లభించనై వుంది, దేవుడు వారిపై ఆధ్యాత్మిక, వస్తుదాయక ఆశీర్వాదాలను నిరంతరం కుమ్మరిస్తూనే ఉంటాడు! కీర్తన గ్రంథకర్త సరిగ్గానే ఇలా అన్నాడు: “నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి [యుక్తమైన] కోరికను తృప్తి పరచుచున్నావు.” (కీర్తన 145:​16) యెహోవా, వారికి తనపైవున్న విశ్వాసంలో ఒక భాగంగా పరదైసులో జీవితమనే నిరీక్షణను కల్గివుండమని భూతరగతికి చెందిన వారిని ప్రోత్సహిస్తున్నాడు. యెహోవా సర్వోన్నతాధిపత్య వివాదాంశం ఎంతో ప్రాముఖ్యమైనదే అయినప్పటికీ, ప్రజలు ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండానే తన సేవ చేయాలని ఆయన కోరడు. బైబిలంతటిలోనూ, దేవునిపట్ల యథార్థంగా ఉండడమూ నిత్యజీవ నిరీక్షణను కల్గి ఉండడమూ ఈ రెండూ కూడా దేవునిపై ఒక క్రైస్తవుడు కల్గివుండవలసిన విశ్వాసంలో అత్యంత అవసరమైన భాగాలుగా విడదీయరాని విధంగా పెనవేసుకుపోయాయి. “దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.”​—⁠హెబ్రీయులు 11:⁠6.

17. మనం మన నిరీక్షణను బట్టి బలపర్చబడడం సరైనదేనని యేసు ఎలా చూపించాడు?

17 “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అని యేసు చెప్పాడు. (యోహాను 17:⁠3) ఇక్కడాయన, దేవుని గురించిన, ఆయన సంకల్పాలను గురించిన జ్ఞానాన్ని, అది తెచ్చే ప్రతిఫలంతో ముడిపెట్టాడు. ఉదాహరణకు, రాజ్యపరిపాలన చేసేటప్పుడు తనను జ్ఞాపకం చేసుకోమని ఒక దొంగ యేసును అడిగినప్పుడు, “నీవు నాతోకూడ పరదైసులో ఉందువని” అన్నాడు. (లూకా 23:​43) ప్రతిఫలం దొరకకపోయినా విశ్వాసం మాత్రం కల్గివుండమని ఆయన ఆ వ్యక్తికి చెప్పలేదు కదా! తన సేవకులు ఈ లోకంలో అనేక శ్రమలను ఎదుర్కొంటుండగా వారిని బలపర్చడానికి సహాయం చేసే నిత్యజీవ నిరీక్షణను వారు కల్గివుండాలని యెహోవా కోరుకుంటున్నాడన్నది యేసుకు తెలుసు. కాబట్టి, క్రైస్తవులముగా సహించడానికి మనకు ఆవశ్యకమైన ఒక సహాయకం, ప్రతిఫలం కోసం నిరీక్షించడమే.

రాజ్య భవితవ్యం

18, 19. వెయ్యేండ్ల పరిపాలన చివరిలో రాజుకు, రాజ్యానికి ఏమౌతుంది?

18 రాజ్యం అన్నది, భూమినీ దానిలోని నివాసులనూ పరిపూర్ణతకు తీసుకువచ్చేందుకు యెహోవా ఉపయోగించే సహాయక ప్రభుత్వం మాత్రమే గనుక, వెయ్యేండ్ల పరిపాలన అనంతరం, రాజైన యేసుక్రీస్తు, 1,44,000 మంది రాజులు యాజకులు ఏ పాత్రను నిర్వహిస్తారు? “అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదములక్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.”​—⁠1 కొరింథీయులు 15:24, 25.

19 క్రీస్తు, రాజ్యాన్ని దేవునికి అప్పగించినప్పుడు, ఆ రాజ్యం నిరంతరం ఉంటుందని చెప్పే లేఖనాలను ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఆ రాజ్యం సాధించిన అంశాలు నిరంతరం నిలిచి ఉంటాయని దానర్థం. దేవుని సర్వోన్నతాధిపత్య నిరూపణ కోసం క్రీస్తు నిర్వహించిన పాత్రను బట్టి ఆయన నిరంతరం గౌరవించబడతాడు. అయితే, అప్పుడు పాప మరణాలు పూర్తిగా నిర్మూలించబడి, మానవజాతి విమోచించబడుతుంది గనుక, విమోచకునిగా ఆయన అవసరం అంతటితో ముగుస్తుంది. రాజ్యం యొక్క వెయ్యేండ్ల పరిపాలన కూడా పూర్తవుతుంది; అప్పుడు యెహోవాకు, విధేయులైన మానవజాతికి మధ్య సహాయక ప్రభుత్వం ఇక ఎంతమాత్రం అవసరం ఉండదు. అప్పుడు, “దేవుడు సర్వములో సర్వమ”వుతాడు.​—⁠1 కొరింథీయులు 15:⁠28.

20. క్రీస్తుకు, ఆయన 1,44,000 మంది సహచరులకు భవిష్యత్తులో ఏమి లభిస్తుందో మనం ఎలా తెలుసుకోగలము?

20 వెయ్యేండ్ల పరిపాలన ముగిసిన తర్వాత క్రీస్తు, ఆయన సహపరిపాలకులు భవిష్యత్తులో ఏ పాత్రను నిర్వహిస్తారు? బైబిలు ఏమీ చెప్పడం లేదు. యెహోవా తన యావత్‌ సృష్టిలో వారికి అనేకానేక అదనపు ఆధిక్యతలను ఇస్తాడని మనం నిశ్చయత కల్గివుండవచ్చు. రాజు కోసం, ఆయన తోటి రాజులు యాజకుల కోసం, అలాగే తన అద్భుతమైన విశ్వమంతటి కోసం యెహోవా ఏమి సంకల్పించాడో తెలుసుకునేందుకు మనం భవిష్యత్తులో సజీవంగా ఉండగలిగేలా, మనమందరం నేడు యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని ఉన్నతపరిచి, నిత్యజీవాన్ని అందుకుందాం!

పునఃపరిశీలన కోసం అంశాలు

• పరిపాలనలో ఏ మార్పు రాబోతుంది?

• దుష్టులకు, నీతిమంతులకు దేవుడు ఎలా తీర్పుతీరుస్తాడు?

• నూతన లోకంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి?

• యెహోవా సర్వోన్నతాధిపత్యం ఎలా సంపూర్ణంగా నిరూపించబడుతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[17వ పేజీలోని చిత్రాలు]

“నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్న[ది]”

[18వ పేజీలోని చిత్రం]

యథార్థవంతులు యెహోవాతో తిరిగి సరైన సంబంధాన్ని ఏర్పరచుకోగల్గుతారు