కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిశుద్ధాత్మను నేను నా వ్యక్తిగత సహాయకుడిగా చేసుకున్నానా?

పరిశుద్ధాత్మను నేను నా వ్యక్తిగత సహాయకుడిగా చేసుకున్నానా?

పరిశుద్ధాత్మను నేను నా వ్యక్తిగత సహాయకుడిగా చేసుకున్నానా?

దేవుని పరిశుద్ధాత్మను గురించి దైవశాస్త్ర తత్వవేత్తలకే గాక సామాన్య మానవులకు కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ, అలాంటి అనిశ్చయత అనవసరం. పరిశుద్ధాత్మ ఏమైవుందో బైబిలు స్పష్టంగా వివరిస్తుంది. కొంతమంది అంటున్నట్లుగా అది ఒక వ్యక్తి కాదుగానీ, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఉపయోగించే చురుకైన శక్తి, ఇది చాలా బలమైనది.​—⁠కీర్తన 104:30; అపొస్తలుల కార్యములు 2:33; 4:31; 2 పేతురు 1:⁠21.

దేవుని సంకల్పాల నెరవేర్పుతో పరిశుద్ధాత్మ చాలా సన్నిహిత సంబంధాన్ని కల్గివుంది గనుక, మనం మన జీవితాలను దానికి అనుగుణ్యంగా మలచుకోవడానికి సుముఖత చూపాలి. దానిని మన వ్యక్తిగత సహాయకుడిగా చేసుకోవడానికి మనం ఇష్టపడాలి.

ఒక సహాయకుడు​—⁠ఎందుకవసరం?

భూమి మీది నుండి తాను తిరిగి వెళ్లడానికి ఎదురుచూస్తూ, యేసు తన శిష్యులకు ఇలా హామీ ఇచ్చాడు: “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను [“సహాయకుడిని,” NW] . . . మీకనుగ్రహించును.” ఆయన ఇంకా ఇలా కూడా అన్నాడు: “అయతే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త [“సహాయకుడు,” NW] మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.”​—⁠యోహాను 14:16, 17; 16:⁠7.

“మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” అని యేసు తన శిష్యులకు ఉపదేశించడం ద్వారా ఒక గంభీరమైన బాధ్యతను వారికి అప్పగించాడు. (మత్తయి 28:​19, 20) ఇది ఏమాత్రం సులభమైన పని కాదు, ఎందుకంటే తీవ్రమైన వ్యతిరేకత మధ్య దాన్ని నెరవేర్చవలసి ఉంది.​—⁠మత్తయి 10:22, 23.

బయటి నుండి వ్యతిరేకత రావడమే కాకుండా సంఘం లోపల కూడా కొంత సంఘర్షణ ఉంటుంది. “సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను” అని పౌలు దాదాపు సా.శ. 56 లో రోములోని క్రైస్తవులకు వ్రాశాడు. (రోమీయులు 16:​17, 18) అపొస్తలుల మరణంతో ఈ పరిస్థితి మరింత పెచ్చుపెరిగిపోయింది. అందుకే పౌలు ఇలా హెచ్చరించాడు: “నేను వెళ్లిపోయన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.”​—⁠అపొస్తలుల కార్యములు 20:29, 30.

ఈ అవాంతరాలను అధిగమించడానికి దేవుని సహాయం ఎంతో అవసరం. దాన్ని ఆయన యేసు ద్వారా అందజేశాడు. ఆయన పునరుత్థానం చేయబడిన తర్వాత, సా.శ. 33 పెంతెకొస్తునాడు ఆయన అనుచరుల్లో దాదాపు 120 మంది ‘పరిశుద్ధాత్మతో నింపబడ్డారు.’​—⁠అపొస్తలుల కార్యములు 1:15; 2:⁠4.

ఈ సందర్భంలో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ యేసు వాగ్దానం చేసిన దేవుని సహాయమేనని శిష్యులు గుర్తించారు. “ఆదరణకర్త [“సహాయకుడు,” NW], అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును” అని యేసు చెప్పినదానికిగల గుర్తింపును వాళ్లు ఇప్పుడు మరింత చక్కగా అర్థం చేసుకున్నారన్నదానిలో సందేహం ఎంతమాత్రం లేదు. (ఇటాలిక్కులు మావి.) (యోహాను 14:​26) ఆయన దాన్ని ‘సహాయకుడు, సత్యస్వరూపియైన అత్మ’ అని కూడా పిలిచాడు.​—⁠యోహాను 15:⁠26.

ఆత్మ ఎలా ఒక సహాయకుడుగా కాగలడు?

ఆత్మ సహాయకుడిగా అనేక విధాలుగా పనిచేయవలసి ఉంది. మొదటిగా, తాను తన శిష్యులకు చెప్పిన విషయాలను అది వారికి జ్ఞాపకం చేస్తుందని యేసు వాగ్దానం చేశాడు. కేవలం పదాలను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయడం కంటే ఎక్కువే ఇమిడి ఉందన్నది ఆయన ఉద్దేశం. ఆయన బోధించిన విషయాల లోతైన భావాన్ని, ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఆత్మ వాళ్లకు సహాయం చేయాల్సి ఉంది. (యోహాను 16:​12-14) క్లుప్తంగా చెప్పాలంటే, ఆయన శిష్యులు సత్యాన్ని మరింత చక్కగా అర్థం చేసుకోవడానికి ఆత్మ వారిని నడిపించవలసి ఉంది. అపొస్తలుడైన పౌలు అటు తర్వాత ఇలా వ్రాశాడు: “మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.” (1 కొరింథీయులు 2:​10) యేసు అభిషిక్త అనుచరులు ఇతరులకు కచ్చితమైన జ్ఞానాన్ని అందజేయాలంటే, వాళ్ల స్వంత అవగాహన పటిష్టమైన పునాదులు గలదై ఉండాలి.

రెండవదిగా, యేసు తన శిష్యులకు ప్రార్థించడం నేర్పించి, తరచూ ప్రార్థించమని బోధించాడు. తాము దేని కోసం ప్రార్థించాలనేది వాళ్లకు కచ్చితంగా తెలియనప్పుడు, ఆత్మ వారి పక్షాన మాట్లాడుతుంది లేక వారికి సహాయం చేస్తుంది. “అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు.”​—⁠రోమీయులు 8:⁠26.

మూడవదిగా, సత్యానికి బహిరంగంగా మద్దతునివ్వడంలో ఆత్మ యేసు శిష్యులకు సహాయం చేయవలసి ఉంది. ఆయన వారినిలా హెచ్చరించాడు: “వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించునప్పుడు​—⁠ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.”​—⁠మత్తయి 10:17-20.

పరిశుద్ధాత్మ క్రైస్తవ సంఘాన్ని గుర్తించడానికి కూడా సహాయం చేసి, దాని సభ్యులు జ్ఞానయుక్తమైన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేలా వారిని పురికొల్పుతుంది. ఈ విషయానికి సంబంధించి ఈ రెండు అంశాలను మరింత వివరంగా చర్చించి, అవి నేడు మనకు ఏ ప్రాముఖ్యతను కల్గివున్నాయో చూద్దాము.

గుర్తింపు చిహ్నంగా ఉండడానికి

యూదులు శతాబ్దాలపాటు మోషే ధర్మశాస్త్రం క్రింద, దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలుగా సేవ చేశారు. వాళ్లు యేసును మెస్సీయగా నిరాకరించారు గనుక, త్వరలోనే వాళ్లు పూర్తిగా నిరాకరించబడతారని ఆయన ప్రవచించాడు: “ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.” (మత్తయి 21:​42, 43) సా.శ. 33 పెంతెకొస్తునాడు క్రైస్తవ సంఘం స్థాపించబడిన తర్వాత, క్రీస్తు అనుచరులు “దాని ఫలమిచ్చు జనుల”య్యారు. అప్పటి నుండి ఈ సంఘం దేవుడు సమాచార వినిమయానికి ఉపయోగించే మాధ్యమం అయ్యింది. దైవిక అనుగ్రహంలో జరిగిన ఈ మార్పును ప్రజలు గుర్తించేందుకు, దేవుడు ఒక సుస్పష్టమైన గుర్తింపు చిహ్నాన్ని ఇచ్చాడు.

పెంతెకొస్తునాడు శిష్యులు తాము మునుపెన్నడూ నేర్చుకోని భాషలను మాట్లాడేలా పరిశుద్ధాత్మ వారికి శక్తినిచ్చింది, దానితో అక్కడుండి చూస్తున్నవారు, “ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?” అని ఆశ్చర్యపోయారు. (అపొస్తలుల కార్యములు 2:​7, 8) రాని భాషల్లో మాట్లాడడం, అలాగే “అనేక మహత్కార్యములును సూచక క్రియలును అపొస్తలుల ద్వారా” జరగడం, దేవుని ఆత్మ నిజంగా పనిచేస్తుందని దాదాపు మూడు వేలమంది వ్యక్తులు గుర్తించడానికి నడిపించాయి.​—⁠అపొస్తలుల కార్యములు 2:41, 43.

అంతేగాక, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము వంటి “ఆత్మ ఫల”ములను ఫలించడం ద్వారా, క్రీస్తు శిష్యులు దేవుని సేవకులుగా స్పష్టంగా గుర్తించబడ్డారు. (గలతీయులు 5:​22-24) నిజానికి, ప్రేమ నిజక్రైస్తవ సంఘానికి మరి విశేషమైన గుర్తింపు చిహ్నాన్నిచ్చింది. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందుర[ని]” యేసు చెప్పాడు.​—⁠యోహాను 13:34, 35.

తొలి క్రైస్తవ సంఘ సభ్యులు దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును అంగీకరించి, అది అనుగ్రహించే సహాయం నుండి ప్రయోజనం పొందారు. దేవుడు మొదటి శతాబ్దంలోలా మృతులను తిరిగిలేపడం వంటి అద్భుతాలను ఇప్పుడు చేయడం లేదని క్రైస్తవులు నేడు గుర్తిస్తారు గనుక, వారు దేవుని ఆత్మ ఫలాలను ఫలిస్తూ, యేసుక్రీస్తు యొక్క నిజ శిష్యులుగా గుర్తించబడతారు.​—⁠1 కొరింథీయులు 13:⁠8.

వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడంలో

బైబిలు పరిశుద్ధాత్మ మూలంగా కల్గింది. కాబట్టి మనం, బైబిలుచే ఒప్పించబడడానికి మనల్ని మనం అనుమతించుకున్నప్పుడు, అది పరిశుద్ధాత్మ మనకు ఉపదేశిస్తున్నట్లుగానే ఉంటుంది. (2 తిమోతి 3:​16, 17) జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి అది మనకు సహాయం చేయగలదు. కాని మనం అందుకు అనుమతిస్తామా?

మనం మన వృత్తిని లేదా ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునే విషయం మాటేమిటి? ఏదైనా ఒక ఉద్యోగాన్ని యెహోవా దృక్కోణం నుండి చూడడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. మన ఉద్యోగం బైబిలు సూత్రాలతో పొందిక కల్గివుండాలి, ముఖ్యంగా మనం దైవపరిపాలనా లక్ష్యాలను అనుసరించేందుకు వీలు కల్గించేదై ఉండాలి. ఉద్యోగంతో ముడిపడి ఉన్న జీతంగానీ పేరుప్రతిష్టలుగానీ అంత ముఖ్యమైన విషయాలు కావు. అయితే, అది మనకు జీవితావసరాలను తీర్చుకునేందుకు తగినదై మన క్రైస్తవ బాధ్యతలను నెరవేర్చడానికి తగినంత సమయాన్ని, అవకాశాన్ని ఇస్తుందా లేదా అన్నదే మరింత ప్రాముఖ్యమైన విషయం.

జీవితాన్ని ఆనందించాలనే కోరిక సహజసిద్ధమైనది, అది సరైనదే. (ప్రసంగి 2:24; 11:⁠9) కాబట్టి సమతూకంగల క్రైస్తవుడు ఉల్లాసం కోసం ఆనందం కోసం వినోదం కావాలనుకుంటాడు. అయితే ఆయన అత్మ ఫలాలను ప్రతిఫలించే వినోదాన్ని ఎంపిక చేసుకోవాలి గానీ “శరీరకార్యముల”ను చూపించే వాటిని కాదు. పౌలు ఇలా వివరిస్తున్నాడు: “శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి.” ‘ఒకరి నొకరు వివాదానికి రేపుకోవడం, ఒకరియందొకరు అసూయపడడం, వృథాగా అతిశయపడడం’ వంటివాటిని కూడా నివారించాలి.​—⁠గలతీయులు 5:16-26.

స్నేహితులను ఎంపిక చేసుకునే విషయానికి కూడా ఇది వర్తిస్తుంది. బాహ్యరూపం లేక ఆస్తిపాస్తులు వంటి వాటిని బట్టి కాక వారికున్న ఆధ్యాత్మికతను బట్టి వారిని ఎంపిక చేసుకోవడం జ్ఞానయుక్తం. దావీదు నిస్సందేహంగా దేవునికి స్నేహితుడే, ఎందుకంటే “నా యిష్టానుసారుడైన మనుష్యుడు” అని దేవుడు ఆయన గురించి వర్ణించాడు. (అపొస్తలుల కార్యములు 13:​22) దేవుడు బాహ్యరూపానికి ప్రాముఖ్యతనివ్వకుండా దావీదును ఇశ్రాయేలు రాజుగా ఎంపిక చేసింది ఈ సూత్రం అనుసారంగానే: “మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; . . . మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”​—⁠1 సమూయేలు 16:⁠7.

బాహ్యరూపం లేదా సిరిసంపదల ఆధారంగా ఏర్పడిన వేలాది స్నేహ బంధాలు తెగిపోయాయి. అస్థిరమైన ధనంపై ఆధారపడిన స్నేహాలు హఠాత్తుగా ముగింపుకొస్తాయి. (సామెతలు 14:​20) మనం స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు, యెహోవా సేవ చేయడానికి మనకు సహాయం చేయగలవారిని మనం ఎంచుకోవాలని దేవుని ఆత్మచే ప్రేరేపించబడిన వాక్యం మనకు ఉపదేశిస్తుంది. ఇవ్వడం ఎక్కువ ఆనందాన్ని తెస్తుంది గనుక తీసుకోవడం కంటే ఇవ్వడంపై ఎక్కువ శ్రద్ధ నిలపమని అది మనకు చెప్తుంది. (అపొస్తలుల కార్యములు 20:​35) మనం మన స్నేహితులకు ఇవ్వగల అత్యంత అమూల్యమైనవి సమయం, అభిమానం.

వివాహజత కోసం వెదుకుతున్న క్రైస్తవులకు, బైబిలు ఆత్మ ప్రేరేపిత సలహాను ఇస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, అదిలా చెప్తుంది, ‘ముఖాన్ని, శరీరాకృతిని చూసే బదులు, కాళ్లను చూడండి.’ కాళ్లనా? అవును, ఏ భావంలోనంటే: సువార్త ప్రకటించడమనే యెహోవా పనిని చేయడానికి అవి ఉపయోగించబడుతూ, ఆయన దృష్టిలో అవి సుందరమైనవై ఉన్నాయా? అవి సత్య సందేశాన్ని, సమాధాన సువార్తను తొడుగుకొని ఉన్నాయా? మనమిలా చదువుతాము: “సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.”​—⁠యెషయా 52:7; ఎఫెసీయులు 6:⁠15.

మనం “అపాయకరమైన కాలము”లలో జీవిస్తున్నాము గనుక, దేవుని చిత్తాన్ని చేయడానికి మనకు సహాయం అవసరం. (2 తిమోతి 3:⁠1) సహాయకుడు, అంటే దేవుని పరిశుద్ధాత్మ మొదటి శతాబ్దపు క్రైస్తవుల పనికి శక్తివంతమైన మద్దతును ఇచ్చి, వారికి వ్యక్తిగత సహాయకుడిగా కూడా ఉంది. పరిశుద్ధాత్మ మూలంగా వ్రాయబడిన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం, పరిశుద్ధాత్మను మన వ్యక్తిగత సహాయకుడిగా చేసుకోవడానికైన ఒక ప్రధాన మార్గం. మరి మనమలా సహాయకుడిగా చేసుకున్నామా?

[23వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]