కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కోతకాలానికి ముందే “పొలములో” పనిచేయడం

కోతకాలానికి ముందే “పొలములో” పనిచేయడం

కోతకాలానికి ముందే “పొలములో” పనిచేయడం

గొప్ప బోధకుని శిష్యులు అయోమయంలో పడ్డారు. గోధుమలూ గురుగుల గురించిన ఒక చిన్న కథ చెప్పడాన్ని యేసు అప్పుడే ముగించాడు. ఆ రోజు ఆయన చెప్పిన అనేక ఉపమానాల్లో అదొకటి. ఆయన చెప్పడం ముగించిన తర్వాత తన ప్రేక్షకుల్లోని చాలామంది వెళ్ళిపోయారు. కానీ ఆయన ఉపమానాలకు ఒక ప్రాముఖ్యమైన భావం తప్పక ఉండుంటుందని ఆయన అనుచరులకు తెలుసు​—⁠ముఖ్యంగా గోధుమలూ గురుగులను గురించిన ఉపమానానికి. యేసు మంచి కథలు చెప్పేవాడు మాత్రమే కాదన్నది వాళ్ళకు తెలుసు.

“పొలములోని గురుగులను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమని” వాళ్ళు అడిగినట్లు మత్తయి వ్రాస్తున్నాడు. దానికి జవాబుగా, తన అనుచరులని చెప్పుకునేవాళ్ళ మధ్యనుంచే మహా మతభ్రష్టత్వం వ్యాప్తి చెందుతుందని ప్రవచిస్తూ యేసు ఉపమాన భావాన్ని చెప్పాడు. (మత్తయి 13:​24-30, 36-38, 43) అలా జరగనే జరిగింది, అపొస్తలుడైన యోహాను మరణానంతరం మతభ్రష్టత్వం చాలా త్వరితంగా వ్యాప్తి చెందింది. (అపొస్తలుల కార్యములు 20:29, 30; 2 థెస్సలొనీకయులు 2:​6-12) లూకా 18:8 లో నమోదు చేయబడినట్లుగా, యేసు, ‘మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?’ అని అడిగిన ప్రశ్న చాలా సమంజసంగానే అన్పించేంతగా అది వ్యాపించింది.

గోధుమల వంటి క్రైస్తవులను ‘కోతకొసే’ పని ప్రారంభానికి యేసు ఆగమనం ఒక గుర్తు. 1914 లో ప్రారంభమైన “యుగసమాప్తి”కి ఆయన ఆగమనం ఒక సూచనై ఉంది. అందుకే కోతకోసేపని ప్రారంభమయ్యేముందు, బైబిలు సత్యాల పట్ల మంచి ఆసక్తిని కనబరిచే కొంతమంది ఉన్నారంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు.​—⁠మత్తయి 13:39.

‘గురుగులు’ సహితం, అంటే నామకార్థ క్రైస్తవులతో కూడిన క్రైస్తవ సామ్రాజ్యంలోని సామాన్య ప్రజల మనస్సులు సహితం ముఖ్యంగా 15వ శతాబ్దంనుండి చైతన్యవంతమయ్యాయని చారిత్రక రికార్డు రుజువుచేస్తుంది. బైబిలు విరివిగా లభ్యమవ్వడం వల్ల, బైబిలు అకారాది సూచికలు తయారుచేయబడడం వల్ల సహృదయులైన వ్యక్తులు లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించడం మొదలు పెట్టారు.

వెలుగు తేజరిల్లుతుంది

19వ శతాబ్దం ప్రారంభంలో, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన హెన్రీ గ్రూ (1781-1862) అలాంటి వారిలో ఒకరు. తన 13వ ఏట కుటుంబంతో పాటు అట్లాంటిక్‌ మీదుగా ప్రయాణించి 1795, జూలై 8న అమెరికాకు చేరుకున్నాడు. రోడ్‌ ద్వీపంలోని ప్రొవిడెన్స్‌లో వాళ్ళు స్థిరపడ్డారు. తల్లిదండ్రులు బైబిలుమీద మమకారాన్ని అతనిలో నాటారు. గ్రూ తన 25వ ఏట అంటే 1807వ సంవత్సరంలో, కనెక్టీకట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌ బాప్టిస్ట్‌ చర్చిలో పాస్టర్‌గా సేవ చేసేందుకు ఆహ్వానించబడ్డాడు.

తన కాపుదలలో ఉన్న వారు లేఖనానుగుణ్యంగా జీవించేలా వారికి సహాయం చేయడానికి కృషిచేస్తూ, బోధనాధిక్యతలను ఆయన గంభీరంగా తీసుకున్నాడు. అయితే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నవాళ్ళనుండి సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన నమ్మాడు. కొన్నిసార్లు, బాధ్యతగల ఇతర పురుషులతో కలిసి, వ్యభిచారం లేక వేరే అనైతిక క్రియలను జరిగిస్తున్న వాళ్ళను ఆయన చర్చి నుండి వెలివేసేవారు (బహిష్కరించేవారు).

చర్చిలో ఉన్న వేరే సమస్యలు కూడా అతన్ని కలవరపర్చాయి. చర్చి సభ్యులు కానివారు చర్చి వ్యాపార లావాదేవీలను చూసుకోవడంను, చర్చి పాటల్లోను నాయకత్వం వహిస్తుండేవారు. ఈ పురుషులు సంఘానికి సంబంధించిన విషయాలపై కూడా ఓటు వేయడం వల్ల కొంతమట్టుకు దాని కార్యకలాపాలలో పట్టు కల్గి ఉండేవారు. లోకం నుండి వేరై వుండాలన్న సూత్రం ఆధారంగా నమ్మకమైన పురుషులు మాత్రమే ఇలాంటి కార్యాలను జరిగించాలని గ్రూ ఎంతో బలీయంగా నమ్మాడు. (2 కొరింథీయులు 6:14-18; యాకోబు 1:​27) దేవునికి చెల్లించే స్తుతి కీర్తనలు అవిశ్వాసులు పాడడం అతనికి దేవదూషణగా అన్పించేది. ఈ దృక్పథాల వల్ల హెన్రీ గ్రూ 1811 లో చర్చినుంచి తిరస్కరించబడ్డాడు. అదే సమయంలో, అలాంటి దృక్పథాలు కల్గిన ఇతరులు కూడా చర్చిని విడిచిపెట్టేశారు.

క్రైస్తవమత సామ్రాజ్యం నుండి వేరవ్వడం

హెన్రీ గ్రూతో పాటు ఈ గుంపు, బైబిలు సలహాలకు అనుగుణంగా తమ జీవితాలను, తమ కార్యకలాపాలను మలచుకోవాలన్న ఉద్దేశంతో బైబిలును జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించారు. బైబిలు సత్యాలకున్న గొప్ప అర్థాన్ని గ్రహించేలా, క్రైస్తవమత సామ్రాజ్యం చేస్తున్న తప్పిదాలను బట్టబయలు చేసేలా త్వరితగతిన వాళ్ళ పఠనాలు వాళ్ళను నడిపించాయి. ఉదాహరణకు, గ్రూ 1824 లో త్రిత్వం తప్పు అన్న దానికి ఒక మంచి తర్కంతో కూడిన పుస్తకాన్ని వ్రాశాడు. తాను వ్రాసిన పుస్తకంలోని ఈ మాటల్ని ఆయన తర్కించిన విధానాన్ని చూడండి: “‘అయితే నేను వచ్చే ఆ రోజూ ఆ గడియా ఎప్పుడో ఏ మనిషికీ తెలియదు. పరలోకంలోవున్న దేవదూతలకూ తెలియదు. కుమారునికి కూడా తెలియదు. ఇది తెలిసిన వాడు పరమతండ్రి ఒక్కడే!’ [మార్కు 13:​32] ఇక్కడ ఇవ్వబడిన వరుస క్రమాన్ని పరిశీలించండి. మనిషి, దేవదూతలు, కుమారుడు, తండ్రి. . . . ఆ దినమును గురించి తండ్రికి మాత్రమే తెలుసు అని మన ప్రభువు మనకు బోధిస్తున్నాడు. కొందరు తలంచినట్లు ఇది సత్యం కానట్లయితే, తండ్రి, వాక్యం, పరిశుద్ధాత్మ ఒక్క దేవునిలో ఉన్న ముగ్గురు వ్యక్తులన్నది నిజం అయినట్లయితే ఈ [బోధ ప్రకారం అంటే, త్రిత్వ సిద్ధాంతం] ప్రకారం, తండ్రికి తెలిసినవన్నీ కుమారునికి తెలుసు అని అర్థం.”

క్రీస్తుకు సేవచేస్తున్నామని చెప్పుకొనే పాదిరీల, సైనికాధికారుల వేషధారణను గ్రూ బయటపెట్టాడు. 1828 లో ఆయన ఇలా తెలియజేశాడు: “ఇంతకన్నా అసంగతమైన విషయాన్ని మనం ఊహించగలమా? ఒక క్రైస్తవుడు ఏకాంతంగా ఉన్నప్పుడు తన శత్రువుల కోసం ప్రార్థన చేసి, అటు తర్వాత అదే శత్రువులను క్రూరాతిక్రూరంగా చంపడానికి మరణాయుధాలను వారిపై విసరమని తన సైనికులకు ఆజ్ఞ ఇవ్వడం ఎంత అసంగతమైన విషయం! ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడేమో చనిపోబోతున్న తన యజమానిని [యేసును] చక్కగా అనుకరిస్తున్నాడు; కానీ అటు తర్వాత ఎవరిని అనుకరిస్తున్నాడు? తనను చంపుతున్నవారి కోసం యేసు ప్రార్థించాడు. క్రైస్తవులు ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నారో వారినే చంపుతున్నారు.”

గ్రూ మరింత గట్టిగా ఇలా చెప్పాడు: “తాను ‘వెక్కిరించబడను’ అని మనకు హామీ ఇస్తున్న సర్వశక్తుణ్ణి మనం ఎప్పుడు నమ్ముతాము? ‘ప్రతి విధమైన కీడుకు’ దూరంగా ఉండమని కోరే పవిత్ర మత స్వభావాన్ని, దాని లక్షణాల్ని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాము? . . . ఆ మతం, ఒక వ్యక్తి ఫలాని పరిస్థితిలో దేవదూతలా ప్రవర్తించాలని, మరో సందర్భంలో దయ్యంలా ప్రవర్తించాలని కోరుతుందని అనుకోవడం ఆ దేవుని కుమారుణ్ణి అవమానపర్చడం కాదా?”

నిత్యజీవం వారసత్వంగా వచ్చేది కాదు

రేడియోలు టీవీలు రాకపూర్వం ఒకరి ఉద్దేశాలను తెలియజేసే ప్రసిద్ధిగాంచిన ఒక పద్ధతి, కరపత్రాలను వ్రాయడం, పంచిపెట్టడం. దాదాపు 1835 లో అత్మ అమర్త్యం, నరకాగ్ని బోధలు లేఖనాధారితం కాదు అని బహిర్గతం చేస్తూ గ్రూ ఒక ముఖ్యమైన కరపత్రాన్ని వ్రాశాడు. ఈ సిద్ధాంతాలు దేవుని నామానికి దూషణ తెస్తాయని అతను భావించాడు.

ఈ కరపత్రం విస్తృత ప్రభావాన్ని కల్గివుంది. 1837 లో 40 ఏండ్లవాడైన జార్జ్‌ స్టార్స్‌కు ఈ కరపత్రం ట్రైన్‌లో దొరికింది. స్టార్స్‌ న్యూ హాంప్‌షైర్‌లోని లెబనాన్‌ వాస్తవ్యుడు, ఈ కరపత్రం లభించే నాటికి అతను న్యూయార్క్‌లోని యుటికలో నివసిస్తున్నాడు.

మెథడిస్ట్‌-ఎపిస్కోపల్‌ చర్చిలో ఇతనొక గౌరవించదగ్గ పరిచారకుడు. కరపత్రం చదివిన తర్వాత, తనెన్నడూ సందేహించని క్రైస్తవమత సామ్రాజ్యపు ఈ ప్రాథమిక బోధలకు వ్యతిరేకంగా అంత బలమైన కారణం ఉందా అని ఆయన చాలా ప్రభావితమయ్యాడు. మూడు సంవత్సరాల వరకూ తనకు ఆ కరపత్రాన్ని ఎవరు వ్రాసారన్నది తెలియలేదు, అంటే పెన్సిల్వేనియాలోని ఫిలదెల్ఫియాలో నివసిస్తున్నప్పుడు అక్కడే నివసిస్తున్న హెన్రీ గ్రూను కలిసేంతవరకూ అంటే కనీసం 1844 వరకూ తెలియలేదు. అయితే, ఈ మూడు సంవత్సరాలు విషయాన్ని తను స్వంతంగా పరిశీలిస్తూ, దాని గురించి ఇతర పాదిరీలకు మాత్రమే చెబుతూ ఉండేవాడు.

చివరిగా, తను నేర్చుకున్న విషయాలను ఎవరూ తప్పని రుజువు చేయలేకపోవడంతో, మెథడిస్ట్‌ చర్చిలోనే ఉంటూ దేవునికి విధేయుడై ఉండడం కష్టమని జార్జ్‌ స్టార్స్‌ గుర్తించాడు. ఆయన 1840 లో చర్చికి రాజీనామా చేసి, న్యూయార్క్‌లోని ఆల్బెనీకి మారాడు.

1842 వసంతబుతువులో “ఒక అన్వేషణ​—⁠దుష్టులు అమర్త్యులా?” అన్న అంశంపై స్టార్స్‌ ఆరు వారాల్లో ఆరు ఉపన్యాసాలను ఇచ్చాడు. ప్రజల్లో దానిపై గొప్ప ఆసక్తి ఉండేది అందుకే ఆయన ప్రచురణ కోసం దానిని మళ్లీ సంస్కరించాడు, తర్వాతి 40 సంవత్సరాల్లో అమెరికా, గ్రేట్‌ బ్రిటన్‌లలో 2,00,000 ప్రతులు పంపిణీ అయ్యాయి. అమర్త్యమైన ఆత్మ అన్న సిద్ధాంతానికి వ్యతిరేకంగా స్టార్స్‌, గ్రూలు కలిసి బహిరంగ చర్చలు జరిపారు. గ్రూ 1862, ఆగస్టు 8న ఫిలడెల్ఫియాలో, మరణించేంత వరకూ కూడా ప్రకటనా పనిని ఆసక్తితో కొనసాగించాడు.

స్టార్స్‌ పైన పేర్కొన్న ఆరు ఉపన్యాసాలనిచ్చిన కొంతకాలానికి, క్రీస్తు రాకడ 1843 లో దృశ్యంగా ఉంటుందని ఎదురుచూసిన విలియమ్‌ మిల్లర్‌ చేసిన ప్రకటనా పని మీద ఆయనకు ఆసక్తి పెరిగింది. దాదాపు రెండు సంవత్సరాలు, స్టార్స్‌ అమెరికా ఈశాన్య ప్రాంతమంతటా ఈ సందేశాన్ని ప్రకటించడంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1844 తర్వాత క్రీస్తు రాకడకు ఒక తేదీనంటూ నిర్ణయించలేదు, తేదీలను లెక్కించాలనుకునే ఇతరులకు తను అడ్డుచెప్పలేదు. క్రీస్తు రాకడ సమీపమైంది గనుక క్రైస్తవులు మెలకువగానూ అధ్యాత్మికంగా చురుగ్గానూ దర్శన దినానికి సిద్ధంగానూ ఉండడం ప్రాముఖ్యమని స్టార్స్‌ నమ్మాడు. కానీ తను మిల్లర్‌ గ్రూప్‌తో విడిపోయాడు, దానికి గల కారణం వాళ్ళు లేఖనరహితమైన సిద్ధాంతాలను అంటే అత్మ అమర్త్యమైనదని, భూమి దానిమీదనున్న కృత్యాలు కాలిపోతాయి, అజ్ఞానంలో ఉండి చనిపోయినవారికి నిత్యజీవ నిరీక్షణ లేదు అనేవి వాళ్ళు నమ్మడమే.

దేవుని ప్రేమ ఎక్కడకు నడిపిస్తుంది?

దేవుడు దుష్టులను పునరుత్థానం చేయడానికి గల ముఖ్య ఉద్దేశం వాళ్ళను తిరిగి మరణానికి అప్పగించడానికే అని నమ్మే అడ్వెంటిస్ట్‌ తలంపుకు స్టార్స్‌ విముఖతను చూపించాడు. దేవుడు అర్థంలేని ప్రతీకార చర్యతీసుకుంటాడనడానికి ఎలాంటి ఆధారాన్ని తను లేఖనాల్లో చూడలేకపోయాడు. మరోవైపున చూస్తే, స్టార్స్‌, అతని అనుచరులు దుష్టులు పునరుత్థానం కానేకారన్న ముగింపుకు వచ్చారు. అనీతిమంతుల పునరుత్థానం గురించి చెబుతున్న కొన్ని లేఖనాలను వివరించడం వారికి కష్టంగా అన్పించినప్పటికీ తాము చెప్పింది దేవుని ప్రేమకు ఎక్కువ అనుగుణ్యంగా ఉన్నట్టు వారికి అనిపించింది. దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోవడంలో త్వరలో ఒకడుగు ముందుకు పడనైఉంది.

1870 లో ఆయన అస్వస్థతకుగురై కొన్ని నెలలపాటు పని చేయలేకపోయాడు. ఆ సమయంలో తను 74 సంవత్సరాలుగా నేర్చుకున్నదంతా పునఃపరిశీలించుకున్నాడు. మానవజాతి పట్ల దేవుని సంకల్పంలో ఒక కీలకమైన అంశాన్ని తాను గ్రహించలేకపోయానన్న ఒక ముగింపుకు ఆయన వచ్చాడు. అది అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధనలో సూచించబడింది, అదేమిటంటే​—⁠‘అబ్రాహాము దేవుని మాట వినినందున భూలోక వంశములన్నియు ఆయన సంతానమువలన ఆశీర్వదించబడును.’​—⁠ఆదికాండము 22:⁠18; అపొస్తలుల కార్యములు 3:25.

అయితే, ఇది ఆయన మనస్సుకి ఒక క్రొత్త ఆలోచనను ఇచ్చింది. ‘భూలోక వంశాలన్నీ’ ఆశీర్వదించబడాలంటే రాజ్య సువార్తను అందరూ వినవలసిన అవసరం ఉంది కదా? వారెలా వింటారు? ఇప్పటికే కోట్లాదిమంది మరణించారు కదా? లేఖనాలను మరింతగా పరిశీలించడం వల్ల, చనిపోయిన ‘దుష్టుల్లో’ రెండు తరగతులకు చెందిన వాళ్ళు ఉన్నారన్న ముగింపుకు ఆయన వచ్చాడు: వాళ్ళు దేవుని ప్రేమను బుద్ధిపూర్వకంగా తృణీకరించినవాళ్ళు, అజ్ఞానంలో ఉండి మరణించిన వాళ్ళు.

రెండవ తరగతి వాళ్ళు మృతులలో నుండి లేపబడి క్రీస్తుయేసు విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందేలా చివరిగా వారికి ఒక అవకాశం ఇవ్వబడుతుందని స్టార్స్‌ ముగించాడు. విమోచన క్రమధనమందు విశ్వాసముంచేవారు భూమిపై నిరంతరం జీవిస్తారు. విశ్వసించనివారు నిర్మూలించబడతారు. అవును, మంచి భవిష్యత్‌ ఉత్తరాపేక్షలేమీ ఇవ్వకుండా దేవుడు వాళ్ళను ఊరికే లేపడు అని స్టార్స్‌ నమ్మాడు. చివరికి, ఆదాము పాపం చేయడం వల్ల ఆదామే తప్ప, ఎవరూ చనిపోరు! గాని, ప్రభువైన యేసు క్రీస్తు రాకడ సమయంలో జీవిస్తున్న వారి సంగతి ఏమిటి? వారిని చేరుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రకటనా పని ఒకటి జరగాలని స్టార్స్‌ చివరికి తెలుసుకున్నాడు. అంతటి పని ఎలా జరుగుతుందన్నది ఆయనకు తెలియదు గాని, విశ్వాసంతో ఆయన ఇలా వ్రాశాడు: “చాలామంది ప్రజలు ఆ తలంపును ఎందుకు తృణీకరిస్తారంటే ఆ పని ఎలా జరుగుతుందో వాళ్ళు గ్రహించకపోవడం వల్లనే, ఎలా జరుగుతుందో కేవలం తమకు తెలియనందునే వారు దేవునికి అది అసాధ్యమని అనుకుంటారు.”

1879, డిసెంబరులో జార్జ్‌ స్టార్స్‌ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని తన ఇంటివద్ద చనిపోయాడు, తను దేనికోసమైతే చాలా ఆశగా ఎదురుచూశాడో ఆ ప్రపంచవ్యాప్త ప్రకటనా పని యొక్క కేంద్రానికి కేవలం కొన్ని బిల్డింగ్‌ల దూరంలో అతని ఇల్లు ఉంది.

వెలుగు ఇంకా అవసరం

మనం సత్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకున్నట్లుగా అప్పుడు హెన్రీ గ్రూ, జార్జ్‌ స్టార్స్‌లాంటి వ్యక్తులు అర్థం చేసుకున్నారా? లేదు. వాళ్ళు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేశారో వాళ్ళకు తెలుసు, 1847 లో స్టార్స్‌ ఇలా అన్నాడు: “మనం చర్చి యొక్క అంధకార యుగం నుంచి ఇప్పుడే బయటకు వచ్చాం గాని; సత్యం అనుకుంటూనే ఇంకా కొన్ని ‘బబులోను వస్త్రాలను’ తొడుగుకున్నట్టుగా మనం గ్రహిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు అన్నది గుర్తించుకోవాలి.” ఉదాహరణకు గ్రూ, యేసు ఇచ్చిన విమోచనను విలువైనదిగా ఎంచాడు, గాని దాన్ని “అందరికొరకు విమోచన క్రయధనముగా” ఇచ్చాడని ఆయన గుర్తించలేదు, అంటే ఆదాము పోగొట్టిన పరిపూర్ణ మానవ జీవితానికి బదులు యేసు పరిపూర్ణ మానవ జీవితాన్ని ఇచ్చాడన్నది ఆయన గుర్తించలేదు. (1 తిమోతి 2:⁠6) యేసు భూమిపైకి తిరిగి వస్తాడనీ, వచ్చి దృశ్యంగా పరిపాలిస్తాడనీ హెన్రీ గ్రూ కూడా పొరబడ్డాడు. అయితే, సా.శ. రెండవ శతాబ్దం తర్వాతి కాలంలో అతి కొద్దిమంది మాత్రమే ఆసక్తి చూపించిన, యెహోవా నామం పరిశుద్ధపర్చబడడమన్న విషయంపై గ్రూ ఆసక్తి కనబరిచాడు.

అలాగే జార్జ్‌ స్టార్స్‌కి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలపై ఒక సరియైన అవగాహన లేదు. పాదిరీలు ప్రోత్సహించే అబద్ధసిద్ధాంతాలను తను గమనించగల్గినప్పటికీ కొన్నిసార్లు ఆయన దానికి పూర్తిగా వ్యతిరేకమైన దానిని నమ్మేవాడు. ఉదాహరణకు, సాతాను గురించి అర్థోడాక్స్‌ పాదిరీలకున్న దృక్కోణానికి అతిగా ప్రతిస్పందించి సాతాను ఒక వాస్తవమైన వ్యక్తి అనే తలంపును స్టార్స్‌ తృణీకరించాడు. ఆయన త్రిత్వాన్ని అంగీకరించనప్పటికీ తన మరణానికి కొంతకాలం ముందు వరకూ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తా కాదా అన్న విషయంపై ఆయనకు సంశయం ఉండేది. జార్జ్‌ స్టార్స్‌ క్రీస్తు రాకడ మొదట్లో అదృశ్యంగా ఉన్నా చివరికి అది దృశ్యంగా ఉంటుందని నమ్మాడు. ఏదేమైనప్పటికీ హెన్రీ గ్రూ, జార్జ్‌ స్టార్స్‌లిరువురూ తమ పరిశోధనల్లో యథార్థహృదయులుగా, నమ్మకమైనవారుగా ఉన్నారు, ఇతరుల కన్నా ఎక్కువ సత్యాల్ని వారు తెలుసుకోగలిగారు.

గోధుమలు, గురుగుల ఉపమానంలో యేసు వివరించిన “పొలము” అప్పటికి కోతకు సిద్ధంగా లేదు. (మత్తయి 13:​38) గ్రూ, స్టార్స్‌ మరితరులు కోతకోసం “పొలము”ను సిద్ధంచేస్తూ వచ్చారు.

1879 లో ఈ పత్రికను (ఆంగ్లం) ప్రచురించడం ప్రారంభించిన చార్ల్స్‌ తేజ్‌ రస్సెల్‌ తన ప్రారంభ సంవత్సరాలను గూర్చి ఇలా వ్రాశాడు: “తన వాక్యాన్ని పఠించడానికి ప్రభువు మనకు అనేక సహాయకాలను అందించ్చాడు, వారిలో మొదటగా ఎవరు నిలబడతారు? మన ప్రియ వృద్ధ సహోదరులైన జార్జ్‌ స్టార్స్‌. ఆయన తన మాట ద్వారా తన వ్రాతల ద్వారా మనకెంతో సహాయం చేశాడు; కాని మనం మనుష్యులను వెంబడించకుండా ఉండేలా ప్రయత్నించడం జ్ఞానయుక్తమైన పని, కనుక మనం ‘దేవుని పిల్లలముగా ఆయనను పోలి నడుచుకోవాలి’.” అవును యథార్థవంతులైన బైబిలు విద్యార్థులు గ్రూ, స్టార్స్‌ లాంటి వ్యక్తులు చేసిన ప్రయత్నాల వల్ల ప్రయోజనం పొందినప్పటికీ సత్యానికి నిజమైన మూలంగా దేవుని వాక్యమైన బైబిలును పరిశీలించడమనేది ప్రాముఖ్యం.​—⁠యోహాను 17:⁠17.

[26వ పేజీలోని బాక్సు/చిత్రం]

హెన్రీ గ్రూ నమ్మిన విషయాలు

యెహోవా నామంపై నింద ఏర్పడింది, అది పరిశుద్ధపరచబడవలసిన అవసరం ఉంది.

త్రిత్వం, ఆత్మ అమర్త్యం, నరకాగ్ని వంటి సిద్ధాంతాలు మోసకరమైనవి.

లోకం నుండి క్రైస్తవ సంఘం వేరైవుండాలి.

ఈ లోక దేశాలు చేసే యుద్ధంలో క్రైస్తవులు పాల్గొనకూడదు.

శనివారం లేదా ఆదివారం విశ్రాంతిదిన నియమం క్రింద క్రైస్తవులు లేరు.

సౌభ్రాతృత్వం సంస్థలా క్రైస్తవులు రహస్య సంస్థలకు చెందినవారు కాకూడదు.

క్రైస్తవుల మధ్య మతనాయకుల తరగతి, సామాన్యుల తరగతి అని ఉండకూడదు.

మత బిరుదులు క్రీస్తు విరోధులవి.

అన్ని సంఘాల్లోనూ పెద్దల సభలు ఉండాలి.

పెద్దలు, నిందారహితులుగా తమ ప్రవర్తనంతటిలో పవిత్రంగా ఉండాలి.

క్రైస్తవులందరూ సువార్తను ప్రకటించాలి.

భూపరదైసులో ప్రజలు నిరంతరం జీవిస్తారు.

క్రైస్తవ పాటలు యెహోవాను, క్రీస్తును ఘనపరిచేవై ఉండాలి.

[చిత్రసౌజన్యం]

ఫొటో: Collection of The New-York Historical Society/69288

జార్జ్‌ స్టార్స్‌ నమ్మిన విషయాలు

యేసు తన జీవితాన్ని మానవజాతి విమోచన క్రయధనంగా అర్పించాడు.

సువార్త ప్రకటనా పని ఇంకా పూర్తికాలేదు (1871 లో)

అందువల్ల, అంతం అప్పటికి ఇంకా సమీపమై లేదు (1871 లో). భవిష్యత్తులో ఇంకా ప్రకటనా పని జరగనై ఉంది.

భూమిపై నిరంతర జీవితాన్ని అనుభవించే ప్రజలు ఉంటారు.

అజ్ఞానంలో చనిపోయిన వారందరూ పునరుత్థాం అవుతారు. క్రీస్తు విమోచన క్రయధనమందు విశ్వాసం ఉంచేవారు భూమిపై నిరంతర జీవితాన్ని అనుభవిస్తారు. విశ్వసించనివాళ్ళు నాశనమవుతారు.

ఆత్మ అమర్త్యం, నరకాగ్ని, దేవునికి అనంగీకారమైన అబద్ధ సిద్ధాంతాలు.

ప్రభురాత్రి భోజనం అనేది నీసాను 14న జరుపుకొనే సాంవత్సరిక ఆచారం.

[చిత్రసౌజన్యం]

ఫొటో: SIX SERMONS, by George Storrs (1855)

[29వ పేజీలోని చిత్రాలు]

“జాయన్స్‌ వాచ్‌ టవర్‌,” సంపాదకుడైన సి. టి. రస్సెల్‌ 1909 లో, అమెరికాలోని న్యూయార్క్‌నందలి బ్రూక్లిన్‌కి మారాడు