కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాజ్య నిరీక్షణలో ఆనందోత్సాహాలతో ఉండండి!

రాజ్య నిరీక్షణలో ఆనందోత్సాహాలతో ఉండండి!

రాజ్య నిరీక్షణలో ఆనందోత్సాహాలతో ఉండండి!

న్యూయార్క్‌ రాష్ట్రంలోని పెద్ద బేతేలు కుటుంబానికి చెందిన మూడు వేర్వేరు బిల్డింగ్‌లలో, 2001, మార్చి 10వ తేదీన దాదాపు 5,784 మంది ఒక ఆనందకరమైన సందర్భంలో సమకూడారు. గిలియడ్‌ మిషనరీ స్కూలు యొక్క 110వ తరగతి స్నాతకోత్సవమే ఆ సందర్భం.

యెహోవాసాక్షుల పరిపాలక సభలోని సభ్యుడైన క్యారీ బార్బర్‌ అందరికీ ఆహ్వానం పలికి కార్యక్రమాన్ని ఈ మాటలతో ప్రారంభించాడు: “నేటికి 110 తరగతులలో గిలియడ్‌ విద్యార్థులు మిషనరీలుగా శిక్షణపొంది భూగోళమంతటా వేర్వేరు ప్రాంతాల్లో నియమించబడ్డారన్న విషయం మనకెంతో ఆనందాన్నిస్తుంది.”

ఆనందంగా ఉంటూ కొనసాగడమెలా?

సహోదరుడు బార్బర్‌ తొలి పలుకుల తర్వాత డాన్‌ ఆడమ్స్‌, ప్రేక్షకులనూ వారిమధ్యనున్న 48 మంది పట్టభద్రులైన విద్యార్థులనూ ఉద్దేశించి “యెహోవా ఆశీర్వాదం మనకు ఐశ్వర్యమిస్తుంది” అనే అంశంపై మాట్లాడాడు. సామెతలు 10:⁠22వ వచనం ఆధారంగా ప్రసంగిస్తూ, తన సేవకులు రాజ్యాసక్తులను తమ జీవితాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంచుకున్నప్పుడు యెహోవా వారిని పోషిస్తాడనీ ఆశీర్వదిస్తాడనీ ఆయన ప్రేక్షకులకు గుర్తు చేశాడు. “నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని” అపొస్తలుడైన పౌలును ఆహ్వానించినప్పుడు ఆయన ఎంత సిద్ధమనస్సును ప్రదర్శించాడో అదే స్ఫూర్తితో విద్యార్థులు కూడా తమ క్రొత్త నియామకాల్ని స్వీకరించాలని ఆయన ప్రోత్సహించాడు. (ఆపొస్తలుల కార్యములు 16:⁠9) కష్టాలు ఎదుర్కోవాల్సి ఉన్నా పౌలు తాను నిర్దేశించబడిన ప్రాంతంలో ప్రకటించడానికి చూపిన సిద్ధమనస్సు ఆయనకెన్నో ఆనందకరమైన ఆశీర్వాదాల్ని తీసుకువచ్చింది.

పట్టభద్రులైన వీరు ఐదు నెలల బైబిలు అధ్యయనాన్నీ మిషనరీ పనికి వీరిని సిద్ధం చేయడానికిచ్చే శిక్షణనూ పూర్తిచేశారు. అయినా, యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన డానియల్‌ సిడ్లిక్‌ వారు ఇంకా నేర్చుకుంటూ కొనసాగాలని వారిని ప్రోత్సహించాడు. “నిజమైన శిష్యులుగా ఉండండి” అనే అంశంపై మాట్లాడుతూ ఆయనిలా వ్యాఖ్యానించాడు: “శిష్యరికం అంటే యేసు మాటలకు నిరంతరం విధేయత చూపడమే. అందులో మనం ఆయన మాటల్ని, ఆయన సందేశాన్ని, ఆయన బోధల్ని వినడానికి ఎల్లప్పుడూ చూపే సుముఖత కూడా ఒక భాగమే.” క్రీస్తు శిష్యులు తమ యజమాని స్వరాన్ని వినకుండానే నిర్ణయాలు తీసుకోరు; దేవుని జ్ఞానము క్రీస్తు జీవితంలోనే నిక్షిప్తమైవుంది అని ఆయన వారి దృష్టికి తెచ్చాడు. (కొలొస్సయులు 2:⁠3) మనలో ఎవ్వరమూ, ఒక్కసారి యేసు మాటల్ని వినేసి, ఇక ఆయన గురించి సమస్తమూ తెలుసు అనే నిర్ధారణకు రాము, కాబట్టి స్వతంత్రులను చేసే క్రైస్తవ సత్యాన్ని నిరంతరం నేర్చుకుంటూ, దాన్ని జీవితంలో అన్వయించుకుంటూ, బోధిస్తూ ఉండమని సహోదరుడు సిడ్లిక్‌ పట్టభద్రులను ప్రోత్సహించాడు.​—⁠యోహాను 8:​31, 32.

దేవుని సేవలో ఆనందంగా కొనసాగాలంటే ఎవరైనా సరే క్రమశిక్షణను దిద్దుబాటును స్వీకరించడానికి సిద్ధమనస్సును ప్రదర్శించాలి. గిలియడ్‌ ఉపదేశకుడు లారెన్స్‌ బౌవెన్‌ లేవనెత్తిన ప్రశ్న: “మీ అంతరింద్రియములు మిమ్మల్ని సరిదిద్దుతాయా?” బైబిలులో, సూచనార్థకమైన అంతరింద్రియములు ఒక వ్యక్తిలోని లోతైన ఆలోచనలతో, భావోద్రేకాలతో సంబంధం కలిగివున్నాయని ఆయన చూపించాడు. దేవుని వాక్యంలోని ప్రేరేపిత సలహాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలోని లోతుల్లోకి సహితం ప్రవేశించినట్లైతే అవి ఆయనను సరిదిద్దేందుకు పనిచేయగలవు. (కీర్తన 16:⁠7; యిర్మీయా 17:​10) ఒక వ్యక్తి విశ్వసనీయమైన జీవన విధానం యెహోవానే గొప్ప రీతిలో స్పృశించగలదు. సామెతలు 23:​15, 16 చదివిన తరువాత ప్రసంగీకుడు ఇలా అడిగాడు: “మీ అంతరింద్రియములు మిమ్మల్ని సరిదిద్దుతాయా?” ఆయనింకా ఇలా అన్నాడు: “అవి అలా సరిదిద్దాలని మేము ప్రార్థిస్తున్నాము, అలాగైతేనే మీరు యెహోవా తనలో తాను అపరిమితమైన ఆనందాన్ని అనుభవించేలా చేయగలరు. మీరాయనలోని లోతైన భావాల్ని కదిలించగలరు. అవును, మీరు మీ నియామకాల్లో నమ్మకంగా నిలిచివుండడంవల్ల దేవుని అంతరింద్రియములు ఆనందించేలా చేస్తారు.”

కార్యక్రమంలోని ఈ భాగంలో చివరి ప్రసంగాన్ని మార్క్‌ న్యూమర్‌ ఇచ్చాడు, ఆయన గిలియడ్‌ ఉపదేశకుడు కావడానికి ముందు కెన్యాలో మిషనరీగా సేవచేశాడు. “ఎదుటనున్నదాన్ని అనుభవించడం మేలు” అనే శీర్షికగల ఆయన ప్రసంగం సంతృప్తిని అలవర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో వివరించింది. ప్రసంగి 6:9కి అనుగుణ్యంగా సహోదరుడు న్యూమర్‌ ఇలా సిఫారసు చేశాడు: “వాస్తవాన్ని అంగీకరించండి. అదే ‘ఎదుటనున్నదాన్ని అనుభవించడం’ అంటే. మీరు సాధించాలనుకున్నవి సాధించలేకపోతున్నప్పుడు వాటి గురించి కలలు కనడానికి బదులుగా మీ ప్రస్తుత పరిస్థితిపై దృష్టి కేంద్రీకరించి దాన్నుండి సాధ్యమైనంత ప్రయోజనాన్ని పొందండి. అసహేతుకమైన ఆశలు పెట్టుకుని, లేక మీ నియామకంలోని ప్రతికూల అంశాలపైనే మనస్సు నిలుపుతూ కలల లోకంలో విహరించడం మీలో అసంతృప్తి అసంతుష్టి ఏర్పడడానికే నడిపిస్తుంది.” అవును, మనం ఎక్కడున్నా లేక పరిస్థితులు ఎలా ఉన్నా దేవునితో మనకుగల సంబంధంపై ఆధారపడివున్న సంతృప్తిని పెంపొందించుకోవడం మన మహా సృష్టికర్తను సేవించడంలో ఆనందకరమైన ఆత్మను కలిగివుండడానికి దారితీస్తుంది.

రాజ్య సేవలోను గిలియడ్‌లోను ఆనందకరమైన అనుభవాలు

ఆ ప్రసంగాల ద్వారా లభించిన అంత చక్కని ఆచరణయోగ్యమైన ఉపదేశం విన్న తర్వాత, విద్యార్థులు తాము బహిరంగ పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు ఆ ఐదు నెలల్లో తమకెదురైన అనుభవాల్ని పంచుకున్నారు. గిలియడ్‌ స్కూలు రిజిస్ట్రార్‌ అయిన వాల్లెస్‌ లివరెన్స్‌ నిర్దేశంలో, పట్టభద్రులైన విద్యార్థులు తమను తాము దేవుని పరిచారకులుగా ఎలా మెప్పించుకున్నారో తెలిపారు. (2 కొరింథీయులు 4:⁠2) దైవదత్తమైన కొందరి మనస్సాక్షులను వారు ప్రేరేపించగలిగారు. వీధుల్లోను, ఇంటింటి పరిచర్యలోను, మరితర సందర్భాల్లోను కలిసిన యథార్థవంతులతో బైబిలు అధ్యయనాలు ఎలా ప్రారంభించబడ్డాయో విద్యార్థుల అనుభవాలు చూపించాయి. వేర్వేరు సందర్భాల్లో ఆసక్తిగల ప్రజలు యెహోవా సంస్థ అందిస్తున్న బైబిలు ఆధారిత ప్రచురణల్లో సత్యం ధ్వనిస్తోందని వ్యాఖ్యానించారు. ఒక ఇంటావిడ ఒక బైబిలు వచనం చదివినప్పుడు చాలా చక్కగా ప్రతిస్పందించింది. ఆమె ఇప్పుడు యెహోవాసాక్షులతో బైబిలును అధ్యయనం చేస్తోంది.

కార్యక్రమంలో తర్వాత, జోయెల్‌ ఆడమ్స్‌ గత సంవత్సరాల్లోని గిలియడ్‌ పట్టభద్రుల్ని ఇంటర్వ్యూ చేశాడు. ఆయన అంశం, “నేర్చుకోవడం ఎన్నడూ మానకండి, యెహోవాను సేవించడం ఎన్నడూ మానకండి.” ఆ ఇంటర్వ్యూల్లో క్రొత్త మిషనరీల కోసం ఎంతో సమయానుకూలమైన సలహా ఉంది. 26వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పటి రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటూ హ్యారీ జాన్సన్‌ ఇలా అన్నాడు: “యెహోవా తన ప్రజల్ని ఇప్పటి వరకు నడిపిస్తూ వచ్చాడు, ఇక ముందూ నడిపిస్తాడు అని మాకు నేర్పించబడింది. ఆ నమ్మకం ఈ సంవత్సరాలన్నింట్లో గొప్ప ప్రోత్సాహంగా ఉంది.” 53వ గిలియడ్‌ తరగతి విద్యార్థి విలియం నాన్కీస్‌ పట్టభద్రులకు ఈ సలహా ఇచ్చాడు: “అన్నింటికన్నా ప్రాముఖ్యంగా బైబిలు సూత్రాల్ని మనస్సులో ఉంచుకోండి, వాటిని మీ జీవితంలో ఇప్పుడూ మరి భవిష్యత్తులోనూ మీరు తీసుకునే నిర్ణయాలన్నింట్లో అన్వయించుకోండి. తత్ఫలితంగా మీరు మీ నియామకాల్లో నిలిచివుండగల్గుతారు, ఇంకా అపరిమితమైన యెహోవా ఆశీర్వాదాలు మీపై ఉంటాయి.”

“యెహోవా చిత్తాన్ని నెరవేర్చడానికి దృఢం చేయబడ్డారు” అన్నది రిచర్డ్‌ రైయన్‌ కార్యక్రమంలోని తన భాగానికి ఎంపిక చేసుకున్న అంశం. తాను ఇంటర్వ్యూ చేసినవారిలో 30వ తరగతి నుండి పట్టభద్రుడై స్పెయిన్‌లో 41 సంవత్సరాలు మిషనరీగా ఉన్న జాన్‌ కుర్ట్స్‌ కూడా ఉన్నాడు. గిలియడ్‌ పాఠ్యపుస్తకాల గురించి అడిగినప్పుడు సహోదరుడు కుర్ట్స్‌ ఇలా అన్నాడు: “మా ప్రధాన పుస్తకం బైబిలే. దానికి తోడుగా దాన్ని అర్థం చేసుకోవడానికి బైబిలు అధ్యయన సహాయకాలు కూడా ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నాయి. గిలియడ్‌లో ఏదో రహస్య సమాచారం అందజేయబడడం లేదు. నేనీ విషయాన్ని ఎప్పుడూ చెబుతుంటాను, ఎందుకంటే గిలియడ్‌ వద్ద అందించబడే సమాచారం సాక్షులందరికీ అందుబాటులోనే ఉంది.”

యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన సహోదరుడు గెరిట్‌ లూష్‌ “యెహోవా రెక్కల పైన, క్రింద” అన్న విషయంపై మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చక్కని రీతిలో ముగించాడు. దేవుని కాపుదల, విశ్వసనీయులైన ఆయన సేవకులకు ఆయనిచ్చే మద్దతు బైబిల్లో గ్రద్ద రెక్కలతో ఎలా పోల్చబడ్డాయో ఆయన వివరించాడు. (ద్వితీయోపదేశకాండము 32:​11, 12; కీర్తన 91:⁠4) గ్రద్ద తన పిల్లల్ని కాపాడడానికి కొన్నిసార్లు తన రెక్కల్ని కొన్ని గంటలపాటు చాపి ఉంచుతుంది. కొన్నిసార్లు తల్లి గ్రద్ద తన రెక్కల్ని తన పిల్లలపై ఉంచి చలిగాలుల నుండి కూడా రక్షిస్తుంది. అదే విధంగా, తన సంకల్పానికి అనుగుణంగా యెహోవా కూడా విశ్వసనీయులైన తన సేవకులకు సహాయం చేయగలడు, ప్రత్యేకంగా వారు ఆధ్యాత్మిక పరీక్షల్ని ఎదుర్కొన్నప్పుడు. తన సేవకులు సహించగలిగినదానికి మించి వారు శోధించబడడానికి యెహోవా అనుమతించడు, కానీ వారు దాన్ని సహించగలిగేలా తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగజేస్తాడు. (1 కొరింథీయులు 10:​13) సహోదరుడు లూష్‌ ఇలా అంటూ ముగించాడు: “ఆధ్యాత్మికంగా సంరక్షణలో ఉండాలంటే మనం యెహోవా రెక్కల క్రింద ఉండాలి. అంటే మనం స్వాతంత్ర్య స్ఫూర్తిని పెంపొందించుకోకూడదని అర్థం. మనమెల్లప్పుడూ యెహోవాకూ తల్లివంటి ఆయన సంస్థకూ దగ్గరగా ఉండాలి. వారి నిర్దేశం నుండీ ప్రేమపూర్వక సలహా నుండీ మనమెన్నడూ దూరంగా వెళ్ళకూడదు.”

చైర్మన్‌ భూమి నలుమూలల నుండి శ్రేయోభిలాషుల నుండి వచ్చిన టెలిగ్రామ్‌ అభినందనల్ని చదివాడు. తర్వాత డిప్లొమాలను అందజేయడం జరిగింది. గిలియడ్‌ స్కూలు స్థాపించబడినప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం కొన్ని తరగతులను మాత్రమే నిర్వహించాలని ఉద్దేశించారు. కానీ 58 సంవత్సరాలుగా యెహోవా దేవుడు స్కూలు పనిచేస్తూనే ఉండేలా చేశాడు. సహోదరుడు బార్బర్‌ ప్రారంభ వ్యాఖ్యానంలో చెప్పినట్లుగా: “గిలియడ్‌ స్థాపించబడిన 1943వ సంవత్సరం నుండి గిలియడ్‌ పట్టభద్రులు ఎంత చక్కని రికార్డును కొనసాగించారు! వారి సమష్టి కృషి భూమ్మీది వందల వేలమంది సాత్వికులు యెహోవా యొక్క మహిమాన్విత సంస్థలో చేరేలా పరిణమించింది.” అవును, ఈ మిషనరీ స్కూలు లక్షలాదిమంది రాజ్య నిరీక్షణతో ఆనందభరితులుగా ఉండేందుకు దోహదపడింది.

[24వ పేజీలోని బాక్సు]

తరగతి గణాంకాలు

ప్రాతినిధ్యం వహించిన దేశాల సంఖ్య: 8

పంపించబడిన దేశాల సంఖ్య: 18

విద్యార్థుల సంఖ్య: 48

సగటు వయస్సు: 34

సత్యంలో సగటు సంవత్సరాలు: 18

పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 13

[25వ పేజీలోని చిత్రాలు]

వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 110వ తరగతి

ఈ క్రింద ఉన్న లిస్టులో వరుసల సంఖ్య ముందు నుండి వెనక్కి లెక్కించబడ్డాయి, ప్రతి వరుసలోని పేర్లు ఎడమ నుండి కుడికి ఉన్నాయి.

(1) వాసెక్‌, ఈ.; మడెలిన్‌, ఎల్‌.; ఇవాన్స్‌, జి.; వాటనబీ, కె. (2) ట్రాఫర్డ్‌, పి.; టర్ఫా, జె.; విల్సన్‌, పి.; విలియమ్స్‌, ఆర్‌.; వేబర్‌, ఎ.  (3) జాన్సన్‌, టి; హనావు, కె.; మోర్లూ, ఎఫ్‌.; షార్పెన్‌ట్యే, ఎఫ్‌.; పెకమ్‌, ఆర్‌.; ఆండ్రసోఫ్‌, పి. (4) సీగర్స్‌, టి.; సీగర్స్‌, డి.; బెయిలీ, పి.; బెయిలీ, ఎమ్‌.; మడెలిన్‌, కె.; లిపోల్డ్‌, ఈ.; లిపోల్డ్‌, టి. (5) ఇవాన్స్‌, ఎన్‌.; గోల్డ్‌, ఆర్‌.; బోల్మన్‌, ఐ.; వాసెక్‌, ఆర్‌.; ఊన్‌జీన్‌, జె.; విల్సన్‌, ఎన్‌. (6) టర్ఫా, జె.; జూడీమా, ఎల్‌.; జూడీమా, ఆర్‌.; బేంక్ట్‌సన్‌, సి.; బేంక్ట్‌సన్‌, జె.; గెలానో, ఎమ్‌.; గెలానో, ఎల్‌. (7) పెకమ్‌, టి.; మోర్లూ, జె.; షార్పెన్‌ట్యే, సి.; గోల్డ్‌, ఎమ్‌.; బోల్మన్‌, ఆర్‌.; ఊన్‌జీన్‌, ఎఫ్‌. (8) వేబర్‌, ఆర్‌.; జాన్సన్‌, బి.; హనావు, డి.; వాటనబీ, వై.; విలియమ్స్‌, ఆర్‌.; ట్రాఫర్డ్‌, జి.; ఆండ్రసోఫ్‌, టి.