కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హస్మోనియన్లు వారి ప్రభావం

హస్మోనియన్లు వారి ప్రభావం

హస్మోనియన్లు వారి ప్రభావం

యేసు భూమ్మీద ఉన్నప్పుడు యూదామతం వేర్వేరు వర్గాలుగా విడిపోయి ఉంది, ప్రతి వర్గమూ ప్రజలపై పెత్తనం చెలాయించడానికే పోటీపడింది. బైబిలులోని సువార్త వృత్తాంతాల్లోను మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన జోసీఫస్‌ వ్రాతల్లోను ఆ పరిస్థితే వివరించబడింది.

ఈ రంగస్థలంపై పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎక్కువ ప్రాబల్యం ఉన్నవారిగా కనబడతారు, ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయగల సత్తా వీరికి ఉంది. ప్రజలు చివరికి యేసును మెస్సీయాగా అంగీకరించనంతగా వీరు తమ ప్రభావాన్ని కనపర్చారు. (మత్తయి 15:​1, 2; 16:⁠1; యోహాను 11:​47, 48; 12:​42, 43) అయితే ఇంత ప్రాబల్యం ఉన్న ఈ రెండు గుంపుల ప్రస్తావన హీబ్రూ లేఖనాల్లో ఎక్కడా కనిపించదు.

జోసీఫస్‌ సద్దూకయ్యులను పరిసయ్యులను గురించి సా.శ.పూ. రెండవ శతాబ్దానికి సంబంధించిన వివరణలో మొదటి సారిగా పేర్కొన్నాడు. ఆ కాలంలో చాలామంది యూదులు హెల్లెనిజం ఆకర్షణలో, అంటే గ్రీకు సంస్కృతీ తత్త్వజ్ఞానాల ఆకర్షణలో పడిపోతూ ఉన్నారు. సెల్యూకస్‌ రాజవంశ పరిపాలకులు, యెరూషలేములోని ఆలయాన్ని అపవిత్రం చేసి దాన్ని జీయస్‌కు సమర్పించినప్పుడు హెల్లెనువాదానికీ యూదామతానికీ మధ్య ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకుంది. శౌర్యవంతుడైన యూదామత నాయకుడు యూదా మక్కబీ, హస్మోనియన్లు అని పిలువబడిన ఒక కుటుంబం నుంచి వచ్చాడు. ఈయన దేవాలయాన్ని గ్రీకుల పట్టునుండి విడిపించిన తిరుగుబాటుదారుల సైన్యానికి నాయకత్వం వహించాడు. *

మక్కబీయుల తిరుగుబాటు, వారి దిగ్విజయంల తరువాతి సంవత్సరాల్లో ఒకదానితో మరొకటి పోటీపడే సిద్ధాంతాలతో వేర్వేరు మతతెగల్ని ఏర్పాటు చేసుకునే ధోరణి ప్రబలిపోయింది. వీటిలో ఒక్కొక్కటి వేరే తెగలతో పోటీపడుతూ అధికశాతం యూదా ప్రజానీకాన్ని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నించాయి. కానీ ఈ ధోరణి ఎందుకు తలెత్తింది? యూదామతం ఎందుకంత విభాజితమైంది? వీటికి జవాబులు కావాలంటే రండి, మనం హస్మోనియన్ల చరిత్రను పరిశీలిద్దాం.

పెరుగుతున్న స్వాతంత్ర్యం, అనైక్యత

యెహోవా దేవాలయంలో ఆరాధనను తిరిగి పునరుద్ధరించాలన్న తన మతపరమైన లక్ష్యాన్ని సాధించిన తరువాత యూదా మక్కబీ రాజకీయ చతురుడైపోయాడు. కాబట్టి చాలామంది యూదులు ఆయనను అనుసరించడం మానుకున్నారు. అయినా, ఆయన సెల్యూకస్‌ రాజవంశ పరిపాలకులతో పోరాడ్డంలో కొనసాగాడు, రోమ్‌తో ఒక సంధిని ఏర్పర్చుకున్నాడు, ఒక స్వతంత్ర యూదా రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నాలు సాగించాడు. ఒక యుద్ధంలో యూదా మరణించడంతో ఆయన సహోదరులైన యోనాతాను, సీమోనులు పోరాటాన్ని కొనసాగించారు. సెల్యూకస్‌ రాజవంశ పరిపాలకులు మొదట్లో మక్కబీయుల్ని శాయశక్తులా వ్యతిరేకించారు. కానీ కొంతకాలానికి ఈ పరిపాలకులు రాజకీయ రాజీలకు ఒప్పుకుని, హస్మోనియన్‌ సహోదరులకు కొంతమేరకు స్వయంపాలనా హక్కును అనుమతించారు.

హస్మోనియన్లు యాజకుల వంశం వారే అయినప్పటికీ అప్పటివరకు వారిలో ఎవ్వరూ ప్రధాన యాజకుని హోదాలో సేవచేయలేదు. సొలొమోను ప్రధాన యాజకునిగా నియమించిన సాదోకు సంతానం వారే ఆ స్థానాన్ని ఆక్రమించాలని చాలామంది యూదులు భావించారు. (1 రాజులు 2:​35; యెహెజ్కేలు 43:​19) తనను ప్రధాన యాజకునిగా నియమించేందుకు సెల్యూకస్‌ పరిపాలకులను ఒప్పించేలా యోనాతాను యుద్ధకార్యకలాపాల్నీ దౌత్యనీతినీ ప్రయోగించి చూశాడు. అయితే యోనాతాను మరణం తరువాత ఆయన అన్న సీమోను ఆయన కన్నా కాస్త ఎక్కువే సాధించాడు. సా.శ.పూ. 140 సెప్టెంబరులో యెరూషలేము నుండి ఒక ప్రముఖమైన ఆజ్ఞ గ్రీకు శైలిలో రాగి ఫలకాలపై జారీ చేయబడింది: “రాజైన దిమిత్రీస్‌ [గ్రీకువాడైన సెల్యూకస్‌ రాజవంశ పరిపాలకుడు] ఆయనకు [సీమోనుకు] ప్రధాన యాజకత్వాన్ని స్థిరపరిచాడు, తన స్నేహితుల్లో ఒకనిగా చేసుకున్నాడు, ఆయన పట్ల గౌరవాదరాల్ని కనబర్చాడు. . . . యూదులూ వారి యాజకులూ నమ్మదగిన ఒక ప్రవక్త జన్మించేంత వరకు సీమోను నిరంతరం తమ నాయకునిగా ప్రధాన యాజకునిగా ఉండాలని తీర్మానించుకున్నారు.”​—⁠1 మక్కబీయులు 14:​38-41 (అప్రామాణిక గ్రంథంలోని ఒక చరిత్ర పుస్తకం).

ఆ విధంగా పాలకునిగా ప్రధాన యాజకునిగా సీమోను స్థానం​—⁠ఆయనకూ ఆయన సంతానానికీ కూడా లభించేలా​—⁠విదేశీ సెల్యూకస్‌ పరిపాలకులకే కాక తన స్వంత ప్రజల మహా సమాజానికి కూడా అంగీకృతమైంది. ఇదొక ప్రాముఖ్యమైన మలుపురాయిగా ఉంది. చరిత్రకారుడైన ఏమీల్‌ ష్యూరర్‌ వ్రాస్తున్నట్లుగా, ఒకసారి హస్మోనియన్ల రాజవంశ పరిపాలన రాజకీయంగా స్థాపించబడిన తరువాత “వారి అసలు చింత తోరహ్‌ [యూదుల ధర్మశాస్త్రం]ను నెరవేర్చడం కాక, తమ రాజకీయ శక్తిని కాపాడుకోవడమూ దాన్ని విస్తృతపర్చుకోవడమూ అయిపోయింది.” అయితే యూదుల మనోభావాలను నొప్పించకుండా జాగ్రత్తపడుతూ సీమోను “రాజు” అనే బిరుదుకు బదులుగా “ప్రజానాయకుడు” అనే బిరుదును ఉపయోగించాడు.

హస్మోనియన్లు అలా అటు మతపరమైన ఇటు రాజకీయపరమైన నియంత్రణను హస్తగతం చేసుకోవడం కొందరికి నచ్చలేదు. కుమ్రాన్‌ సమాజం ఏర్పడిన కాలం ఇదేనని చాలామంది పండితులు అభిప్రాయపడతారు. కుమ్రాన్‌ వ్రాతల్లో “నీతి బోధకుడు” అని పేర్కొనబడిన వ్యక్తి అని నమ్మబడుతున్న, సాదోకు వంశావళి వాడైన ఒక యాజకుడు యెరూషలేమును విడిచిపెట్టి ఒక వ్యతిరేక గుంపును మృత సముద్రం ప్రక్కన యూదయలోని ఎడారిలోకి తీసుకువెళ్లాడు. హబక్కూకు పుస్తకంపై వ్యాఖ్యానమైన ఒక మృత సముద్రపు గ్రంథపు చుట్ట “మొదట్లో సత్యసంధుడిగా పిలువబడిన ఒక దుష్ట యాజకుడ్ని” గర్హిస్తుంది. “ఇశ్రాయేలుపై రాజ్యం చేసిన తరువాత ఆయన హృదయం గర్వంతో నిండిపోయింది” అని ఆ గ్రంథపు చుట్ట చెబుతుంది. పరిపాలిస్తున్న ‘దుష్ట యాజకుడు’ అని ఈ తెగవారు చేసిన వర్ణనకు యోనాతాను గానీ సీమోను గానీ సరిపోతారని చాలామంది పండితులు విశ్వసిస్తారు.

సీమోను తన ఆధీనంలో ఉన్న భూభాగాన్ని విస్తృతం చేసుకోవడానికి దండయాత్రలను కొనసాగించాడు. అయితే, యెరికో వద్ద ఒక విందులో ఆయన అల్లుడు టాలమీ ఆయన్నూ, ఆయన కుమారుల్లో ఇద్దరినీ హత్య చేయడంతో ఆయన పరిపాలన హఠాత్తుగా అంతమైంది. కానీ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న టాలమీ ప్రయత్నం విఫలమైంది. సీమోను కుమారుల్లో బ్రతికివున్న వాడైన జాన్‌ హిర్కేనస్‌, తన ప్రాణానికి ప్రమాదం ఉందని హెచ్చరించబడ్డాడు. తనను హత్య చేసే అవకాశం ఉన్నవారిని ఆయన బంధించి నాయకత్వాన్ని, ప్రధాన యాజకత్వాన్ని హస్తగతం చేసుకుని తన తండ్రి స్థానాన్ని ఆక్రమించాడు.

మరింత విస్తరణ, అణచివేత

మొదట్లో జాన్‌ హిర్కేనస్‌ సిరియా బలగాల నుండి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు, కానీ సా.శ.పూ. 129 లో సెల్యూకస్‌ రాజవంశం పార్థియన్లతో చేసిన ఒక కీలకమైన యుద్ధంలో ఓడిపోయింది. సెల్యూకస్‌ రాజవంశస్థులపై ఈ యుద్ధం చూపిన ప్రభావాన్ని గురించి యూదా చరిత్రకారుడు మెనాహెమ్‌ స్టెర్న్‌, “రాజ్య వ్యవస్థ సమస్తం దాదాపుగా కుప్పకూలిపోయింది” అని వ్రాశాడు. అలా హిర్కేనస్‌ “యూదయ ప్రాంతపు రాజకీయ స్వాతంత్ర్యాన్ని పొందడంతో పూర్తిగా తేరుకోగలిగాడు, తర్వాత అనేక దిశల్లో విస్తరించడం ప్రారంభించాడు.” చివరికి లక్ష్యాన్ని సాధించనే సాధించాడు.

ఇప్పుడిక సిరియన్ల నుండి ఎటువంటి ప్రమాదమూ లేకపోవడంతో హిర్కేనస్‌ యూదయ వెలుపలి ప్రాంతాలపై కూడా దండెత్తడం ప్రారంభించి, వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆయా ప్రాంతాల నివాసులు యూదా మతంలోకి మారాల్సి వచ్చింది, లేకుంటే వారి నగరాలు నేలమట్టమయ్యేవి. అలాంటిది ఒక సైనిక దాడి ఇదూమయులకు (ఎదోమీయులు) విరుద్ధంగా జరిగింది. దీని గురించి స్టెర్న్‌ ఇలా వ్యాఖ్యానించాడు: “ఇదూమయుల మత మార్పిడి అలాంటి మార్పిడులలోనే మొదటిది, ఏదో కొందరు వ్యక్తుల మార్పిడి జరగడానికి బదులుగా పూర్తి జాతి అంతటికీ మతమార్పిడి జరిగింది.” జయించబడిన ప్రాంతాల్లో సమరయ కూడా ఉంది, అక్కడ హిర్కేనస్‌ గెరీజీము పర్వతంపై ఉన్న సమరయుల దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. హస్మోనియన్ల రాజవంశం చేపట్టిన బలవంతపు మార్పిళ్ళ విధానంలోని హాస్యాస్పదమైన విషయాన్ని గురించి మాట్లాడుతూ చరిత్రకారుడైన సాల్మన్‌ గ్రేజెల్‌ ఇలా వ్రాశాడు: “అంతకు మునుపటి తరం ఎంతో ఉదాత్తంగా సమర్థించిన మత స్వాతంత్ర్యమనే అదే సూత్రాన్ని మత్తతీయ [యూదా మక్కబీ తండ్రి] మనుమడు ఒకడు ఉల్లంఘిస్తున్నాడు చూడండి.”

పరిసయ్యులు, సద్దూకయ్యుల రంగప్రవేశం

హిర్కేనస్‌ పరిపాలన గురించి వ్రాస్తున్నప్పుడే జోసీఫస్‌ పరిసయ్యులు, సద్దూకయ్యుల పెరుగుతున్న ప్రాబల్యాన్ని గురించి మొదటిసారిగా పేర్కొంటున్నాడు. (యోనాతాను పరిపాలన కాలంలో జీవించిన పరిసయ్యులను గురించి జోసీఫస్‌ ముందే పేర్కొన్నాడు.) ఆయన వీరి మూలాలను గురించి ఏమీ చెప్పడం లేదు. వీరు, యూదా మక్కబీకి ఆయన మతపరమైన లక్ష్యాల్లో మద్దతునిచ్చి, అటుతర్వాత ఆయన రాజకీయ లక్ష్యసిద్ధిలో పడిపోయినప్పుడు ఆయన్ను విడిచిపెట్టిన హాసిదీములనే ఒక నిష్ఠగల మతతెగ నుండి వచ్చి ఉంటారని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

పరిసయ్యులు అనే పేరు సాధారణంగా “వేర్పాటుదారులు” అని అర్థమిచ్చే హీబ్రూ మూలపదంతో జతచేయబడుతుంది. అయితే కొందరు ఆ మాట “భాష్యకారులు” అనే పదానికి సంబంధించినదని భావిస్తారు. పరిసయ్యులు సామాన్య ప్రజానీకంలోని విద్వాంసులు, ఎటువంటి ప్రత్యేక వంశావళి నుండి వచ్చినవారూ కారు. వారొక ప్రత్యేకమైన నిష్ఠా తత్త్వశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఆచారబద్ధమైన అపవిత్రత నుండి తమను తాము వేర్పర్చుకున్నారు, దేవాలయంలోని యాజకుల పరిశుద్ధతకు సంబంధించిన నియమాల్ని మామూలు దైనందిన పరిస్థితులకూ వర్తింపజేసుకున్నారు. ఈ పరిసయ్యులు లేఖనాలకు భాష్యం చెప్పే ఒక క్రొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు, ఇదే అటు తరువాత మౌఖిక ధర్మశాస్త్రం అయ్యింది. సీమోను పరిపాలనలో వీరు చాలా ప్రాబల్యాన్ని సంపాదించారు, యెరోసియా (పెద్దల సభ)లో సభ్యులుగా నియమించబడ్డారు, ఇదే అటు తరువాత సన్హెడ్రిన్‌, అంటే యూదుల మహా సభ అని పిలువబడింది.

జాన్‌ హిర్కేనస్‌ పరిసయ్యుల తొలి విద్యార్థి అనీ మద్దతుదారుడనీ జోసీఫస్‌ వర్ణిస్తున్నాడు. అయితే, కాలగతిలోని ఒకానొక సమయంలో పరిసయ్యులు, ప్రధాన యాజకత్వాన్ని విడిచిపెట్టనందుకు ఆయన్ను మందలించారు. దీంతో నాటకీయమైన రీతిలో ఒక చీలిక ఏర్పడింది. హిర్కేనస్‌ పరిసయ్యుల మతపర ఆదేశాల్ని రద్దు చేశాడు. ఇది చాలదన్నట్లు అదనపు శిక్షగా ఆయన పరిసయ్యుల మతపరమైన శత్రువులైన సద్దూకయ్యుల పక్షాన చేరాడు.

సద్దూకయ్యులనే పేరుకు బహుశ ప్రధాన యాజకుడైన సాదోకు పేరుతో సంబంధం ఉండవుండవచ్చు. ఈయన వంశస్థులు సొలొమోను కాలం నుండి యాజక విధుల్ని నిర్వర్తిస్తున్నారు. అయితే సద్దూకయ్యులందరిదీ అదే వంశం కాదు. జోసీఫస్‌ ప్రకారం సద్దూకయ్యులు జనాంగంలోని కులీనవర్గం వారు, ధనికవర్గం వారు. వీరికి ప్రజా మద్దతు పెద్దగా లేదు. ప్రొఫెసర్‌ షిఫ్‌మాన్‌ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “వీరిలో అత్యధికులు . . . యాజకులేనని తెలుస్తోంది, లేదా ప్రధాన యాజకుల కుటుంబాలతో అంతర వివాహాలు జరుపుకున్నవారై ఉండవచ్చును.” వారావిధంగా అధికారంలో ఉన్నవారితో చాలాకాలం దగ్గరి సంబంధాలు కలిగివున్నారు. అందుకని, ప్రజా జీవన స్రవంతిలో పరిసయ్యుల పాత్ర పెరగడమూ, యాజకులకు ఉండాల్సిన పరిశుద్ధత అందరికీ ఉండాలన్న వారి సూత్రమూ సద్దూకయ్యులకు ఉన్న సహజ అధికారానికి ముప్పును తీసుకువచ్చే అంశాలుగా కన్పించాయి. చివరికి, హిర్కేనస్‌ పరిపాలన చివరి రోజుల్లో సద్దూకయ్యులు మళ్ళీ ఆధిపత్యాన్ని సంపాదించారు.

రాజకీయాలెక్కువ, భక్తి తక్కువ

హిర్కేనస్‌ పెద్ద కొడుకు అరిస్టోబ్యులస్‌ ఒక్క సంవత్సరం మాత్రం పరిపాలించి చనిపోయాడు. ఆ కాలంలో ఆయన ఇతూరయన్ల విషయంలో బలవంతపు మతమార్పిడులు కొనసాగించాడు. ఆయన ఉత్తర గలిలయను హస్మోనియన్ల పరిధిలోకి తీసుకువచ్చాడు. కానీ సా.శ.పూ. 103-76 మధ్యకాలంలో పరిపాలించిన ఆయన తమ్ముడైన అలెగ్జాండర్‌ జన్నేయస్‌ పరిపాలనలోనే హస్మోనియన్ల రాజవంశం శక్తి సంబంధంగా అత్యుచ్ఛస్థాయికి చేరుకుంది.

అలెగ్జాండర్‌ జన్నేయస్‌ పాత విధానాన్ని తిరస్కరించి తనను తాను బాహాటంగా ప్రధాన యాజకునిగా రాజుగా ప్రకటించుకున్నాడు. హస్మోనియన్ల పరిసయ్యుల మధ్య సంఘర్షణలు తీవ్రతరమయ్యాయి, చివరికి అవి 50,000 మంది యూదులు నశించిపోయిన ఒక అంతర్యుద్ధానికి దారితీశాయి. జన్నేయస్‌ తిరుగుబాటును అణచివేసిన తరువాత, అన్యరాజులను గుర్తుకుతెచ్చే రీతిలో 800 మంది తిరుగుబాటుదారుల్ని కొయ్యకు వ్రేలాడదీశాడు. వారు తుదిశ్వాస పీల్చుకుంటుండగా వారి కళ్ళముందే వారి భార్యలూ పిల్లలూ వధించబడ్డారు. ఇదంతా జరుగుతుండగా జన్నేయస్‌ తన ఉంపుడుకత్తెలతో బహిరంగంగా విందారగిస్తున్నాడు. *

జన్నేయస్‌కు పరిసయ్యులతో శత్రుత్వం ఉన్నప్పటికీ, ఆయన ఎంతో లౌక్యంగల రాజకీయవేత్త. పరిసయ్యులకు ప్రజా మద్దతు పెరుగుతోందని ఆయన గమనించాడు. ఆయన తాను మరణశయ్యపై ఉన్నప్పుడు తన భార్య సలోమీ అలెగ్జాండ్రాకిచ్చిన సలహా ఏమిటంటే అధికారాన్ని వారితో పంచుకోమనడమే. తన కుమారులను కాదని ఆయన ఆమెను తన రాజ్యానికి వారసురాలిగా ఎంపిక చేసుకున్నాడు. ఆమె సామర్థ్యంగల పరిపాలకురాలిగా రుజువుచేసుకుంది, ఆమె హస్మోనియన్ల పరిపాలనంతటిలో కాస్త శాంతి వర్ధిల్లిన కాలాన్ని తన జనాంగానికి ఇచ్చింది (సా.శ.పూ. 76-67). పరిసయ్యులకు అధికారాల్ని తిరిగి కట్టబెట్టింది, వారి మతపర ఆదేశాలకు విరుద్ధంగా ఉన్న చట్టాల్ని వెనక్కు తీసుకుంది.

సలోమీ చనిపోయిన తరువాత ఆమె కొడుకులు, ప్రధాన యాజకునిగా సేవచేసిన హిర్కేనస్‌ II, అరిస్టోబ్యులస్‌ IIలు బలప్రదర్శనకు బరిలో దిగారు. ఇద్దరికీ తమ పూర్వికులకు ఉన్నంత రాజకీయమైన సైనికపరమైన అవగాహన లేదు. అంతేకాదు, సెల్యూకస్‌ రాజవంశీకుల రాజ్యం పూర్తిగా కుప్పకూలిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో రోమన్ల ఉనికి పెరుగుతుండడం మూలంగా ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో ఇద్దరూ అర్థం చేసుకోలేదని అనిపిస్తోంది. రోమా పరిపాలకుడైన పాంపే దమస్కులో ఉన్నప్పుడు, సా.శ.పూ. 63 లో సహోదరులిద్దరూ ఆయన తట్టు తిరిగి, తమ వివాదానికి మధ్యవర్తిత్వం నెరపమని కోరారు. అదే సంవత్సరంలో పాంపే తన సేనలతోపాటు యెరూషలేములోకి ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. హస్మోనియన్ల రాజ్యం కూలిపోవడం దాంతోనే ప్రారంభం. సా.శ.పూ. 37 లో ఇదూమీయ రాజైన హేరోదు ద గ్రేట్‌ యెరూషలేమును ఆక్రమించుకున్నాడు, ఆయన్ను రోమా సెనేట్‌ “యూదయకు రాజు,” “రోమీయులకు మిత్రుడు, స్నేహితుడు”గా ఆమోదించింది. హస్మోనియన్ల రాజ్యం కనుమరుగైపోయింది.

హస్మోనియన్ల ప్రభావం

యూదా మక్కబీ నుండి అరిస్టోబ్యులస్‌ II వరకు ఉన్న హస్మోనియన్ల కాలం, యేసు ఈ భూమ్మీద నడిచినప్పటి కాలంలో ఉన్న మత విభజనకు పునాదిని వేసింది. హస్మోనియన్లు దేవుని ఆరాధన పట్ల అత్యంతాసక్తితో ఉద్భవించారు, కానీ అది కాస్తా స్వార్థపూరిత దుష్కార్యాలకు దిగజారిపోయింది. దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో ప్రజల్ని ఏకీకరించే అవకాశం ఉన్న వారి యాజకులు ఆ జనాంగాన్ని రాజకీయ కుట్రలూ కుతంత్రాల అగాధంలోకి నడిపించారు. ఈ వాతావరణంలో విభిన్నమైన మతపరమైన దృక్కోణాలు వర్ధిల్లాయి. హస్మోనియన్లు అంతరించిపోయారు, కానీ సద్దూకయ్యులు పరిసయ్యులు మరితరుల మధ్య, మతపరమైన నియంత్రణ కోసమైన పోరాటం, హేరోదు రోమ్‌ల క్రిందనున్న ఆ జనాంగపు విశిష్టలక్షణంగా ఉండనైయుంది.

[అధస్సూచీలు]

^ పేరా 4 కావలికోట నవంబరు 15, 1998 సంచికలోని “మక్కబీయులు ఎవరు?” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 22 “నహూముపై వ్యాఖ్యానం” అనే మృత సముద్రపు గ్రంథపు చుట్ట, “పురుషుల్ని సజీవంగా ఉరితీసిన” “ఆగ్రహోదగ్ర సింహం” గురించి పేర్కొంటున్నది, బహుశ పైనున్న సంఘటన గురించే కావచ్చు.

[30వ పేజీలోని చార్టు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

హస్మోనియన్ల రాజవంశం

యూదా మక్కబీ యోనాతాను మక్కబీ సీమోను మక్కబీ

జాన్‌ హిర్కేనస్‌

↓ ↓

సలోమీ అలెగ్జాండ్రా—భార్యాభర్తలు—అలెగ్జాండర్‌ జన్నేయస్‌ అరిస్టోబ్యులస్‌

↓ ↓

హిర్కేనస్‌ II అరిస్టోబ్యులస్‌ II

[27వ పేజీలోని చిత్రం]

యూదా మక్కబీ యూదుల స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించాడు

[చిత్రసౌజన్యం]

The Doré Bible Illustrations/Dover Publications, Inc.

[29వ పేజీలోని చిత్రం]

హస్మోనియన్లు యూదులవి కాని నగరాల్లో తమ నియంత్రణను విస్తరించడానికి ప్రయత్నించారు

[చిత్రసౌజన్యం]

The Doré Bible Illustrations/Dover Publications, Inc.