కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యారాధన ప్రజలను ఐక్యపరుస్తుంది

సత్యారాధన ప్రజలను ఐక్యపరుస్తుంది

సత్యారాధన ప్రజలను ఐక్యపరుస్తుంది

సాధారణంగా మతం మానవజాతిని విభజించడానికే మొగ్గు చూపుతున్నప్పటికీ, ఏకైక సత్యదేవునికి చేసే ఆరాధనకు ప్రజలను ఐక్యపరచే శక్తి ఉంది. ఇశ్రాయేలు దేవుడు ఎంపికచేసుకున్న జనాంగముగా ఉన్నప్పుడు, యథార్థహృదయులైన అనేక మంది అన్యజనులు సత్యారాధనవైపుకు ఆకర్షితులయ్యారు. ఉదాహరణకు, రూతు తన స్వదేశమైన మోయాబు దేవుళ్ళను వదిలిపెట్టి, నయోమితో, “నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు” అని చెప్పింది. (రూతు 1:​16) సా.శ. మొదటి శతాబ్దం వచ్చేసరికి, గొప్ప సంఖ్యలో అన్యజనులు సత్య దేవుని ఆరాధకులయ్యారు. (అపొస్తలుల కార్యములు 13:​48; 17:⁠4) తర్వాత, యేసు అపొస్తలులు సువార్తతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించడం మొదలుపెట్టడంతో, యథార్థ హృదయులైన ఇతర ప్రజలు కూడా సత్యదేవుణ్ణి ఆరాధించడంలో ఐక్యపర్చబడ్డారు. “మీరు విగ్రహములను విడిచి పెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు ... దేవుని వైపునకు తిరిగితి[రి]” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 థెస్సలొనీకయులు 1:⁠9) ప్రజలను అలా ఐక్యపరచే శక్తి సత్య దేవుని ఆరాధనకు నేడూ ఉందా?

శంకావాదులు “సత్యారాధకులు,” “సత్య దేవుడు” అనడం తప్పని నొక్కి వక్కాణిస్తారు. సత్యాన్ని నేర్చుకోగల ఏ మూలాధారం గురించీ వాళ్ళకు తెలియనందువల్లే వాళ్ళలా భావిస్తుండవచ్చు కానీ అనేక నేపథ్యాల నుండి వచ్చిన సత్యాన్వేషకులు ఆరాధన అనేది అభిరుచిని బట్టి నిర్ణయించుకునే విషయం కాదని గ్రహించారు. మన ఆరాధనకు అర్హుడు అన్నింటికి సృష్టికర్తయైన యెహోవా దేవుడు మాత్రమే. (ప్రకటన 4:​10, 11) ఆయనే సత్య దేవుడు, తానెలా ఆరాధించబడాలన్నది నిర్ణయించుకునే హక్కు ఆయనకుంది.

తానేమి కోరుతున్నాడో మనం గ్రహించేందుకు సహాయపడడానికి యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా మనకు సమాచారాన్ని అందజేశాడు. భూమి మీద ఉన్న దాదాపు ప్రతి ఒక్కరికీ మొత్తం బైబిలుగానీ, దానిలోని కొన్ని భాగాలు గానీ అందుబాటులో ఉన్నాయి. అంతేకాక, “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే ... సత్యమును గ్రహించెదరు” అని దేవుని కుమారుడు చెప్పాడు. (యోహాను 8:​31,32) కనుక, సత్యాన్ని తెలుసుకోవచ్చు. వివిధ నేపథ్యాల నుండి వచ్చిన యథార్థహృదయులైన లక్షల కొలది ప్రజలు ఈసత్యాన్ని ధైర్యంగా అవలంబిస్తున్నారు, వారు సత్యారాధనలో ఐక్యమైవున్నారు.​—⁠మత్తయి 28:​19,20; ప్రకటన 7:⁠9,10.

మన కాలాల్లో ప్రపంచవ్యాప్త ఐక్యత!

జెఫన్యా పుస్తకంలోని గమనార్హమైన ఒక ప్రవచనం, వివిధ నేపథ్యాలకు చెందిన ప్రజలు సమకూడడం గురించి మాట్లాడుతుంది. “అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు [యెహోవా దేవుడినైన] నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చెదను” అని అది చెబుతోంది. (జెఫన్యా 3:⁠9) యెహోవాను ఐక్యంగా సేవిస్తున్నవారిగా మారిన ప్రజల గురించిన ఎంత రమ్యమైన వర్ణన అది!

ఇదెప్పుడు జరుగనుంది? “యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా​—⁠నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్నిచేత భూమియంతయు కాలిపోవును” అని జెఫన్యా 3:8 చెబుతోంది. అవును, యెహోవా అన్యజనులను పోగు చేసే సమయంలో, వారిపై తన రోషాగ్నిని కురిపించక ముందు, భూమి మీద ఉన్న వినయమనస్కులకు ఆయన పవిత్ర భాషను ఇస్తాడు. ఆసమయం ఇదే. సర్వశక్తిమంతుడైన దేవుని మహా దినమున అర్మగిద్దోను అనే మహా యుద్ధం కోసం దేశములనన్నింటినీ పోగు చేసే సమయం ఇప్పుడు ప్రగతి పథంలో ఉంది.​—⁠ప్రకటన 16:​14,16.

తన ప్రజలను ఐక్యపర్చేందుకు యెహోవా వారికి పవిత్ర భాషను ఇస్తున్నాడు. ఈక్రొత్త భాషలో, దేవుని గురించిన, ఆయన సంకల్పాల గురించిన బైబిలు సత్యమును సరైన విధంగా అర్థం చేసుకోవడం ఇమిడి ఉంది. పవిత్ర భాషను మాట్లాడడంలో, సత్యాన్ని నమ్మడం, దాన్ని ఇతరులకు బోధించడం, దేవుని నియమాలకూ సూత్రాలకూ పొందికగా జీవించడం ఇమిడి ఉన్నాయి. అందుకు, విభాగించే రాజకీయాలను వదిలిపెట్టడం, ఈలోకపు లక్షణాలైన జాతివాదము, విభాగించే జాతీయతా వాదము వంటి స్వార్థపూరిత మనోభావాలను హృదయాల్లో నుండి పెరికివేయడం అవసరం. (యోహాను 17:​14; అపొస్తలుల కార్యములు 10:​34,35) సత్యాన్ని ప్రేమించే యథార్థ హృదయులందరూ ఈభాషను నేర్చుకోగలరు. ముందటి ఆర్టికల్‌లో పేర్కొనబడిన ఐదుగురు వ్యక్తులనే తీసుకోండి. వారు ఒకప్పుడు మత సంబంధంగా వేర్వేరు దృక్కోణాలుగలవారు, కానీ ఇప్పుడు ఏకైక సత్య దేవుడైన యెహోవాను ఆరాధించడంలో ఐక్యమై ఉన్నారు.

వారు సత్యారాధనలో ఐక్యమైవున్నారు

నిష్ఠగల రోమన్‌ క్యాథలిక్‌ విశ్వాసి ఫీడెల్యా, తన కూతురి స్కూలు హోంవర్క్‌ కోసం, ఒక బైబిలు కొనింది. మరణించిన తన ఐదుగురు పిల్లలకు ఏమైందో ఆబైబిలు నుండి వివరించి చెప్పమని తమ ప్రీస్టును ఆమె అడిగింది. అప్పుడు తనకు “ఎంత నిరాశ కలిగింది!” అని ఆమె అంటోంది. యెహోవాసాక్షులు ఆమెను సందర్శించినప్పుడు, ఆమె వాళ్ళను కూడా అలాంటి ప్రశ్నే అడిగింది. మృతుల పరిస్థితి గురించిన సత్యాన్ని తన సొంత బైబిలులో చదివినప్పుడు, తమ చర్చి తనను ఎంత మోసం చేసిందో ఆమె గ్రహించింది. మృతులకు దేని గురించీ స్పృహ ఉండదు కనుక, వారు పాతాళంలో గానీ మరెక్కడైనా గానీ బాధలననుభవించడం లేదని ఆమె తెలుసుకుంది. (కీర్తన 146:⁠4; ప్రసంగి 9:⁠5) ఆమె తన మత సంబంధ ప్రతిమలన్నింటినీ పారేసి, తమ చర్చిని వదిలిపెట్టి, బైబిలును అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. (1 యోహాను 5:​21) గత పది సంవత్సరాలుగా, ఆమె ఇతరులకు లేఖనాల్లోవున్న సత్యాలను బోధించడంలో ఆనందిస్తోంది.

ఖాట్మండులోని తార, మరొక దేశంలోకి తరలి వెళ్ళింది, అక్కడ హిందూ ఆలయాలు అంతగా లేవు. అందుకే, తన ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకోవాలనే ఆశతో ఆమె ఒక మెథడిస్ట్‌ చర్చికి వెళ్ళింది. కాని మానవుల బాధలను గురించిన తన ప్రశ్నకు అక్కడా ఆమెకు జవాబు దొరకలేదు. అలావుండగా, యెహోవాసాక్షులు ఆమెను సంప్రదించి, ఆమెతో బైబిలు అధ్యయనం చేస్తామని ప్రతిపాదించారు. “ఈలోకంలోని బాధలన్నింటికీ ప్రేమా స్వరూపియైన దేవుడు బాధ్యుడు కాడని నేను గ్రహించాను. ... శాంతి, సామరస్యాలుండే నూతన లోకమనే నిరీక్షణను బట్టి నేను ఆనందించాను” అని తార చెబుతోంది. (ప్రకటన 21:​3,4) తార తమ హిందు దేవుళ్ళ ప్రతిమలను పారేసి, తన స్వదేశపు మతసంబంధ ఆచారాలను మానేసి, ఒక యెహోవాసాక్షిగా, ఇతరులు తమ ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకొనేందుకు సహాయపడడంలో నిజమైన సంతోషాన్ని కనుగొంది.

బౌద్ధ మతస్థుడైన పాన్య, యెహోవాసాక్షులు తనను మొదటిసారిగా బ్యాంకాక్‌లో సందర్శించినప్పుడు సోదె చెప్పేవాడు. అందుకే, బైబిలులోని ప్రవచనాలు ఆయనకు ఆసక్తిని రేకెత్తించాయి. “ప్రస్తుత పరిస్థితులు సృష్టికర్త ఆదిలో సంకల్పించినదానికి భిన్నంగా ఉండడానికి గల కారణాన్ని, ఆయనను ఆయన సర్వాధిపత్యాన్ని తిరస్కరించేవారి మూలంగా కలిగిన నష్టాల ఛాయలు కూడా లేకుండా చేసేందుకు ఆయన చేసిన ఏర్పాట్లను గురించీ తెలుసుకున్నప్పుడు, నా కళ్ళకున్న మబ్బు పొరలు తీసివేయబడినట్లయ్యింది. బైబిలు సందేశాన్ని గురించిన ప్రతి వివరణ ఎంతో పొందికగా ఉంది. నేను యెహోవాను ఒక వ్యక్తిగా ప్రేమించడం మొదలుపెట్టాను; సరైనదని నాకు తెలిసినదాన్ని ఆచరణలో పెట్టడానికి అది ప్రేరణనిచ్చింది. మానవ జ్ఞానానికి దైవిక జ్ఞానానికి మధ్య గల తేడాను చూసేందుకు ఇతరులకు సహాయపడాలన్న ఆతురత నాలో కలిగింది. నిజమైన జ్ఞానము నిజంగా నా జీవితాన్ని మార్చి వేసింది” అని పాన్య అన్నాడు.

వర్జిల్‌కి తన మత నమ్మకాలను గురించి, కాలక్రమేణా తీవ్రమైన సందేహాలు కలుగనారంభించాయి. నల్లవారికి సహాయం చేయమని ప్రార్థించే బదులు, శ్వేతజాతీయులపై విద్వేషాన్ని కలిగిస్తున్న జాతివాద సంస్థగా తాను భావిస్తున్న సంస్థ కోసం దేవుణ్ణి ప్రార్థించే బదులు, సత్యమును అదేదైనా సరే ఎక్కడున్నా సరే తనకు చూపించమని ప్రార్థించాడు. “నేను దేవునికి తీవ్రంగా ప్రార్థించిన మరుసటి రోజు నేను నిద్ర నుండి మేల్కొని చూసేసరికి, ఇంట్లో కావలికోట పత్రిక కనిపించింది. ... అది తలుపు క్రింద నుండి జారవేయబడివుండవచ్చు” అని ఆయన చెబుతున్నాడు. త్వరలోనే ఆయన యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం శ్రద్ధగా చేయడం మొదలుపెట్టాడు. “నా జీవితంలో మొదటిసారిగా, నాకు తృప్తనిపించింది. ... నాలో ఒక నిరీక్షణా కిరణం ఉదయించనారంభించింది” అని కూడా ఆయనంటున్నాడు. దేవుని వాక్యమైన బైబిలులో ఇవ్వబడిన ఏకైక సత్య నిరీక్షణను ప్రజలకు ప్రతిపాదించేవారితో ఆయన త్వరలోనే ఐక్యపర్చబడ్డాడు.

లాటిన్‌ అమెరికాకు చెందిన చారో, తన చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నట్లు గ్లాడిస్‌ అనే సాక్షి గమనించి, తనను మార్కెట్‌కి తీసుకెళ్ళడం ద్వారా సహాయం చేయనారంభించినప్పుడు చారో చాలా ముగ్ధురాలైంది. కొన్నాళ్ళకు, ఆమె గ్లాడిస్‌ చేసిన ప్రతిపాదనకు అంటే, ఉచిత గృహ బైబిలు అధ్యయనానికి అంగీకరించింది. మంచివాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరనీ, దేవుడు మానవులను భూమి మీద నిత్య జీవితంతో కూడా ఆశీర్వదిస్తాడని తన సొంత బైబిలు నుండి తెలుసుకున్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. (కీర్తన 37:​11,29) చారో ఈనిరీక్షణను గత 15 సంవత్సరాలుగా ఇతరులతో పంచుకుంటోంది.

ఏకైక సత్యదేవుడైన యెహోవాను ఆరాధించడంలో ఐక్యంగా ఉన్న యథార్థ హృదయులైన ప్రజలతో భూమి మొత్తం నిండివుండడాన్ని ఊహించండి! ఇది కల్పన కాదు. ఇది యెహోవా చేసిన వాగ్దానం. తన ప్రవక్త జెఫన్యా ద్వారా, దేవుడు, “దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండనిత్తును. ... వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ ... [ఉం]దురు” అని వాగ్దానం చేశాడు. (జెఫన్యా 3:​12,13) ఈవాగ్దానం మీకు ఆకర్షణీయంగా ఉన్నట్లయితే, “దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు” అన్న బైబిలు ఉద్బోధను హృదయంలోకి తీసుకోండి.​—⁠జెఫన్యా 2:⁠3.