కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా దీవెన మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తుంది

యెహోవా దీవెన మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తుంది

యెహోవా దీవెన మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తుంది

“యెహోవా దీవెన ఐశ్వర్యవంతులను చేస్తుంది, దానితో ఆయన ఏబాధను చేర్చడు.”​—సామెతలు 10:​22, Nw.

1, 2. సంతోషానికి వస్తుసంపదలతో ఎందుకు పొత్తులేదు?

నేడు లక్షలాదిమంది జీవితాలను వస్తుదాయక అన్వేషణలు నియంత్రిస్తున్నాయి. కానీ వస్తుసంపదలు వారిని సంతోషపరుస్తున్నాయా? “ప్రజలు తమ జీవిత స్థితిని గురించి ఇంత నిరాశాపూరితంగా ఉన్న మరో సమయం నాకు గుర్తులేదు” అని ది ఆస్ట్రేలియన్‌ వుమెన్స్‌ వీక్లీ చెబుతోంది. అది ఇంకా ఇలా చెబుతోంది: “అదొక వైపరీత్యం. ఆర్థికపరంగా ఆస్ట్రేలియా మంచి స్థితిలో ఉందనీ, జీవితం ఇంతకంటే మంచిగా ఎప్పుడూ ఉండలేదనీ మనకు చెప్పబడింది. ... అయినా దేశమంతటా నిరాశావాదం ప్రబలుతోంది. స్త్రీలూ పురుషులూ కూడా, తమ జీవితాల్లో ఏదో కొరవడుతోందని అనుకుంటున్నారు గానీ అదేమిటో వాళ్ళు నిర్వచించలేకపోతున్నారు.” మన కలిమి నుండి సంతోషం గానీ, జీవం గానీ లభించవని సూచించడంలో లేఖనాలు ఎంత సత్యవంతమైనవో కదా!​—⁠ప్రసంగి 5:10; లూకా 12:15.

2 దేవుని దీవెన నుండే అతి గొప్ప సంతోషం కలుగుతుందని బైబిలు బోధిస్తోంది. దీనికి సంబంధించి, సామెతలు 10:⁠22 ఇలా చెబుతోంది: “యెహోవా దీవెన ఐశ్వర్యవంతులను చేస్తుంది, దానితో ఆయన ఏబాధను చేర్చడు.” దురాశతో వస్తు సంపదలను సమకూర్చుకోవడం వల్ల తరచు బాధలు కలుగుతాయి. తగిన విధంగానే, అపొస్తలుడైన పౌలు ఇలా హెచ్చరించాడు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”​—⁠1 తిమోతి 6:9, 10.

3. దేవుని సేవకులు పరీక్షలను ఎందుకు అనుభవిస్తారు?

3 మరో వైపున, ‘యెహోవా మాట వింటూ ఉండే’ వారందరికీ బాధల్లేని దీవెనలు ప్రాప్తిస్తాయి. (ద్వితీయోపదేశకాండము 28:⁠2) అయితే, ‘యెహోవా ఇచ్చే దీవెనకు ఏబాధా చేర్చబడనట్లయితే, మరి దేవుని సేవకులనేకులు ఎందుకు బాధలు పడుతున్నారు?’ అని కొందరు ప్రశ్నించవచ్చు. మన పరీక్షలను దేవుడు అనుమతిస్తున్నాడు కానీ వాస్తవానికి అవి సాతాను మూలంగా, అతని దుష్టవిధానం మూలంగా, మన అపరిపూర్ణత మూలంగా ఉత్పన్నమవుతాయని బైబిలు తెలియజేస్తోంది. (ఆదికాండము 6:⁠5; ద్వితీయోపదేశకాండము 32:​4,5; యోహాను 15:​19; యాకోబు 1:​14,15) ‘శ్రేష్ఠమైన ప్రతి యీవికి సంపూర్ణమైన ప్రతి వరముకు’ మూలం యెహోవాయే. (యాకోబు 1:​17) అందుకే, ఆయనిచ్చే దీవెనలు ఎన్నడూ బాధను కలిగించవు. కాబట్టి మనం దేవుడిచ్చే శ్రేష్ఠమైన కానుకల్లో కొన్నింటిని పరిశీలిద్దాం.

దేవుని వాక్యం​—⁠అమూల్యమైన కానుక

4. యెహోవా ప్రజలు ఈ“అంత్యకాలము”లో ఏదీవెనను, అమూల్యమైన కానుకను ఆనందిస్తారు?

4 “అంత్యకాలము” గురించి దానియేలు ప్రవచనం, “తెలివి అధికమగును” అని పేర్కొంటోంది. అయితే దీని భావం, ఈమాటలచే పరిమితం చేయబడుతుంది: “ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.” (దానియేలు 12:​4,10) ఒక్కసారి ఊహించండి! దేవుని వాక్యం, ప్రాముఖ్యంగా ప్రవచనం ఎంతటి దైవిక జ్ఞానముతో వ్యక్తపరచబడిందంటే, దుష్టులు దాని సరైన భావాన్ని గ్రహించలేరు, అయితే యెహోవా ప్రజలు గ్రహిస్తారు. దేవుని కుమారుడు ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.” (లూకా 10:​21) దేవుని లిఖిత వాక్యమైన బైబిలు అనే అమూల్యమైన కానుకను పొందడం, యెహోవా ఎవరికైతే ఆధ్యాత్మిక అంతర్దృష్టిని ఇచ్చాడో వారిమధ్యన ఉండడం ఎంతటి దీవెన!​—⁠1 కొరింథీయులు 1:​21,27,28; 2:​14,15.

5 మనం “పైనుండివచ్చు జ్ఞానము”ను పొందక పోయినట్లయితే మనకు ఏమాత్రం ఆధ్యాత్మిక అంతర్దృష్టి ఉండేది కాదు. (యాకోబు 3:​17) జ్ఞానము అంటే, సమస్యలను పరిష్కరించుకోవడానికి, ప్రమాదాలను తప్పించుకోవడానికి లేక నివారించుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి, లేక సరైన ఉపదేశాన్ని ఇవ్వడానికి తెలివిని, అవగాహనను ఉపయోగించుకునే సామర్థ్యం. మనం దైవిక జ్ఞానమును ఎలా పొందుతాము? సామెతలు 2:6 ఇలా చెబుతోంది: “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు; తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.” అవును, మనం జ్ఞానం కోసం పట్టుదలతో ప్రార్థిస్తే, యెహోవా సొలొమోను రాజుకు “బుద్ధి వివేకములు గల హృదయము”ను ఇచ్చినట్లు, మనల్ని జ్ఞానముతో దీవిస్తాడు. (1 రాజులు 3:11, 12; యాకోబు 1:​5-8) జ్ఞానమును సంపాదించుకోవడానికి మనం యెహోవా వాక్యమును క్రమంగా అధ్యయనం చేస్తూ దాన్ని అన్వయించుకోవడం ద్వారా ఆయన చెప్పేది వింటూ ఉండాలి కూడా.

6. దేవుని నియమాలనూ, సూత్రాలనూ మన జీవితంలో అన్వయించుకోవడం ఎందుకు జ్ఞానయుక్తం?

6 బైబిలు నియమాల్లోనూ, సూత్రాల్లోనూ దైవిక జ్ఞానానికి సంబంధించిన అత్యుత్తమమైన ఉదాహరణలను కనుగొనవచ్చు. ఇవి మనకు అన్ని విధాలుగానూ అంటే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. అందుకు తగినట్లే కీర్తనకర్త ఇలా పాడాడు: “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును; యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారుకంటెను కోరదగినవి.”​—⁠కీర్తన 19:​7-10; 119:​72.

7. దేవుని నీతియుక్తమైన ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తే ఫలితమేమిటి?

7 మరోవైపున, దేవుని నీతియుక్తమైన ప్రమాణాలను నిర్లక్ష్యం చేసేవారు సంతోషాన్ని, వారు అన్వేషించే స్వేచ్ఛను పొందలేరు. ఒక వ్యక్తి తాను విత్తినదానినే కోస్తాడు గనుక, దేవుడు వెక్కిరింపబడడని వారు ఎప్పుడో ఒకసారి తెలుసుకుంటారు. (గలతీయులు 6:⁠7) బైబిలు సూత్రాలను నిర్లక్ష్యం చేసే కోట్లాదిమంది అవాంఛిత గర్భధారణ, జుగుప్సాకరమైన రుగ్మతలు, లేక కృశింపజేసే దురలవాట్లకు బానిసలవడం వంటి దుఃఖకరమైన పర్యవసానాలను అనుభవిస్తున్నారు. వారు పశ్చాత్తాపపడి తమ జీవిత విధానాన్ని మార్చుకోకపోతే వారి మార్గం చివరికి మరణానికీ, బహుశా దేవుని చేతుల్లో నాశనానికీ నడిపిస్తుంది.​—⁠మత్తయి 7:13, 14.

8. దేవుని వాక్య ప్రేమికులు ఎందుకు సంతోషంగా ఉన్నారు?

8 అయితే, దేవుని వాక్యాన్ని ప్రేమించి, దాన్ని అన్వయించుకునేవారికి ఇప్పుడూ, భవిష్యత్తులోనూ గొప్ప దీవెనలు ప్రాప్తిస్తాయి. వారు సముచితంగానే దేవుని ధర్మశాస్త్రంచే స్వతంత్రులుగా చేయబడినట్లు భావిస్తారు, వారు నిజంగా సంతోషంగలవారు, పాపం నుండి దాని మరణకరమైన ప్రభావాల నుండి తాము విముక్తిని పొందే సమయం కోసం ఆత్రుతతో వేచివుంటారు. (రోమీయులు 8:20, 21; యాకోబు 1:​25) ఈనిరీక్షణ ఖచ్చితమైనది ఎందుకంటే దానికి ఆధారం దేవుడు మానవజాతికి ఇచ్చిన అత్యంత ప్రేమపూర్వకమైన కానుక, అది ఆయన జనితైక కుమారుడైన యేసు క్రీస్తు విమోచన క్రయధన బలి. (మత్తయి 20:28; యోహాను 3:16; రోమీయులు 6:​23) అలాంటి సర్వోత్కృష్టమైన కానుక మానవజాతి పట్ల దేవునికున్న ప్రేమ యొక్క ప్రగాఢతను ధ్రువీకరిస్తుంది, యెహోవా చెప్పేది వింటూ ఉండేవారందరికీ అనంతమైన దీవెనలను హామీ ఇస్తుంది.​—⁠రోమీయులు 8:⁠32.

పరిశుద్ధాత్మ వరమును బట్టి మనం కృతజ్ఞులం

9, 10. యెహోవా ఇచ్చే పరిశుద్ధాత్మ వరము నుండి మనం ప్రయోజనమెలా పొందుతాము? ఉదాహరణ చెప్పండి.

9 మనం కృతజ్ఞత కలిగివుండవలసిన, దేవుడిచ్చిన మరో ప్రేమపూర్వక కానుక ఆయన పరిశుద్ధాత్మ. సా.శ. 33 పెంతెకొస్తు దినాన యెరూషలేములో ఉన్న అసంఖ్యాకులైన ప్రజలను అపొస్తలుడైన పేతురు ఇలా ఉద్బోధించాడు: “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.” (అపొస్తలుల కార్యములు 2:​38) నేడు, యెహోవా తన పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించే, తన చిత్తాన్ని చేయాలని కోరుకునే తన సమర్పిత సేవకులకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. (లూకా 11:​9-13) ప్రాచీన కాలాల్లో, విశ్వంలోకెల్లా అత్యంత బలమైన ఈశక్తి అంటే దేవుని పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తి తొలి క్రైస్తవులతో సహా విశ్వాసంగల స్త్రీ పురుషులను శక్తివంతులను చేసింది. (జెకర్యా 4:6; అపొస్తలుల కార్యములు 4:​31) యెహోవా ప్రజలుగా మనం దుర్భేద్యమైన అవాంతరాలను లేక సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ, పరిశుద్ధాత్మ మనల్ని కూడా శక్తివంతులను చేయగలదు.​—⁠యోవేలు 2:28, 29.

10 పోలియో వ్యాధి సోకి 37 సంవత్సరాలపాటు ఐరన్‌ లంగ్‌కే (కృత్రిమంగా శ్వాసించడానికి సహాయపడే యంత్రం) పరిమితమైపోయిన లారెల్‌ ఉదాహరణను పరిశీలించండి. * ఆమె ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన మరణం వరకూ అత్యాసక్తితో దేవుని సేవ చేసింది. సంవత్సరాలు గడుస్తుండగా యెహోవా గొప్ప దీవెనలు లారెల్‌కు ప్రాప్తించాయి. ఉదాహరణకు, ఆమె దినంలో 24 గంటలపాటు తన యంత్రానికే పరిమితమై ఉండవలసి వచ్చినప్పటికీ ఆమె దాదాపు 17 మంది వ్యక్తులు బైబిలు సత్యాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని పొందడానికి సహాయం చేయగలిగింది! ఆమె పరిస్థితి అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఈమాటలను మనకు జ్ఞప్తికి తెస్తాయి: “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.” (2 కొరింథీయులు 12:​10) సువార్తను ప్రకటించడంలో మనకు లభించే ఏసఫలతకైనా కారణం మన స్వంత శక్తి సామర్థ్యాలు కాదు గానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చే సహాయమే, ఆయన తన స్వరాన్ని వింటూ ఉండేవారికి ఆపరిశుద్ధాత్మ సహాయాన్ని ఇస్తాడు.​—⁠యెషయా 40:29-31.

11. “నవీనస్వభావము”ను ధరించుకునేవారిలో దేవుని ఆత్మ ఏలక్షణాలను ఉత్పన్నం చేస్తుంది?

11 దేవుడు చెప్పేదాన్ని మనం విధేయంగా వింటే, ఆయన ఆత్మ మనలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము వంటి లక్షణాలను ఉత్పన్నం చేస్తుంది. (గలతీయులు 5:​22,23) ఈ‘ఆత్మఫలము,’ క్రైస్తవులు తాము ముందు కనబరచిన దురాశతో కూడిన క్రూరమైన లక్షణాల స్థానంలో ధరించే “నవీనస్వభావము”లో ఒక భాగం. (ఎఫెసీయులు 4:20-24; యెషయా 11:​6-9) ఈఆత్మ ఫలములో అత్యంత ప్రాముఖ్యమైనది “పరిపూర్ణతకు అనుబంధమైన” ప్రేమ.​—⁠కొలొస్సయులు 3:14.

క్రైస్తవ ప్రేమ​—⁠విలువైనదిగా ఎంచవలసిన కానుక

12. మొదటి శతాబ్దానికి చెందిన తబితా, మరితరులు తమ ప్రేమను ఎలా ప్రదర్శించారు?

12 క్రైస్తవ ప్రేమ యెహోవా ఇచ్చే మరో దీవెనకరమైన కానుక, సముచితంగానే మనం దాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతాము. అది సూత్రాలచే నిర్దేశించబడుతుంది, కానీ వాత్సల్యం విషయంలో అది ఎంత సుసంపన్నమైనదంటే అది రక్తసంబంధుల మధ్యనుండేదాని కన్నా సన్నిహితమైన అనుబంధం విశ్వాసుల మధ్య ఏర్పడేలా చేస్తుంది. (యోహాను 15:12, 13; 1 పేతురు 1:​22) ఉదాహరణకు, మొదటి శతాబ్దానికి చెందిన చక్కని క్రైస్తవురాలైన తబితాను పరిశీలించండి. ప్రాముఖ్యంగా సంఘంలోని విధవరాండ్ర పట్ల, “ఆమె సత్‌క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను.” (అపొస్తలుల కార్యములు 9:​36) ఈస్త్రీలకు రక్తసంబంధీకులు ఉండి ఉండవచ్చు, కానీ వారికి సహాయం చేయడానికీ, వారిని ప్రోత్సహించడానికీ తబితా తాను చేయగలిగినదంతా చేయాలని కోరుకుంది. (1 యోహాను 3:​18) తబితా ఎంత చక్కని మాదిరిని ఉంచింది! పౌలు కోసం ‘తమ ప్రాణాలను ఇవ్వడానికి తెగించేలా’ సహోదర ప్రేమ ప్రిస్కిల్లను, అకులను ప్రేరేపించింది. అపొస్తలుడు రోములో ఖైదీగా ఉన్నప్పుడు ఆయనకు సహాయం చేయడానికి ఎపఫ్రాను, లూకాను, ఓనేసిఫోరును, ఇతరులను కూడా ప్రేమే ప్రేరేపించింది. (రోమీయులు 16:3, 4; 2 తిమోతి 1:​16; 4:11; ఫిలేమోను 23, 24) అవును, అలాంటి క్రైస్తవులు నేడు ‘ఒకరియెడల ఒకరు ప్రేమకలిగి ఉంటారు,’ వారిని యేసు నిజమైన శిష్యులుగా గుర్తించే ఆప్రేమ దేవుడిచ్చిన దీవెనకరమైన కానుక.​—⁠యోహాను 13:​34,35.

13. మనం మన క్రైస్తవ సహోదరత్వం పట్ల ప్రగాఢమైన మెప్పు కలిగి ఉన్నామని ఎలా చూపించగలము?

13 క్రైస్తవ సంఘంలో చూపించబడే ప్రేమను మీరు విలువైనదిగా ఎంచుతారా? భూగోళవ్యాప్తంగా ఉన్న మన ఆధ్యాత్మిక సహోదరత్వాన్ని బట్టి మీరు కృతజ్ఞులై ఉన్నారా? ఇవి రెండూ కూడా సంతృప్తిని తెస్తాయి, ఇవి పైనుండి వచ్చే, మనల్ని సుసంపన్నం చేసే కానుకలు. మనం వాటిని విలువైనవిగా ఎంచుతున్నామని ఎలా చూపించగలము? దేవునికి పవిత్ర సేవను అర్పించడం ద్వారా, క్రైస్తవ కూటాల్లో భాగం వహించడం ద్వారా, ప్రేమను దేవుని ఆత్మఫలాల్లోని మరితరమైనవాటిని కనపర్చడం ద్వారా చూపించవచ్చు.​—⁠ఫిలిప్పీయులు 1:9; హెబ్రీయులు 10:24, 25.

‘మనుష్యుల్లో ఈవులు’

14. ఒక క్రైస్తవుడు పెద్దగా లేక పరిచర్య సేవకునిగా సేవ చేయాలంటే ఆయనకు ఏమి అవసరం?

14 పెద్దలుగా, పరిచర్య సేవకులుగా తమ తోటి ఆరాధకులకు సేవ చేయాలని అభిలషించే క్రైస్తవ పురుషులకు ఒక చక్కని లక్ష్యం ఉంటుంది. (1 తిమోతి 3:​1,8) ఒక సహోదరుడు ఈఆధిక్యతలను పొందడానికి యోగ్యుడవ్వాలంటే, ఆయన ఆధ్యాత్మిక వ్యక్తియై ఉండాలి, లేఖనములయందు ప్రవీణుడై ఉండాలి, క్షేత్రసేవలో ఆత్యాసక్తి కలిగి ఉండాలి. (అపొస్తలుల కార్యములు 18:24; 1 తిమోతి 4:15; 2 తిమోతి 4:⁠5) ఆయన వినయమును, నమ్రతను, సహనమును కనపర్చాలి, ఎందుకంటే అహంకారము, గర్వము, అధికారదాహము గల ప్రజలకు దేవుని దీవెనలు ప్రాప్తించవు. (సామెతలు 11:2; హెబ్రీయులు 6:15; 3 యోహాను 9, 10) ఆయన వివాహితుడైతే, తన కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించే ప్రేమగల కుటుంబ శిరస్సు అయ్యుండాలి. (1 తిమోతి 3:​4,5,12) ఆయన ఆధ్యాత్మిక సంపదలను విలువైనవిగా ఎంచుతాడు గనుక అలాంటి వ్యక్తి యెహోవా దీవెనను పొందుతాడు.​—⁠మత్తయి 6:19-21.

15, 16. ‘మనుష్యులకు ఈవులుగా’ ఎవరు నిరూపించబడ్డారు? ఉదాహరణలు ఇవ్వండి.

15 సంఘంలో పెద్దలుగా సేవచేస్తున్నవారు సువార్తికులుగా, కాపరులుగా, బోధకులుగా కృషి చేసినప్పుడు, ‘మనుష్యుల్లో ఈవులు’ అయిన అలాంటి వారిని ఎంతో విలువైనవారిగా ఎంచడానికి మనకు తగిన కారణాలను ఇస్తారు. (ఎఫెసీయులు 4:​8,11) వారి ప్రేమపూర్వక సేవ నుండి ప్రయోజనం పొందేవారు ఎల్లవేళలా తమ మెప్పును వ్యక్తపరచకపోవచ్చు, కానీ నమ్మకమైన పెద్దలు చేసేదానినంతటినీ యెహోవా చూస్తాడు. తన ప్రజలకు పరిచర్య చేయడం ద్వారా తన నామము పట్ల వారు చూపించే ప్రేమను యెహోవా మరచిపోడు.​—⁠1 తిమోతి 5:17; హెబ్రీయులు 6:10.

16 మెదడు శస్త్రచికిత్సకు వెళ్లబోతున్న ఒక క్రైస్తవ బాలికను సందర్శించిన కష్టించి పనిచేస్తున్న ఒక పెద్ద విషయాన్ని పరిశీలించండి. “ఆయన ఎంతో దయగా ఉన్నాడు, ఎంతో ఆసరాగా ఉన్నాడు, ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. మాతో కలిసి యెహోవాకు ప్రార్థించేందుకు ఆయన అనుమతి అడిగాడు. ఆయన ప్రార్థిస్తుండగా, ఆఅమ్మాయి తండ్రి [యెహోవాసాక్షి కాదు] వెక్కి వెక్కి ఏడ్చాడు, హాస్పిటల్‌ రూములో ఉన్న ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. ఆపెద్ద చేసిన ప్రార్థన ఎంత వాత్సల్యభరితంగా ఉందో, అలాంటి సమయంలో ఆయనను పంపించడం ద్వారా యెహోవా ఎంతటి ప్రేమను చూపించాడో!” అని ఆకుటుంబపు స్నేహితురాలు ఒకామె వ్రాసింది. రోగగ్రస్థురాలైన మరో సాక్షి, తనను సందర్శించిన పెద్దల గురించి ఇలా చెప్పింది: “ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్న నా బెడ్‌ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు, ఇక అప్పటి నుండి ఏమి జరిగినా ఫరవాలేదు నేను సహించగలను అని నాకు అనిపించింది. నేను ఎంతో బలాన్ని, ప్రశాంతతను పొందాను.” అలాంటి ప్రేమగల శ్రద్ధను ఎవరైనా కొనుక్కోగలరా? ఎంతమాత్రం కొనుక్కోలేరు! అది క్రైస్తవ సంఘం ద్వారా లభ్యమయ్యే, దేవుడిచ్చే కానుక.​—⁠యెషయా 32:1, 2.

క్షేత్రసేవ అనే కానుక

17, 18. (ఎ) యెహోవా తన ప్రజలందరికీ ఏ సేవా కానుకను అందుబాటులో ఉంచాడు? (బి)మనం మన పరిచర్యను నెరవేర్చగలిగేలా దేవుడు ఏసహాయాన్ని అందజేశాడు?

17 సర్వోన్నతుడైన యెహోవా సేవ చేయడం కన్నా మరింత గొప్ప ఘనత ఏదీ మానవులకు ఉండదు. (యెషయా 43:10; 2 కొరింథీయులు 4:7; 1 పేతురు 2:⁠9) అయితే, యౌవనులైనా, వృద్ధులైనా, స్త్రీలైనా, పురుషులైనా దేవుని సేవ చేయాలనే నిజమైన కోరిక ఉన్నవారందరికీ బహిరంగ పరిచర్యలో పాల్గొనే అవకాశం అందుబాటులో ఉంది. మీరు ఈఅమూల్యమైన కానుకను ఉపయోగించుకుంటారా? తాము అసమర్థులమని భావించి కొందరు ఈపనిలో పాల్గొనరు, కానీ యెహోవా తన సేవ చేసేవారికి పరిశుద్ధాత్మను ఇస్తాడని గుర్తుంచుకోండి, ఆపరిశుద్ధాత్మ మనలో ఉన్న ఏలోటునైనా తీరుస్తుంది.​—⁠యిర్మీయా 1:​6-8; 20:11.

18 యెహోవా రాజ్య ప్రకటన పనిని వినయముగల తన సేవకులకు అప్పగించాడు గానీ గర్వంగా ఉండి తమ సొంత సామర్థ్యాలపై ఆధారపడే వ్యక్తులకు కాదు. (1 కొరింథీయులు 1:​20,26-29) వినయమూ వినమ్రతా గల ప్రజలు తమ పరిమితులను అంగీకరించి, క్షేత్రసేవలో పాల్గొనేటప్పుడు దేవుని సహాయంపై ఆధారపడతారు. ఆయన ‘నమ్మకమైన గృహనిర్వాహకుని’ ద్వారా అందజేసే ఆధ్యాత్మిక సహాయాన్ని వారు గుణగ్రహిస్తారు కూడా.​—⁠లూకా 12:42-44; సామెతలు 22:4.

సంతోషభరితమైన కుటుంబ జీవితం​—⁠ఓ చక్కని కానుక

19. పిల్లలను పెంచడంలో ఏవిషయాలు విజయానికి నడిపిస్తాయి?

19 వివాహము, సంతోషభరితమైన కుటుంబ జీవితము దేవుడిచ్చే వరాలు. (రూతు 1:9; ఎఫెసీయులు 3:​14,15) పిల్లలు కూడా “యెహోవా అనుగ్రహించు” అమూల్యమైన “స్వాస్థ్యము,” వారిలో దైవిక లక్షణాలను విజయవంతంగా నాటే తల్లిదండ్రులకు వారు ఆనందాన్ని తెస్తారు. (కీర్తన 127:⁠3) మీరు తల్లిగానీ తండ్రిగానీ అయితే, యెహోవా వాక్యం అనుసారంగా మీపిల్లలకు శిక్షణనివ్వడం ద్వారా ఆయన స్వరాన్ని వింటూ ఉండండి. అలా చేసేవారు యెహోవా మద్దతును, గొప్ప దీవెనలను తప్పకుండా అనుభవిస్తారు.​—⁠సామెతలు 3:5, 6; 22:⁠6; ఎఫెసీయులు 6:1-4.

20. సత్యారాధన నుండి తొలగిపోయిన పిల్లలు గల తల్లిదండ్రులకు ఏది సహాయకరంగా ఉండగలదు?

20 దైవిక తల్లిదండ్రులు మనస్సాక్షిపూర్వకంగా కృషి చేసినప్పటికీ, బహుశా వారి పిల్లల్లో కొందరు పెద్దవారైన తర్వాత సత్యారాధన నుండి తొలగిపోయేందుకు ఎంపిక చేసుకోవచ్చు. (ఆదికాండము 26:​34,35) ఇది తల్లిదండ్రులను భావోద్రేకపరంగా కృంగదీయవచ్చు. (సామెతలు 17:​21,25) అయితే, ఆశలన్నీ వదులుకునే బదులు వారు, తప్పిపోయిన కుమారుని గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని గుర్తుతెచ్చుకోవడం వారికి సహాయకరంగా ఉంటుంది. ఆకుమారుడు ఇల్లు వదిలి వెళ్లి తప్పు మార్గాన్ని చేపట్టినప్పటికీ, అతడు తర్వాత తన తండ్రి ఇంటికి తిరిగివచ్చాడు, ఆతండ్రి అతడిని ఆనందంగా, ప్రేమపూర్వకంగా స్వీకరించాడు. (లూకా 15:​11-32) ఏమి జరిగినప్పటికీ యెహోవా అర్థం చేసుకుంటాడనీ, ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తాడనీ, తప్పకుండా మద్దతునిస్తాడనీ నమ్మకమైన క్రైస్తవ తల్లిదండ్రులు నిశ్చయత కలిగివుండవచ్చు.​—⁠కీర్తన 145:14.

21. మనం ఎవరు చెప్పేది వినాలి, ఎందుకు?

21 కాబట్టి మనలో ప్రతి ఒక్కరం జీవితంలో నిజంగా ఏది ప్రాముఖ్యమైనదో నిశ్చయించుకుందాము. మనకు, మన కుటుంబాలకు బాధలను తెచ్చే వస్తుసంపదలను మనం అత్యాసక్తితో సమకూర్చుకుంటున్నామా? లేక “జ్యోతిర్మయుడగు తండ్రి” దగ్గరి నుండి వచ్చే “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” సంపాదించుకోవడానికి మనం కృషి చేస్తున్నామా? (యాకోబు 1:​17) ‘అబద్ధమునకు జనకుడైన’ సాతాను, మనం వస్తుసంపదల కోసం శ్రమిస్తూ, సంతోషాన్ని జీవాన్ని పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాడు. (యోహాను 8:44; లూకా 12:​15) అయితే యెహోవా మన గురించి నిజంగా శ్రద్ధ కలిగివున్నాడు, ఆయన మన మంచి కోరుతున్నాడు. (యెషయా 48:​17,18) కాబట్టి మనం మన ప్రేమగల పరలోక తండ్రి చెప్పేది వింటూ ఉండి, ఎల్లప్పుడూ ఆయనను బట్టి ‘సంతోషించుదము.’ (కీర్తన 37:⁠4) మనం అలాంటి జీవన విధానాన్ని అనుసరిస్తే, యెహోవా ఇచ్చే అమూల్యమైన కానుకలు పుష్కలమైన దీవెనలు మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తాయి​—⁠అదీ ఏమాత్రం బాధల్ని చేర్చకుండానే.

[అధస్సూచి]

^ పేరా 10 తేజరిల్లు! జనవరి 22, 1993, (ఆంగ్లం) 18-21 పేజీలు చూడండి.

మీరు గుర్తుతెచ్చుకోగలరా?

• అత్యంత గొప్ప సంతోషాన్ని ఎక్కడ కనుగొనవచ్చు?

• యెహోవా తన ప్రజలకు ఇచ్చే కొన్ని కానుకలు ఏవి?

• క్షేత్ర సేవ ఎందుకు ఒక కానుక?

• తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచేటప్పుడు దేవుని దీవెనను పొందడానికి ఏమి చేయవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

5. జ్ఞానము అంటే ఏమిటి, మనం దాన్ని ఎలా సంపాదించుకోవచ్చు?

[16వ పేజీలోని చిత్రం]

దేవుడిచ్చిన వరమైన ఆయన లిఖిత వాక్యం పట్ల మీరు మెప్పును చూపిస్తారా?

[17వ పేజీలోని చిత్రం]

ఎంతో కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, లారెల్‌ నిస్‌బెట్‌ అత్యాసక్తితో దేవుని సేవ చేసింది

[18వ పేజీలోని చిత్రాలు]

తబితా వలె, ప్రస్తుత దిన క్రైస్తవులు తమ ప్రేమపూర్వక కార్యాలకు పేరుపొందారు

[19వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ పెద్దలు తమ తోటి విశ్వాసులపట్ల ప్రేమపూర్వక శ్రద్ధ కలిగివుంటారు